శ్రీకృష్ణరాయల వరహ పుట్టింది వరాహావతారం నుండే.
.......................................
విష్ణుమూర్తి వరాహరూపంలో భూమిని పాతాళం నుండి ఉద్ధరించినట్లే విజయనగర సామ్రాజ్యపు వరాహ నాణెం దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరిచింది.స్వచ్ఛమైన బంగారం ఖచ్చితమైన బరువు అపూర్వమైన కళాత్మకతతో ఈ నాణెం భారతదేశ సరిహద్దులను దాటి సముద్ర వాణిజ్యంలోనూ విశ్వసనీయ ద్రవ్యంగా ఖ్యాతి పొందింది. దక్షిణ భారత చరిత్రలో రాజకీయ సైనిక సాంస్కృతిక రంగాలలోనే కాకుండా ఆర్థిక వ్యవస్థ నాణేల చరిత్రలోనూ విజయనగర సామ్రాజ్యం ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించింది.
ACE 1336లో హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించిన విజయనగర సామ్రాజ్యం దాదాపు మూడు శతాబ్దాల పాటు దక్షిణ భారతదేశ ఆర్థిక జీవనాన్ని ప్రభావితం చేసింది. సంగమ సాళువ తుళువ ఆరవీడు వంశాల పాలకులు తమపాలనలో విడుదల చేసిన నాణేలు కేవలం ద్రవ్య మార్పిడి సాధనాలే కాకుండా రాజ్య వైభవానికి మత విశ్వాసాలకు కళా సంపదకు ప్రతిబింబాలుగా నిలిచాయి. ముఖ్యంగా తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర నాణేల ప్రామాణికత స్వచ్ఛత కళాత్మకత అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాయి.నేడు కూడా భారతీయ నాణేలచరిత్రలో విజయనగర నాణేలు అత్యుత్తమ కళాఖండాలుగా పరిగణించబడుతున్నాయి.
విజయనగర కాలంలో నాణేలు ప్రధానంగా బంగారం వెండి రాగితో తయారయ్యేవి. వీటిలో బంగారు నాణేలకు అత్యున్నత స్థానం ఉండేది. బంగారు నాణేలను సాధారణంగా గద్యాణం,వరాహం. విదేశీయులు తమ వర్ణనల్లో వరహాన్ని పగోడా అని పిలిచేవారు. ఒక వరాహం సుమారు 3.4 గ్రాముల బరువు కలిగి ఉండేది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇమ్మడి వరాహమనే రెండింతల బరువు గల ప్రత్యేక బంగారు నాణెం కూడా చలామణిలో ఉండేది.వీటితో పాటు అర్ధవరాహ పావువరాహ వంటి చిన్న విలువల నాణేలు కూడా ముద్రించబడ్డాయి. చిన్నచిన్న లావాదేవీల కోసం ఫణాలు తారలు కాసులు వంటి వెండి రాగినాణేలు చలామణిలోవుండేవి.
విజయనగర సామ్రాజ్యం అరేబియా పర్షియా తూర్పుఆఫ్రికా శ్రీలంక మలయా బర్మా చైనా పోర్చుగీసు వ్యాపార కేంద్రాలతో విస్తృతమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉండేది. ఈ కారణంగా విజయనగర బంగారునాణేలు భారతదేశం వెలుపల కూడా విశ్వసనీయ ద్రవ్యంగా గుర్తింపు పొందాయి.
తుంగభద్రా తీరాన వెలసిన హంపి ప్రపంచంలోని అత్యంత సంపన్న వాణిజ్యనగరాలలో ఒకటిగా పేరొందింది. విదేశీయాత్రికులైన నికోలోకాంటీ అబ్దుల్ రజాక్ డొమింగో పాయెస్ ఫెర్నావో నునీజ్ వంటి వారు తమ రచనల్లో విజయనగర బజార్ల వైభవాన్ని ప్రశంసించారు. బంగారం వజ్రాలు ముత్యాలు గుర్రాలు, పట్టు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు విలువైన రత్నాలు అక్కడ విస్తారంగా విక్రయించబడుతున్నాయని వారు నమోదు చేశారు.
విజయనగర నాణేలలో అత్యంత ప్రసిద్ధి చెందినది వరాహం. విష్ణుమూర్తి వరాహావతారం నుండి ఈ నాణెం తన పేరును పొందింది. అయితే విదేశీ వ్యాపారులు దీనిని పగోడా అని పిలిచేవారు. దక్షిణ భారత దేవాలయాలను కూడా వారు పగోడాలుఅని పిలిచినందున ఈ పేరు నాణేలకూ వ్యాపించింది. ఈ బంగారునాణేలపై వరాహావతారం శ్రీమహాలక్ష్మి బాలకృష్ణుడు వెంకటేశ్వరస్వామి గరుడుడు హనుమంతుడు వంటి దైవిక రూపాలు అద్భుతమైన నైపుణ్యంతో ముద్రించబడ్డాయి. కొన్నింటిపై శంఖం, చక్రం విల్లు పుష్పాలంకారాలు కనిపిస్తాయి. మరికొన్ని నాణలపై శ్రీ విరూపాక్ష,శ్రీ ప్రతాపకృష్ణరాయ,శ్రీ వెంకటేశ్వర వంటి శాసనాలు కనిపించడం విశేషం. ఈ నాణేలు విజయనగర రాజులు తమను హిందూ ధర్మ పరిరక్షకులుగా భావించిన దానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి.
శ్రీకృష్ణదేవరాయల పాలనలో విజయనగర నాణేల కళాత్మకత శిఖరాగ్రాన్ని చేరుకుంది. ఉదయగిరి విజయానంతరం అక్కడి బాలకృష్ణ విగ్రహాన్ని హంపికి తీసుకువచ్చి ప్రత్యేక దేవాలయాన్ని నిర్మించిన సందర్భంగా బాలకృష్ణుడి ప్రతిమతో ప్రత్యేక బంగారు నాణేలు ముద్రించబడినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ నాణేలు నేడు ప్రపంచంలోని అనేక మ్యూజియంలలో సంరక్షించబడుతున్నాయి. భారతీయ న్యూమిస్మాటిక్స్ చరిత్రలో ఇవి అత్యంత విలువైన నాణేలుగా గుర్తించబడ్డాయి. కృష్ణదేవరాయల అనంతరం అచ్యుతదేవరాయలు సదాశివరాయలు ఆరవీడు వంశ పాలకుల కాలంలోనూ వరాహ నాణేలు కొనసాగినా కళాత్మకతలో కొంత మార్పు చోటుచేసుకుంది.
విజయనగర నాణేలపై నాగరి కన్నడ తెలుగు ప్రభావం కలిగిన లిపులు కనిపిస్తాయి.ఇవి సామ్రాజ్యపు భాషా వైవిధ్యాన్ని పరిపాలనా విస్తృతిని ప్రతిబింబిస్తాయి. నాణేలు తయారు చేయడానికి ప్రత్యేక టంకశాలలు ఉండేవి. హంపితో పాటు పెనుగొండ చంద్రగిరి తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా టంకశాలలు పనిచేసినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.ఈ టంకశాలల్లో పనిచేసిన ముద్రాపకులు అత్యంత సూక్ష్మమైన కళానైపుణ్యంతో దేవతా చిత్రాలను చెక్కేవారు.
విజయనగర ఆర్థిక వ్యవస్థలో గుర్రాల దిగుమతి వ్యాపారం అత్యంత కీలకమైనది. అరేబియా పర్షియా ప్రాంతాల నుండి దిగుమతి చేసుకున్న యుద్ధగుర్రాలకు బదులుగా విజయనగర రాజులు భారీ మొత్తంలో బంగారు వరాహాలను చెల్లించేవారు. ఇది విజయనగర బంగారు నాణేల అంతర్జాతీయ విలువను తెలియజేస్తుంది. పోర్చుగీసు వ్యాపారులు విజయనగర వరాహాలను స్వచ్ఛమైన బంగారంతో తయారైన విశ్వసనీయ నాణేలుగా ప్రశంసించారు.
నేటికీ హంపి శిథిలాల్లో పురావస్తు తవ్వకాలలో భారతదేశంలోని మరియు విదేశాల్లోని మ్యూజియంలలో లభిస్తున్న విజయనగర నాణేలు ఆ మహాసామ్రాజ్య వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అవి కేవలం లోహపు ముక్కలు మాత్రమే కాదు దక్షిణ భారతదేశ రాజకీయశక్తి ఆర్థిక స్థిరత్వం కళాత్మక సౌందర్యం భక్తి సంప్రదాయం అంతర్జాతీయ వాణిజ్య ప్రభావాన్ని ప్రతిబింబించే అమూల్య చారిత్రక పత్రాలు.ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల వరాహం దక్షిణ భారత స్వర్ణయుగానికి ప్రతీకగా నిలిచి, నేటికీ చరిత్రాభిమానులనునాణేల పరిశోధకులను సమానంగా ఆకర్షిస్తోంది. నాణేలను
నాణ్యాలు అని పలుకరాదు వ్రాయరాదు. నాణెములని పలుకవచ్చు వ్రాయవచ్చు.
॥సేకరణ॥
.................. జిబి విశ్వనాథ
9441245857
అనంతపురం.
No comments:
Post a Comment