శీలమంటే పారదర్శకత
నిద్రలో తానున్నానని తనకు తెలియకపోయినా తానున్నాడు.
యెందుకంటే మెలకువ రాగానే నేను హాయిగా నిద్రపోయాను అంటాడు.
'హాయి'ని అనుభవించేవాడు అక్కడ ఒకడు ఉండే ఉండాలి.
నిజానికి ఆ 'హాయే' తాను.
మెలకువలో ఉండి, హాయిని కోరేవాడు కాదు తాను.
ఆ 'హాయే' ఆత్మ, భగవంతుడు....ఇత్యాది పేర్లతో పిలువబడుతున్నాడు.
ఆ 'హాయి'గా ఉన్న తానే...
ఆ ఏకంగా ఉన్న తానే....
చెదరి... కదలి...మనసుగా మారి...
మెలకువలోకి...కలలోకి జారి...
ఈ ప్రత్యేకమైన తానుగా
అనగా పరిమితమైన తానుగా...
జగత్తుగా విస్తరిల్లాడు....
ఏకంగా ఉన్న తానే అనేకం ఐన సంగతిని మరిచి...
ఆ అనేకంలో ఏదో ఒక నామరూపాలు కలిగిన దేహాన్ని మాత్రమే తానని అభిమానించి...
దానితో మమేకం అయ్యి...
అది మాత్రమే తానని వ్యవహరిస్తూ...
జీవిస్తూ...
నానా అవస్థలు పడుతున్నాడు...
ఇదంతా మరపు వలన వచ్చిన అవస్థలే...
మరపుతో ఉన్న అవస్థలే - జాగ్రత్-స్వప్న-సుషుప్తులు.
ఎరుకతో ఉన్న అవస్థే - తురీయం.
* * *
నిద్రలో ఉన్న హాయిని,
మెలకువలో ఉన్న ఎరుకను
అనుసంధానం చేసే ప్రక్రియే - ధ్యానం.
* * *
స్వస్వరూపమైన ఆ 'హాయి'ని తిరిగి పొందటానికి
జీవుడు గురువును ఆశ్రయిస్తాడు...
గురువు అంటే తనకు విడిగా ఉన్న ఓ వ్యక్తి అని కాదు...
తనలోనే, తనకు అభిన్నంగా ఉన్న ఓ 'ప్రజ్ఞ' అది.
యెప్పటికీ అలా తాను మరపులో ఉండకుండా
మళ్లీ తానెవరో గుర్తుకు తెచ్చే ఆ ప్రజ్ఞయే 'గురువు'.
కొందరికి ఆ గురువు పైకి ఓ వ్యక్తిలాగే కనబడవచ్చు...
కొందరికి ఆ గురువు పైకి కనబడకపోవచ్చు...
ప్రజ్ఞయే సాకారంగా ఉంటే - గురువు.
ప్రజ్ఞయే నిరాకారంగా ఉంటే - ఈశ్వరుడు.
గుర్తుకు తెచ్చేవాడు గురువు.
వస్తువు ఇచ్చేవాడు కాదు.
నీదే, నీవే అయిన ఆత్మవస్తువును
గురువూ ఇవ్వలేడు, దేవుడూ ఇవ్వలేడు.
నిన్ను నీలోలోపలికి(ధ్యానంలోకి) త్రోయడం తప్ప.
* * *
అనంతమైన వస్తువు - సద్వస్తువు.
అది 'నేను'గా ఉంటుందేగాని 'నేను' అని అనదు, అనుకోదు.
పరిమితమైన ప్రతి వస్తువూ జడమే.
జడవస్తువు 'నేను' అని అనదు, అనుకోదు.
* * *
సద్వస్తువు 'నేను' అనదు - అన్యము లేక.
జడశరీరము 'నేను' అనదు - ఉనికి లేక.
ఈ మధ్యలో, ఈ రెంటి స్పర్శతో, దేహపరిమాణంలో
'నేను' అని ఒకటి పుడుతోంది.
* * *
విమానం జడం - పైలట్ లేకుండా ఎగురదు.
పైలట్ చైతన్యం - విమానం లేకుండా ఎగురలేడు.
ఈ రెంటి కలయిక వలననే విమానం ఎగురుతుంది.
శివ-శక్తుల కలయికే ఈ సృష్టి చలనానికి మూలం.
* * *
కాబట్టి జీవుడు -
పూర్తిగా జడమూ కాదు,
పూర్తిగా చైతన్యమూ కాదు.
జడ-చైతన్యముల కలయికే జీవుడు...
అదే చిజ్జడగ్రంథి...
అదే బంధము...
అదే జీవుడు...
అదే సూక్ష్మశరీరము...
అదే అహంకారము...
అదే సంసారము...
అదే మనస్సు...
* * *
మా మేనమామగారి అబ్బాయి ఆనంద్ అడిగాడు-
మహనీయులు భారతదేశంలోనే యెందుకు పుడుతుంటారు? విదేశాల్లో అటువంటి పుట్టుకలు యెందుకు జరగడం లేదు? అని.
* * *
ఓ పదహారేళ్ల కుర్రవాడు(రమణుడు) దేవునికోసమని ఇల్లు వదిలి
అరుణాచలం చేరి, ధనం, వస్త్రం పరిత్యజించి
కేవలం "గోచీతో నిలబడడం" అనే అద్భుతమైన ఘట్టం
నాకు రోజులో ఒక్కసారైనా గుర్తుకువస్తుంటుంది.
ఆ పదహారేళ్ల కుర్రవాడే - భగవాన్ శ్రీరమణ మహర్షి.
చదివింది ఫిఫ్త్ ఫామ్.
కానీ పండితులకు, పీఠాధిపతులకు సైతం అవగతం కాని తాత్త్విక విషయాలెన్నింటినో బోధించారు.
ఎలా వచ్చింది ఆ కుర్రాడికి ఆ శక్తి? ఆ జ్ఞానం?
ఓ పువ్వు పుట్టినట్టు, ఓ మెరుపు మెరిసినట్టు
జ్ఞాని అలా పుడతాడు సహజంగా.
జ్ఞానికావడానికి-
కోచింగ్ సెంటర్లు లేవు,
text books లేవు,
రిజర్వేషన్లు లేవు,
రెకమెండేషన్లూ లేవు.
ఈ పవిత్ర భారతభూమిలో అటువంటి జ్ఞానవృక్షాలు సహజంగా ఎదగడానికి అవసరమైన "సారం" ఏదో ఉంది.
ప్రతి దశాబ్దంలోనూ అటువంటి మహనీయులు అవతరించడం చూస్తూనే ఉన్నాం.
అది మన భారతీయ ధార్మిక జీవన విధానమే
ఆ "సారం".
అలా మహనీయుడు పుట్టని దశాబ్ధం ఉన్నదంటే
ఈ భూమికి "చేవ" చచ్చినట్టు.
యుగాలపర్యంతం వస్తున్న ఆ చేవను
అలాగే మనం భవిష్యత్తరాలవారికి మనం అందివ్వాలంటే ఏకైక మార్గం - ధర్మాచరణం.
ధర్మాచరణ యొక్క దివ్యఫలమే భగవదనుగ్రహంగా,
అవతారమూర్తిగా ప్రకటనమౌతుంది ప్రపంచంలో.
ధర్మాచరణ అంటే శీలం.
శీలం అంటే పారదర్శకత (Transparency)
పారదర్శకత అంటే-
నీవు నీ లోపల ఏదో
బయట కూడా అదిగానే ఉండడం.
* * *
No comments:
Post a Comment