Thursday, June 12, 2025

 *సర్వభూతాల్లోనూ నారాయణుడు*

*"సర్వభూతాల్లోనూ భగవంతుడున్నాడు. కాని మంచివారితో సన్నిహితంగా ఉండాలి: దుష్టుడికి దూరంగా ఉండాలి. పులిలో కూడా నారాయణుడున్నాడు. అలాగని పులిని ఎవరూ కౌగలించుకోరు కదా! (అందరూ నవ్వారు) పులి కూడా నారాయణుడే కదా! దాన్ని చూసి పారిపోవటం ఎందుకు? అని నువ్వు అడగవచ్చు. దీనికి జవాబు - పులి వస్తోంది, పారిపో అని హెచ్చరిస్తున్నవారు కూడా నారాయణులే కదా! వారి మాటలెందుకు వినవు?*

*"ఒక కథ చెబుతాను విను:*

 *ఒకప్పుడు ఒక అడవిలో అనేకమంది శిష్యులతో ఒక సాధువు నివసిస్తూండేవాడు. ఒక రోజు ఆ సాధువు సర్వభూతాల్లోనూ నారాయణుణ్ణి చూడాలనీ, ఆ ఎరుకతో వాటన్నిటికీ వినమ్రంగా నమస్కరించాలనీ బోధించాడు. ఒక రోజు హోమం నిమిత్తం సమిధలను సేకరించటానికి శిష్యుడొకడు అడవిలోకి వెళ్లాడు. హఠాత్తుగా అతడొక కేక విన్నాడు: “దారినుండి పక్కకు తప్పుకోండి! ఒక మదపుటేనుగు ఇటుకేసి వస్తోంది!' ఈ శిష్యుడు* *తప్ప అందరూ పారిపోయారు.*

*'ఏనుగులో కూడా భగవంతుడున్నాడని గురువుగారు బోధించారు కదా! నేనెందుకు పారిపోవాలి?' అని భావిస్తూ ఉన్నచోటే నిలబడిపోయాడు. చేతులు జోడించి స్తవం, స్తుతులు గానం చెయ్యసాగాడు. మావటివాడు 'తప్పుకో, తప్పుకో అంటూ కేకలు పెడుతూనే ఉన్నాడు. మన శిష్యుడు ఎంతకూ కదలలేదు. చివరికి ఏనుగు తన తొండంతో ఇతగాణ్ణి పట్టుకొని, తిప్పి ఒక మూలకు విసిరివేసింది. ఒంటినిండా గాయాలతో స్పృహతప్పి పడిపోయాడు శిష్యుడు.*

*“ఈ సమాచారం వినగానే గురువుగారు ఇతర శిష్యులతోపాటు అక్కడకొచ్చి, అతణ్ణి ఆశ్రమానికి కొనిపోయారు. మందుమాకులిచ్చి చికిత్స చేశారు. కొంతసేపటికి శిష్యుడికి స్పృహవచ్చింది. అప్పుడు శిష్యుల్లో ఒకడు 'ఏనుగు వస్తోందని వినీ నువ్వెందుకు కదల్లేదు?' అని అతణ్ణి అడిగాడు. 'నారాయణుడే మానవుల, జంతువుల రూపాలను ధరించాడని గురువుగారు చెప్పారు కదా! అందువల్ల ఏనుగు నారాయణుడు వస్తున్నాడని నేను తొలిగిపోలేదు' అన్నాడతడు. అది విని గురువుగారు ఇలా చెప్పారు: 'నాయనా! ఏనుగు నారాయణుడు వస్తూండటం నిజమే. కాని మావటి నారాయణుడు తొలగిపొమ్మని హెచ్చరించలేదా? అందరూ నారాయణులే ఐతే నువ్వెందుకు మావటి మాటలను విశ్వసించలేదు? మావటి నారాయణుడి మాట కూడా వినాలి కదా?' (అందరూ నవ్వారు)*

*"శాస్త్రాల్లో 'ఆపో నారాయణ' - అంటే, నీరు నారాయణుడు అని ఉంది. కాని కొన్ని నీళ్ళు దేవుని పూజకు వినియోగపడతాయి. మరికొన్ని కాళ్ళు చేతులు ముఖం కడుగుకొనటానికి, పాత్రలు తోముకోవటానికి, బట్టలు ఉతుకుకోవటానికి మాత్రమే పనికొస్తాయి. ఈ నీళ్ళు తాగటానికి గాని, దేవుని పూజకు గాని పనికి రావు.*

*అదే రీతిలో సజ్జనుడు, దుష్టుడు, భక్తుడు, నాస్తికుడు అందరి హృదయాల్లోనూ నారాయణుడున్నాడు. కాని దుష్టుడు, అపవిత్రుడు, పాపి అయిన వ్యక్తితో సంబంధాలు ఉంచుకోరాదు. వారితో సన్నిహితంగా ఉండరాదు. కొందరితో ఏవో నాలుగు మాటలు మాట్లాడవచ్చునేమో గాని, మరికొందరితో అది కూడా పనికిరాదు. ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి."*

*┈┉┅━❀꧁నారాయణ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🌹🧘‍♂️🌹 🙏🕉️🙏 🌹🧘‍♀️🌹

No comments:

Post a Comment