Friday, April 24, 2026

 దారి చూపిన మిత్రుడు    (కథ )  నారంశెట్టి ఉమామహేశ్వరరావు
వెంకటాపురంలో ఉండే  రాజు,మధు, గోపి స్నేహితులు.  ప్రక్క ఊరులోని  బడిలో తొమ్మిదో తరగతి  చదువుతున్నారు. ముగ్గురిలో రాజుకి బద్ధకం ఎక్కువ. సరిగ్గా చదవడు. మధు కూడా అంతంతమాత్రమే చదివి బడికి వస్తాడు.   వాళ్ళిద్దరూ పరీక్షల్లో బొటాబొటి మార్కులతో పాసవుతుంటారు.  


గోపి మాత్రం  చదువులో శ్రద్ధ  చూపిస్తూ ప్రజ్ఞ కనబరుస్తాడు. లోకజ్ఞానం ఎక్కువే.    వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో బహుమతులు  పొందుతుంటాడు.


 ఒకరోజు బడికి వెళుతున్నప్పుడు రాజు “ నీలాగా చదవాలని, బహుమతులు పొందాలని  మా ఇంట్లో ఒకటే విసిగిస్తున్నారు. మార్కులు తక్కువొస్తే   అదే పనిగా తిడుతున్నారు. ఈ రోజు  నిద్ర లేవడం ఆలస్యమయిందని మా నాన్న దుడ్డుకర్రతో కొట్టాడు. నాకు చదువంటే ఇష్టం  లేదు. ఇల్లు వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలని పిస్తోంది” అన్నాడు .

ప్రక్కనే ఉన్న  మధు “నా   పరిస్థితీ అంతే.  ఇంట్లో నుండి  వెళిపోతే  తిట్లు  తప్పుతాయనిపిస్తోంది” అన్నాడు.  

వాళ్ళ మాటలు విన్న గోపి  “మీ ఆలోచన  తప్పు.  మీ మీద అమ్మానాన్నలు కోప్పడేది   ప్రేమ లేక కాదు. మీ శ్రేయస్సు  కోరుతున్నారు కాబట్టే బాగుపడాలని ఆశపడుతున్నారు. చదువు మీద శ్రద్ధ పెట్టండి. అమ్మానాన్నలు  సంతోషిస్తారు. మీ భవిష్యత్తు  బాగుంటుంది” అన్నాడు .    

“నీకేం బాబూ? ఎన్నయినా చెబుతావు.
ఫస్టు మార్కులు తెచ్చుకుంటావు కాబట్టి నీకు ఇవేవీ తెలిదులే. నీలాగా  మారడం మా వల్ల కాదు” అన్నారు ఇద్దరూ.


అది జరిగిన వారం తరువాత  ముగ్గురూ  బడి  నుండి వస్తున్నప్పుడు,    పొడుగైన సర్పాన్ని   చుట్టుముట్టి కదలనివ్వకుండా చేసిన చలి చీమల్ని చూసారు  దారిలో.    అది చూడగానే గోపికి ఒక ఆలోచన   వచ్చింది.

   “ ఎంతో పెద్దదైన సర్పాన్ని కొన్ని చీమలు కలిసి ఎలా   బంధించాయో చూసారా?.  వాటి  ఐకమత్యం మీద మనం  పాఠం కూడ చదువుకున్నాం. కానీ వాటి    జీవన విధానం తెలుసుకుంటే ఆసక్తిగా ఉంటుంది. మీకు  తెలుసా? ” అనడిగాడు. 

తెలియదన్నట్టు తలూపారు మిత్రులిద్దరూ.

గోపి చెప్పడం ప్రారంభించాడు. ‘నేనొక పుస్తకంలో చదివినవే మీకు  చెబుతాను. ఆహారం ఎక్కడున్నా  వెంటనే  పసి  గడతాయి చీమలు . తీపి పదార్ధాలను ఎక్కడ , ఎలా దాచినా క్షణంలో పసిగట్టేస్తాయి. చీమలకు పరిశీలనా శక్తి ఎక్కువని తెలుస్తోంది“ అని  చెప్పాడు గోపి .

“ చీమలు ఎప్పుడూ ఒకదాని తరువాత మరొకటి వరుస పాటిస్తూ వెళతాయి.  ముందున్న చీమను అనుసరిస్తాయి కానీ రెండో వరుస మొదలు పెట్టవు.  దాన్నిబట్టి చీమలు క్రమశిక్షణ పాటిస్తాయని తెలుస్తోంది” అన్నాడు గోపి. 

 ‘అవునవును” తలూపుతూ చెప్పారు  రాజు, మధు.


“వర్షాకాలంలో ఆహారానికి   ఇబ్బంది  కలగకూడదని  ముందే  ఆహారాన్ని సేకరించి  దాచుకుంటాయి. నీటిలో వెళితే చీమలకు ప్రమాదం కదా అందుకు” అని చెప్పాడు   గోపి.  అలాగా అన్నారు మిగతా ఇద్దరు.


“అంతే కాదు. అవి వెళుతున్నప్పుడు  ఏదైనా అడ్డం వస్తే  ప్రక్కనుండి వెళతాయి తప్ప ఆగిపోవు. వెనక్కు వెళ్లవు. చీమలకు పట్టుదల ఎక్కువని తెలుస్తోంది” అని కాసేపు ఆగాడు గోపి.


 ‘ఇంకా… ‘  అని అడిగారు మిగిలిన ఇద్దరు.


“వాటి  బరువు కంటే ఎక్కువ రెట్లున్న  బరువు  పదార్ధాన్ని  సులభంగా మోసుకుపోతాయి. మరో సంగతి కూడా ఉంది… “ అని  ఆగాడు  గోపి.


“అదేంటో చెప్పు” అని ఆసక్తిగా అడిగారు వాళ్లిద్దరు.
 
“అవి సేకరించిన ఇసుక రేణువులతో  శ్రద్ధగా, ఓర్పుగా పుట్టల్ని నిర్మిస్తాయి. అనుభవజ్ఞుడైన   శిల్పి  నిర్మించినంత అందంగా కనబడతాయి పుట్టలు.   వాటి లోపల అంతస్తులున్న మేడల్లాగ  నిర్మిస్తాయి.   పుట్టలను కట్చేటప్పుడు  నిరంతరం విసుగు చెందకుండా పని చేసుకుపోతాయి. అవి విశ్రాంతి తీసుకోవడం ఎవరికీ కనబడదు”  అని ఆగాడు గోపి.  

“అన్ని మంచి లక్షణాలున్నాయా”  అని ఆశ్చర్యపోయారు   రాజు, మధు.

“అవును.  వాటి నుండి  మనం నేర్చుకోవలసిందేమిటో ఇప్పుడు మీకు  తెలిసిందా?” అనడిగాడు గోపి. 

“నువ్వే చెప్పు” అన్నారు ఇద్దరూ ఒకేసారి.  
 
అప్పుడు గోపి “ చీమలకే  అంత తెలివి , కష్టపడే తత్త్వం ఉన్నప్పుడు మనుషులమైన మనకెంత  ఉండాలి? చీమల్లో లేనిది బద్ధకం, విశ్రాంతి తీసుకునే లక్షణం. ఎవరికైనా కష్టపడి పని చేసాక కాసేపు విశ్రాంతి అవసరమే. కానీ మనకు ఎంతో నష్టం కలిగించే బద్ధకం అవసరం లేదు.  మనలాంటి విద్యార్థులకు ఉన్న ఒకే ఒక్క   పని చదువు.  ఆ పని చేయమని అమ్మానాన్నలు, గురువులు కోరుకోవడం తప్పా?.  మనకి కావాల్సినవన్నీ సమయానికి  అమరుస్తూ చదువు కోమంటున్నారు. అలాంటప్పుడు పిల్లలని  సరిదిద్దే హక్కు, బాధ్యత పెద్దలకు  ఉంటుంది. చీమల గురించి విన్న తరువాతైనా బుద్ధి తెచ్చుకోండి.  ఎవరికోసమో చదువుతున్నామని అనుకోకుండా మీ  భవిష్యత్తు కోసమని మనసుపెట్టి చదవండి. మీకు తెలియంది ఉంటే పెద్దలని  అడిగి తెలుసుకోండి. విద్యార్థిగా ఉన్నప్పుడు  కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థానం చేరుకుంటారు. అమ్మానాన్నలు తిట్టారని మరెప్పుడూ చెప్పవద్దు” అని ముగించాడు  గోపి.  


“ మా తప్పు తెలిసొచ్చింది.      బద్ధకం వదిలేసి  కష్టపడి చదువుతాం“ అని మాట ఇచ్చారు ఇద్దరూ .  


వాళ్లలో మంచి మార్పు రావాలని మనసులోనే కోరుకున్నాడు గోపి.
 
_____*****______

No comments:

Post a Comment