Monday, June 16, 2025

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*రమణీయం*

*భగవన్ శ్రీ రమణమహర్షి జీవిత చరిత్ర*

*మొదటి భాగము*
--01--

దక్షిణ భారత దేశంలో మధురకు ముఫై మైళదూరంలో,"తిరుచ్చుళి" అనే గ్రామం వుంది. నేడు ఆ గ్రామం, రామనాథపురం జిల్లాలో వుంది. "తిరుచ్చుళి" అంటే, ఓంకారమని అర్ధం. స్కంధ పురాణంలో, ఆ గ్రామాన్ని "త్రిశూలపురం” అన్నారు. “ఆగ్రామంలో ఒక శైవ దేలవాయం వుంది. అందు పార్వతి, సహా యాంబగాను, పరమేశ్వరుడు - భూమినాధేశ్వరుడుగాను అవతరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ దివ్యమూర్తులను "మాణిక్య వాచకర్, సుందరమూర్తి” అనే ఇద్దరు ఋషి కవులు స్తుతించినట్లు, పెరియ పురాణంలో వుంది. పూర్వం ఆ గ్రామంలో క్షామం వచ్చి నప్పుడు, "కౌండిన్యుడు" శివునిగూర్చి తపస్సు చేయగా, ఒక నది ఉద్భవించినట్లు, ఒక గాథ వుంది, కరువు నివారణ అయింది. అంచేత ఆ నదికి "కౌండిన్యనది" అని పేరు వచ్చింది.

పందొమ్మిదో శతాబ్దం నాల్గవ పాదంలో తిరుచ్చుళి గ్రామంలో "సుందరమయ్యర్ - అలఘమ్మ" అనే స్మార్త శాఖకు చెందిన ద్రావిడ బ్రాహ్మణ దంపతులున్నారు. వారు దైవభక్తులై, పవిత్ర జీవనులై కాలం గడిపేవారు. అలఘమ్మకు ఎన్నో స్తోత్రాలూ, గీతాలూ వచ్చు. ఆచారవంతురాలు. ఆమె ఉపదేశం కూడా పొందిది. సుందరమయ్యర్ నెలకు రెండు రూపాయలు జీతం మీద, గుమాస్తాపని చేస్తో, ఊళ్లోవాళ్ళకు దస్తావేజులూ అవీ రాసిపెడుతూ, మంచి మాటకారితనంతో, వ్యవహారదక్షతతో అందరికీ తలలో నాలుక మాదిరిగా మెలుగుతూ, తన తెలివితేటలతో పరీక్ష రాయ కుండా, పట్టాలేని ప్లీడరుగా ప్రభుత్వ అనుమతిమీద స్థానిక మెజి స్ట్రేట్ కోర్టులో పనిచేస్తూ, ఇంటా- బైటా మంచివాడనే పేరు తెచ్చు కున్నాడు. అతడు బీదసాదలకు, సాధు - సజ్జనులకు అతిథి సత్కారాలు చేసేవాడు. క్రమంగా అతడు కొంతడబ్బు కూడబెట్టి, తిరుచ్చుళిలో ఒక ఇల్లు కట్టాడు.

1879 - డిశంబరు 30వ, తేదీరాత్రి ఒంటిగంట వేళ, అంటే ప్రమాది సంవత్సర, మార్గశీర్షమాస, పునర్వసు నక్షత్రమందు అల ఘమ్మ గర్భాన ఒక మగశిశువు జన్మించాడు. అది ఆర్ద్ర నక్షత్ర దర్శన పుణ్యదినం. పరమేశ్వరుడు, బ్రహ్మ - విష్ణువులకు జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన పర్వదినమది. ఆ రోజున పరమేశ్వరుడు కరుణాస్వరూపుడై - గౌతమ, పతంజలి, వ్యాఘ్ర పాదాది మొదలైన మహర్షులకు చిదంబరంలో నటరాజై దర్శనమిచ్చిన పుణ్యదినం. ఆ శుభసమయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు ఆనందతాండవమూర్తిని మహావైభవంతో ఊరేగిస్తారు. ఆ రోజున తిరుచ్చుళిలో ఈశ్వరోత్సవం ముగిసి, స్వామి గర్భాలయం ప్రవేశిం చేప్పుడు, అలఘమ్మ ప్రసవించింది.

ఆ దంపతులకు అది ద్వితీయ సంతానం. పెద్దవాని పేరు, నాగస్వామి. వారిది తెలుగు సంప్రదాయం. పూర్వం ఆ వంశంలో తెలుగు విద్వాంసులు వున్నారు. వారు తండ్రిని “నాయనా” అని పిలిచేవారు. సుందరమయ్యర్ కులదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కావడం చేత, ఆ బిడ్డకు "వెంకట్రామన్”అని పేరుపెట్టారు. ఆ తర్వాత ఆ దంపతులకు “నాగసుందరం" అనే కొడుకూ, "అలి మేలు" అనే కూతురూ, కలిగారు. వెంకట్రామన్ పిల్లలందరిమాదిరిగా పెరిగినా అతనిలో చురుకుదనంతక్కువ, నిద్ర ఎక్కువగా ఉండేది. అయినా అతడు పిల్లలతోకలిసి భూమినాథేశ్వరస్వామి ఆలయం ప్రక్కనవున్న కళ్యాణమండపంలోనో, కౌండిన్యనదీతీరంలోనో ఆట లాడుకునేవాడు. అతనికి ఎనిమిదవఏట, శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు.

----- *చిక్కాల కృష్ణారావు గారు రచించిన "రమణీయం" అను పుస్తకము నుండి* -----

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

No comments:

Post a Comment