Friday, April 24, 2026

 లక్ష్మీ దేవి సంకల్పం 

☸️☸️☸️☸️☸️☸️☸️

పూర్వం దండకారణ్యంలో ఆజీవకుడు అనే ఋషి తపస్సు చేసుకుంటూ వుండేవాడు. ఆయన తన జపమూ తపమూ తప్ప మరో సంగతి పట్టించుకునేవాడు కాదు.

అలా వుండగా ఒకనాడు ఆజీవకుడు పడుకొని వుండగా ఒక కల వచ్చింది. 

అందులో లక్ష్మీదేవి కన్పించి “ఆజీవకా! నీ తపస్సుకు నేను చాలా ఆనందించాను. అందుకని నీకు సకల సౌభాగ్యాలూ ఇవ్వకుండా ఉన్నాను” అన్నది.

అప్పుడు ఆజీవకుడు “సర్వ సంగ పరిత్యాగిని నాకు సంపదలు ఎందుకు తల్లీ?” అన్నాడు.

లక్ష్మీదేవి నవ్వి, “నీవు కావాలంటే ఇస్తున్నాను కనుకనా వద్దంటే మానడానికి? నీకు ఐశ్వర్యం అబ్బబోతున్నది. దానిని ఆపడం ఎవరివల్ల కాదు” అని చెప్పి అదృశ్యమై పోయింది. 

ఆజీవకుడు మేలుకున్నాడు. తనకు వచ్చిన కలకు ఆశ్చర్యపడ్డాడు.

తనకు సంపదలు అక్కర లేదంటే ఆమె ఎలా ఇవ్వగలుగుతుందో చూడాలని కుతూహల పడ్డాడు. 

అంతలోనే ఒక తెల్లని గుర్రం వచ్చి ఆజీవకుని పక్కన నిలబడింది. అది దాహంతో రొప్పుతున్నది, వెంటనే ఆజీవకుడు దానిపై కరుణతో నీళ్లు పెట్టి, గడ్డి వేశాడు. కొంతసేపటికి కొందరు​​ సైనికులు గుర్రాలపై అటు వచ్చి ఆజీవకుని పర్ణశాల పక్కనే గడ్డి మేస్తున్న గుర్రాన్ని చూచి ఆశ్చర్యం పోయారు. సైనికుల కలకలం విని ఆజీవకుడు పర్ణశాలలో నుండి ఇవతలకు వచ్చాడు. “మహర్షి! ఈ గుర్రాన్ని ఎవరు అక్కడికి తెచ్చారు?” అగి _పశ్నించాడొక సైనికుడు, "ఏమో, నా కేమీ తెలియదు. ఇది ఇక్కడికి వచ్చింది. దప్పికగా వుందని నీళ్ళు పెట్టి గడ్డి​ వేశాను. అంతే” అన్నాడు ఆజీవకుడు.

"ఇది ప్రభువుల వారి యాగాశ్వం. దీన్ని దొంగలు తీసుకుపోయారు. దీనికోసం నిన్నటి నుంచి వెతుకుతున్నాము. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? పదండి ముందు మా రాజు గారి దగ్గరికి" అని సైనికులు ఆజీవకు బెదిరించారు. 

ఆజీవకుడు ధైర్యంగా "పదండి -అలాగే వస్తాను," అంటూ బయలుదేరాడు. గుర్రమూ, సైనికులూ, ఆజీవకుడూ అంతా త్రిభువన చక్రవర్తి దర్బారుకు చేరారు. 

సైనికులు ఆ యాగాశ్వం ఆజీవకుని వద్ద దొరికిందని ఫిర్యాదు చేశారు. 

త్రిభువనుడు ఆజీవకున్ని పరిశీలనగా చూచాడు. ఆ తర్వాత సైనికులతో "వెర్రిముఖాల్లారా! ఈయన మహానుభావుడురా! మన పాలిటి దైవం. తన మంత్రశక్తితో దొంగల వద్ద నుండి గుర్రాన్ని తన ఆశ్రమానికి తెప్పించాడు" అని చెప్పి, "దయచేయండి స్వామీ!" అని అర్ఘ్యపాద్యాలు తెచ్చేందుకై లోపలికి వెళ్ళాడు. 

ఆజీవకుడు ఆ పరిణామానికి నివ్వెర పోయాడు. లక్ష్మీదేవే దొంగల నుండి గుర్రాన్ని తప్పించి అలా తన ఆశ్రమం వైపు పంపిందని గ్రహించాడు. 

చూద్దాం-ఆమె పంతం ఎలా నెగ్గుతుందో అని అజీవకుడు అనుకుంటూ వుండగా త్రిభువన చక్రవర్తి అర్ఘ్యమూ పాద్యమూ తీసుకొని వచ్చి ఆజీవకుని పాదాలు కడిగేందుకు వంగాడు.

ఆజీవకుడు ఫెడీలుమని ఆ ఆర్ఘ్యపాత్రను ఒక్క తన్ను తన్నాడు. చక్రవర్తి చేతిలో నుండి ఆ పాత్ర ఎగిరి అవతల పడింది. సభలోని వారంతా కోపంతో ఒక్కసారి కత్తులపై చేయి వేసి నిలబడ్డారు. 

అంతలో దూరంగా పడ్డ అర్ఘ్య పాత్ర అడుగు నుండి పెద్ద మండ్రగబ్బ అవతలికి పోతూ కన్పించింది. త్రిభువన చక్రవర్తి ఆనంద బాష్పాలు రాలుస్తూ "స్వామీ, నన్నిలా మండ్రగబ్బ కుట్టకుండా కాపాడారా, తాము! రండి. రండి. నా సింహాసనం మీద కూర్చోండి" అని లోనికి తీసుకుని పోయాడు. 

తాను దురుద్దేశంతో చేసిన పనిని, లక్ష్మీదేవి ఎలా తన పాలిట వరంగా మార్చిందో ఆజీవకుడు గ్రహించి నవ్వు కున్నాడు. 'అప్పుడే ఏమయిందమ్మా! చూద్దాం ఇంకా' అనుకున్నాడు మనస్సులోనే. 

మహారాజు ఆజీవకునికి సమస్త వైభవాలూ సమకూర్చాడు. 

లక్ష్మీదేవి దయవల్ల త్రిభువన చక్రవర్తి భార్య గర్భవతి అయి, మగ పిల్లవాన్ని కన్నది. అసలు త్రిభువనుడు మొదట యాగం పెట్టింది కూడా సంతానం లేనందు వల్లనే! ఆహా! మహర్షి రాజ్యంలో అడుగుపెట్టారు, అన్ని మంగళాలే జరుగుతున్నవి' అని బ్రహ్మా నంద భరితుడైనాడు త్రిభువనుడు. 

నామ కరణం కాగానే రాజు ఆజీవకుడుని వెంటబెట్టుకొని అంతఃపురంకి వెళ్ళి "మహర్షీ! నా బిడ్డను ఆశీర్వదించండి" అని ప్రార్థించాడు. 

'అలాగే' అని ఆజీవకుడు 'అమ్మా! లక్ష్మిదేవి ఏది ఈసారి నీ ప్రతాపం చూపించు ఏం చేయగలవో' అని మనస్సులో అనుకుంటూ ఊయల మంచంలోని పసికందును గభాలున పైకెత్తి భవనంలో నుండి విసిరి అవతల పడేశాడు. 

రాజూ, దాసదాసీజనులు హాహాకారాలు చేస్తూ భవనంలో నుండి ఇవతలికి వచ్చారు. 

ఆజీవకుడు కూడా, పిల్లవాడు ఎమైనాడో చూద్దామని ఇవతలకి వచ్చాడు. 

ఆజీపకుడు ఇవతలికి రావడమేమిటి - ఆ భవనం ఫెడేలుమని బద్దలు కావడ మేమిటి ఒక్కసారే జరిగాయి. 

శిశువు మాత్రం బయట వన పాలకులు తెచ్చి రాసులుగా పోసిన పూలమీద పడి క్యారు క్యారు మంటున్నాడు. 

త్రిభువను నిస్సంతుగా చేసి రాజ వంశం నిర్మూలించి రాజ్యం కాజేయాలని బందువులలోనే కొందరు అంతఃపురం గోడల కింద గంథకపు పాతరలు పెట్టి నిప్పు అంటించినట్లు త్రిభువనుడికి వర్తమానం అందింది. - 

“ఆహా! ఆజీవకుడే లేకుంటే ఇవ్వాళ నేనంటూ నా రాణీ పరివారమూ, నా వంశాకురమూ ఏమైపోయే వాళ్ళమో!”  అని దణ్ణాలు పెట్టుకుంటూ వెళ్ళి ఆజీవకుని పాదాలపై బడి "స్వామీ! నా రాజ్యం మొత్తం మీరు గురుదక్షిణంగా స్వీకరించండి" అని వేడుకోసాగాడు ఆ రాజు.

'అమ్మా లక్మీదేవీ! ఈసారీ నీవే గెలిచావు' అనుకున్నాడు అజీవకుడు మనస్సులో. 

కొంత కాలం గడిచింది. ఆజీవకుడు ఆ రాజ వైభవాలలో పడి, దాన జప తపాలు అన్నీ మరిచిపోయాడు. 

అలా వుండగా ఒకరోజు రాత్రి మళ్ళీ లక్ష్మీదేవి కలలో కన్పించి "అజీవకా! నీ తపస్సుకు తగినంత భోగం అనుభవించావు. ఇక నేను వెళ్తున్నాను. అయితే భోగభాగ్యాలలో నీవు నీ జపతపాలన్ని మరచిపోయి పతితుడివైనావు, కాబట్టి రేపటి నుండి కొద్దికాలం నిన్ను జ్యేష్టాదేవి వరిస్తుంది - నీవు బంగారం పట్టుకున్నా మట్టి అవుతుంది. కర్ర పట్టుకుంటే పామై కరుస్తుంది" అని చెప్పి ఆదృశ్యమైంది. 

ఆజీవకునికి మెలకువ వచ్చింది. లక్ష్మీదేవి అన్నంత పని చేస్తుందని ఆజీవకునికి తెలుసు. భోగ భాగ్యాలకు అలవాటు పడ్డ ఆజీవకునికి వాటిని వదలడమంటే అప్పుడు ఇష్టం లేకపోయింది. అందుకని ఎలాగైనా వాటిని దక్కించుకోవాలనే ఆశతో రాత్రికి రాత్రే రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు. అలా పోయి పోయి నిర్జనమైన ఒక శ్మశానం చేరాడు. అక్కడ కపాలాలు చుట్టూ పెట్టుకొని ఒక శవం పైన కూర్చుని నలభై రోజులు నిద్రాహారాలు మాని ప్రచండ భైరవ ఉపాసన చేశాడు. 

నలభై ఒకటవ రోజున అజీవకుడికి జ్యేష్టాదేవి ప్రత్యక మైంది. ఆజీవకుడు ఫక్కున నవ్వుతూ "నేను ప్రచండ భైరవోపాసన చేశాను. ఇక నీవూ, నీ దరిద్రమూ నన్నేమీ చెయలేవు" అన్నాడు. వెటకారంగా. 

జ్యేష్టాదేవీ నవ్వి "ఓరి మూర్ఖుడా! గత నలభై రోజుల నుండి నేను నిన్ను పట్టి పీడించుకు తింటున్నాను. లేకుంటే హాయిగా భోగభాగ్యాలు అనుభవించే వాడివి తిండి తిప్పలూ మాని ఈ శ్మశానంలో శవం పైన కూర్చోవడ మేమిటి? — ఇవ్వాళ్లతో నీకు విమోచనమయింది- నేనిక వెళ్తున్నాను- ఆది చెబుదామనే వచ్చాను" అని చెప్పి ఆదృశ్యమయింది.

ఆజీవకునికి జ్ఞానోదయమైంది. ఆటు రాజ్యసుఖాలూ, ఇటు శ్మశానమూ రెండూ వదిలి తిరిగి తపస్సు చేసుకునేందుకై తన పర్ణశాలను వెతుక్కుంటూ బయలుదేరాడు.

"ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే
విష్ణు పత్న్యై చ ధీమహి!
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||

"ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి!
తన్నో విష్ణుః ప్రచోదయాత్"

                జై శ్రీరామ్   జై హనుమాన్
                                   
                       సదా మీ సేవలో 
         I am nothing without all of you" 
                  *_🌻శుభమస్తు🌻_*
                              ఇట్లు
                                మీ
                         భవధీయుడు
                అవధానుల శ్రీనివాస శాస్త్రి 
                  ❀┉┅━❀🕉️

No comments:

Post a Comment