🌲🌲🌲🌲🌲🌲
ఒక ఊరిలో బడి బాగుంటే, ఆ ఊరిలో ఊరికోసం పనిచేసే ఓ మాస్టారు ఉంటే ఆ ఊరు ఇలా ఉంటుంది.
ఓపికగా చదవండి. టైమ్ చూసుకుని మరీ చదవాల్సిన వ్యాసమిది.
ఇక మొదలెడదాం.
మా ఊరి పక్కనే అదో మోస్తరు గ్రామ పంచాయతి.. ఆ ఊరి ఓటింగ్ ఓ నాలుగువేల వరకు ఉంటుంది! అందులో పెద్ద ప్రత్యేకత ఏం లేదు కానీ.. సంక్రాంతి పండుగ వచ్చిందంటే Benz.. BMW.. Audi.. వంటి high end luxury కార్లు ఆ వూరి రోడ్ల మీద మాములుగా తిరుగుతుంటాయి! ఇంక ఏ వీధి చూసినా.. ఆల్మోస్ట్ ప్రతి ఇంటి ముందు ఒకటో రెండో కార్లు పార్క్ చేసి ఉండటం పండక్కి అక్కడ ఓ సాధారణ విషయం!
ఇంక సంక్రాంతి పండగ వచ్చిందంటే ఊర్లో సందడి మాములుగా ఉండదు! స్పోర్ట్స్ ఈవెంట్స్ నుండి కల్చరల్ ఈవెంట్స్ దాక ఆ వారం రోజులు దుమ్ము రేపుతారు! ఇక పండుగ సందర్భంగా ఆ ఊర్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ చూడటం కోసం అయితే ఒంగోలు.. గుంటూరు.. వంటి చుట్టుపక్కల టౌన్స్ నుండి కూడా క్రికెట్ ప్రేమికులు వస్తుంటారు! నిజంగా అంత ఉత్సాహంగా ఉంటుంది ఆ వూరిలో పండుగ వాతావరణం!
కాని.. ఓ 40-50 సంవత్సరాలు వెనక్కి వెళితే.. చుట్టుపక్కల గ్రామాలతో పోలిస్తే ఆర్థికంగా అదో బాగ వెనుకబడిన గ్రామం! అంతా మెట్ట పొలం! వూరికి నీటి వసతి లేదు! ఆదాయం చాలా తక్కువ! ఊర్లో కనీసం పెద్ద రైతులు కూడా లేరు! వందకి వందశాతం అందరూ అరెకరా.. ఎకరా.. రెండెకరాల లోపున్న చిన్నా.. సన్నకారు రైతులే! గ్రామస్తులు ఎక్కువగా వారి వారి కులవృత్తులు.. పశువుల పెంపకం.. రాష్ట్రం అంతా తిరుగుతూ అప్పట్లో పెంకుటిళ్లకు నల్ల పెంకు కప్పడం.. వంటి వృత్తులపై ఆధారపడి బ్రతికేవారు!
అంతవరకు విశేషం ఏమిలేదు.. కాని.. మిగతా గ్రామాల్లో లేనిది ఆ ఊర్లో ఉన్నది.. ఆ ఊరి దశా దిశని.. గ్రామస్తుల ఆర్దిక సామాజిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది.. అది మరేదో కాదు ఆ ఊరి " గవర్నమెంట్ హైస్కూల్"!! ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో అదే మొదటితరం హైస్కూల్! ఆరోజుల్లో దాదాపు షుమారు పది పదిహేను గ్రామాల విద్యార్థులు ఆ స్కూల్లో చదువుకోవడానికి వచ్చేవారు! అలా భవిష్యత్ లో తమ బతుకులను సమూలంగా మార్చివేసే ఓ నిశబ్ధ విప్లవానికి ఆ వూరి హైస్కూలే వేదిక అయ్యింది!
సీన్ కట్ చేస్తే..
ఈరోజున ఆ చిన్న గ్రామంలో మూడు నేషనల్ బ్యాంకులు.. ఓ రాష్ట్ర స్థాయి క్రికెట్ స్టేడియంతో సహ కళ్యాణ మండపాలు.. కమ్యూనిటీ హాల్స్.. మంచి లైబ్రెరీ.. వందశాతం సీసీ రోడ్లు.. అందరికీ ఫ్రీ RO drinking water plants.. అలా ఆ గ్రామానికి లేని సౌకర్యమే లేదు! ఇక దేశ విదేశాల్లో సెటిల్ ఆయిన ఆ గ్రామానికి చెందిన రెండు వందలకు పైగా NRI కుటుంబాల్లో ఒక్క అమెరికాలోనే షుమారు వంద కుటుంబాలు వరకు స్థిరపడ్డారు! ఇక దేశవ్యాప్తంగా వివిధ ఉన్నతోద్యోగాల్లో ఉన్నవారు.. డాక్టర్లు.. చార్టెడ్ అకౌంటంట్లు.. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో కొన్ని పదుల మంది యువ Software ఇంజనీర్లు! ఇక ప్రభుత్వ టీచర్లయితే చెప్పేపని లేదు.. ఆ ఊరి టీచర్ పని చేయని పాఠశాల అసలు మా జిల్లాలోనే లేదంటే అతిశయోక్తి కాదు!
ఇక ఆ ఊరిలో ఉన్న మూడు జాతీయ బ్యాంకులు కాకుండా ఆ ఊరి కో-ఆపరేటివ్ సొసైటి (ప్రాదమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం) లో గ్రామస్తుల సేవింగ్ డిపాజిట్ల విలువ అక్షరాల 20 కోట్ల రూపాయలు!! ఇది మొత్తం సౌత్ ఇండియాలోనే ఒక విలేజ్ సొసైటీలో రెండవ అత్యధిక సేవింగ్స్ మొత్తం అట! (మొదటి స్థానంలో కేరళలో ఒక వూరి సొసైటి ఉందట) ఈ వూరి సొసైటి ఆధ్వర్యంలో సొంతంగా కోల్డ్ స్టోరేజ్ లు.. గిడ్డంగులు.. కిరాణా షాపులు.. బట్టల షాపులు.. నిర్వహిస్తూ సహకార సంఘం చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అవార్డులను అందుకుంది!
ఇక మొదటి తరంలో ఆ వూరు హైస్కూల్లో చదువుకొని బాగుపడ్డ కుటుంబాల్లో మా కుటుంబం కూడ ఒకటని నేను గర్వంగా చెప్తాను! వాస్తవానికి మా లాంటి ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో మొదటి తరంలో విద్యావకాశాలు దొరకడం.. అందరూ చదువుకోవడం వల్ల.. ఈరోజున ఒక్క మా కుటుంబంలోనే ఆరుగురు డాక్టర్లుగా వైద్య వృత్తిలో స్థిరపడ్డారు! ఇక మా జనరేషన్ లో విద్యార్హత కనీసం Post graduation లేని వాళ్ళు మా ఇంట్లో ఒక్కళ్ళు కూడా లేరు!!
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. కేవలం చదువుకొనే అవకాశాలు ఎక్కువ మందికి లభించడం వల్ల మాత్రమే.. కేవలం చదువే పెట్టుబడిగా.. మానవ వనరులే పెట్టుబడిగా.. అన్ని రంగాల్లో అభివృద్ది పథాన ముందంజలో నిలిచిన రావినూతల అనే ఓ మామూలు గ్రానం కొన్ని దశాబ్దాలలోనే అన్ని రంగాల్లో మిగతా గ్రామాలకు అందనంత ఎత్తులో నిలిచింది! అది Educaton కు ఉన్న పవర్! అది గుర్తించిన మనుషులు.. అది గుర్తించిన పాలకులు ఉన్న సమాజంలో నిజంగా అద్భుతాలే జరుగుతాయి!
ఈ సందర్భంగా.. నువ్వు ఒక చేపనిస్తే ఈరోజు మాత్రమే తింటాడు! అదే నువ్వు చేపలు వేటాడడం నేర్పితే రోజూ తింటాడనే ఓ ఫేమస్ చైనా కోట్ ని గుర్తు చేయాలనిపించింది!!
చల్లా శ్రీధర్ రెడ్డి గారు చాలా బాగా రాశారు. ఆయన చెప్పింది నిజమే. బడి వలన బాగు పడ్డాం. సందేహం లేదు. కానీ అది ఒక్కటే కాదు అనే దానికే ఈ వివరణ. మీకు సంక్రాంతి పండుగకు క్రికెట్ పోటీలో, బయట నిలుచున్న ఫారిన్ కారులో మమ్మల్ని, మా విజయాలను నిర్వచించలేవు. రెడ్డి గారు గమనించిన దానిని ఐస్ బెర్గ్ ఎఫెక్ట్ (Ice berg effect) అంటారు. అంటే ఐస్ బెర్గ్ (Ice Berg) నీటి పైకి ఎంత కనిపిస్తుందో, అంతకు తొమ్మిది రేట్లు లోపల ఉంటుంది. దానిని నేను పూర్తిచేయటానికి ప్రయత్నిస్తాను. మా ఊరులో కాపులు ఉన్నారు , పెద్ద రైతులు ఉన్నారు. మీరనుకున్నంత మంది లేకపోవచ్చు. కానీ వాళ్లంతా గొప్పవారు. వారందరు ఆదర్శవంతులు. అందుకే మా బడికి భూదానం చేశారు. సొసైటీ ని నిలబెట్టారు. కళానిలయాలకు దాతృత్వం చూపారు. ఆలయాలు పునరుద్ధరించారు. స్టేడియం కోసం జీవిత కాలాన్ని త్యాగం చేశారు. మా ఉన్నతిని మీరు ఐశ్వర్యం తో కొలిచారు. దానికంటే గొప్పగా మాలో మానవత్వం ఉంది. మా ఊరి వైద్యులు అద్దంకి, ఒంగోలు, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నో పట్టణాల్లో కొన్ని లక్షల మంది ప్రజలకు వైద్య సేవలందించారు. మా విద్యావేత్తలు రాష్ట్రం నలుమూలల్లో కొన్ని లక్షల మందికి విద్యాదానం చేశారు. వారి చైతన్య స్ఫూర్తి ఎంతో మందిని విద్యకు దగ్గర చేసింది. ప్రయోజకులను చేసింది. మా ఇంజినీర్లు ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించారు. మైక్రోసాఫ్ట్, ఈబే, గూగుల్, డెల్, ఆపిల్ ఇంకా ఇలాంటి ఎన్నో బహుళజాతి కంపెనీలను ఉన్నతంగా నిలబెట్టారు. కొన్ని వందల పేటెంట్లు సృష్టించారు. ప్రపంచ మేధకు నాయకత్వం వహిస్తున్నారు. మా ఊరి కోసం తపిస్తున్నారు. మా వారి కోసం గ్రంధాలయం పెట్టారు. అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్నారు. అమ్మాయిల ఆత్మగౌరవం కోసం టాయిలెట్స్ కట్టించారు. చదువు కోవటానికి చేయందిస్తున్నారు. పల్లె, ఊరు అనే భేదాభిప్రాయం లేని జీవనం కోసం పాటుపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలోని పత్రికలు మా ప్రింటింగ్ టెక్నాలజీ నిపుణుల చేతిమీదగా నడుస్తాయి. మాకు ఒకటి రెండు ఎకరాల మెట్ట భూమే ఉండచ్చు కానీ మా తల్లిదండ్రులు వందల ఎకరాలు ఉన్న పిల్లలకు కంటే మిన్నగా విలువలు బోధించారు. మాకు ఆత్మగౌరవం నేర్పించారు. మా అమ్మలు మేదరమెట్ల పుగాకు గ్రేడింగుకు వెళ్ళుండచ్చు, మేము అమెరికాలో ఉన్నాకూడా పనిలో దైవం చూసిన మాతృమూర్తులు వాళ్ళు . అదే మాకు శ్రమను నేర్పింది. మేము ఇళ్ళు కట్టినా, పెంకు కప్పినా, కుండలు చేసినా, సాఫ్ట్ వేర్ రాసినా, సర్జరీలు చేసినా అదే నిబద్దత, అదే అంకిత భావం. తప్పును తప్పని నిలదీస్తాం. ఒప్పు కాకుంటే మావాడైనా దండిస్తాం. బడులున్న ఊళ్లన్నీ రావినూతల కాలేవు. మా మెట్ట మట్టిలో, మా మంచి నీళ్లలో ఒక చైతన్యం, ఒక ఒరవడి, ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం, ఒక ఉల్లాసం,ఒక సంకల్పం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. దీనికి మా తల్లిదండ్రులు, గురువులు, నాయకులు కూడా ఒక ముఖ్య కారణం.
– రవీంద్ర బాబు పూనాటి.ప్లసెంటన్, కాలిఫోర్నియా, అమెరికా.
No comments:
Post a Comment