Sunday, March 13, 2022

నేటి జీవిత సత్యం. *వాక్చాతుర్యం*

నేటి జీవిత సత్యం. వాక్చాతుర్యం

అంతర్యామి మనిషికి బుద్ధి, మనసు, మాట అనే అమూల్య వరాలు ప్రసాదించాడు. బుద్ధి చెప్పినట్లు మనసు వినాలి. మనసు చెప్పినట్లు మాట బయటికి రావాలి. అనాలోచితంగా వచ్చేమాట పలు సందర్భాల్లో ప్రమాదం తెచ్చిపెడుతుంది. నేర్పుతో, ఓర్పుతో,లౌక్యంగా, ఇతరుల మనసును నొప్పించకుండా, సంతోషపరచేలా మాట్లాడటమే వాక్చాతుర్యం. మనిషికి మాటను మించిన ఆభరణమే లేదన్నాడు భర్తృహరి. మాట సందర్భోచితమై ఉండాలి. 'ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడు' అన్నాడు సుమతీ శతక కర్త. ఇతరులు ఏది మాట్లాడితే మనం బాధపడతామో, అది మాట్లాడి వాళ్ల మనసును బాధపెట్టవద్దు. మనసు ప్రశాంతంగా ఉండాలి. చతుర భాషణంతో మాత్రమే ఎవరినైనా ఆకట్టుకోవచ్చు. ఎదుటివారిని తరచుగా పేరుపెట్టి సంబోధిస్తుంటే వారుఆనందపరవశులవుతారు. వారి అభిరుచి, ఆసక్తి,అలవాటు, సంస్కృతి, సంప్రదాయం, ఆలోచనా విధానం అన్నీ తెలుసుకొని, అవగాహనతో మాట్లాడగలిగేవాడే
వాక్చాతుర్యం గలవాడు. 'విస్సన్న చెప్పిందే వేదం' అనేమొండి ఆలోచనతో చేసే సంభాషణం అపఖ్యాతితెచ్చిపెడుతుందిఒకవేళ ఎదుటివారు చెబుతోందిదోషపూరితమైంది అయినా అసత్యమైనా- ఓ వంక మొదట వినయంగా అంగీకరిస్తూనే, సాత్వికంగా దాన్ని మృదుమధుర వచనాలతో సవరించే ప్రయత్నం చేయడం సముచితం. తర్క వితర్కాలలోకి దిగకూడదు. మన భాషణంలో చమత్కారం ఉండాలి. రసజ్ఞత ఉండాలి. కపటంలేని లౌక్యం, సంస్కారం ఉట్టిపడాలి. సాటివారి అభిమానం, ఆదరణ పొందాలంటే ముందు వారిని అభిమానించి, ప్రసన్నవదనుల్ని చేయాలి. ప్రశంస అనేది ఎదుటివారిని కట్టిపడేస్తుంది. అయితే అది సందర్భశుద్ధి కలిగి ఉండాలి. మితంగా ఉండాలి. శ్రుతిమించితే అపార్థాలకు, అనుమానాలకు దారితీస్తుంది. పొగడ్త అనేది ఎవరికైనా ఇష్టమే. మన అవసరార్థం, అకారణంగా పొగడుతూ మాట్లాడే మాటలు వెగటు పుట్టిస్తాయి. ప్రశంస అనేది సహేతుకమై
అభినందనపూర్వకంగా ఉంటే ఇరువురికీ సంతోషం కలిగిస్తుంది. ఎదుటివాడు పొగిడినప్పుడు అది మీ అభిమానం అంటూ మరచిపోవడం కూడా సంస్కారమే. అది అహంకారానికి మూలం కాకూడదు. ఎదుటివారు
కోపగించుకున్నా, ఆవేశంలో ఉన్నా, మనం బదులు చెబుతూ వాదించకుండా ఉండటమే శ్రేయస్కరం. 'వాక్చాతుర్యానికి మౌనమే తొలి సోపానం' అని ఉపనిషత్ కథనం. పట్టు విడుపులు లేని విశ్వామిత్రుడు క్రోధవివశుడై వాక్కును, తపఃఫలాన్ని ఎంతగా వ్యర్థం చేసుకున్నాడో తెలిసిందే! పెదాలనుంచి వచ్చే మాటకన్నా పెదాలపై ప్రథమంగా మెరిసే మందహాసం గొప్పది.
ఎదుటివారినుంచి 'అవును, నిజమే' అనే జవాబులు వచ్చేలా ప్రశ్నలు వేయడం వాక్చాతుర్యానికి ఉండవలసిన ప్రధాన లక్షణం. తమ వాక్చాతుర్యంతో మూర్ఖులు, అజ్ఞానులైన విద్యార్థులనెందరినో దారికి తెచ్చిన గురువులు అనేకమంది ఉన్నారు. పాండితీప్రకర్షతో ఒక శ్లోకం వల్లించే దానికన్నా దాని తాత్పర్యం సామాన్యులకు
సైతం మధుర వచనాలతో సరళంగా, అర్థమయ్యేలా
చెప్పడమూవాక్చాతుర్యమేవాక్కులోఅహంకారం,ఆడంబరత్వం, అవహేళన అధికార దర్పం లేకపోతే- అదిఆహ్లాదకరంగానే ఉంటుంది.
‘సజ్జనుండు పల్కు చల్లగాను' అన్న వేమన పలుకుల్లోఅద్భుతమైన సందేశం అందుతుంది మనకు.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment