Wednesday, June 11, 2025

 *వేదమూర్తుల స్తుతులు*
*(1 వ భాగము)*

*ఆధ్యాత్మికవిషయ అవగాహనలో ఒక ముఖ్యమైన ప్రశ్నను పరీక్షిన్మహారాజు. శుకదేవగోస్వామిని అడిగాడు. ఆ ప్రశ్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి: "వేద జ్ఞానము సాధారణంగా భౌతికజగత్తుకు చెందిన త్రిగుణాలతోనే ముడివడి ఉంటుంది. కనుక త్రిగుణాలకు అతీతమైన పరతత్త్వాన్ని అదెట్లా వర్ణించగలుగుతుంది? మనస్సు భౌతికము, వాక్కులు భౌతికశబ్ద తరంగములే కనుక మనస్సు యొక్క ఆలోచనలను శబ్దతరంగాలతో వ్యక్తపరచే వేదజ్ఞానము పరతత్త్వాన్ని ఏ విధంగా వర్ణించగలదు? ఏదేని వస్తువర్ణనము ఆ వస్తుమూలాన్ని, గుణాలను, కర్మలను వర్ణించడముతో కూడి ఉంటుంది. మనస్సుతో ఆలోచించి, వాక్కులను పలకడము ద్వారానే అటువంటి వర్ణన సాధ్యపడుతుంది. పరతత్త్వము భౌతిక గుణరహితుడు, కాని మన వాక్కులు గుణాలకు అతీతముగా పోజాలవు. అటువంటప్పుడు పరతత్త్వాన్ని వాక్కులలో వర్ణించడమెలా? భౌతికవాక్కుల ద్వారా పరతత్త్వాన్ని* *తెలిసికోవడము ఎట్లా సాధ్యమో నాకు తెలియడము లేదు."*

*వేదాలు చరమముగా పరతత్త్వాన్ని నిరాకారుడని వర్ణిస్తున్నాయో లేదా సాకారుడని వర్ణిస్తున్నాయో శుకదేవుని ద్వారా ధ్రువపరచుకోవడమే పరీక్షిన్మహారాజు అడిగిన ప్రశ్న యొక్క ప్రయోజనము. నిరాకారబ్రహ్మము, హృదయస్థ పరమాత్ముడు, తుట్టతుదకు దేవాదిదేవుడు శ్రీకృష్ణభగవానుడు అనే మూడు తత్త్వాలుగా పరతత్త్వావగాహనము పురోగమిస్తుంది.*

*వేదాలు మూడు కార్య విభాగాలతో ముడివడి ఉంటాయి. వాటిలో ఒకటి కర్మకాండ అని పిలువబడుతుంది. వేదాదేశముతో చేయబడే అటువంటి కర్మలు క్రమంగా మనిషిని పవిత్రుని జేసి అతని నిజస్థితిని తెలియజేస్తాయి. తరువాతది జ్ఞానకాండ. అది కాల్పనిక పద్ధతి ద్వారా పరతత్త్వాన్ని అర్థము చేసికొనే పద్ధతి. మూడవది ఉపాసనాకాండ. అది భగవదర్చనము, అప్పుడప్పుడు దేవతార్చనము. కూడ అయియుంటుంది. దేవతలకు భగవంతునితో గల సంబంధమును గురించిన అవగాహనతోనే వేదములలో దేవతార్చనము ఉపదేశించబడింది. భగవంతునికి ఎన్నో అంశలు ఉంటాయి. వాటిలో కొన్ని స్వాంతలని (స్వీయ విస్తారాలు), మరికొన్ని విభిన్నాంశలని (జీవులు) పిలువబడతాయి. ఈ రెండు రకాల అంశలు ఆదిదేవుని నుండే ఉద్భవిస్తాయి. స్వాంశలు విష్ణుతత్త్వాలని పిలువబడగా, విభిన్నాంశలు జీవతత్త్వాలని పిలువబడతాయి. బద్ధజీవులు సాధారణంగా ఇంద్రియభోగము కొరకే భౌతికజగత్తు కలాపాలలో నెలకొంటారు. అందుకే భగవద్గీతలో చెప్పబడినట్లు నానారకాలైన ఇంద్రియభోగాలకు అలవాటుపడిన వారిని నియంత్రించడానికే ఒక్కొక్కప్పుడు దేవతార్చనము ఉపదేశించబడుతుంది. ఉదాహరణకు మాంసభక్షణకు అలవాటుపడిన వారికి వేదములు కాళీపూజను చేసి కర్మకాండ విధి ననుసరించి మేకను (ఇంకొక జంతువును కాదు) బలి ఇచ్చిన తరువాత మాంసభక్షణము చేయడానికి అనుమతిస్తాయి. దీని ఉద్దేశ్యము మాంసభక్షణను ప్రోత్సహించడము గాక మాంసభక్షణకు పట్టుబట్టేవారికి కొన్ని నియమిత పరిస్థితులలోనే దానిని తినేటట్లు చేయడము అవుతుంది. కనుక దేవతార్చనము భగవదర్చనము కానేకాదు, కాని దేవతార్చనము ద్వారా మనిషి క్రమంగా భగవంతుని పరోక్షంగా అంగీకరించినట్లు అవుతుంది.*

*ఈ పరోక్షమైన అంగీకారమే భగవద్గీతలో "అవిధి" అని చెప్పబడింది. అవిధి అంటే అప్రమాణికమైనదని అర్థము. దేవతార్చనము అప్రమాణికము కనుక నిరాకారవాదులు పరతత్త్వము యొక్క నిరాకారధ్యానమునే నొక్కి చెబుతారు. పరతత్త్వముయొక్క నిరాకారధ్యానము, సాకారధ్యానము అనే రెండింటిలో వేద జ్ఞానముయొక్క చరమలక్ష్యమేమిటనేది పరీక్షిన్మహారాజు ప్రశ్న. అయినా భగవంతుని సాకార నిరాకార తత్త్వాలు మన భౌతికభావనకు అతీతమైనవే. బ్రహ్మజ్యోతి యని పిలువబడే నిరాకారతత్త్వము శ్రీకృష్ణుని దేహకాంతియే గాని అన్యము కాదు. ఆ దేహకాంతియే భగవంతుని సృష్టి యంతట వ్యాపించి ఉంటుంది: భౌతికమేఘముచే కప్పబడే దాని అత్యల్పభాగమే త్రిగుణమయ జగత్తని పిలువ బడుతుంది. భౌతికజగత్తుగా పిలువబడే ఆ ఆచ్ఛాదిత భాగములో ఉండే జీవులు కాల్పనికపద్ధతి ద్వారా పరతత్త్వాన్ని ఏ విధంగా తెలిసికోగలుగుతారు?*

*ఇంద్రియభోగము, ఒక దేహము నుండి వేరొక దేహములోనికి పునర్జన్మము, అట్లే భౌతికస్థితుల నుండి ముక్తి అనే ప్రయోజనము కొరకే జీవుని మనస్సును, ఇంద్రియాలను, ప్రాణాలను భగవంతుడు సృష్టించాడని పరీక్షిన్మహారాజు ప్రశ్నకు సమాధానముగా శుకదేవగోస్వామి పలికాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే మనిషి తన ఇంద్రియాలను, మనస్సును, ప్రాణాన్ని ఇంద్రియభోగానికి ఉపయోగించుకో వచ్చును, పునర్జన్మ కొరకు ఉపయోగించుకోవచ్చును లేదా మోక్షము నిమిత్తము వాడుకోవచ్చును. బద్ధజీవులకు నిబంధనలతో కూడిన ఇంద్రియభోగ అవకాశాన్ని ఇవ్వడానికి వేదాదేశాలు ఉన్నాయి. తద్వారా అవి ఉన్నతజీవన స్థితులను పొంద. డానికి వారికి అవకాశాన్ని ఇస్తాయి. తుట్టతుదకు చేతనము విశుద్ధమైతే జీవుడు తన మూలస్థితికి అరుదెంచి భగవద్ధామానికి చేరుకుంటాడు.*

*జీవుడు తెలివితేటలు కలవాడు. అందుకే మనిషి తన బుద్ధిని మనస్సు, ఇంద్రియాల పైన ఉపయోగించాలి. బుద్ధిని సరిగ్గా ఉపయోగించడము ద్వారా మనస్సు, ఇంద్రియాలు శుద్ధిపడినపుడు బద్ధజీవుడు ముక్తుడౌతాడు. ఇంద్రియమనో నిగ్రహంలో బుద్ధిని సరిగ్గా వాడకపోతే బద్ధజీవుడు కేవలము ఇంద్రియభోగార్ధము. పదేపదే పునర్జన్మలు పొందుతాడు. వ్యక్తిగతజీవుని మనస్సు, ఇంద్రియాలు, బుద్ధిని భగవంతుడు సృష్టించాడని శుకదేవగోస్వామి చెప్పిన సమాధానములోని స్పష్టమైన మరియొక అంశము. జీవులు సృజించబడినారని ఎప్పుడూ చెప్పబడ లేదు. సూర్యకిరణాలు సర్వదా సూర్యునిలో ఉన్నట్లు, జీవులు శాశ్వతముగా భగవ దంశలై ఉన్నారు. కాని సూర్యుని ద్వారా సృజింపబడిన మేఘముచే సూర్యకిరణాలు ఒకప్పుడు కప్పబడినట్లు, భగవంతుని శాశ్వతాంశలు అయినప్పటికిని జీవులు ఒకప్పుడు అజ్ఞానాంధకారములో జీవిత భౌతికభావన యనే మేఘముతో కప్ప బడతారు. ఈ చీకటిస్థితిని తొలగించడానికే వైదికవిధానము ఉన్నది. బద్ధ జీవుని. ఇంద్రియాలు, మనస్సు పూర్తిగా సవిత్రమై నపుడు అతడు కృష్ణభక్తిభావన అనే తన నిజస్థితికి వస్తాడు. అదే మోక్షము.*

*వేదాంత సూత్రాలలో మొదటి సూత్రము పరతత్వము గురించి విచారణ చేస్తుంది. “అథాతో బ్రహ్మజిజ్ఞాసా పరతత్త్వము యొక్క స్వభావమేమిటి?" తరువాతి సూత్రము దానికి సమాధానము చెబుతూ పరతత్త్వమే సమస్తానికి మూలమని ఆతని స్వభావాన్ని తెలియజేసింది. మన అనుభవములో ఉన్నదేదైనా. భౌతికజీవనస్థితిలో ఉన్న దైనా సరే అదంతా అతని నుండి ఉత్పన్నమైనదే. ఆ పరతత్త్వమే మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని సృష్టించాడు. పరతత్త్వము ఇంద్రియమనోబుద్ధి రహితుడు కాడని దీని భావము. ఇంకొక విధంగా చెప్పాలంటే అతడు నిరాకారుడు కాడు. "సృజించాడు" అనే పదమే అతడు దివ్యమైన బుద్ధిని కలిగియున్నాడని సూచిస్తుంది. ఉదాహరణకు ఒక తండ్రి పిల్లవాడికి జన్మనిస్తాడు.*

💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని  భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦 
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*

*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁

No comments:

Post a Comment