Friday, April 24, 2026

 *వేలుమణి.. వాల్యూ ఫర్‌ మనీ!!*
(Achievers story).      *(ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)*
ఆయన సక్సెస్‌ సీక్రెట్‌ చాలా సింపుల్‌. చవక ధరలు. అవును.. మీరు విన్నది నిజమే. ప్రైసింగ్‌ ఆయన విజయ మంత్రం. నమ్మశక్యంగా లేదు కదూ. థైరాయిడ్‌ టెస్ట్‌కు రూ.500 వసూలు చేస్తున్న రోజుల్లో తాను  రూ.100కే టెస్ట్‌ చేసి పెడతానని మార్కెట్లో అడుగుపెట్టారు. ఇంకేముంది.. కస్టమర్లు క్యూ కట్టారు. సక్సెస్‌ ఆయన పరమైంది. ఆ టెస్టింగ్‌ ల్యాబ్‌ పేరు థైరోకేర్‌. 

ఆన్‌లైన్‌లో ఆర్డరు ఇస్తే చాలు.. రక్త నమూనాలను ఇంటి వద్ద నుంచే సేకరిస్తారు. ప్రపంచంలో థైరాయిడ్‌ టెస్టింగ్‌లో అగ్రశేణి కంపెనీగా అవతరించింది. అతి తక్కువ ధరలకే సేవలు అందిస్తూ నంబర్‌ వన్‌ స్థాయికి చేరింది. అచీవర్స్‌ స్టోరీస్‌ సగర్వంగా అందిస్తున్న ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌ ల్యాబ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్స్‌ చైన్‌ ‘థైరోకేర్‌ టెక్నాలజీస్‌’ వ్యవస్థాపకులు డాక్టర్‌ ఆరోగ్యస్వామి వేలుమణి సక్సెస్‌ స్టోరీ..

200 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదలైన కంపెనీ ప్రస్థానం నేడు 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం స్థాయికి చేరింది. ప్రపంచంలో థైరోకేర్‌ టెస్టింగ్‌లో అతిపెద్ద సంస్థగా నిలిచింది. రోజుకు 3 లక్షల పరీక్షలు జరుపుతున్నారు. ముంబైలో సెంట్రలైజ్డ్‌ ప్రాసెసింగ్‌ ల్యాబ్‌ ఉంది. కీలక పరీక్షల కోసం  దేశం నలుమూలల నుంచి శాంపిళ్లు ఈ నగరానికి చేరతాయి. 2,000 నగరాల్లో 3,000 ఫ్రాంచైజీల ద్వారా సేవలు అందిస్తున్నారు.

 హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో 8 ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఇంటి వద్దకే వచ్చి రోగుల రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపుతారు. 10,000 మంది కలెక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఫ్రాంచైజీల వద్ద పనిచేస్తున్నారు. టర్నోవరు రూ.350 కోట్లకు చేరింది. లాభాలు పండిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ లిస్ట్‌ అయింది. లిస్టింగ్‌ సమయంలో షేరు ధర 73 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అవడం విశేషం.

వేలుమణి స్వస్థలం తమిళనాడులోకి కోయంబత్తూరు జిల్లా దస్‌నైక్కెనపాల్యం. తండ్రి ఆరోగ్యస్వామి కౌలు రైతు. తల్లి సాయమ్మల్‌ గృహిణి. వేలుమణికి ఇద్దరు సోదరులు, ఒక సోదరి. పిల్లలు పెరిగే కొద్దీ ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబానికి చుట్టుముట్టాయి. దీంతో రెండు గేదెలను కొనుగోలు చేశారు. పాడి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబ అవసరాలు తీరేవి. పిల్లలందరూ ఊర్లో ఉన్న టౌన్‌ పంచాయత్‌ యూనియన్‌ స్కూల్లో చదువుకున్నారు. కోయంబత్తూరులోని రామకృష్ణ మిషన్‌ విద్యాలయలో డిగ్రీ పూర్తి చేశారు. 

దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అల్యూమినియం ప్లేటు, పలక మాత్రమే వేలుమణి దగ్గర ఉండేది. పుస్తకాలు, బ్యాగు లేదు. హార్లిక్స్, కాంప్లాన్‌ తెలియవు. నేల మీద కూర్చుని స్కూల్లో చదువుకునేవారు. వేలుమణికి చెప్పులు కూడా ఉండేవి కావు. కుటుంబానికి ఆసరాగా వర్షాకాలంలో నాలుగు నెలలు స్కూల్‌ మానేసి వ్యవసాయ పనులకు సాయపడేవాడు. 6వ తరగతి నుంచి మేనత్త ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఇంటర్లో ఉన్నప్పుడు తరగతి విద్యార్థులతో దిగిన గ్రూప్‌ ఫోటోకు రూ.2 చెల్లించలేని స్థితి ఆయన కుటుంబానిది.

ఇంటర్‌ బైపీసీ అయినప్పటికీ, బీఎస్సీకి ఫీజు చెల్లించే స్తోమత లేక ఆర్ట్స్‌లో జాయిన్‌ అయ్యారు. 20 రోజుల తర్వాత ఈ విషయం తెలుసుకుని లెక్చరర్‌ ఫీజు చెల్లించి తిరిగి బీఎస్సీ కెమిస్ట్రీలో అడ్మిషన్‌ తీసుకునేలా చేశారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో పుస్తకాలు లేకుండానే చదువు పూర్తి చేశారు. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు.

ఇంటి నుంచి ఆర్థిక సాయం లేకపోవడంతో డిగ్రీ చదువుతూనే పార్ట్‌ టైం జాబ్‌ చేసేవారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉదయం కూర్చుని చదువుకునేవారు. కాలేజీ నుంచి వచ్చాక చిన్నాచితక పనులు చేసేవారు. 1978లో డిగ్రీ పూర్తి అయ్యాక 50 ఇంటర్వ్యూలకు వెళ్లారు. అన్ని చోట్లా అనుభవం లేదంటూ వెనక్కి పంపారు. 

ఎట్టకేలకు కోయంబత్తూరులోని చిన్న ఫార్మా కంపెనీ జెమిని క్యాప్సూల్స్‌లో చేరారు. జీతం నెలకు రూ.150. అక్కడ మూడేళ్లు చేశాక జీతం రూ.225కి చేరింది. రూ.50 తన ఖర్చులకు ఉంచుకుని మిగిలినవి ఇంటికి పంపించేవారు. రూ.1,000 జీతం అందుకున్నాక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ లోపు కంపెనీ మూతపడింది. కొద్ది రోజులు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌లో పని చేశారు. 

పేపర్‌ చదివే అలవాటు ఆయన జీవితాన్నే మార్చేసింది. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ కావాలంటూ బాబా అటమిక్‌ రిసర్చ్‌ సెంటర్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆయన కంట పడింది. ఆలస్యం చేయకుండా అప్లై చేశారు. కంపెనీ నుంచి పిలుపు రావడంతో ముంబై పయనమయ్యారు. 1982 ఆగస్టు 18న దేశ ఆర్థిక రాజధానిలో అడుగుపెట్టారు.  

చేతిలో రూ.500 మాత్రమే ఉన్నాయి. వీటీ రైల్వే స్టేషన్‌లో మూడు రోజుల మకాం. ఎట్టకేలకు ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసి ఉద్యోగం దక్కించుకున్నారు. రూ.800 వేతనంలో కెరీర్‌ మొదలైంది. అదనపు సంపాదన కోసం ట్యూషన్లు చెప్పేవారు. అత్యధిక మొత్తం ఇంటికి పంపేవారు. 1986లో ముంబైలో స్థిరపడ్డ ఎస్‌బీఐ ఉద్యోగి సుమతిని వివాహం చేసుకున్నారు.

రేడియేషన్‌ మెడిసిన్‌ సెంటర్లోని ల్యాబొరేటరీలో వేలుమణి విధులు నిర్వర్తించేవారు. థైరాయిడ్, క్యాన్సర్‌ చికిత్సలో రేడియేషన్‌ పనితీరు, ఉపయోగాలను ఈ ల్యాబొరేటరీ అధ్యయనం చేస్తుంది. బీఎస్సీ చదివిన అనుభవంతో ఇక్కడే తన మేధస్సుకు పదునుపెట్టారు వేలుమణి. థైరాయిడ్‌ పాథోఫిజియాలజీలో మాస్టర్స్, అలాగే పీహెచ్‌డీ పూర్తి చేశారు. 

1996లో వేలుమణి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాన్ని వదిలేయాలన్న నిర్ణయానికి వచ్చారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా అనుకున్న పని పూర్తి చే శారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో భార్యకు రాజీనామా విషయాన్ని చెప్పారు. తన ఆశయాలు, లక్ష్యాలు ఆమెకు వివరించారు. ఆ మాటలు విన్న సుమతి  సైతం భర్త అడుగు జాడల్లో నడిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఎస్‌బీఐకి రాజీనామా చేశారు.

థైరాయిడ్‌ టెస్ట్‌కు అప్పట్లో రూ.500 చార్జీ చేసేవారు. క్యాన్సర్‌ టెస్ట్‌కు రూ.25,000 ఉండేది. అంతకన్నా తక్కువ ధరకే అందించడం ద్వారా విజయబావుటా ఎగురవేయొచ్చని ధృడనిశ్చయానికి వచ్చారు వేలుమణి. చేతిలో ఉన్న రూ.2 లక్షల ప్రావిడెండ్‌ ఫండ్‌తో తొలి అడుగు వేశారు. ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌ ల్యాబ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ‘థైరోకేర్‌’ను స్థాపించారు. థైరాయిడ్‌ టెస్ట్‌కు రూ.100, క్యాన్సర్‌ టెస్ట్‌కు రూ.9,999 మాత్రమే చార్జీ తీసుకున్నారు. 

‘ముడి సరుకుకు రూ.250 ఖర్చు అయినా రూ.100 తీసుకున్నాం. టెస్టుల సంఖ్య పెరిగితే ముడి సరుకు ధర దిగి వస్తుందన్నది మా నమ్మకం. మేం అనుకున్నట్టే జరిగింది. కస్టమర్లు వెల్లువలా వచ్చారు.  దీంతో మార్కెట్‌ కంటే చవక రేట్లలో సేవలు అందించగలుగుతున్నాం. అనతి కాలంలో దేశవ్యాప్త బ్రాండ్‌ అయింది’ అని వేలుమణి వివరించారు. వేలుమణి పిల్లలు కంపెనీ కార్యకలాపాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

2020 నాటికి రూ.600 కోట్ల టర్నోవర్‌ స్థాయికి కంపెనీని చేర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆ సమయానికి 60 ల్యాబ్‌లు, 10,000 శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు రానున్నాయి. ఒక్కో శాంపిల్‌ కలెక్షన్‌ కేంద్రం ద్వారా 35 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. కంపెనీ రోజుకు ఒకరిని నియమించుకుంటోంది.

నియామకాల విషయంలో థైరోకేర్‌ అనుసరించే విధానం ఆశ్చర్యమేయక మానదు. ఫ్రెషర్లకే తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థికంగా వెనుకబడి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారై ఉండాలి. ప్రస్తుతం 1,200 మంది ఉద్యోగుల్లో 98 శాతం మంది ఫ్రెషర్లే. తనకు అనుభవం లేని కారణంగా ఉద్యోగం ఇవ్వని రోజులు గుర్తున్నాయని అంటారు వేలుమణి. తనలాగా మరొకరు ఇబ్బంది పడొద్దని తన భావన అని చెబుతారు. నియామకాల్లో 25 శాతం క్యాంపస్‌ సెలెక్షన్లు ఉంటున్నాయి.

వేలుమణి.. తనకు తాను చెక్కుకున్న విజేత. అలుపెరుగని పోరాటం ఆయనది. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. కంపెనీ సిబ్బంది కోసం కట్టించిన క్వార్టర్లలో నివాసం. సాధారణ జీవితం గడపాలంటారు. ఆకలి తనకు జీవితాన్ని నేర్పిందని అచీవర్స్‌ స్టోరీస్‌తో నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఏది చెబుతారో ఆచరిస్తారు కూడా. అప్పులకు దూరంగా ఉండాలని హితవు పలుకుతారు. తన గ్రామమే ఒక యూనివర్సిటీ అని గర్వంగా చెబుతారు. పల్లె నుంచి వచ్చిన వారికి ధైర్యమెక్కువ అంటారు. ఆయన జీవితమే ఓ స్ఫూర్తిదాయక కథ. విదేశీ గడ్డపైనా సక్సెస్‌ఫుల్‌ ఎంట్రప్రెన్యూర్‌గా ప్రసంగించారు. నవ్వులు పూయించడంలో ఆయన ధిట్ట. అనర్గలంగా ఎంతసేపైనా మాట్లాడతారు.

తన విజయంలో జీవిత భాగస్వామి సరిత కీలక బాధ్యత పోషించారని గర్వంగా చెబుతారు. ‘ఎవరినైతే పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నానో ఆమే నా జీవితంలోకి వచ్చింది. ఆమే నాకు, కంపెనీకి వెన్నముక. ఐపీవోకు 100 రోజుల ముందు ఆమె నా జీవితంలోంచి వెళ్లిపోయింది. ఐపీవో విజయాన్ని చూడకుండానే కనుమరుగైంది’ అని గద్గద స్వరంతో తన స్వగతాన్ని పంచుకున్నారూ.            

No comments:

Post a Comment