.ఎంత బంగారమో ! ఎన్ని ఆభరణాలో !
.........................................
తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా లాల్గుడి తాలూకాలో గల తిణ్ణకుళం (Tiṇṇakulam) గ్రామంలోని తిరునెర్కున్రనాథర్ ఆలయ గోడలపై చెక్కబడిన చోళయుగపు శాసనం దేవాలయ వైభవాన్ని భక్తి సంప్రదాయాన్ని ఆలయఆర్థిక నిర్వహణను అర్థం చేసుకోవడానికి అత్యంత విలువైన చారిత్రక ఆధారంగావుంది. తమిళభాషలో తమిళలిపిలో చెక్కబడిన ఈ శాసనం చోళ చక్రవర్తి విక్రమచోళుని 14 వ సింహాస నసంవత్సరానికి చెందినది.అంటే విక్రమచోళుడు సింహాసమెక్కిన 14 సంవత్సరాల తరువాత అన్న మాట. అందువల్ల శాసనకాలం 1132 (ACE) గా నిర్ధారించబడింది.
శాసనం కొంత భాగం దెబ్బతిన్నప్పటికీ
అందులో నమోదైన ముఖ్య సమాచారం స్పష్టంగా వుంది. మదురాంతక చతుర్వేదిమంగళం అనే బ్రహ్మదేయ గ్రామంలోని వంగిపురానికి చెందిన పరంపొరుళ్ భట్టర్ కుమారుడు పరమేశ్వరన్ అనే భక్తుడు, తిరునెర్కున్రం గ్రామంలోని మహాదేవర్ అంటే శివుడి, నాచ్చియార్ లేదా పిరాట్టియార్ అంటే పార్వతీదేవి విగ్రహాల అలంకరణ కోసం బంగారు ఆభరణాలను సమర్పించినట్లు ఈ శాసనం తెలియజేస్తుంది.
దేవతల కోసం సమర్పించిన ఆభరణాల జాబితా ఎంతో విశిష్టంగా ఉంది. తమిళ ఆలయ సంప్రదాయంలో ప్రతి పవిత్ర వస్తువుకు ముందు “తిరు” అనే గౌరవసూచక ఉపసర్గను చేర్చడం ఆనవాయితీ. ఈ పదానికి పవిత్రమైనది దివ్యమైనది శ్రీకరమైనదనే అర్థాలున్నాయి. అందువల్ల దేవతలకు సమర్పించిన ప్రతి ఆభరణం పేరు ముందు తిరు అనే పదం ఉపయోగించబడింది.
శాసనంలో పేర్కొన్న ఆభరణాలలో ఒక తిరుచూట్టు (కిరీటబంధం) ఒక తిరుచడై (జటాజూట అలంకారం) రెండు తిరుతోడు (చెవికమ్మలు) ఒక తిరుఆరం (మెడహారం) రెండు తిరుకైకట్టై (చేతి కంకణాలు) ఒక తిరువాళ్కట్టై (నడుము పట్టీ) రెండు తిరుచిలంబు (పాదగజ్జెలు) ఒక సెంగలనిరు (ప్రత్యేక హారం) ఒక తిరుతోడై అడై (ఉరు అలంకారం అంటే తొడలదగ్గర ) అలాగే ఒక తిరుపిరై (నెలవంక ఆకార ఆభరణం) ఉన్నాయి.
ఈ ఆభరణాలలో కొన్ని శివుని ఆధ్యాత్మిక స్వరూపాన్ని ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా తిరుపిరై అనే నెలవంక ఆకార ఆభరణం శివుని జటాజూటంలో అలంకరించే చంద్రకళకు సంకేతం. తిరుచడై అనే జటాభరణం గంగాధరుడైన శివుని తపోమూర్తి రూపాన్ని గుర్తు చేస్తుంది. అదే సమయంలో నాచ్చియార్ (పార్వతీ దేవి) కోసం సమర్పించిన హారాలు కంకణాలు నడుము పట్టీలు పాదాభరణాలు ఆమెను జగజ్జనని మాత్రమే కాకుండా దివ్యరాజ్ఞిగా భావించిన ఆలయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి.
ఈ ఆభరణాల తయారీ కోసం మొత్తం 120 కళంజులు 9 మంజాడిల బంగారం వినియోగించబడినట్లు శాసనం పేర్కొంటుంది. చోళ యుగంలో కళంజు బంగారం కొలిచే ప్రామాణిక బరువు ప్రమాణం. ఒక కళంజు సుమారు 4.2 నుండి 4.4 గ్రాముల మధ్య బరువు కలిగి ఉండేదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన శాసనంలో పేర్కొన్న బంగారం మొత్తం సుమారు అర కిలోగ్రాముకు పైగా ఉంటుంది. మంజాడి అనే చిన్న కొలతా ప్రమాణం కళంజుకు ఉపవిభాగంగా ఉపయోగించబడేది. ఈ బరువు ప్రమాణాలు చోళుల కాలంలో బంగారం, వెండి రత్నాలు వంటి విలువైన వస్తువుల లావాదేవీలలో విస్తృతంగా ఉపయోగించబడ్డాయి.
ఈ దానం చేసిన బంగారాన్ని గ్రామ దేవాలయానికి చెందిన పెరుందట్టాన్ అంటే ప్రధాన స్వర్ణకారుడికి అప్పగించినట్లు శాసనం తెలియజేస్తుంది. దీనివల్ల ఆలయాల్లో ప్రత్యేక స్వర్ణకారులు ఉండేవారని వారు దేవతల ఆభరణాల తయారీ మరమ్మత్తు సంరక్షణ బాధ్యతలను నిర్వహించేవారని తెలుస్తుంది. ఇది చోళుల కాలంలో దేవాలయాలు ఎంత సుసంఘటితమైన పరిపాలనా వ్యవస్థతో పనిచేశాయో తెలియజేసే ముఖ్యమైన ఆధారం.
చోళ యుగంలో దేవాలయాలు కేవలం పూజా కేంద్రాలు మాత్రమే కాదు. అవి ఆర్థిక విద్యా సాంస్కృతిక కళాత్మక కార్యకలాపాలకు కేంద్రబిందువులుగా నిలిచాయి. భూములు బంగారం పశువులు దీపారాధనకు నిధులు ఆభరణాలు వంటి దానాలను శాసనాల రూపంలో నమోదు చేయడం ద్వారా ఆలయ ఆస్తులపై శాశ్వత హక్కును కలిగించేవారు. అందువల్ల శాసనాలు ఒక విధంగా నేటి రిజిస్ట్రేషన్ పత్రాల పాత్రను కూడా పోషించాయి.
ఈ 1132 ACE కాలంనాటి శాసనం ద్వారా చోళుల కాలపు భక్తి సంప్రదాయం దేవతావిగ్రహాల అలంకరణ విధానం, బంగారం కొలతల వ్యవస్థ స్వర్ణకారుల నైపుణ్యం బ్రహ్మదేయ గ్రామాల పాత్ర అలాగే ఆలయాల ఆర్థిక నిర్వహణ గురించి విలువైన సమాచారం లభిస్తుంది. అందుచేత ఇది కేవలం ఒక దానశాసనం మాత్రమే కాకుండా చోళసామ్రాజ్యపు సామాజిక ఆర్థిక సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించే అమూల్య చారిత్రక పత్రంగా నిలిచింది.
...Dr.Munirathnam Reddy, Director of Epigraphy Government of India.
//అనువాదం & అదనపు సమాచారం//
.............జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.
No comments:
Post a Comment