*✍🏼 నేటి కథ ✍🏼*
*భయం లేని జీవితం*
*పునఃకథనం: డా॥ ఎం. హరికిషన్ - 9441032212*
ఒక అడవిలో కొన్ని కుందేళ్ళు వున్నాయి.
ఆ కుందేళ్ళు అన్నీ ఒకచోట సమావేశం అయ్యాయి. మనసులు
విప్పుకున్నాయి. బాధలు చెప్పుకున్నాయి.
ఒక కుందేలు లేచి మనదీ ఒక జీవితమేనా... ఏది తినాలన్నా భయం.
ఎక్కడికి పోవాలన్నా భయం. ఏ జంతువు ఎప్పుడు ఎలా ఎటువైపు నుండి
మీద పడుతుందో తెలీదు. చిన్న అలికిడికి కూడా ఉలిక్కి పడుతున్నాం.
చీటికీమాటికీ బెదిరిపోతున్నాం. ఇలా జీవించడం కన్నా చావడమే మంచిది
అనింది.
మిగతా కుందేళ్ళు కూడా అవును నిజమే... నిమిష నిమిషానికీ ఇలా
భయపడుతూ జీవించడం కన్నా ఒకేసారి చావడమే మంచిది. పదండి
పోదాం అన్నాయి.
అన్నీ కలసి చావడానికి ఒక చెరువు దగ్గరికి బైలుదేరాయి.
ఆ చెరువు గట్టు మీద చాలా కప్పలు వున్నాయి.
అవి దూరం నుంచే కుందేళ్ళ గుంపును చూసి భయంతో
వణికిపోయాయి. అమ్మో... ఎన్ని కుందేళ్ళో చూడండి. వాటి కాళ్ళకింద
పడితే అక్కడికక్కడే చచ్చిపోతాం. పారిపోండి. పారిపోండి అంటూ తలా
ఒక దిక్కు ఎగురుతా దుంకుతా భయంతో వెళ్ళిపోయాయి.
అది చూసి కుందేళ్ళు అవాక్కయ్యాయి. వాటి నోట మాట రాలేదు.
అరే... మనమే అందరికీ భయపడతా వున్నాం అనుకుంటే మన
కుందేళ్ళని చూసి భయపడేవి కూడా చాలా వున్నాయి. నిజమే లోకంలో
అన్నీ ఏదో ఒకదానికి భయపడుతూనే వుంటాయి. భయం లేనిది ఈ
లోకంలో ఏదీ వుండదు. ఇదింతదానికి మనం చావాలి అనుకోవడం
అవివేకం అనుకున్నాయి.
దాంతో కుందేళ్ళు తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయి.
No comments:
Post a Comment