Vedantha panchadasi:
శ్మశ్రుకంటకవేధేన బాలే
రుదతి తత్పితా ౹
చుంబత్యేవ న సా ప్రీతిర్బాలార్థే స్వార్థ ఏవ సా
౹౹10౹౹
నిరిచ్ఛమపి రత్నదివిత్తం యత్నేన పాలయన్ ౹
ప్రీతిం కరోతి స స్వార్థే విత్తార్థంత్వం న శంకితమ్
౹౹11౹౹
అవిచ్ఛతి బలీవర్దే వివాహయిషతే బలాత్ ౹
ప్రీతిః సా వణిగర్థైవ
బలీవర్థతా కుతః
౹౹12౹౹
బ్రహ్మణ్యం మేఽ స్తి పూజ్యోఽ హమితి తుష్యతి పూజయా ౹
అచేతనాయా జాతేర్నో సంతుష్టిః పుంస ఏవసా
౹౹13౹౹
క్షత్రియోఽ హం తేన రాజ్యం కరోమీత్యత్ర రాజతా ౹
న జాతేర్వైశ్య జాత్యాదౌ యోజనాయేదమీరితమ్
౹౹14౹౹
స్వర్గలోక బ్రహ్మలోకౌ స్తాం మమేత్యభివాంఛనమ్ ౹
లోకయోర్నోపకారాయ స్వభోగాయైవ కేవలమ్
౹౹15౹౹
సమస్తమూ ఆత్మస్వరూపమే
అనుటకు మరికొన్ని ఉపమానాలు.
ముళ్ళలాగా ఉన్న గడ్డం, మీసాలతో తండ్రి కొడుకును ముద్దుపెట్టుకొన్నప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.కానీ తండ్రి మాత్రం ముద్దుపెట్టు కుంటూనే ఉన్నాడు.దీనినిబట్టి ఏమి తెలుస్తోంది ?
పిల్లవాని సంతోషంకోసం
తండ్రి ముద్దు పెట్టుకోవడం లేదు.తన సంతోషం కోసం,
తన ప్రీతికోసమే ముద్దు పెట్టుకొంటున్నాడన్నమాట.
చేతనాల్లో అయితే యిట్లా ఉండవచ్చు ! అచేతనాల విషయంలో అట్లా ఉండదు గదా ! అంటే,
"న వా అరే ! విత్తస్యకామాయ విత్తం ప్రియం భవత్యాత్మవస్తు కామాయ విత్తం ప్రకటన యం భవతి" బృ.4-5-6 అంటూ చెప్పిన శ్రుతి తాత్పర్యాన్ని వివరిస్తున్నారు.
పురుషుడు అనుకోకుండానే కోరకుండానే ధనాన్ని రత్నాల్ని ఎంతో ప్రయత్న పూర్వకంగా రక్షిస్తూ - కాపాడుతూ ఉంటాడు. ఎందుకోసం ?
తన ప్రయోజన సిద్ధిమీది ప్రీతితో ! ఆ ప్రేమ అనేది ఆ ధనంమీద ఉండికాదు.ఆ ప్రేమ అనేది డబ్బుమీద ఉంటుందని అనుకోవటానికి కూడా వీలులేదు.ఆ డబ్బు తన ప్రయోజనాల కోసం కాబట్టి దానిని ప్రేమిస్తున్నాడనేది స్పష్టం !
డబ్బుమీదనే ప్రేమ అని అంటే,
ఎవరి డబ్బునైనా ప్రేమించాలికదా ! అట్లాలేదు కాబట్టి ఆత్మార్థమే,
ఆత్మార్థం కోసమైన డబ్బునే ప్రేమిస్తున్నాడు.
చేతనాల విషయం కూడా చూద్దాం ! ఎద్దుకు బరువు మోయాలనే - లాగాలనే కోరిక ఉండదు.అయినా వాణిజ్యుడు దానిచేత బరువు మోయిస్తున్నాము.
ఇందులో ఎద్దుయొక్క స్వార్థసిద్ధి ఏమీలేదు. వ్యాపారస్తుని స్వార్థసిద్ది కోసం లేదా వ్యవసాయదారుని స్వార్థసిద్ది కోసం ఎద్దుచేత బరువు లాగిస్తున్నాడు.
"న వా అరే బ్రహ్మణః కామాయ.. అనే శ్రుతిని వివరిస్తున్నారు.
"నాలో బ్రాహ్మణత్వం ఉంది కాబట్టి నేను పూజింప దగినవాడను"అనే బ్రహ్మణత్వ గౌరవంతో కూడిన వ్యక్తి తాను పూజింపబడినప్పుడు సంతోషిస్తున్నాడు.
ఈ విధమైన సంతుష్టి అచేతనమగు బ్రాహ్మణ్యమునకు సంతోషము ఉండదు.ఆ పురుషునియందే సంతోషము.
"నేను క్షత్రియుణ్ణి కాబట్టి రాజ్యపాలన చేస్తున్నాను" అని అంటున్నాడు.ఇక్కడ రాజ్యానుభోగం కారణంగా కలిగే సుఖం క్షత్రియజాతికి చెందినవానిది.ఇందులో క్షత్రియ జాతియొక్క క్షత్రియత్వం ఏమీలేదు.ఆ వ్యక్తిది తప్ప !
ఈ దృష్టాంతాన్నే వైశ్యజాతికి అన్ని జాతులకూ అన్వయించుకోవచ్చు.
"న వా అరే లోకానాం కామాయ...."అనే దానిని వివరిస్తున్నారు.
తనకు స్వర్గలోక బ్రహ్మలోక భోగాలు కావాలని మానవుడు కోరుతున్నాడు.ఇట్లాకోరటం,
ఆ లోకాలకు ఉపకారం చేద్ధామనికాదు.ఆ లోకాలమీది ప్రేమతోనూ కాదు.కేవలం తన భోగంమీద ఉండే ప్రీతితో,ఆ భోగాలమీద తనకున్న కోరికను బట్టే అనుభవించాలనే ఆయా లోకాలను ప్రేమిస్తున్నాడు.
ఈశవిష్ణ్వాదయో దేవాః పూజ్యన్తే పాపనష్టయే ౹
న తన్నిష్పాపదేవార్థం తత్తు స్వార్థం ప్రయుజ్యతే
౹౹16౹౹
ఋగాదయో హ్యధీయన్తే దుర్బాహ్మణ్యానవాప్తయే ౹
న తత్ర్పసక్తం వేదేషు మనుష్యేషు ప్రసజ్జతే
౹౹17౹౹
భూమ్యాది పంచభూతాని స్థానతృట్పాకశోషణైః ౹
హేతుభిశ్చావకాశేన వాంఛ త్యేషాం న హేతవః
౹౹18౹౹
స్వామి భృత్యాదికం సర్వం స్వోపకారాయ వాంఛతి ౹
తత్తత్కృతోపకారస్తు తస్య తస్య న విద్యతే
౹౹19౹౹
సర్వ వ్యవహృతిష్వేవ మనుసంధాతు మిదృశమ్ ౹
ఉదాహరణ బాహుల్యం తేన స్వాం వాసయేన్మతిమ్
౹౹20౹౹
ఆత్మార్థమే సర్వం జరపబడుతోంది -
జనులు శివుడు,విష్ణువు మొదలైన దేవతలను పూజించటం అనేది పాపాల్ని పోగొట్టుకోవటం కోసమే చేస్తున్నాడు.అంతేతప్ప,స్వతః పాపరహితులైన - ఏ పాపమూ లేనట్టి ఆయా దేవతలమీది ప్రేమతో,ఆ దేవతలకోసం కాదు.అంటే -
దేవతల్ని పూజించటం అనేది కూడా తన స్వార్థసిద్ధి కోసం చేస్తున్నాడన్నమాట !
అట్లాగే -
వేదాలను అధ్యయనం చేస్తున్నాడంటే తనకు వ్రాత్యదోషం (ఉపనయన వేదాధ్యయనాదులు లేని ద్విజుడు వ్రాత్యుడు)జాతి భ్రష్టత్వదోషం రాకుండా ఉండటంకోసం అధ్యయనం చేస్తున్నాడు.అంటే -
దు(దుష్ట)బ్రాహ్మణుడనే పేరు రాకుండుటకు ఋగ్వేదాది అధ్యయనము చేయుదురు.
అంతే తప్ప ఆ వేదములకు జాతి భ్రష్టత్వం లేదు గదా !
కాబట్టి, ఆ వేదాలమీది ప్రేమతో,వాటిని ఉద్ధరించ టానికై వేదాధ్యయనం చేయటంలేదు అని భావం.
అట్లాగే -
మానవుడు భూమి మొదలగు పంచభూతములను,అవి వానస్థానమునకు దాహము తీర్చుకొనుటకు వంట చేయుటకు శోషింపజేయుటకు కదలికకు అవకాశము నిచ్చుటకు,కోరుదురే గాని పంచభూతముల కొరకుగా వాంఛింపరు.అంటే -
తమకు ఉండటానికి
చోటు కోసం,దప్పిక కోసం,
ఆహారం కోసం,శరీరాన్ని రక్షించుకోవడానికి వస్త్రాల రూపేణే - ఔషద రూపేణా ఇంకనూ కదలటానికి మెదలటానికి అవకాశం కోసం వరసగా భూమి,జలము,అగ్ని, వాయువు,ఆకాశం అనే పంచ మహాభూతాల్ని సేవిస్తున్నారు.
అంతేతప్ప,ఆ పంచభూతాల
మీది ప్రేమతో వాటిని వాంఛించడం - సేవించడం లేదు.
యజమాని,సేవకుడు కూడా తమ తమ ఉపకారంకోసమే,
తమ తమ ప్రయోజనం కోసమే
ఎదుటివానిని ప్రేమిస్తున్నారు.
యజమాని,సేవకునికి చేసే ఉపకారం - ఇచ్చేధనం తనకోసం చేసుకొనేవే !
అట్లాగే,
సేవకుడు యజమానికి చేసే సేవ తన ప్రయోజనం కోసం చేసేదే ! అంటే -
జనులు యజమానులనుగాని
సేవకులను గాని ఇతర విధములుగ గాని ఎన్నుకొనుట తమ లాభము కొరకేగాని వారి వారికి ఉపకారము చేయుటకు కాదని భావము.
సకలవ్యవహారములందును ఈ విధముగ అన్వేషించుటకు అనేకములైన ఉదాహరణలు గలవు.
"ఆత్మ వస్తుకామాయ సర్వం ప్రియం భవతి" - బృ.2-4-5 ;
"ఆత్మయే ప్రియమైనది"
అనే విషయాన్ని చెప్పటం కోసం - సమస్త వ్యవహారాల్లో నూ ఈ విధమైన ఆలోచనను
చూపించటానికే
పతి పత్నీ ప్రేమ లాంటి అనేక ఉదాహరణలు ఇవ్వబడ్డాయి.
కాబట్టి మనం మన బుద్ధితో పరిశీలన చేయాలి.అంతా తమకోసమే - ఆత్మార్థమే అన్నీ చేస్తూ ఉంటారు.ఆత్మ అనేది మిక్కిలి ప్రీతిపాత్రమైనది,అనే విషయాన్ని గ్రహించి నిశ్చయించుకోవాలి.
అన్ని ఉదాహరణలు కూడా తమ స్వార్థమునే నిరూపించును.ఈ "తాను"
ఎవరని అన్వేషించినపుడు
"ప్రత్యగాత్మ" యే అని తెలియును.
అథ కేయం భవేత్ర్పీతిః శ్రూయతే యా నిజాత్మని ౹
రాగో వధ్వాదివిషయే శ్రద్ధా యగా దికర్మణి ౹౹
భక్తిః స్యాద్గురుదేవాదా విచ్ఛాత్వప్రాప్తవస్తుని
౹౹21౹౹
తర్హ్యస్తు సాత్వికీ వృత్తిః సుఖమాత్రానువర్తినీ ౹
ప్రాప్తే నష్టేఽ పి సద్భావాది చ్ఛాతో వ్యతిరిచ్యతే
౹౹22౹౹
సుఖ సాధనతో పాధేరన్న పానాదయః ప్రియాః
౹౹23౹౹
సంశయము :ఈ ప్రేమ అనేది ఆత్మార్థమే అని అంటున్నారు గదా ! ఆ ఆత్మయొక్క స్వరూపం ఎటువంటిది ?
ఈ ప్రీతి అనేది
రాగ స్వరూపం కలదా ? శ్రద్ధాస్వరూపం కలదా ?
భక్తి స్వరూపం కలదా ?
ఇచ్ఛా రూపమైనదా ?
అంటే -
శ్రుతి చెప్పే ఈ ఆత్మయందలి ప్రీతి ఎట్టిదై ఉండును ?
రాగస్వరూపం కలది అని గనుక అంటే,
భార్య మొదలగువాని పట్ల అనురాగం విషయంలోనే కనిపించాలి.
యజ్ఞయాగాది కర్మల యందలి శ్రద్ధయా ?
ఈ ప్రీతి అనేది శ్రద్ధా స్వరూపం కలదైతే యజ్ఞ యాగాది కర్మల విషయంలోనే కనిపించాలి.
భక్తియా ?
ఇది భక్తిస్వరూపం కలదైతే గురువులు దేవతలు మొదలైన వారి విషయంలోనే ఉండాలి.
అట్లాగే ఈ ప్రీతి అనేది ఇచ్ఛా రూపం కలదైతే అప్రాప్య పదార్థాల విషయమైనదిగా ఉండాలి - లభింపని వస్తువులపట్ల ఉండే ఇచ్ఛయా?
ఆ ప్రీతికి విషయం అన్ని పదార్థాల్లోనూ వేరువేరుగా ఉంటున్నందున దాని స్వరూపం తెలియటం లేదు.
సమాధానము :
ఇవి ఏవీ కాదు.
దానిని కేవలము సుఖ స్వరూపం కల సాత్వికీ వృత్తి అని అనుకోవాలి.అంటే ,
పైన చెప్పిన రాగరూపం,శ్రద్ధారూపం,
భక్తిరూపం,ఇచ్ఛారూపం
కలది కాదు అని భావం.
సాత్వికీ వృత్తి అంటే - సుఖాన్ని విషయంగా చేసే సత్వగుణ పరిణామం అని అనుకోవాలి.
సుఖాన్ని విషయంగా చేసే ఈ సాత్త్వికీ వృత్తి రూపంలో ఉండే ప్రీతి ఒక వస్తువు లభించటం లోను,నష్టమవడంలోనూ కూడా ఆ వస్తువునందు కనిపిస్తుంది.
అందుకని ఇది ఇచ్ఛకంటే భిన్నమైనది. ఎందుచేతనంటే -
ఇచ్ఛ అనేది అప్రాప్యమైన సుఖదుఖాదుల్లో ఉండే ప్రీతి అనేది ప్రాప్తము,అప్రాప్తము,
నష్టము అయిన వాటి విషయంలో కూడా ఉంటుంది.
కాబట్టి,
సుఖమును మాత్రమే అనుసరించి ఉండు సాత్త్వికమైన అంతఃకరణ వృత్తే
ఆత్మ యందలి ప్రీతి.
విషయములు లభించినా నష్టపోయినా ఈ ప్రీతి ఉండునదే.కనుక ప్రీతి అనేది అంతఃకరణ వృత్తే
అయినప్పటికీ ఇచ్ఛకంటే భిన్నమైనది.
సంశయము: అన్నపానాదులు సుఖము నిచ్చుటచేత ప్రియములు అగుచున్నవి.
అట్లే ఆత్మ కూడా సుఖమునిచ్చు ఒకానొక విషయమై ఉండవచ్చును కదా ?
No comments:
Post a Comment