Sunday, June 15, 2025

 *☘️ వేదమూర్తుల స్తుతులు ☘️*
*(4 వ భాగము)*

*అనంతమగు జ్ఞానము, అనంతమగు శక్తి, అనంతమగు బలము, అనంతమగు ప్రభావము, అనంతమగు సౌందర్యము, అనంతమగు వైరాగ్యము కారణంగానే శ్రీకృష్ణుడు పరబ్రహ్మము. కనుక తుట్టతుదకు బ్రహ్మమనే పదము కేవలము శ్రీకృష్ణునకే అన్వయిస్తుంది. నిరాకారబ్రహ్మము శ్రీకృష్ణుని దేహకాంతియే కనుక అతడే పరబ్రహ్మమని అర్జునుడు ధ్రువపరిచాడు. సమస్తము బ్రహ్మము మీదనే ఆధారపడి ఉంటుంది, కాగా బ్రహ్మమే శ్రీకృష్ణునిపై ఆధారపడియున్నాడు. కనుక శ్రీకృష్ణుడే చరమబ్రహ్మము లేదా పరబ్రహ్మము అయియున్నాడు. భౌతిక తత్త్వాలు శ్రీకృష్ణుని న్యూనశక్తిగా చెప్పబడినాయి. వారి అంతఃప్రక్రియ వలననే భౌతికజగత్తు ప్రకట మౌతుంది, శ్రీకృష్ణునిపై ఆధారపడి నిలిచి ఉంటుంది, ప్రళయము తరువాత సూక్ష్మమైన శక్తిగా శ్రీకృష్ణుని దేహములో తిరిగి ప్రవేశిస్తుంది. కనుక శ్రీకృష్ణుడే ప్రకట విలయాలు రెండింటికి కారణమై యున్నాడు.*

*"సర్వం ఖల్విదం బ్రహ్మ" అనేదానికి అర్థము సమస్తము శ్రీకృష్ణ భగవానుడే. అంటే సమస్తము అతని శక్తియే. మహాభాగవతుల దృష్టికోణము ఈ విధంగా ఉంటుంది. వారు ప్రతిదానిని శ్రీకృష్ణ సంబంధములోనే చూస్తారు. శ్రీకృష్ణుడే పలురూపాలలోనికి మార్పుచెందాడు కనుక ప్రతీదీ శ్రీకృష్ణుడే. దేని అర్చనమైనా అతనిని అర్చించడమేనని నిరాకారవాదులు వాదిస్తారు. ఈ మిథ్యావాదానికి శ్రీకృష్ణుడు భగవద్గీతలో సమాధానము నిచ్చాడు. అదేమిటంటే ప్రతీదీ భగవంతుని శక్తి రూపాంతరమేయైనా అతడు సర్వత్ర లేడు. అతడు ఏకకాలంలో ఉన్నాడు, లేడు. శక్తిరూపములో అతడు సర్వత్ర ఉన్నాడు. కాని . శక్తిమంతుని రూపములో అతడు సర్వత్ర లేడు. ఏకకాలంలో ఈ ఉండడము, లేకపోవడము మన ఇంద్రియాలకు అచింత్యమైన విషయము. కాని ఈశోపనిషత్ ఆరంభములోనే దీనికి స్పష్టమైన వివరణము ఇవ్వబడింది. అదేమిటంటే భగవంతుడు ఎంతటి పరిపూర్ణుడంటే అనంతమైన శక్తులు, వాటి రూపాంతరములు అతని నుండి ఉత్పన్నమైనా అతడు మార్పురహితుడై ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుడు సర్వకారణకారణుడు కనుక బుద్ధిమంతులు ఆ పారపద్యాలనే ఆశ్రయించాలి.*

*కేవలము తనకే శరణుజొచ్చుమని శ్రీకృష్ణుడు ఎల్లరకు ఉపదేశించాడు.. వేదాదేశము కూడా అదే. శ్రీకృష్ణుడే సర్వకారణకారణుడు కనుక నియమపాలనము ద్వారా ఋషిమునులు అతనిని పూజిస్తారు. ఇక ధ్యానానికి సంబంధించినంతవరకు మహాత్ములు తమ హృదయాంతరములో శ్రీకృష్ణుని దివ్యరూపాన్నే ధ్యానిస్తారు. ఈ ప్రకారంగా మహాత్ముల చిత్తములు సర్వదా శ్రీకృష్ణుని యందే లగ్నమై ఉంటాయి. కృష్ణగత చిత్తములతో సహజముగానే భక్తులు కృష్ణ చర్చనే చేస్తారు.*

*కృష్ణచర్చ లేదా కృష్ణుని గురించి పాడడము కీర్తనమని పిలువబడుతుంది. "కీర్తనీయ సదా హరిః" అని శ్రీచైతన్యులు ఉపదేశించారు. కృష్ణచింతనము, కృష్ణ చర్చకు అన్యమైనది లేకపోవడమని దాని అర్ధము. ఇదే కృష్ణభక్తిభావన. ఇదెంత ఉదాత్తమైనదంటే ఈ పద్ధతిని చేపట్టినవాడు ముక్తి భావానికి అతీతంగా మహోన్నత జీవన పూర్ణత్వాన్ని సాధిస్తాడు. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో సర్వదా తననే స్మరించమని, తనకే సేవ చేయమని, తనను అర్చించమని, తనకు నమస్కరించమని ఎల్లరకు ఉపదేశించాడు. ఈ రకంగా భక్తుడు కృష్ణాత్ముడే అవుతాడు. కృష్ణభక్తిభావన లోనే సర్వదా నెలకొనినవాడై చివరకు అతడు కృష్ణధామానికి చేరుకుంటాడు.*

*శ్రీకృష్ణుని వివిధాంశలుగా వివిధ దేవతల అర్చనాన్ని వేదములు ఉపదేశించి నప్పటికిని అటువంటి ఉపదేశాలు ఇంద్రియభోగానురక్తులైన అల్పబుద్ధులకే ఉద్దేశించబడినాయని తెలిసికోవాలి. కాని మానవజీవనకార్యాన్ని పరిపూర్ణము చేసికొన గోరేవాడు కేవలము శ్రీకృష్ణునే భజించాలి. ఇది విషయాన్ని సరళమొనర్చి మానవజీవన సాఫల్యానికి పూచీనిస్తుంది. ఆకాశము, జలము, నేల అన్నీ కూడ భౌతికజగత్తులోని భాగాలేయైనా మనిషి నేల మీద నిలబడినపుడు అతని స్థితి ఆకాశము లేదా నీళ్ళపై నిలిచినప్పటి కంటే సురక్షితముగా ఉంటుంది. అందుకే బుద్ధిమంతుడు భగవదంశలే యైనా దేవతల రక్షణలో నిలువడు. పైగా అతడు కృష్ణభక్తిభావన యనే స్థిరమైన పదముపై నిలిచి ఉంటాడు. అదే అతని స్థితిని సుస్థిరము, పదిలము చేస్తుంది.*

*మనిషి రాయి పైన నిలిచినా లేదా కట్టెపై నిలిచినా రాయి, కట్టె రెండును వేల పైననే నిలిచియున్న కారణాన తుదకు అతడు నేలపైననే నిలిచి ఉంటాడనే ఉపమానాన్ని నిరాకారవాదులు చెబుతారు. కాని అతడు నేరుగా వేలపైననే నిలబడితే మీద నిలిచినప్పటి కన్నను లేదా రాయిమీద నిలిచినప్పటి కన్నను. మరింత భద్రముగా ఉంటాడని చెప్పవచ్చును. ఇంకొకరకంగా చెప్పాలంటే పరమాత్ముని ఆశ్రయించడం లేదా నిరాకారబ్రహ్మమును ఆశ్రయించడం భక్తితో ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని ఆశ్రయించుట యంతగా సురక్షితము కాదు. అందుకే జ్ఞానులు, యోగుల స్థితి కృష్ణభక్తుల స్థితి కన్నను సురక్షితము కానే కాదు. వివేకము. నశించినవాడే దేవతార్చనము చేపడతాడని శ్రీకృష్ణుడు అందుకే భగవద్గీతలో చెప్పాడు. ఇక నిరాకార బ్రహ్మాసురక్తులైనవారిని గురించి శ్రీమద్భాగవతము ఈ విధంగా చెప్పింది : "ప్రభూ! జ్ఞానముచే తాము ముక్తులమైనామని తలచేవారు నీ పాదపద్మాశ్రయాన్ని పొందని కారణంగా ప్రకృతి కల్మషము నుండి పవిత్రులై ఉండరు. వారు నిరాకారబ్రహ్మానుభూతి స్థితికి ఎదిగినను నీ పాదపద్మాలను అపహాస్యము చేసిన కారణంగా ఆ ఉన్నతస్థితి నుండి నిక్కముగా పతనము . చెందుతారు". అందుకే దేవతార్చకులు బుద్ధిమంతులు కారని శ్రీకృష్ణుడు. తలచాడు. ఎందుకంటే వారు కేవలము తాత్కాలికము, నశ్వరమునైన ఫలాలనే పొందుతున్నారు. వారి యత్నాలన్నీ బుద్ధిహీనుల యత్నాలు. ఇంకొకప్రక్క. భగవంతుడు తన భక్తునికి పతనభయం లేదని ఆశ్వాసమిచ్చాడు.*

*వేదమూర్తులు తమ స్తుతిని కొనసాగించారు: "దేవా! అన్ని దృష్టికోణాలను పరిశీలించి చూసినట్లైతే మనిషి తన కన్నను ఉన్నతుడైనవానిని పూజించవలసివస్తే అతడు నీ పాదపద్మార్చనకు అంటి పెట్టుకొని ఉండుట ఉత్తమము. ఎందుకనగా నీవే సృష్టిస్థితిలయాలకు పరమనియామకుడవై యున్నావు. నీవు భూః భువః స్వః అనే ముల్లోకాలకునియామకుడవు, నీవు చతుర్దశ ఊర్ధ్వ అధోలోకాలకు నియామకుడవు, నీవు త్రిగుణాలకు నియామకుడవు. దేవతలు, ఆధ్యాత్మికజ్ఞానప్రగతిని సాధించిన వ్యక్తులు నీ దివ్యలీలలనే సర్వదా కీర్తిస్తారు, వింటారు. ఎందుకంటే పాపపురాశులను నశింపజేసే విశేషశక్తి ఆ పద్ధతికి ఉంది. బుద్ధిమంతులు యథార్థానికి నీ అమృత లీలాసాగరములో మునిగి, ఓపికతో వాటిని గురించి శ్రవణము చేస్తారు. ఆ విధంగా వారు శీఘ్రమే గుణకల్మషము నుండి ముక్తులౌతారు. ఆధ్యాత్మికజీవనప్రగతి కొరకు వారు కఠోరమైన వ్రతములు, తపస్సులు చేయ నవసరము లేదు. నీ దివ్యలీలల శ్రవణకీర్తనము అత్యంత సులభమైన ఆత్మానుభూతి విధానము, దివ్యకథను వినయముతో వినడం ద్వారా మనిషి హృదయము సమస్త కల్మషము నుండి శుద్ధి పడుతుంది. ఆ విధంగా కృష్ణభక్తిభావన భక్తుని హృదయంలో సుస్థిరమౌతుంది."*

*దేవదేవుని గురించిన ఈ శ్రవణకీర్తన విధానమే అత్యున్నత ధర్మమని మహా జనకుడైన భీష్ముదేవుడు కూడా తన అభిప్రాయాన్ని తెలియజేసాడు. భగవదర్చనమే సకలవైదికక్రియల సారమని తైత్తిరీయోపనిషత్ తెలియజేసింది.*

*వేదమూర్తులు ఇంకను స్తుతులు కొనసాగించారు: "దేవా! శ్రవణకీర్తనమనే భక్తి యోగ విధానము ద్వారా తనను తాను ఉద్ధరించుకొనగోరే భక్తుడు అచిరకాలములోనే సంసార ద్వంద్వ బంధముల నుండి విడుదలను పొందుతాడు. సరళమైన ఈ తపోవ్రత విధానముచే భక్తుని హృదయమందున్న పరమాత్ముడు. అతిప్రసన్నుడై అతడు భగవద్ధామాన్ని చేరులాగున నిర్దేశములు ఇస్తాడు." తన సమస్తకర్మలను, ఇంద్రియాలను భగవత్సేవలో నియోగించేవాడు తనయెడ పరమాత్ముడు సంతుష్టుడయ్యెడి కారణంగా పూర్ణప్రశాంతుడు అవుతాడని. భగవద్గీతలో చెప్పబడింది. ఆ విధంగా భక్తుడు శీతవాతాలు, మానావమానాలు అనే ద్వంద్వాలకు అతీతుడౌతాడు. సమస్త ద్వంద్వాల నుండి విడివడినవాడై అతడు దివ్యానందాన్ని అనుభవిస్తాడు, సంసార చింతలను క్లేశాలను అతడు పట్టించు కోడు. కృష్ణభక్తిభావనలో లగ్నమైన భక్తుడు తన పోషణకు లేదా రక్షణకు చింతించడని భగవద్గీతలో ధ్రువపరుపబడింది. కృష్ణుని యందే లగ్నమైనవాడై అతడు తుట్టతుదకు పరమపూర్ణత్వాన్ని సాధిస్తాడు. భౌతికజగత్తులో ఉన్నప్పుడు అతడు చింతలు క్లేశాలు లేకుండ ప్రశాంతముగాను, పరమానందముతోను జీవించి. దేహత్యాగానంతరము భగవద్ధామానికి చేరుకుంటాడు. దీనిని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో ఈ విధంగా ధ్రువపరిచాడు: "దివ్యస్థానమైన నా పరంధామమును చేరిన తరువాత జీవుడు ఈ భౌతికజగత్తుకు తిరిగి రాడు. నిత్యధామములో నా సేవలో నెలకొనినవాడై పరమపూర్ణత్వాన్ని బడసినవాడు దుఃఖమయమైన భౌతికజగత్తుకు తిరిగి రానవసరము లేదు."*

*వేదమూర్తులు తమ స్తుతులను కొనసాగించారు. "ప్రభూ! శ్రవణకీర్తనల ద్వారా. నీ ఆజ్ఞాపాలనము ద్వారా నిరంతరము భక్తియుత సేవను చేస్తూ జీవులందరు. తప్పనిసరిగా కృష్ణభక్తిభావనలో నెలకొనాలి. భక్తియోగములో నెలకొననపుడు మనిషి జీవించియున్నవాని లక్షణాలను ప్రదర్శించడము వ్యర్థము. మనిషి శ్వాసించి నపుడు జీవించియున్నాడని తెలిసికొంటాము. కాని కృష్ణభక్తిభావన లేనట్టి మనిషి కమ్మరివాని కొలిమితిత్తితో పోల్చబడతాడు. కొలిమితిత్తి గాలిని తీసికొని, విడుస్తూ ఉంటుంది. భక్తి యోగాన్ని చేపట్టకుండా తోలు, ఎముకల సంచీలో జీవించేవాడు. కొలిమితిత్తికి ఏమాత్రము తీసిపోడు. అదేవిధంగా అభక్తుని దీర్ఘాయువు చెట్ల సుదీర్ఘమైన జీవితముతోను, అతని భోజనము శునకసూకరముల మలభక్షణముతోను, అతని మైథునసుఖము సూకరమేషములు మైథునసంభోగముతోను పోల్చబడతాయి." దేవాదిదేవుడు మహావిష్ణువు రూపములో భౌతికజగత్తులో ప్రవేశించిన కారణంగానే విశ్వప్రకటము సాధ్యపడింది. మహావిష్ణువు వీక్షణముచే మహత్తత్త్వము క్షుభితమౌతుంది; అప్పుడే త్రిగుణములు అంతఃప్రక్రియ ఆరంభమౌతుంది. కనుక ఏవైతే భౌతికసౌకర్యాలను మనము అనుభవించాలని యత్నిస్తున్నామో అవి కేవలము భగవత్కరుణ చేతనే లభ్యమౌతున్నాయని తెలిసికోవాలి.*

💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦 
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*

*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁

No comments:

Post a Comment