Thursday, May 23, 2024

 *_నీ పాటలే_* 
_*పరమపదానికి బాటలు!*_ 
--------------------------------------
తెలుగు పదానికి జన్మదినం
జానపదానికి జ్ఞానపధం..
అన్నమయ్య కీర్తనలతోనే
*_నిత్యం ప్రతిధ్వనించు_*
*_విష్ణుపథం..!_*

ఒకటా..రెండా..
ముప్పై రెండు వేల సంకీర్తనలు..
శ్రీనివాసుని ప్రాంగణంలోనే
ఆ పదకవితా 
పితామహుని నర్తనలు..
నీకైనా..నాకైనా తిరుమలగిరులను 
అల్లంత దూరాన 
దర్శించగనే 
గుర్తొచ్చే పాట
*_అదివో అల్లదివో శ్రీహారివాసము.._*
*_పదివేల శేషుల_* 
*_పడగల మయము..._*
అన్నమయ్య కీర్తనలతోనే
వేంకటపతి వశము..
ఆలపించినంతనే
ఒడలు పరవశము..!

తిరుమల గిరులలో
ప్రతి చెట్టు.. 
మహారుషుల ప్రతిరూపాలట
అక్కడ ఎల్లెడలా
కనిపించేది 
*_అన్నమయ్య ఉనికే.._*
వినిపించేది 
*_అన్నమయ్య పాటే..!_*

తాళ్ళపాక వారి కీర్తనతోనే
తిరుమల ప్రవేశం...
అలిపిరిలో మొదటి మెట్టు 
అధిరోహం..
అన్నమయ్య పాట ఆరోహం..
శేషాద్రి..నీలాద్రి..గరుడాద్రి..
అంజనాద్రి..వృషభాద్రి..
నారాయణాద్రి..
కడపటిగా వెంకటాద్రి..
ఒక్కో కొండా ఎక్కుతూ
ఆ కడపరాయుడి కీర్తనలతోనే వేంకటరాయుని
స్తుతి..ప్రస్తుతి..సన్నుతి..
అంతిమంగా 
ఆదుకొమ్మనే విన్నుతి..
మానవ జీవితానికి పరిణితి!

తెలిసీ తెలియని వయసులోనే తెలియకుండా 
మనమంతా వినలేదా
అమ్మ పాడుతుంటే
అన్నమయ్య పాట..
*_చందమామ రావే.._*
*_జాబిల్లి రావే.._*
జీవితాన ఏదో ఒక దశలో
వచ్చే ఆలోచన ఆ కీర్తన
*_అలల చంచలమైన_* 
*_ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల.._*
*_పలుమారు ఉచ్వాసపవనమందుండ_* 
*_నీ భావంబు_* 
*_తెలిపెనీ ఉయ్యాల.._*
అన్నమయ్య కీర్తన 
నీ రుజువర్తన..
నీ బ్రతుకున ఆలన..
నీ కష్టాన లాలన..
నీ భక్తి భావన..
మొత్తంగా నీ జీవితానికే
ఆలంబన..!

*కొండంత దేవుని* 
*కొండంత భక్తితో* *కొలవలేకపోయినటుల*
*ముప్పై రెండు వేల కీర్తనల*
*పదకవితాపితామహుని*
*జయంతి సందర్భంగా*
*చంద్రునికి నూలుపోగులా*
*ఓ చిరు అక్షరమాల!*
**********************
 *_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
    *_9948546286_*

No comments:

Post a Comment