Friday, April 24, 2026

*ఎ‘ఫైర్’* *దేశరాజు*

 *ఎ‘ఫైర్’*
*దేశరాజు*

‘‘కాస్త చూసుకుని పొయ్యవే’’ అంటూ అక్క తల మీద ముని వేళ్లతో పొడిచింది.
ఆమె ముక్కు ఎగబీలుస్తూ ‘‘అంత చేతనైన దానివి నువ్వే పొయ్యి’’ అంటూ విసురుగా పాల ప్యాకెట్‌ అక్కడ పెట్టేసి, కన్నీళ్లు తుడుచుకుంటూ కిచెన్‌లోంచి వెళ్లిపోయింది. 
ఆమె దీర్ఘంగా నిట్టూర్చి ప్యాకెట్లోని పాలు గిన్నెలో పోసి, స్టౌ మీద పెట్టి వెలిగించింది. అటూఇటూ వెతికి టిష్యూ తీసుకుని స్టౌ మీద, గట్టు మీద పడిన పాలు తుడిచేసింది. పెర్క్యులేటర్‌లోంచి డికాషన్‌ కప్పుల్లో పోసి, సుగర్‌ వేయాలో, లేదో కనుక్కుందామని హాల్లోకి వెళ్లింది. సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ, ఏడుస్తున్న అక్కను చూసి ‘‘ఏడ్చింది చాల్లేగానీ, సుగర్‌ వేయాలో లేదు చెప్పు’’ అని అరిచింది.
‘‘ఏదో ఒకటి తగలెయ్‌’’ అంటూ విసురుగా సమాధానమిచ్చిందామె.
కాఫీ తీసుకుని వెళ్లి హాల్లోని గ్లాస్‌ టీపాయ్‌ మీద పెట్టింది. తన కప్పు తీసుకుని టీవీలోకి చూసింది. ఏదో డాన్స్‌ ప్రోగ్రామ్‌ వస్తోంది. చిత్రవిచిత్రంగా, పిచ్చిపిచ్చిగా డాన్స్‌లు వేస్తున్నారు. వాళ్లలో చిన్న పిల్లలూ, పెద్దవాళ్లూ కూడా వున్నారు. నిశ్శబ్దంగా రెండు సిప్‌లు చేసింది. 
‘‘కాఫీ బావుందే. కాంటినెంటలా? లేకపోతే ఆ చెన్నై కాఫీ పౌడరా?’’ అడిగింది.
‘‘చెన్నైదే’’ అంటూ చెల్లికి సమాధానమిచ్చి, కాస్త స్థిమితపడిన దానిలా కప్పు చేతిలోకి తీసుకుని, తానూ ఒక సిప్‌ చేసింది.
మళ్లీ కాసేపు నిశ్శబ్దం అలుముకుంది.
‘‘మరీ, ఆ బట్టలేంటే? అంత చిన్నపిల్లతో అసయ్యంగా ఆ స్టెప్పులేంటి? ఎలా చూస్తారో.. అసలు’’ 
‘‘పిల్లలదేముందిలే. పెద్దలూ అలాగే తయారయ్యారుగా? చూస్తుంటే నీకే మాత్రం టెన్షన్‌ వున్నట్టు కనిపించడం లేదు’’ అంది అక్క, విషయానికి నాందీ ప్రస్తావనగా.
‘‘నీకే కాదే. నాక్కూడా చిరాగ్గా వుంది. అలాని ఓ.. అని ఏడుస్తూ కూర్చుంటే పనులవుతాయా?’’ చెల్లెలు నిలదీసింది.
అక్క మౌనం వహించింది. కాఫీ తాగుతూ, రిమోట్‌తో ఛానల్స్‌ మారుస్తూ ఇంగ్లీష్‌ న్యూస్‌ దగ్గర ఆగింది.
‘‘నువ్వు వీడి న్యూస ్‌ కూడా  చూస్తావా, తల్లీ?’’  అంది చెల్లెలు, వాతావరణాన్ని నార్మల్‌గా మార్చే వుద్దేశంతో.
‘చూస్తే ఏం?’ అన్నట్టు చూసింది అక్క.
‘‘వీడు పొద్దున్నించి రాత్రి దాకా అలా మిరపకాయ్‌ తిన్న కాకిలా అరుస్తూనే వుంటాడే. పాపం, ఆ మహాతల్లి ఎలా భరిస్తోందో వీడ్ని’’ అంది చెల్లెలు నవ్వుతూ.
‘‘అదే వుంటే వీడికి నోరు తెరిచే ఛాన్స్‌ వుండేదంటావా?’’ అంటూ అక్క కూడా నవ్వింది.
అక్క పూర్తిగా మామూలుగా అయినట్టనిపించడంతో లేచి వచ్చి, గట్టిగా వాటేసుకుని ‘‘హమ్మయ్య, ఇలాగే వుండవే. లేకపోతే నాకేం బాగోదు’’ అంది. అలా అంటుండగానే ఆమె గొంతు బొంగురుపోయింది.
‘‘వుండాలనే వుంటుందమ్మా. ఎవరికి మాత్రం ఏడుస్తూ కూర్చోవాలని వుంటుంది? చుట్టూ వున్నవాళ్లు అలా వుండనివ్వాలి కదా’’ అంటూ నిష్టూరాలు పోయింది అక్క.
అదేం పట్టనట్టు ‘‘సరేగానీ, టిఫిన్‌ తాజా నుంచి అర్డర్‌ పెట్టవే. బాగుంటాయట కదా? ఎప్పుడైనా తిన్నారా?’’ అని అడిగింది.
‘‘లేదు, ఇంతకుముందు దూరంగా వుండేది. డెలివరీ లేట్‌ అవుతుందని పెట్టలే. ఇప్పుడు ఇక్కడ కొత్త బ్రాంచ్‌ ఓపెన్‌ అయ్యింది.’’
‘‘అందుకేనా లైట్లవీ పెట్టాడు. పొద్దున్న క్యాబ్‌లో వస్తున్నప్పుడు చూశాలే’’
‘‘ఇంకా చాలా టైముందిగా, బ్రేక్‌ఫాస్ట్‌కి? రాత్రి ట్రైన్‌లో ఏం తినలేదా? ఆకలేస్తుంటే చెప్పు, ఇప్పుడే పెట్టెస్తా’’
‘‘వద్దులే. కాస్త ఆగే పెట్టు’’ అంటూ టీవీవైపు దృష్టి సారించింది చెల్లెలు.
చెల్లెల్ని పట్టిపట్టి చూస్తూ, టీ షర్ట్‌ లాగుతూ ‘‘ఇంట్లో కూడా ఇదే అవతారమేమే?’’ అని అడిగింది.
‘‘అదేంటే, కొత్తగా అడుగుతావ్‌? మనం ఆల్వేజ్‌ రామ్‌చరణ్‌’’ 
‘‘మధ్యలో ఆ పేరెందుకు?’’
‘‘ఏదో రైమ్‌ కోసం వేశాలేవే’’
‘‘సర్లేగానీ, ఓ చున్నీ పడేసుకోవచ్చుగా?’’ అంది ఆరాగా, చెల్లెలు కళ్లలోకి చూస్తూ.
‘‘ఎందుకే, మీ ఆయనేమైనా పడిపోతాడనా?’’ అంది నవ్వుతూ.
‘‘పడితే, తీసుకుపోవే. ఓ గొడవొదిలిపోతుంది. నేనింకోడ్ని చూసుకుంటా, మంచివాడ్ని’’
‘‘పాపం.. ఎందుకే బావను అంతమాటంటావ్‌? మీ కోసమే కదా కష్టపడేది’’
‘‘అవును, అంతా మా కోసమే. అందుకే మనుషులు పట్టకుండా, అలా ఊళ్లట్టుకు తిరుగుతాడు. పోనీ ఊళ్లో వున్నప్పుడైనా తిన్నగా వుంటాడా అంటే, అప్పుడూ బిజీయే’’ అని ఇంకా ఏదో చెప్పబోతుండగా కాలింగ్‌ బెల్‌ మోగింది.
‘‘మీ బావ అయ్యుంటారు. నేను తీస్తాలే’’ అని సోఫాలోంచి లేచి గబగబా వెళ్లింది అక్క.
‘‘అబ్బొబ్బ.. ఏం యాక్షనే నీది. ఇంతసేపూనేమో వాడూ వీడూ, వదిలేస్తా అన్నావ్‌. ఇప్పుడేమో ..టారు’’ అని వెక్కిరించింది.
‘‘చాల్లే సంబడం.. నోర్మూసుకో’’ అంటూ చెల్లెల్ని నడుం దగ్గర గిల్లి, వెళ్లి తలుపుతీసింది.
ఆయన లోపలికి వస్తూ ‘‘హాయ్‌’’ అంటూ ఇద్దర్ని పలకరించి, స్ట్రోలర్ని ఓ పక్కకు తోసేసి, సోఫాలో కూలబడ్డాడు. 
ఆమె కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది.
ఓ సిప్‌ చేసి ‘‘ఊఁ.. ఏంటి విశేషాలు? ఆయన, పిల్లలూ..’’ అని మరదల్ని పలకరించాడు.
‘‘అందరూ బాగున్నారు బావా, మీరే బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్నారు. ఫ్లయిట్లో వచ్చేయలేక పోయారా?’’
‘‘ఫ్లయిట్లో రావాలంటే టైమింగ్స్‌ సెట్‌ కాలేదు. వాటిని సెట్‌ చేసుకున్నా, ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ఇక్కడకు రావాలంటే ట్రాఫిక్‌లో తాడు తెగుతుంది’’ అన్నాడాయన చిన్నగా నవ్వుతూ.
మరదలు పెద్దగా నవ్వింది. ‘‘అవును బావా, ఈ హైద్రాబాద్లో ట్రాఫిక్‌ను ఈదడంకంటే, ఏ సముద్రాన్నో దాటడం బెటర్‌’’.
‘‘నేను కాసేపు  రెస్ట్‌ తీసుకుంటా. మధ్యాహ్నం భోజనం చేశాక బైటకు వెళ్లే పనుంది. మళ్లీ రాత్రి వస్తా’’ అంటూ ఆయన భార్యతో చెప్పాడు.
మరదలి వైపు తిరిగి ‘‘ఊరికేనేగా, ఏమైనా పని మీదొచ్చావా?’’ అని అడిగాడు.
‘అంటే బావకు ఇంకా విషయం తెలియదన్నమాట’ అనుకంటూ, అక్కవైపు చూసింది. ‘చెప్పెయ్‌.. చెప్పెయ్‌’ అన్నట్టు ఆమె సైగ చేసింది. కానీ, చెల్లెలి గొంతు పెగల్లేదు.
ఆయన కాఫీ తాగుతూ ఇద్దరి మొహాలూ చూశాడు.
‘‘ఆయన రాత్రికి వస్తానంటే.. వచ్చినట్టే. ఏ అపరాత్రో అవుతుంది. చెప్పాగా, ఆయన చాలా బిజీ అని’’ అక్క పరోక్షంగా చెల్లెల్ని తొందరపెట్టింది.
ఆయన కాస్త చిరాగ్గా చూస్తూ ‘‘ఏదో ఒకటి చెప్పండి. చిన్నపిల్లలా ఏం?’’ అన్నాడు.
ఇక తప్పదన్నట్టు చెల్లెలు గొంతు విప్పింది. ‘‘అదీ.. అదీ..’’ అంటూ అక్కవైపు చూసింది. ఆమెకి అప్పుడే కళ్లల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఏ క్షణమైనా ఏడ్చేసేట్టు వుంది. 
భార్య మొహంలో మారుతున్న నీడల్ని గమనించిన ఆయన ఇరువురి వైపూ కాస్త మెత్తగా చూశాడు.
‘‘ఏం లేదు. బావా.. అమ్మకి ఒంట్లో బాగోలేదు. అంటే.. అదీ ప్రెగ్నెన్సీ అని చెప్పారుట’’ అంటుంటే ఆమె గొంతు పొడిబారిపోయింది.
ఆయనకి తానేం విన్నాడో అర్థం కాలేదు. భార్య బొటబొటా కన్నీళ్లు కారుస్తుండటంతో, స్లో పాయిజన్‌లా విషయం అర్థమైంది. అందుకు గుర్తుగా ఆయన గొంతు పొలమారింది. వెంటనే మరదలు ముందుకు వెళ్లి ఆయన చేతిలోని కాఫీ కప్పు అందుకుంది. భార్య దగ్గరగా వెళ్లి తల మీద గట్టిగా తట్టింది. ఆయన ఇంకా దగ్గుతూనే ‘నిజమా’ అన్నట్టు పక్కకు తిరిగి భార్య మొహంలోకి చూశాడు.
ఆమె ముఖకవళికలను బట్టి తాను విన్నది నిజమే అని అర్థమైంది.
‘‘అదేంటి? ఆంటీకి.. ఈ వయసులో కడుపు.. ఎలా?’’ అంటూ మరదలవైపు చూసి మాటలుమింగేశాడు.
***
కమ్యూనిటీల్లో అందరూ డబ్బున్న వాళ్లే వుంటారని, వాళ్లు ఎప్పుడో బారెడు పొద్దెక్కితేగానీ లేవరని చాలామంది అపోహ. కానీ, వాస్తవానికి చాలా ఫ్లాట్లలో కిచెన్‌ అద్దాలు చీకటి చెదిరిపోకుండానే వెలుగుతాయి. అందుకు 90శాతం కారణం పిల్లల స్కూల్లు, కాలేజీలు అయితే, కొంతమంది మార్నింగ్‌ షిప్ట్‌లకు పరుగెట్టేవారు వుంటారు. అలాగే, కాఫీ పడితేగానీ వాకింగ్‌లకు, యోగాలకు బయల్దేరని బ్యాచ్‌లు కూడా వుంటాయి. అయితే, ఇండిపెండెంట్‌ వాల్స్‌ కావడంతో ఒకరి గొడవ ఒకరికి వినబడదు-అనేది కొంతమేరకే వాస్తవం. వినబడినా పట్టించుకోరనేది పూర్తి వాస్తవం.
పని మనుషుల కాలింగ్‌ బెల్లుల మోత, పాల ప్యాకెట్‌లు వేసే వాళ్లు ఫోన్లలో చూస్తున్న రీల్స్‌ సౌండ్లు అక్కడ అందరినీ డిస్టర్బ్‌ చేస్తాయ్‌. అంత పొద్దున్నే లేవాల్సిన అవసరం లేనివారు సైతం, ఇంకాసేపట్లో సచ్చినట్టు, తిట్టుకుంటూ లేస్తారు. అందుక్కారణం చెత్తబండి. ‘చెత్తబండొచ్చిందమ్మా.. చెత్తబండి’ అంటూ పాట  వినిపించడంతోపాటు, చెవులు చిల్లులుపడేలా వాళ్లు వేసే విజిల్స్‌ ఎవర్నీ నిద్రపోనీయవ్‌. 
అయితే, వీటన్నిటికంటే ముందు కిచెన్‌లోని గిన్నెల చప్పుడు వల్లే ఆమెకు మెలుకువ వచ్చింది.
‘‘ఏంటే బాబూ.. మరీ ఇంత చీకట్లో లేచావ్‌?’’ అంటూ వచ్చింది చెల్లెలు.
‘‘ఇప్పుడేం తక్కువైందనుకుంటున్నావా? ఐద్దాటింది. ఇప్పటి నుంచి మొదలు పెడితేకానీ, పనులు కావు. కాఫీ ఇస్తాను తాగేసి మళ్లీ పడుకో. నా పనులన్నీ అయ్యాక లేపుతాను’’ అంది అక్క.
తనకీ నిద్ర వస్తోంది. కానీ, నిన్నంతా మాట్లాడుకోవడానికి కుదర్లేదు. మధ్యాహ్నం దాకా బావగారు ఇంట్లో వుండటం, ఆయన అలా వెళ్లే సరికి పిల్లలు స్కూళ్ల నుంచి ఊడిపడటం, వాళ్లకి చిరుతిళ్లు, హోంవర్క్‌లు-ఆ హడావిడితో గడిచిపోయింది.
అందుకని అక్కడే కిచెన్‌ గట్టు మీద కాస్త ఖాళీ చేసుకుని కూర్చుంది. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ‘‘అసలేం జరిగిందే? పూర్తిగా, వివరంగా చెప్పవా?’’ అంది.
పాలు దించి, కప్పుల్లో పోస్తూ ‘‘చాలా రోజులైంది కదాని, నా దగ్గరకు వచ్చిందే. పదిహేను రోజులేమో అయ్యింది. ఓసారి ‘బాగా చిరాగ్గా వుంది. కడుపులో తిప్పుతున్నట్టుగా వుంది’ అంది. నేనేవో వంటింటి చిట్కాలు కొన్ని చెప్పా. అమ్మ కూడా తనకు తెల్సినవి ప్రయోగించింది. కానీ, కుదరలేదు. సరే అని,మేం రెగ్యులర్‌గా వెళ్లే డాక్టర్‌ దగ్గరకు వెళ్తే, టెస్ట్‌లు చేయించుకోమంది. అమ్మకంటే నాకే ఎక్కువ కోపం వచ్చింది. ఆమేంటి, ఆమె వయసేంటి? ఈ టెస్ట్‌లేంటి? అని కాస్త గట్టిగానే అడిగానులే. ఆ డాక్టర్‌ మాత్రం కూల్‌గా ‘అనుమానం వున్నప్పుడు చేయించుకోవాలండీ’ అంది. అప్పుడు చూడాలి అమ్మ మొహం. ఒక్కసారిగా వాడిపోయింది. అసలే ఆల్చిప్పల్లా అంతంత కళ్లేమో భయం కూడా స్పష్టంగా కనిపించింది’’ అక్క చెప్పుకుపోతోంది. 
‘‘నిజమేలే.. భయం వేయకుండా ఎలా వుంటుంది. నువ్వు మొదటిసారి చెప్పినప్పుడైతే, ఏదో కామెడీగా అనిపించింది. చాలాసేపటికి గానీ నమ్మకం కుదరలేదు. తరువాత నాకు ఫ్యూజులెగిరి పోయాయనుకో’’ అంది చెల్లెలు, అప్పటి ఎగ్జట్‌మెంట్‌ను అలాగే ప్రదర్శిస్తూ.
‘‘నీకేంటి.. రిపోర్ట్‌లు వాట్సప్‌లో  ఓపెన్‌  చేయగానే  నాకు  చేతులు వణికాయి. అంటే, ఏదో మాట వరసకి అనడం కాదు. నిజంగానే ఇట్లిట్లా ఊగిపోయాయి. అమ్మయితే స్పీచ్‌ లెస్‌. అసలు ఆ పూటంతా ఎలా గడిచిందో కూడా తెలియదు. అసలు అమ్మా, నేను ఒకళ్ల మొహాలొకళ్లం చూసుకోలేదంటే నమ్ము.’’ 
చెబుతున్నది, ఓ క్షణం ఆగి, ఇడ్లీలు కుక్కర్లో పెట్టింది.
‘‘ఇప్పుడు పచ్చడి కోసం మిక్సీ పెడితే అందరూ లేపావ్‌ అని ఏడుస్తారు. ఈలోగా ఇవి పీల్‌ చేసి, తరువాత తురిమేశయ్‌’’ అంటూ క్యారెట్లు చెల్లెలి ముందు పెట్టింది.
ఒక్కో క్యారెట్‌ని సాలోచనగా తోలు తీస్తూ ఏవేవో ఆలోచనలు చేసింది. వున్నట్టుండి ‘‘అది కాదే, అసలెలా జరిగిందట’’ అని మెల్లగా, సిగ్గుగా అడిగింది.
‘‘ఎలా జరగడమేంటే? పిల్లల్లేరన్నమాటేగానీ, నీకూ పెళ్లయి వనెండాఫ్‌ ఇయర్‌ అవుతోందిగా? ఎలాగో తెలీదా’’ అని విసుక్కుంది అక్క.
‘‘నీ ఎంకమా, ఈ పీలర్‌తో నీ తొక్క చెక్కెస్తా. అన్నిటికీ నా మీద బుల్లీయింగ్‌ చేయడం కాదు. అసలు ఏం జరిగింది? అంటే, ఎవరూ? ఎలా?’’ అని చివరిమాటను నెమ్మదిగా, సాగదీస్తూ అడిగింది.
‘‘బుద్ధుందా నీకసలు? అవన్నీ ఏమైనా మాట్లాడే విషయాలా? అదీ ఎవరితో, అమ్మతో.’’
‘‘మరెవర్నెడుగుతాం? అది కాదే, అసలు అమ్మతో అంత చనువు ఎవరికి వుంది? క్లోజ్‌గా ఎవరుంటారు? లేక ఎవరైనా బలవంతంగా..’’
‘‘అంటే, అమ్మేమైనా తెలివి తక్కువదా? ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే ఎంత గొడవైపోయి వుండేది. అదీగాక మనకి కూడా అప్పుడే తెలిసేది కదా? ప్రెగ్నెన్సీ దాకా ఆగడమెందుకు?’’
‘‘మరి, అమ్మ.. కావాలనే..’’ అంటూ నసిగింది.
‘‘కావాలనే, చెప్పేదేదో పూర్తిగా చెప్పేడు’’ అంటూ గయ్యిమంది అక్క.
‘‘నువ్వు ఇలా అరిస్తే కాదు. ఎప్పుడూ నోరేసుకు పడిపోతావ్‌’’
‘‘సర్లే, అరవనుగానీ అర్థమయ్యేలా చెప్పు’’
‘‘అంటే, అదీ.. అమ్మ ఎవరితోనైనా ప్రేమా.. అదీ అని’’ అంటూ అక్క మొహంలోకి చూసింది. తను ప్రశాంతంగా కనబడటంతో ‘‘ఏం లేదు, నాన్న పోయి చాలాకాలం అయ్యింది కదా’’ అంది పొడారిన గొంతుతో.
‘‘ప్రేమ కాదుగానీ..  అలాంటిదే  ఏదో  అయ్యుంటుందని అనుకుంటున్నా. సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌ కదా. టిక్‌టాక్‌లో పాత సినిమా పాటలు చేసేది. తర్వాత ఏవో జోకులవీ చేస్తూ రీల్స్‌ చేస్తుంది. వేలల్లో ఫాలోవర్స్‌ కూడా వున్నారు కదా. నీకు తెలియందేముంది, హోం టూర్లూ, అవీ అంటూ నువ్వూ అందులోనే మునిగి తేలుతూ వుంటావు కదా. బోలెడంతమంది కక్కూర్తి వెధవలు వుంటారక్కడ. ముసలాళ్లు మేకప్‌ వేసుకుని చేసేవాటికీ, జిడ్డు మొహాలతో పల్లెటూరు ఆంటీలు చేసేవాటికే ఎగబడి లైకులు, లవ్వులు కొడతారు. అమ్మ మామూలుగానే అందంగా వుంటుంది. పైగా చదువుకుంది. ఆ గ్రేస్‌, అదీ డిఫరెంట్‌ లుక్‌ ఇస్తుంది కదా? అలా ఎవరైనా పరిచయమై, దగ్గరయ్యారేమో అనుకుంటున్నా’’
‘‘అవును  అందగత్తె  కాబట్టేగా  డిగ్రీలో వుండగానే నాన్న వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు.  ఆమెకు తొందరగా అయిపోయింది కదాని, మనకీ ఇరవైల్లోనే ముడెట్టేయించింది. కానీ, నాన్న వుంటే ఎంత బాధపడేవారే.’’
చెల్లెలు మాట పూర్తి కానే లేదింకా, అక్క టపీమని మొట్టింది.
‘‘అబ్బా..’’ అంటూ తల తడుముకుంటూ ‘‘నేను ముందే చెప్పానా, ఇలా భౌతికదాడులు వద్దని’’ కోపంగా అరిచింది.
‘‘కొట్టనులేగానీ, అరవకే తల్లీ. అంతా లేచి కూర్చొంటారు’’ అని ‘‘ఊరికే కొట్టానని ఏడుస్తావుగానీ, నువ్వు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థముందా? నాన్నుంటే బాధపడేవారంట’’ అంటూ చివరి మాటలను వత్తి పలికింది.
‘అవును, నేనన్న దాంట్లో తప్పేముంది’ అనబోయి ‘‘అ..’’ అనగానే అక్క మళ్లీ చెయ్యెత్తడంతో, ఆగిపోయింది. 
‘‘తింగరిమొహమా, నాన్నుంటే.. అమ్మకి వేరే వాళ్ల అవసరం ఏముంటుంది’’ అంటూ సాగదీసింది.
‘పొరబాటే’ అన్నట్టు చెల్లెలు నాలిక్కరుచుకున్నట్టు మొహం పెట్టింది.
‘‘మరి పీరియడ్స్‌ ఆగిపోయినప్పడైనా అనుమానం రాలేదటనా?’’
‘‘తొందరగా ఆగిపోయాయి, పీడా వదిలిపోయిందని అనుకుందిట. ఆ విషయం మనక్కూడా చెప్పిందిగా, గుర్తులేదా? ఈ వయసులో ఇలా జరుగుతుందని అనుకోదుగా’’
చెల్లెలు గుడ్లప్పగించి చూడటం మినహా ఏం మాట్లాడలేదు.
‘‘అప్పటికప్పుడు తత్కాల్‌లో చేసుకుని వెళ్లిపోయింది. లేపోతే, నువ్వొచ్చేసరికి వుందును. ఎంత మొత్తుకున్నానో ఏదో ఒకటి చేద్దామమ్మా, వుండు అని. విన్లేదు. ఇక చేసేదేం లేక ఏ అఘాయిత్యాలు చేయకు తల్లీ, నీకు మేమున్నాం. దాంతో మాట్లాడి-నీతో, ఏదో ఒక పరిష్కారం చూస్తాం అని చెప్పా. ఇప్పుడు నీతో ఇదంతా చెప్పుకుంటే, నాకు కాస్త కుదురుగా వుంది. లేకపోతేనా ఏదో అలవికాని భారం మోస్తున్నట్టు ఊపిరాడలేదు, ఇన్నాళ్లూ’’ అంటూ చెప్పుకుపోతున్నది కాస్తా, ఆగింది.
ఆయన కిచెన్‌ దగ్గరకు వచ్చి ‘‘గుడ్‌ మానింగ్‌’’ అన్నాడు. ఇద్దరూ తిరిగి చెప్పారు.
‘‘ఒక్క నిమిషం కాఫీ ఇస్తున్నా’’ అందామె.
‘‘నోనో. నా షెడ్యూల్లో స్మాల్‌ ఛేంజ్‌.. వాకింగ్‌ నుంచి వచ్చాక ఒకేసారి టిఫిన్‌ అండ్‌ కాఫీ. ఒకే బాయ్‌’’ అంటూ గబగబా బయటకు వెళ్లిపోయాడు. 
ఆయన వెళ్లిపోయేదాకా ఆగి, ‘‘బావ ఏమన్నారే?’’ అని అడిగింది.
‘‘ముందు అసహ్యించుకున్నారు. తర్వాత ఎక్కడో పొరపాటు జరిగి వుంటుందిలే అన్నారు. ఇందుకు కారణమైనవాడేమైనా బ్లాక్‌మెయిల్‌ చేస్తాడేమో జాగ్రత్తగా వుండమని చెప్పమన్నారు’’ అందామె.
‘‘నిజమేలే ఆ యాంగిల్‌ కూడా ఆలోచించాల్సిందే’’ అని ఓ నిమిషం మౌనం వహించింది. తర్వాత తనే అంది ‘‘అయినా అమ్మంటే పనులు, వండి పెట్టడం, ఇంటి పనులు, గారం చేయడం.. ఏదో అలా అనుకునేదాన్ని. ఇలా జరిగాక అనిపించింది, అమ్మకు కూడా ఫీలింగ్స్‌ వుంటాయి కదా అని’’.
‘‘వుంటే, ఏంటే? ముండమోసినోళ్లు.. సారీ, భర్త పోయినవాళ్లు ఎంతమంది లేరు? అందరూ ఇలా బజార్న పడుతున్నారా?’’ అంది విసురుగా.
‘‘అదికాదక్కా, నువ్వలా అరవడంలో నీ బాధ అర్థంచేసుకోగలను, కాదనను గానీ-ఒకవేళ ప్రెగ్నెంట్‌ కాలేదనుకో మనకెవరికీ ఏమీ తెలిసేది కాదుగా? ఏ గొడవా వుండేది కాదుగా?’’ అంది వాదనకు దిగుతూ.
‘అయితే?’ అన్నట్టు క్వశ్చన్‌ మార్క్‌ మొహం పెట్టింది అక్క.
ఇంతలోనే ఏదో స్ఫురించినట్టు ‘‘ఓ పని చేస్తే, ఆ పని చేసినవాడు, సారీ, ఆయన-ఎవరో కనుక్కుని వాళ్లిద్దరికీ పెళ్లి చేసేస్తే’’ అంది చురుగ్గా చూస్తూ.
‘‘ఏడ్సినట్టుంటుంది. ఈ వయసులో వాళ్లు పసిగుడ్డును పెంచుతారేమే? నలుగురిలో ఎలా వుంటుంది? ఇప్పుడంటే గుట్టు చప్పుడు కాకుండా ఎవరికో ఇచ్చేయడమో, ఏదో చేయొచ్చు. పెళ్లి అంటే పెనం మీంచి పొయ్యిలో పడినట్టు వుండదూ? అందరికీ మనమే టామ్‌టామ్‌ వేసినట్టు కాదూ? అయినా, అతగాడికి ఏం కమిట్‌మెంట్స్‌ వున్నాయో? పెళ్లాం పిల్లలు వున్నవాడో. ఏమీ తెలియకుండా ఎలా డిసైడ్‌ చేస్తాం.’’
‘‘అమ్మని అడిగితే..’’
‘‘ఆఁ.. చెబ్తుంది. ఇంతకుముందు వీడియో కాల్‌ చేస్తే నా వంటయ్యే దాకా మాట్లాడుతూనే వుండేది. సాయంత్రం పిల్ల స్కూల్‌ నుంచి వచ్చాక దానితో కూడా చాలాసేపు మాట్లాడేది. ఇప్పుడు ఫోన్‌ చేస్తే ‘బతికే వున్నాలేవే, కంగారు పడకు’ అని రెండు ముక్కలు మాట్లాడి పెట్టేస్తోంది. అయినా, అమ్మనెలా అడుగుతాం? తనే ఏదోక నిర్ణయం తీసుకుంటే, అప్పుడు ఆలోచించొచ్చు’’
‘‘ఇంకా ఎప్పుడు తీసుకుంటుంది నిర్ణయం, రేపు నెలలు నిండుతున్న కొద్దీ ఎవరికంటైనా పడాలంటే, ఎంత ఎంబ్రాసింగ్‌గా వుంటుందే’’
‘‘ఎంబరాసింగని మెల్లగా అంటావేం’’
‘‘అన్నట్టు.. అబార్షన్‌ ఆప్షన్‌ ఆలోచించలేదా?’’ అంది హఠాత్తుగా తట్టడంతో.
‘‘అబ్బే.. లేదే. మావి మట్టి బుర్రలు కదా, అస్సలు తోచనే లేదు’’ అని వ్యంగ్యంగా కోప్పడి ‘‘వుండు, అమ్మే చెబుతుంది మిగిలినవన్నీ. రోజూ ఈ టైమ్‌కే ఫోన్‌ చేస్తా’’ అని, గబగబా వెళ్లి బెడ్రూమ్‌లోని ఫోన్‌ తీసుకువచ్చింది.
ఫోన్‌ రింగవుతుంటే ‘‘అసలు, ఈ వయసులో గర్భం రావడమే చాలాచాలా రేర్‌ అట.  అమ్మ వయసు కారణంగా అబార్షన్‌ లాంటివి కుదరవు. ప్రాణానికే ప్రమాదం అంటే.. ఆగిపోయాం. ఇక నాటు వైద్యాలో, చిట్కాలో వైద్యాలో చూడాలి’’ అంది.
ఆ మాటతో చెల్లెలు కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘‘ఎక్కడో, ఏదో తిరకాసుందే. లేపోతే అమ్మకి... ఎందుకోనే అమ్మ మీద నాకేమీ కోపం రావటం లేదిప్పుడు, తెలుసా’’ అంటూ అక్క భుజం మీద వాలి పెద్దగా ఏడ్చేసింది.
ఫోన్‌ రింగయ్యి, రింగయ్యి ఆగిపోయింది. 
‘ఆప్‌కె ద్వారా డయల్‌ కియా గయా నెంబర్‌ అభి ‘వ్యర్థ్‌’ హై’ అని వినిపించింది.
అక్కచెల్లెళ్లిద్దరూ ఆదుర్దాగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
-X-

No comments:

Post a Comment