*🙏🕉️🛕సర్వజన శ్రేయస్సును కోరేదే "సనాతన ధర్మం"!!!*
ఈ మధ్యకాలంలో చాలామంది సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ మాట్లాడే సందర్భాల్లో వేదాలలోని శ్లోకాలపై అనవసర రాద్దాంతం చేయడం చూస్తున్నాం, అసంపూర్ణ జ్ఞానంతో, అరకొర విజ్ఞానంతో విమర్శలు చేస్తూ, చాతుర్వర్ణ వ్యవస్థను ప్రస్తుత కాలానికి అపాదిస్తూ మనువాదం అంటూ రకరకాలుగా విమర్శిస్తూ నేటి సమాజంలోని కొన్ని వర్గాలను కించపరుస్తుండటం ఈ మధ్య తరచుగా చూస్తున్నాం, ఇలాంటి సందర్భాల్లో సనాతన ధర్మాచారులు విమర్శకులకు సరైన సమాధానం ఇచ్చి వారి అపోహలను తొలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
మనకు వేదాలలో "గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు" అన్న ప్రార్థన ఒకటి ఉంది. ఈ మధ్యనే ఆ శ్లోకాన్ని ఉటంకిస్తూ గోవులకు, బ్రాహ్మణులకు మాత్రం శుభం జరిగితే సరిపోతుందా మిగితా సమాజమంతా ఏమైపోయినా పరవాలేదా అంటూ ప్రశ్నించటాన్ని ఒకచోట చూశాను, అలాంటి వారితో బాటు తెలియని వారు కూడా తెలుసుకునేలా చేయటం మన బాధ్యత.
ముందుగా కులానికి సంభందించిన రంగు కళ్లద్దాలు తీసి ఈ శ్లోకాన్ని చదివితే, పెద్దలు ఈ శ్లోకం చెప్పిన సందర్భాన్ని, దాని అర్థాన్ని పూర్తిగా తెలుసుకుంటే ఇలాంటి అపార్థాలు రాకుండా ఉంటాయి.
“ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ || ”
----- భగవద్గీత 4-13
ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది నేటి కులవ్యవస్థకు పెద్దలు చెప్పిన వర్ణవ్యవస్థకు అసలు పోలికే లేదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే పదాలు అప్పుడు, ఇప్పుడు ఓకేలాగా ధ్వనించినంత మాత్రాన ఒకటి కాబోవు...
ఇప్పుడు సమాజంలో వ్యక్తిగతంగా ఎంత ఎదిగినా ఎంత విజ్ఞానాన్ని సాధించినా పుట్టుకతో వచ్చిన కులాలు మారవు, కానీ వర్ణ వ్యవస్థ విషయానికొస్తే పుట్టుకతో మానవులు అందరూ శూద్రులే. వారి గుణ, కర్మలను బట్టి వారు విభజించ పడ్డారు అని గీత లో చెప్ప బడింది.
ఇక 'గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు' అనడంలోని ఔచిత్యం చూసినప్పుడు జననం రీత్యా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు అని కాదు, జీవనం రీత్యా, లేదా జ్ఞానం రీత్యా బ్రాహ్మణ ధర్మం లేదా వర్ణానికి చెందిన వారని గ్రహించాలి, బ్రాహ్మణ జీవనం అంటే సాత్విక జీవనం, సాత్విక భోజనం, కేవలం వైదిక ధర్మాలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, ఇవే వారు అనుసరించే కర్మ, ధర్మ, కర్తవ్యాలు నిర్వహించటం. ఈ కర్మలు ఆచరించే వీరికి శారీరక భుజబలo మిగిలిన వర్ణాలతో పోలిస్తే తక్కువ. వీరు బలహీనుల లెక్కలోకి వస్తారు.
ఏ కులంలో పుట్టినా సాత్వికంగా జీవించడానికి నిర్ణయించుకున్న వారందరూ బ్రాహ్మణులు కిందే వస్తారు. మనo పూజించి, గౌరవించే, మహర్షులు మునులు, వారి భార్యలు అందరూ కూడా పుట్టుకతో బ్రాహ్మణులు కారు. వారు వారి కర్మ చేత బ్రాహ్మణులుగా జీవించిన వారే. దానిని అర్థం చేసుకోకుండా బ్రాహ్మణులను గొప్పగా చూపారు, ఇతరులను తక్కువ చేశారు అంటూ వాదించడం, అది సరికాదనే సనాతన ధర్మాచారులను బాధించడం ఎంతమాత్రం మంచిది కాదు...
హిందూ సంస్కృతి గొప్పదనం తెలియాలంటే...
ఈ శ్లోకాలు తీసుకోండి, వాటి అర్థాలు తెలుసుకోండి,
వీటి అర్థం సరిగ్గా తెలుసుకోగలిగితే చాలు మన సంస్కృతి గొప్పదనం తెలుస్తుంది, ఎప్పుడో సమసిపోయినట్టి, ఇప్పటి సామాజిక స్థితులకు సంబంధం లేనట్టి మనుధర్మ శాస్త్రాన్ని విమర్శిస్తూ కొన్ని కులాల వారిని దూషించడం విజ్ఞత కాబోదు.
శాంతి మంత్రములు మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని ప్రస్తుత కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి చదివేవారు. వేదవిదులైన పండితుల ద్వారా పఠించబడే ఈ శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ద్వారా పూర్వం రోజుల్లో పండితులకు, గోవులకు భారతీయ సమాజంలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది.
1. ఓం సహనావవతు, సహనౌ భునక్తు,
సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి:
తాత్పర్యం:-
సర్వ జీవులు రక్షింపబడుగాక... సర్వ జీవులు పోషింపబడుగాక... అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి పని చేయాలి ( సమాజ ఉద్ధరణ కోసం )... మన మేధస్సు వృద్ది చెందుగాక... మన మధ్య విద్వేషాలు రాకుండు గాక... ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక...
2. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..
ఓం సర్వేషాం శాంతిర్భవతు..
ఓం సర్వేషాం పూర్ణం భవతు..
ఓం సర్వేషాం మంగళం భవతు..
తాత్పర్యం:-
సర్వులకు సుఖము, సంతోషము కలుగుగాక..
సర్వులకు శాంతి కలుగు గాక..
సర్వులకు పూర్ణ స్థితి కలుగుగాక.. సర్వులకు శుభము కలుగుగాక..
3. ఓం సర్వేత్ర సుఖిన: సంతు, సర్వే సంతు నిరామయా,
సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...
తాత్పర్యం:-
సర్వులు సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక..
సర్వులు ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక..
అందరికీ ఉన్నతి కలుగు గాక..
ఎవరికీ బాధలు లేకుండు గాక..
No comments:
Post a Comment