Thursday, November 20, 2025

 🔥అంతర్యామి 🔥

# క్షమ... దైవీగుణం...


☘️ఆధ్యాత్మిక సాధనలో క్షమాగుణానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. హృదయం తేలికపడి ఆనందాన్ని అనుభవించాలంటే అది క్షమ అనే దివ్యగుణ సాధనతోనే సాధ్యం. పెద్ద పెద్ద తప్పులను సైతం క్షమించగలిగే సహృదయులు ఉంటారు. మూర్ఖులు క్షమను బలహీనతగా, పిరికితనంగా భావిస్తారు. అది తప్పు. క్షమ... దైవీగుణం.

☘️కొందరు అహంకారంతో ఎదుటివారిని అవమానపరుస్తారు. అలాంటి వారిని క్షమించడం అంత సులభమైన విషయం కాదు. కార్చిచ్చు అడవిని కాల్చినట్లుగా ఆ బాధ మనసును దహించివేస్తుంది. అటువంటి సమయంలో మొదట తనను తాను కుదుటపరచుకుని సడలిపోని ధైర్యంతో నిలబడగలగాలి. ఆత్మాభిమానాన్ని అణచుకుని క్షమించడం సాధనపరంగా కొంత ఎత్తుకు ఎదిగిన వారికే సాధ్యమవుతుంది. అందుకే క్షమించడానికి చాలా ధైర్యం కావాలంటారు. క్షమించగలిగే హృదయం దైవానికి ప్రీతిపాత్రమవుతుంది. దైవం అక్కడే కొలువై ఉంటాడంటారు పండితులు.

☘️అలాంటి సహృదయుణ్ని లోకమూ ప్రేమిస్తుంది. క్షమించగలిగే గొప్ప మనసును కైవసం చేసుకోవడమే సాధనలోని పరమార్ధం. క్షమా గుణంవల్ల ఎదుటి వ్యక్తిపై ఉన్న ద్వేషం, అసూయి. వంటి చెడుభావాలు కరిగిపోతాయి. వాటి స్థానంలో ప్రేమ అనే దివ్య బీజం అంకురిస్తుంది. అది క్రమంగా ఎదిగి చల్లని నీడనిచ్చే కల్పవృక్షంలా భాసిల్లి శాంతి అనే ఆనందానుభూతిని హృదయంలో పాదుకొల్పుతుంది. మనస్తాపానికి కారణమైన వారిపై కోపం, ద్వేషం వంటివి మనిషి హృదయంలో సహజంగా జనిస్తాయి. దయకు ఆలవాలమైన మానవ హృదయం శాంతికి నోచుకోవాలంటే ఆ దుర్గుణాలను మొగ్గలోనే తుంచేయాలి. క్షమించగలిగే దివ్య గుణాన్ని సాధించినప్పుడే ఆ కార్యం సాఫల్యమవుతుంది. 

☘️క్షమించగల గొప్ప హృదయం కలవాడు తనకు ప్రీతిపాత్రుడని చెబుతాడు శ్రీకృష్ణ భగవానుడు. ధ్యానం, జ్ఞానం, భక్తి అనే సద్గుణాలు క్షమాగుణం వల్ల ప్రవర్ధమానమవుతాయి. సులభమైన విషయం కాకపోయినా క్షమాగుణాన్ని సాధించినప్పుడే ఆధ్యాత్మిక సాధన వేగవంతమవుతుంది. పయనం భగవంతుడి వైపు సాగుతుంది. ఎదుటివారి తప్పులను క్షమించలేనంత కాలం ఆ భారాన్ని హృదయం మోస్తూనే ఉంటుంది. దాన్ని తగ్గించుకునే మార్గం క్షమను ఆశ్రయించడమే! తాను చేసే తప్పులకు మనిషి తనను తాను క్షమించుకోవడం సైతం ప్రాధాన్యం సంతరించుకున్న అంశం.

☘️ఏదుటివారి తప్పులను క్షమించినప్పుడు సాధకుడి హృదయం తేలికవుతుంది. శాంతి లభిస్తుంది. ఎన్ని తప్పులు చేస్తాం. వాటిని భగవంతుడు క్షమించాలని కోరుకుంటాం. అలాగే మనం కూడా ఎదుటివారి తప్పులను క్షమించగలగాలి. అలాంటి హృదయం మల్లెపువ్వంత స్వచ్చంగా వెలుగొందుతుంది. సౌహార్ద్ర పరిమళాలు వెదజల్లే సాధకుడి హృదయం నిజంగా బలసంపన్నమై క్షమకు నెలవవుతుంది.🙏

✍️- గోపాలుని రఘుపతిరావు

🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺

No comments:

Post a Comment