Monday, June 16, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
               *మనసే ఔషధమై*

*'ఆరోగ్యమే మహాభాగ్యం' అని ఆర్యోక్తి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, దురదృష్టవశాత్తు పోగొట్టుకున్న తరవాతే దాని విలువ గ్రహిస్తాడు మనిషి, సంపూర్ణ ఆరోగ్యమంటే- ఒంట్లో రోగం లేకపోవడం ఒకటే కాదు... శారీరక, మానసిక స్థితుల్లో రెండింటా చురుగ్గా ఉండటం. నిజానికి ఆధునిక జీవన సరళిలో ఆయుర్దాయానికి తీవ్ర హాని చేస్తున్నది- మానసిక అనారోగ్యమే! పొంగిపోతుంది, కుంగిపోతుంది, కరిగిపోతుంది, విరిగిపోతుంది మనిషినే ఓ ఆట ఆడిస్తుంది- మనసు! మనిషికి బలమూ అదే, బలహీనతా అదే. మనసే స్వర్గం- అది మనిషికి సహకరిస్తే! మనసే నరకం- కల్లోలపరిస్తే! 'తెలియరాదు మనసు తీరుతెన్నులు చూడ.. బంధ మోక్షములకు సంధి మనసు' అన్నారు అందుకే నండూరి రామకృష్ణమాచార్య. 'మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః'* *అనే ఉపనిషద్వాక్యానికి భావానువాదమది. 'మనసు విరిగెనేని మరి కూర్చలేమయా అని హెచ్చరించాడు వేమనకవి. 'మనసుగతి అంతే మనిషి బతుకింతే' అని చింతించాడు సినీకవి.*

*ఇంతకూ అది ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో మాత్రం మనిషికి తెలియరాలేదు. 'మనసనేది దేహంకన్నా భిన్నమైనది అపూర్వమైనది. ప్రజాపతి దాన్ని మనిషిలోనే నిక్షిప్తం చేశాడు' అంది ఐతరేయ బ్రాహ్మణం. 'మనసంటే ప్రజ్వలించే ఒక మహా జ్వాల. అది ఆవిర్భవించింది- మనిషిని సృజించేవేళ' అన్నాడు ఖలీల్ జిబ్రాన్. 'మనసును జయించాలి' అంటుంది వేదాంతం. 'అనుకూలంగా మార్చుకోవాలి' అని చెబుతుంది నిజజీవితం. జయించినవాడు యోగి. మార్చుకున్నవాడు భోగి. ఏదోరకంగా మనసుతో జీవించేవాడే- సజీవుడు.. 'మననే వహి జీవతి' అంది యోగవాసిష్ఠం. పంచేంద్రియాలకు భావోద్వేగాలతో నిమిత్తం లేదు. వాటికి నొప్పి ఒకటే తెలుసు. కానీ మనసు వేరు. దానికి రెండువైపులా బలమైన రెక్కలున్నాయి. ప్రేమ, ఆప్యాయత, దయ, సంతోషం- ఒకవైపు, దిగులు, గుబులు, కోపం, దుఃఖం- మరోవైపు. ఆ రెండు రెక్కల సాయంతో మనసు యథేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది. 'పుత్ర, మిత్ర, ధన, సంపత్, భ్రాంతి వాంఛాలతల్ కోసీకోయదు నా మనంబు అకటా!' అని విలవిల్లాడాడు కవి ధూర్జటి. దాని పట్టు అంత బలమైనది కాబట్టే- మనసును మదించిన ఏనుగుతో పోలుస్తారు.*

*అయినదానికి కానిదానికీ కూడా విలపించడం దాని మరో లక్షణం. మాధవుడే వచ్చి మనోమందిరం ముందు నిలబడినా, 'మందమతిని, నీవు వచ్చు మధుర క్షణమేదో- కాస్త ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిర మిటులుంచేనా' అని చింతిస్తుందే గాని, మాధవుడి ఉనికిలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేకపోవడం- మనసు విలక్షణత. దాన్ని సరిచేసుకుంటే, లేనిది వదిలేసి ఉన్నదాంతో తృప్తిపడితే మనసు తేటపడుతుంది. 'తెలియగ వచ్చు ఖగోళము, తెలియును శాస్త్రముల తీరుతెన్నుల చూడన్, తెలియును మనుజుడు కళలను, తెలియవలయు తన మనస్సు తేటగ సుమతీ' అంటూ కవులు తేటపడిన మనసుతో చేకూరే ప్రయోజనాలను చెప్పారు. ఆ మాటకొస్తే తేటపడిన మనసే దీర్ఘాయువుకు మూలం' అంటున్నారు- 115 ఏళ్ల వయసుతో చరిత్ర సృష్టించిన ఎథెల్ కేటర్యోమ్! 'ఆరోగ్యానికే కాదు, సుదీర్ఘ ఆయుర్దాయానికి సైతం మనసే మూలం అంటున్న ఆమె మాటలను నార్వేజియన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కూడా సమర్ధించడం విశేషం. కాబట్టి- మనసు ఒక 'ఆయుధంగా..' అనేది పాత మాట. 'ఔషధంగా' అనేది కొత్త బాటగా మార్చుకుందాం! ఏమంటారు?*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌵🌴 🌵🌴🌵 🌴🌵🌴

No comments:

Post a Comment