Saturday, November 13, 2021

అజ్ఞానం తొలగాలంటే ఆత్మ జ్ఞానం తెలుసుకోవడమే.

ఈ జన్మలో అనుభవానికి రాకుండా మిగిలిపోయిన కర్మఫలం
విధిగా జీవుడిని మరొక జన్మ (పునర్జన్మ) ఎత్తేటట్లు చేస్తుంది.
మనిషి నిరంతరం అంతులేని కోరికల వలయంలో చిక్కుకొని తిరుగుతుంటాడు.
ఆ కోరికలే దుఃఖానికి కారణం. కోరికలు తీరడానికి తగ్గ పనిని మనిషి చేస్తూనే ఉండాలి. మరి మనిషి చేసిన పని వృథా పోదు కదా! ప్రతి పనికి మంచిదో చెడుదో ఫలితం ఉంటుంది.
ఆ ఫలితాన్ని మానవుడు అనుభవించక తప్పదు.
కొన్ని కర్మల ఫలితాలను అప్పటికప్పుడు అనుభవిస్తాడు. కొన్నింటిని ఆ తర్వాత అనుభవిస్తాడు. కొన్ని కర్మల ఫలితాలను ఈ జన్మలో అనుభవించలేక పోవచ్చు.
మనిషి మరణించినా కర్మఫలం నశించదు. అది ఆత్మను వాసనా రూపంలో అంటిపెట్టుకొని కొనసాగుతూనే ఉంటుంది.
కర్మఫల శేషం పునర్జన్మకు దారి తీస్తుంది.
ఈ జన్మలో అనుభవానికి రాకుండా మిగిలి పోయిన కర్మఫలం విధిగా జీవుడిని మరొక జన్మ ఎత్తేటట్లు చేస్తుంది. మళ్లీ జీవుడు ఆ జన్మలో కొన్ని కర్మలు చేస్తాడు. ఆ కర్మఫలాలలో కొన్ని మిగిలిపోతాయి.
మళ్లీ జన్మ ఎత్తుతాడు. కొన్ని కర్మఫలాలు అనుభవించాక కొన్ని మిగిలిపోతాయి. వాటిని అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసి వస్తుంది. పాత కర్మల అనుభవాలు తరిగిపోతుంటే ..
కొత్తవి పెరిగిపోతుంటాయి.
మానవుడు జనన మరణ పరంపర చక్రభ్రమణంలో,
చక్రనేమి క్రమంలో పడి తిరుగాడుతుంటాడు.
పునర్జన్మ ఒక నిరంతర చక్రం. దానికి ఆది లేదు. అంతం లేదు.
అందుకే మానవుడు “జనన మరణ పరంపర ”
అనే చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు. అదే కర్మసిద్ధాంతం.
( Law of Karma ).
దీనినే ఫిజిక్స్ లో ( Law of Conservation Energy ) తో పోల్చారు విజ్ఞులు.
ENERGY ఎనర్జీకి నశింపులేదు. రూపాంతరం చెందుతుంది.
అలాగే కర్మ కూడా. అది మానవుని జన్మాంతరాలకు కూడా వెన్నాడుతూనే ఉంటుంది.
పునరపి జననం పునరపి మరణం. పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే. బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే.
(భజగోవిందం )
భావం :
పుడుతూ, మరణిస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూ, పుడుతూ దుస్తరమైన ఈ సంసారాన్ని దాటటం సాధ్యం కాకున్నది.
మురారీ ! దయతో నన్ను రక్షించు
శంకరులు కూడా జగత్తును (మానవ జీవితాన్ని) దుఃఖమయంగా భావించారు.
భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు.
ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు.
మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి?
“ఆత్మానాత్మ వివేకం ” అనే ప్రకరణ గ్రంథంలో శంకరుడు
ఇలా వివరించాడు .
ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది ?
జ) పూర్వ జన్మ లలోని కర్మ వలన.
కర్మ ఎందుకు జరుగుతుంది ?
జ) రాగం (కోరిక) వలన.
రాగాదులు ఎందుకు కలుగుతాయి?
జ : అభిమానం (నాది, కావాలి అనే భావం)వలన.
అభిమానం ఎందుకు కలుగుతుంది?
జ) అవివేకం వలన
అవివేకం ఎందుకు కలుగుతుంది?
జ) అజ్ఞానం వలన
అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?
జ) అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది.

(వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.)
దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం.
జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.
అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం,
అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు,
కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి.
అజ్ఞానం తొలగాలంటే ఆత్మ జ్ఞానం తెలుసుకోవడమే.
ॐశ్రీవేంకటేశాయ నమః

Source - Whatsapp Message

No comments:

Post a Comment