Thursday, November 20, 2025

 1️⃣0️⃣4️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

   *4. జ్ఞాన యోగము.* 
  (నాలుగవ అధ్యాయము)

కాబట్టి మనం తెలుసుకోవలసినది ఏమిటంటే ఈ బంధనములు, వాసనలు కలుగ చేసేది దేహముతో కానీ, ఇంద్రియములతో చేసే కర్మల వలన కానీ కాదు, ఆ కర్మలు చేయడానికి సంకల్పించే మనస్సు. కేవలం ఇంద్రియములను ఒక చోట బంధించి, మనసును విషయవాంఛలలో విహరింపజేయడం కేవలం తనను తాను మోసం చేసుకోవడమే అవుతుంది. లోకాన్ని మోసం చేయడం కూడాను. ఇటువంటివారు తాము పైకి ఏకర్మలు చేయకుండా కనిపించినా అన్ని కర్మలు చేస్తూనే ఉంటారు. వీరు మిధ్యాచారులు.

పేదవాళ్లు వయసు మీరిన వాళ్లు పుణ్య క్షేత్రములు దర్శించలేరు. ఎక్కడికీ పోలేరు. వారికి కడుపే కైలాసం. ఇల్లే వైకుంఠం. వాళ్లు ఇంట్లో కూర్చుని, ధ్యానంలో ఉండి. ఏ కర్మా చేయకుండా కేవలం మనసుతో అన్ని పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చు. అన్ని దేవుళ్లను మనసులోనే దర్శించవచ్చు. మనసులోనే ఎన్నో పుణ్యకార్యాలు చేసినట్టు ఊహ చేయవచ్చు. సమాజానికి పనికి వచ్చే ఎన్నో మంచి పనులు చేసినట్టు అనుభూతి పొందవచ్చు. ఎల్లప్పుడూ ఇతరుల క్షేమమును, సమాజ హితమును కోరుకోవచ్చు. అటువంటి వారు కూడా అకర్మలో కర్మలు చేసినట్టే.

ఈ శ్లోకాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము. ఇటువంటివి గ్రంధిశ్లోకములు అని అంటారు. అంటే పైపైన అర్ధం కావు. చాలా చిక్కుముడిగా ఉంటాయి. లోతుగా పరిశీలిస్తే అనంతమైన అర్థం గోచరిస్తుంది. ఈ శ్లోకం కూడా అటువంటిదే. పై పైన చదివితే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూచేవాడు వివేకి, బుద్ధిమంతుడు అని అర్థం. ఇది ఎంత అసంబద్ధంగా ఉందో మీకే అర్థం అయి ఉంటుంది. సాధారణంగా తాడును చూచి పాము అనుకునేవాడు అజ్ఞాని. తాడును తాడుగానూ, పామును పాముగానూ చూసేవాడు జ్ఞాని ఇది సాధారణ అర్ధము. కాని ఇక్కడ వ్యతిరేకంగా చెబుతున్నాడు పరమాత్మ. కాని దీనిని లోతుగా పరిశీలిస్తే అసలు అర్థం గోచరిస్తుంది.

ఈ లోకంలో ప్రతి జీవికి రెండు లక్షణాలు ఉన్నాయి. అవే మృతం, అమృతం. ఈ రెండు కలిస్తేనే అది జీవి అవుతుంది. దీనినే నేను నాది అనే భావన అని అంటారు. ఇందులో మృతస్వరూపము అంటే దేహము, మనసు, బుద్ధి. ఈ మూడు కలిసి అహంకారము అని పిలుస్తాము. ఈ మూడు ప్రకృతిలో ఉన్న గుణములతో కలిసి ప్రవర్తిస్తుంటాయి. ఈ అహంకారము పుట్టగానే వస్తుంది. మరణించగానే పోతుంది. అంటే మృతస్వభావము కలిగినది. తరువాతది అమృత స్వభావము కలది. అంటే చావులేనిది. దాని గురించి మనం రెండవ అధ్యాయంలో చెప్పుకున్నాము. అదే ఆత్మ స్వరూపము, అస్త్ర శస్త్రములతోగాని, నీరు గాలి అగ్నితో గానీ అది మరణించదు. అదే అమృతస్వరూపము. ఈ రెండు కలిస్తేనే ఒక జీవి అవుతుంది. వీటినే క్లుప్తంగా ఆత్మ అనాత్మ వివేచన అని కూడా అంటారు.

ఈ ఆత్మ అందరిలో ఉంటుంది. అందరిలో ఉన్న ఆత్మస్వరూపము ఒకటే వేరు వేరు కాదు. అన్నీ ఆ పరమాత్మ స్వరూపమే. ఎలాగంటే కుండలో ఉన్న ఆకాశము, రూములో ఉన్న ఆకాశము, పెద్ద హాలులో ఉన్న ఆకాశము, ఈ విశ్వంలో ఉన్న ఆకాశము అన్నీ ఒకటే. కాకపోతే ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశానికి పరిమితం అయినట్టు మనకు అనిపిస్తుంది. అలాగే అంతటా నిండి ఉన్న పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ప్రతి జీవిలోనూ ఉన్నాడు. ఈ ఆత్మ పరమాత్మగా అంతటా నిండి, అనంతంగా, తుది మొదలు లేకుండా ఉంది కాబట్టి అచలంగా ఉంటుంది. ఒక డబ్బా నిండా బియ్యం పోస్తే ఆ డబ్బాను అటుఇటు ఆడించినా అ బియ్యం కదలవు. ఎందుకంటే డబ్బా నిండుగా ఉన్నాయి కాబట్టి. అలాగే ఈ పరమాత్మ తత్త్వము అంతటా నిండి ఉంది కాబట్టి కదలడానికి స్పేస్ లేదు కాబట్టి అచలము అని అన్నారు. అందువలన ఆత్మస్వరూపుడైన పరమాత్మ ఏకర్మ చేయలేడు. చేయడు. కర్మచేయాలంటే కదలిక ఉండాలి. కదలిక లేని వాడు కర్మచేయలేడు.

ఇంక రెండవది. మృతము, అంటే శరీరము, మనస్సు బుద్ధి. ఈ మూడింటిని అహంకారము అని అన్నాము కదా. ఇది నిరంతరము చలిస్తూనే ఉంటాయి. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. మనం నిద్రపోతున్నా శరీరంలో జీర్ణక్రియ, గుండె కొట్టుకోవడం, గాలి పీల్చడం, వదలడం, రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. పగలు సరే ఈ శరీరం ఎన్నో పనులు చేస్తుంటుంది. మనసు ఆలోచనలు, సంకల్పవికల్పాలు చేస్తూనే ఉంటుంది. భావోద్వేగాలు కలుగచేస్తుంటుంది. బుద్ధి తన విచక్షణను ఉపయోగించి మనసుకు మంచి చెడు చెబుతూనే ఉంటుంది. కాబట్టి ఈ శరీరము, మనసు, బుద్ధి కర్మలు చేయడంలో ఉంటాయి. కాబట్టి ఆత్మ --అకర్మ, శరీరము,మనసు,బుద్ధి --కర్మ. కాబట్టి శరీరము, మనసు, బుద్ధి కర్మలను చేయకుండా ఉండలేవు అంటే కర్మలను వదలలేవు. ఆత్మస్వరూపము ఎటువంటి కర్మ చేయలేదు. చేయదు. కేవలం మనో బుద్ధి శరీరాలతో చేసే కర్మలను సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది.

ఈ శ్లోకం ప్రకారము దేహము, మనస్సు బుద్ధితో కలిసి అనేక కర్మలను చేస్తున్నా, ఆ కర్మల మీద ఆసక్తి లేకుండా, కర్మల మీద ఆధారపడకుండా, ఏ కర్మా చేయని ఆత్మస్వరూపాన్ని ఎవరు చూస్తున్నారో దర్శిస్తున్నారో, అంటే తాను చేసే కర్మలలో అకర్మను అంటే ఆత్మస్వరూపాన్ని ఎవరు చూస్తున్నారో వారిని బుద్ధిమంతుడు వివేకి అని అంటారు అని అర్థం చేసుకోవాలి. అలాగే దేహము, మనస్సు బుద్ధి పని చేయనపుడు కూడా అన్ని కర్మలు వాటంతట అవి జరుగుతుంటాయి అని ఎవరు తెలుసుకుంటారో, వారే వివేకవంతులు. అంటే గాఢ సుషుప్తావస్థలో ప్రాపంచిక విషయాల వలన అనుభవించిన దానికన్నా ఎక్కువ ఆత్మానందాన్ని పొందడం గురించిన జ్ఞానం ఎవరు పొందుతారో, వారే వివేకవంతుడు.

సాధారణంగా మనం ఏదో ఒక పని చేస్తే ఆనందం కానీ, దుఃఖం కాని వస్తుంది. కాని గాఢ సుషుప్తిలో ఏ పనీ చేయకపోయినా ఆనందం కలుగుతుంది. దానినే ఆత్మానందము అని అంటారు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం ఆత్మయొక్క స్వభావము. ఆ ఆత్మను దర్శించడమే అకర్మలో కర్మ చూడటం. అటువంటి వాడు కృత్స్నకర్మకృత్ అంటే ఏ పనీ చేయక పోయినా అన్ని పనులు చేసినట్టే. అంటే మనకు కర్మలు చేస్తేనే ఫలితము, తృప్తి, ఆనందము కలిగేది. కాని జ్ఞానికి ఏ పనీ చేయకుండా మనసును ఆత్మలో చేర్చి రమిస్తుంటే, అన్ని పనులు చేసినదాని కన్నా ఎక్కువ తృప్తి ఆనందము కలుగుతాయి. ఈ జ్ఞానము అందరూ పొందవచ్చు అని పరమాత్మ బోధించాడు.

కేవలం వేదములు శాస్త్రములు చదువుకున్నంత మాత్రాన పండితులు కావచ్చేమోకానీ బుద్ధిమంతులు కారు. వారి బుద్ధి మానసికంగా పెడతోవ పడుతూనే ఉంటుంది పైకి సాత్వికంగా కనిపించినా, ఏమీ చేయకుండా ఉన్నా, వారి మనసులో చాలా వికృతమైన ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. కాబట్టి బుద్ధిమంతుడు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు జవాబు ఈ కింది శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P246

No comments:

Post a Comment