*ఉన్నత లక్ష్యాలను సాధించడానికి మనం ఏమి చేయాలి?*
```
ఆకాష్ ఒకరోజు సాయంత్రం ఆడుకుంటూ, తన తల్లి గదిలోకి వెళ్లాడు. అతని తల్లి టేబుల్ దగ్గర కూర్చుని ఏదో వ్రాసుకుంటోంది. హఠాత్తుగా తల్లి అతని వైపు చూసేసరికి, అమ్మమ్మ వారికి బహుమతిగా ఇచ్చిన ఒక పూల కుండీ (ఫ్లవర్ వాజ్) అతని చేతిలో ఉంది.
కొడుకు చేతిలోని గాజు కుండీ(ఫ్లవర్ వాజ్)ని చూసి తల్లి కంగారుపడి, “ఆకాష్ ఆ కుండీని కింద పెట్టు నాయనా, పొరపాటున జారిపడిపోతే పగిలిపోతుంది” అని అంది.
“అమ్మా.. ఇందులోంచి నేను చేయి తీయలేను..” అని ఆకాష్ బదులిచ్చాడు.
తల్లి తాను చేస్తున్న పనిని వదిలిపెట్టి, అతని వైపు జాగ్రత్తగా చూసి, “తీయచ్చు, ముందు నువ్వు దానిని క్రిందపెట్టు”, అని అంది.
“నాకు తెలుసమ్మా, కానీ నేను ఈ కుండీలోంచి చేయి తీయలేను,” ఆకాష్ ఇబ్బందిపడుతున్నట్లుగా సమాధానం చెప్పాడు.
అతని తల్లి మోకాళ్లపై నిలబడి అతని చేతి వైపు చూసింది. కుండీ మూతి చాలా ఇరుకుగా ఉంది, ఆకాష్ చెయ్యి అతని మణికట్టు వరకు పూర్తిగా ఆ కుండీలో చిక్కుకుని ఉంది.
ఇది చూసిన తల్లి కంగారుపడి ఆకాష్ తండ్రిని పిలిచింది.
నాన్న వచ్చి పరిస్థితి చూశారు. మెల్లగా ఆకాష్ చెయ్యి పట్టుకుని కుండీలోంచి లాగే ప్రయత్నం చేసినా అది బయటకు రాలేదు.
అప్పుడు సబ్బు నీళ్లు ఉపయోగించి ఆకాష్ చేతిని తీసే ప్రయత్నం చేసాడు కానీ ఏమీ జరగలేదు. ఆ తర్వాత మణికట్టు చుట్టూ నూనె రాసి చేతిని వదులుచేయడానికి ప్రయత్నించాడు, కానీ అప్పటికీ చేయి బయటకు రాలేదు.
అన్నీ ప్రయత్నించాక, తండ్రి ఒక్క క్షణం ఆగి, ఆకాష్ మణికట్టు, కుండీ వైపు చూసి, “నా వల్ల కావట్లేదు, నేను వదిలేస్తున్నాను.. ఇప్పుడు ఈ కుండీలోంచి చేతిని ఎలా బయటకుతీయాలో చెప్పినవారికి, నేను వంద రూపాయలు బహుమతిగా ఇస్తాను...” అని అన్నాడు.
ఆకాష్ “నిజమేనా నాన్నగారూ.. రూ.100 బహుమతిగా ఇస్తారా!!” అని అడిగాడు.
అప్పుడు అమ్మ, నాన్న ఇద్దరికీ ఒక శబ్దం కంగుమని వినిపించింది, పిల్లవాడి చెయ్యి కుండీలోంచి బయటకిరావడం చూసి, ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.
అమ్మకు చాలా ఆశ్చర్యంగా ఉంది, కానీ నాన్న ముఖంలో చిరునవ్వు ఉంది.
ఆ శబ్దానికి కారణం తెలుసుకోవడానికి, తల్లి కుండీని తలక్రిందులు చేయగా, అందులో నుండి 10 రూపాయల నాణెం పడింది.
తల్లి ఆశ్చర్యపోయి, “ఏమిటిది ఆకాష్??” అని అడిగింది.
ఆకాష్ అమాయకంగా ఇలా బదులిచ్చాడు, “ఇదా! నాన్న నిన్న ఈ నాణెం నాకు ఇచ్చాడు, నేను దానిని ఈ కుండీలో దాచిపెట్టాను.
ఈ రోజు నేను దానిని తీయడానికి ప్రయత్నించినప్పుడు, నా చేయి ఇందులో ఇరుక్కుపోయింది. కానీ నాన్న నా చేయి తీయడానికి 100 రూపాయలు ఇస్తానని చెప్పినప్పుడు, దానిని తీసుకోవడం కోసం నేను ఆ నాణెం వదిలి నా పిడికిలి తెరిచాను... అలా నా చెయ్యి బయటకు వచ్చింది...”
అమ్మ బిగ్గరగా నవ్వుతూ ఆకాష్ ని కౌగిలించుకుంది. అతని తండ్రి యొక్క చమత్కారం అర్థం చేసుకుంది.
స్నేహితులారా, చిన్నవాడైనా ఆకాష్ జీవితంలోని ఒక పెద్ద రహస్యాన్ని ఛేదించాడు.
జీవితంలో, మనకు తెలియకుండానే ఇలాగే అనేక విషయాలను మనం పట్టుకుని ఉంటాం, దాని కారణంగా మన చైతన్యం ఎదగదు. మన చైతన్యం విస్తరించాలని కోరుకుంటుంది, కానీ మనస్సు వాటిని వదులుకోవడానికి ఇష్టపడదు. ఆ పిల్లవాడి చేయి ఇఱుక్కున్నట్లే, మన జీవితం కూడా ఒక పోరాటంగా మారుతుంది. జీవితానికి సంబంధించిన యదార్థ లక్ష్యం వైపు మనం ఎగరలేకపోతున్నాం.
జీవితంలో అత్యున్నత లక్ష్యాలను సాధించాలంటే, చాలా అనవసరమైన విషయాలను మనం వదులుకోగలగాలి. ✍️
♾️♾️♾️♾️♾️
బంధం అనేది సాధారణ కోరికలు, ఇష్టాలు, అయిష్టాలతో ప్రారంభం అవుతుంది. అదే మనల్ని క్రిందికి లాగుతుంది. -దాజీ ```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment