Wednesday, October 6, 2021

దివ్యజీవనం అంటే ఏమిటి?

దివ్యజీవనం అంటే ఏమిటి?
ఈ ప్రశ్నకు రకరకాలైన సమాధానాలు, వ్యాఖ్యానాలు, అర్థాలు చెబుతారు. సరైన అవగాహన కొరవడటం వల్ల ఒక్కొక్కప్పుడు పెడార్థాలకు, అపార్థాలకు, అనర్థాలకు దారితీయటం కద్ధు.

దివ్య అనే పదానికి చాలా అర్థాలున్నాయి. జ్ఞానం, అతీంద్రియశక్తి, ఆకాశం, సత్యం, శ్రేష్ఠం, ఆశ్చర్యకరమైంది... ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్ఛు గొప్పగా బతకడం, అంటే భవ్యజీవితమే దివ్య జీవితం అనుకుని చాలామంది గొప్పలకుపోయి, అప్పులపాలై, నానాతిప్పలకు గురై, చివరికి పశ్చాత్తాపంతో కుంగి కృశించి నశించిన సంఘటనలు ఉన్నాయి.
ఈ ప్రపంచానికి దూరంగా అడవుల్లోనో, కొండగుహల్లోనో, ఒంటరిగా, ఏకాంతంగా, బతకడమే దివ్య జీవనమని మరికొందరి అభిప్రాయం. మూడోరకం మనుషులు, చనిపోయాక స్వర్గంలో అనుభవించే సుఖభోగాలని అనుకుంటారు. వాటికోసం పరితపిస్తూ ప్రస్తుతాన్ని కర్తవ్యాన్ని బాధ్యతలను, పక్కనపెట్టి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటివారు సమాజానికి, ప్రపంచానికి ప్రమాదకరంగా తయారవుతారు. మతం అనే మత్తుమందుకు బానిసలై చివరికి తమ వినాశనాన్ని తామే కోరి తెచ్చుకుంటారు.

ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. ఈ మతాలు మానవ సమాజాన్ని ఉద్ధరించాలన్న ఉద్దేశంతో, కొందరు ప్రవక్తలు బహుళ ప్రచారాలు చేపట్టారు. వ్యక్తి ఎదుగుదల, సమాజ సంక్షేమం రెండూ మతానికి మూల స్తంభాల వంటివి. వ్యక్తి నైతికవిలువలు పాటిస్తూ సుఖజీవనం సాగించాలి. తనలాగా మిగతావారూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి. సభ్యులందరూ బాగుంటే సమాజమూ బాగుంటుంది. అలా ఉండాలంటే, మనుషుల్లో దైవంపట్ల భక్తివిశ్వాసాలు కలగాలి. తనను కాపాడే దివ్యశక్తి ఒకటి ఉన్నదని, అది కనిపెడుతూ ఉంటుందని, హద్దుమీరి ప్రవర్తించవద్దని దాదాపు మతాలన్నీ బోధిస్తాయి.

మానవమాత్రుడై ఈ భూమిపైన పుట్టాక, ప్రకృతి ప్రభావానికి లోనుకాక తప్పదు. అహంకార మమకారాలకు మూలకారణాలైన రాగద్వేషాలకు గురికాక తప్పదు. మృగదశలోని ఆదిమానవుడు క్రమేణా బుద్ధిబలంతో మానవుడయ్యాడని శాస్త్రజ్ఞులు రుజువుచేశారు. ఆ మానవుడే దివ్యమానవుడిగా ఎదిగే అవకాశం ఉన్నదని యోగజ్ఞులు ప్రవచించారు. ప్రయోగాలు, ప్రవచనాలు, మానవ సమాజపు ప్రగతి రథచక్రాలు. మృగత్వం, దివ్యత్వం, మానవత్వానికి కుడి ఎడమల్లాంటివి. పరిస్థితులను బట్టి, పరిసరాలను బట్టి మనిషి పశువులా ప్రవర్తిస్తాడు. తన తప్పు తెలుసుకుని ఇకపైన అలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేయడానికే గురువులు, ప్రవక్తలు ఉన్నారు. వారి బోధనలతోపాటు స్వయంగా ఆలోచించగల మేధాశక్తి మనిషికి ఉంది. ఒకనాటి మహాపాపాత్ముడు ఒకరోజు మహాత్ముడుగా మారిపోవడానికి గురుకృప, ఆత్మవిమర్శ... రెండూ అవసరమే.

బుద్ధుడి నీడలో అంగుళీమాలుడు పరివర్తన చెందాడు. ఆదికవి వాల్మీకి నారదుడి బోధవల్ల వేటవృత్తికి దూరమై మహర్షి కాగలిగాడు. వైజ్ఞానిక జీవపరిణామ క్రమానికి ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్నట్లే- దివ్య జీవనానికి భవ్యజీవన విధానం ఒక వాహికలా ఉపయోగపడాలి. జ్ఞాన వైరాగ్యాలకు జీవితం ఒక అడ్డుగోడ అనుకోవడం పొరపాటు. జీవిత పరమార్థం జీవితం నుంచే పొందాలి. ప్రపంచ పాఠశాలలో అనుభవాలు పాఠాలు. దివ్య జీవనానికి అవి భవ్యసోపానాలు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం- ఈ నాలుగూ ఆశ్రమధర్మాలు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని ఆదుకుంటుంది. కష్టసుఖాలు అనుభవించి, అవి ప్రచ్ఛన్నవరాలని తెలుసుకున్నప్పుడే నిజమైన వైరాగ్యం కలుగుతుంది. అజ్ఞానపుచీకటి తొలగి జ్ఞానోదయం అవుతుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment