Friday, June 5, 2026

 ఆనందం ఎక్కడ ఉంది ఎలా వస్తుంది.

సముద్ర గర్భం నుంచి ఒక నీటి చుక్క  జన్మతీసుకొని బయట పడింది. .ఆది ఆకాశంలోకి ఎదిగి , మేఘంగా మారి ,వర్షంగా కురిసి, జలపాతంగా దిగి, నదిగా సాగి తిరిగి సముద్రాన్ని చేరుకుంది.

భూగర్భం నుంచి ఒక విత్తనం భూమి పొరలను చీల్చుకొని మొలకగా జన్మించింది. ఆది మొక్కై,, మానై, పువ్వ్వై పిందై, కాయై, పండై, విత్తనమై తిరిగి భూమిని చేరుకుంది.

నీటి చుక్కలాగా, చెట్టు విత్తనం లాగా మనం కూడా తల్లి గర్భం నుంచి జన్మ తీసుకుంటాం. బయట ప్రపంచంలో ఆనందం ఉందని, దాన్ని అందుకోవాలని నేల విడిచి సాము చేస్తాం. పిల్లలుగా ఉన్నప్పుడు పెద్దయితే అమ్మానాన్నల నుంచి దూరంగా వెళ్లి ఆనందంగా ఉంటామనుకుంటాం.. పెద్దయ్యిన తరువాత ఉద్యోగం వస్తే వచ్చిన జీతంతో జీవితాన్ని ఆనందంగా అనుభవించ వచ్చు అనుకుంటాం. ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లి చేసుకుంటే ఆనందాన్ని రుచి చూడొచ్చు అనుకుంటాం. పెళ్లి తరువాత బొమ్మరిల్లు లాంటి  ఒక ఇల్లు కట్టి చూస్తే అనందం అందులో పొందుతామనుకుంటాం. ఇల్లు కట్టిన తరువాత కంటి పాపలు లాంటి ఇద్దరు పిల్లలు పుడితే ఆనందంగా ఉంటుందనుకుంటాం. పిల్లలు పుడుతారు. ఇంతటితో మన మొదటి జీవిత చక్రం పూర్తి అవుతుంది. ఇప్పటి దాక జీవితంలో ఆనందాన్ని నీకు నీవే అనుభవించావ్. అందుకని దీన్ని ప్రత్యక్షానుభూతి అంటాం.

పిల్లల పెంపకంతో మన రెండవ జీవిత చక్రం ప్రారంభమవుతుంది.  ఇప్పుడు పిల్లలను ఆధారం చేసుకుని మళ్ళీ రెండో సారి అదే ప్రయాణాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం. వారూ పెద్దవారు అవుతుంటే మురిసి పోతూ, ఉద్యోగం చేస్తుంటే సంతోషిస్తూ, పెళ్లిళ్లు చేసుకుంటే పొంగి పోతూ, ఇల్లు కట్టుకుంటే ఆనందిస్తూ, వారూ ఇద్దరు పిల్లలను కంటే ఆది చూసి తాతనాయ్యానని  తెగ సంబరపడి పోతాం. దీనితో రెండవ జీవిత చక్రం పూర్తవుతుంది. రెండవ జీవిత చక్రంలో పిల్లల ద్వారా నీవుఆనందాన్ని  అనుభవించావ్. అందుకని దీన్ని పరోక్షనుభూతి అంటాం.

మొదటి జీవిత చక్రం మనం పిల్లలుగా వున్నపుడు ప్రారంభమయ్యింది. రెండవ జీవిత చక్రం మన పిల్లలతో ప్రారంభమయ్యింది. మూడవ జీవిత చక్రం మనవళ్ళతో ప్రారంభమవుతుంది . మొదటి చక్రం పూర్తి అయ్యేసరికి మూడు పదులు దాటతాయి. రెండో చక్రం పూర్తి అయ్యేసరికి ఆరు పదులు దాటతాయి. అంటే రెండో చక్రం పూర్తి అయ్యే సమయానికి, మనకి రెండు వంతుల జీవితం అయిపోతుంది. 

మళ్ళీ మనవళ్ళతో ప్రారంభమయిన మూడవ చక్రం, 
వాళ్ళు పెద్ద వాళ్ళు అవుతుంటే మురిసి పోవడం, వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే సంతోషించడం, వాళ్ళు పెళ్లిళ్లు చేసుకుంటే పొంగి పోవడం, వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటే ఆనందించడం, వారూ పిల్లలను కంటే ముత్తాత అయ్యానని మరింత సంబర పడిపోవడంతో ముగుస్తుంది. తిరిగిన చోటే తిరుగుతూ జీవితం రంగుల రాట్నంగా మారిపోతుంది. పుట్టింది ఎందుకో తెలియకుండానే మూడవ చక్రం కూడా పూర్తయ్యి జీవితం ముగింపు దశకు వస్తుంది . మూడవ జీవిత చక్రంలో పిల్లల ద్వారా రెండవ సరి నీవుఆనందాన్ని  అనుభవించావ్. అందుకని దీన్ని ద్విపరోక్షనుభూతి అంటాం.

మూడవ చక్రంలో ముసలితనం మెల్ల మెల్లగా చాప కింద నీరు లాగా నీకు చేరువవుతుంది. బంధాలలో  ఆనందాన్ని చూసి ఆనందించడానికి అలవాటు పడిన నీకు,  నీ చుట్టూ ఎవరూ కనిపించరు. ఒంటరి తనం నీ వెంట పడుతుంది. మనసు భారంగా మారుతుంది. అనుభవించిన సంతోషమంతా ఏమైందని మనసును ప్రశ్నిస్తే “అది నీ బయట నుంచి పొందిందే కానీ,నీ లోపల నుంచి వచ్చింది కాదనే“ సమాధానం వస్తుంది. మరణం దగ్గర పడుతుంది. మళ్ళీ జన్మ లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అప్పటికి సమయం మించిపోతుంది. జీవితాంతం బహు విధ భవ బంధాలలో గడిపి, జీవితం అంతంలో జన్మ రాహిత్యం కావాలంటే విశ్వ ధర్మం ఒప్పుకోదు. మళ్ళీ జన్మ తప్పని సరి అవుతుంది. నీటి చుక్క లాగా,చెట్టు విత్తనం లాగా మళ్ళీ పుట్ట వలసి వస్తుంది.

అందుకే నేస్తం! దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. 
పొయ్యిలో విశ్వ సెగ ఉండగానే ఆధ్యాత్మిక భావాలను వండి వార్చాలి. ప్రాణముండగానే పుట్టిన కారణాన్ని పట్టుకోవాలి. కనీసం మూడవ చక్రం ప్రయాణంలోనైనా మానవ జన్మ పరమార్ధాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు నీవు పొందే అనుభూతి ఆపరోక్షానుభూతి. అందుకు సహాయ పడేవి ఆధ్యాత్మిక జ్ఞానం,ధ్యానం.

ఆచార్య డా అనిల్ ప్రసాద్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment