Friday, June 5, 2026

 ప్రేమ, మనుషుల మధ్య ఉండే సహజ లక్షణం.
కోపం మనుషులలో  ఉండే కృత్రిమ లక్షణం. దీని గురించి మరింత వరంగా తెలుసుకుందాం. 

సృష్టి, స్థితి, కారణం ప్రణయం. సృష్టి లయ కారణం ప్రళయం. ప్రణయం ప్రేమకు ప్రతీక. ప్రళయం కోపానికి ప్రతీక. చీకటి వెలుగుల లాగా ప్రేమ, కోపం రెండూకూడా, ఒక చోట వుండవు; ఉండ లేవు. ప్రేమ అనేది మానసిక ఆకర్షణ శక్తి . ద్వేషం అనేది మానసిక వికర్షణ శక్తి. మనుషుల మధ్య ప్రేమ, అనురాగాలు ఉన్నప్పుడు వారి మనసుల మధ్య మానసిక దూరం తగ్గి పోతుంది. మనుషుల మధ్య కోప ద్వేషాలు ఉన్నప్పుడు వారి మధ్య మానసిక దూరం పెరిగి పోతుంది.

ప్రేమ, మనుషుల మధ్య ఉండే సహజ లక్షణం.
కోపం మనుషులలో  ఉండే కృత్రిమ లక్షణం. 
మనం ఆత్మ అనుభవాన్ని ఆనందం ద్వారా వ్యక్తపరిచే మనదయిన, సహజ లక్షణం ప్రేమ. ఆహం భావాన్ని ద్వేషం ద్వారా వ్యక్త పరచడం కోసం, మనిషి అప్పుడప్పుడు అరువు తెచ్చి పెట్టుకునే, తనది కాని కృత్రిమ లక్షణం కోపం. 

మనిషికి తన సహజ లక్షణం ఎప్పుడు బరువు కాదు. మనకి  అరువు తెచ్చుకున్న అసహజ లక్షణాన్ని భరించడం అంత సులువు కాదు. అందుకే ప్రేమ పైనే మనకు ప్రేమ ఎక్కువ.  కోపం పైన మక్కువ  తక్కువ. మనిషి తన జీవితంలో ఎక్కువ కాలం ప్రేమతో గడుపుతాడు. అతి తక్కువ కాలం; అంటే. అప్పుడప్పుడు మాత్రమే కోపంతో గడుపుతాడు.

ప్రేమ మన సహజ లక్షణం కాబట్టే,  ప్రేమించడానికి ప్రేరణ అవసరం లేదు. ఆది మనలో అంతర్లీనంగా ఉన్న ఆత్మ యొక్క వ్యక్తీకరణ. ఎవరినైనా,దేనినైయినా ఏ కారణం లేకుండా ఎప్పుడయినా ప్రేమించవచ్చు. విశ్వమ్ లో ప్రేమకు ఏదీ అనర్హం కాదు. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని, ఆకాశాన్ని, అఘాతాన్ని, శిలను, శిల్పాన్ని, పువ్వుని, చిరు నవ్వుని దేనినైయినా, ఏ కారణం లేకుండానే ప్రేమించవచ్చు. 

కానీ కోపం ఆలా కాదు .కోపానికి కారణం కావాలి. ద్వేషానికి ప్రేరణ కావాలి. కోరిక లేకుండా కోపం రాదు .కోరిక తీరినా కోపం రాదు. కోపం రావాలంటే రెండూ జరగాలి. ఒకటి కోరిక ఉండాలి; రెండు అ కోరిక తీరకుండా ఉండాలి. అందుకే కోపానికి సరి అయిన నిర్వచనం- ‘తీరని కోరిక యొక్క వ్యక్తీకరణే కోపం’. 

కోపించినప్పుడు మనలో ఆధ్యాత్మిక శక్తి ఖర్చవుతుంది. ఆ శక్తి మన మనసుచేత,  దేహం చేత ఖర్చు చేయబడుతుంది. మనసు మన చేత పెద్దగా మాట్లాడిస్తుంది. అందుకు కారణం, కోపం మనుషుల మధ్య మానసిక దూరాన్ని పెంచుతుంది. పెరిగిన ఈ మానసిక దూరానికి మాటను చేరవేయడానికి మనిషి ఎదురుగా ఉన్నా కూడా,మనసు ఎంతో దూరంగా ఉన్నట్లు. భావించి, మన చేత పెద్దగా అరిపిస్తుంది. దేహంలో రక్త పోటు పెరుగుతుంది. గుండె కొట్టుకోవడం ఎక్కువవుతుంది. శక్తి ఖర్చు అయిపోగానే కోపం తగ్గుతుంది.ఆధ్యాత్మిక శక్తి అడుగంటుతుంది.

ప్రేమించినప్పుడు మనలో ఆధ్యాత్మిక శక్తి ఉత్పత్తి అవుతుంది. ప్రేమ మనుషుల మధ్య ఉన్న మానసిక దూరాన్ని తగ్గిస్తుంది. అందుకనే ప్రేమ ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రేమ ఆత్మనుభూతిని ఇస్తుంది. ఇంకా ముందుకెళ్లి మాట్లాడాలి అంటే, అన్నింటిని ఆకారణంగా ప్రేమించే స్థితికి మనిషి ఎదిగితే, అతడు సత్ చిత్ ఆనంద స్థితికి చేరుకున్నట్లే. ఆత్మ సాక్షాత్కారాన్ని అనుభవించినట్లే. అందుకు మనకు సహకరించేది ధ్యానం.

ఆచార్య డా అనిల్ ప్రసాద్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment