Wednesday, June 15, 2022

చక్కని కథ. మంత్రిగారి ప్రవర్తన

 చక్కని కథ. మంత్రిగారి ప్రవర్తన  


విదర్భ   దేశపు మంత్రి ముకుందుడు వృద్ధుడు కావడంతో,  బాధ్యతల నుండి తప్పుకుంటానని, తన కొడుకు  శోభితుడుకి ఆ పదవినిమ్మని  మహారాజుని కోరాడు. 

అలా కాకుండా  పోటీలు నిర్వహిద్దామని,  ప్రతిభ ఆధారంగా ఎంపిక చేద్దామన్నాడు రాజు. శోభితుడిని కూడా పోటీల్లో పాల్గొనమన్నాడు.   


 మంత్రి పదవికి జరిపిన ఎంపిక పరీక్షల్లో శోభితుడు, సైన్యాధిపతి కుమారుడు వరుణుడు  సహా యువకులెందరో  పాల్గొన్నారు. వాళ్లందరిలో   రైతు కుమారుడు  విజయుడు అసాధారణ ప్రతిభ చూపించి పదవికి ఎంపికయ్యాడు. 


ఆరుమాసాల శిక్షణ తరువాతనే విజయుడికి  పదవీ బాధ్యతలనిద్దామని, అంతవరకు శిక్షణనిమ్మని ముకుందుడికి  చెప్పాడు రాజు. మంత్రిగారి నివాసం ప్రక్కనే ఉన్న వసతిగృహాన్ని విజయుడికిమన్నాడు రాజు. ‘అవన్నీ నేను చూసుకుంటానని’ రాజుగారితో చెప్పాడు మంత్రి.   


 భటుల నివాస గృహాల మధ్యన ఉన్న పాడుబడిన  ఇంటిని విజయుడికి కేటాయించాడు మంత్రి.  ఒక చాప, బొంత, పరిమితమైన వంట సామగ్రి మాత్రమే  ఉన్నాయక్కడ. రాజుగారు చెప్పింది పెడచెవిన పెట్టేసి అలంటి ఇంటిలో ఉండమన్నందుకు  బాధపడ్డాడు విజయుడు.    


ఆ రాత్రి పడుకోబోయే ముందు ఒక భటుడు  ‘ఉదయాన్నే పదిహేను క్రోసుల  దూరంలోని రాజవరం గ్రామానికి తనిఖీల కోసం వెళ్లాలని, మంత్రిగారు బయల్దేర మన్నారని’ విజయుడితో చెప్పాడు.  తొందరగా లేచి మంత్రిగారి నివాసానికి వెళ్ళాడు విజయుడు. అప్పటికే ఆయన వెళ్ళిపోయినట్టు, రెండు రోజుల తరువాత తిరిగొస్తారని వాళ్ళింట్లో చెప్పారు. 


“కాబోయే మంత్రిని తనతో బాటు గుర్రపు బగ్గీలో తీసుకెళ్లొచ్చు కదా. ఎందుకిలా చేసాడు? ఇప్పుడెలా వెళ్ళాలని” బాధపడ్డాడు విజయుడు.  


కొంత దూరం కాలినడకన , ఇంకొంత  దూరం ఎడ్లబండి మీద ప్రయాణించి ఎలాగో వూరు చేరుకున్నాడు.  విజయుడిని చూసి కూడా చూడనట్టే ప్రవర్తించాడు మంత్రి.  పరిచయమేదీ  చెయ్యకుండా సాధారణ పౌరుడిలాగా నిలబెట్టాడు.  అదంతా అవమానంగా భావించాడు విజయుడు.  


పదిరోజుల తరువాత ఆనకట్ట నిర్మాణపు పనులు పర్యవేక్షణకు వెళదామని చెప్పాడు మంత్రి. విజయుడు వెళ్ళేసరికే  వెళ్ళిపోయాడాయన. ఎంతో కష్టపడి ఆయన  చెప్పిన చోటుకి వెళ్ళాడు విజయుడు. అక్కడా విజయుడెవరో తెలియనట్టే ప్రవర్తించాడు మంత్రి. 

మధ్యాహ్న భోజన ఏర్పాట్లప్పుడు కూడా తనకొక్కడికే  చెయ్యమన్నాడు మంత్రి.  పూటకూళ్ళ ఇల్లు వెతుక్కుని భోంచేసి వచ్చాడు  విజయుడు.  

ఇంకొన్ని రోజుల  తరువాత మరో గ్రామంలో కొట్లాటలవుతున్నాయని, వాటిని   పరిష్కరించి రమ్మని విజయుడితో చెప్పాడు మంత్రి. భటుల సాయం కావాలని  అడిగిన   విజయుడితో  “నువ్వెళుతున్నది యుద్ధానికి కాదు. కొట్లాట పరిష్కారానికి..  భటులెందుకని ’ అన్నాడాయన.  ఆ వూళ్ళోకెళ్లి తనని పరిచయం చేసుకుని సమస్యను పరిష్కరించాడు విజయుడు. ’ ప్రక్కన ఓ భటుడున్నా బాగుండేది. తనని  పరిచయం చేసేవాడు’    అనుకున్నాడు మనసులో. 


మొత్తానికి విజయుడి ఆరునెలల శిక్షణ కష్టంగా పూర్తయింది. ఆయన  కొడుక్కివ్వాల్సిన పదవిలోకి వచ్చినందుకు  కోపంతోనే మంత్రిగారు అలా ప్రవర్తించారని అనుకున్నాడు విజయుడు. 


పదిరోజుల్లో  మంత్రి బాధ్యతలు  అప్పగిస్తారనగా విజయుడి పట్ల  మంత్రి గారిలో మార్పు వచ్చింది. కాబోయే మంత్రి అని పరిచయాలు చేయడం, తన ప్రక్కనే ఆసనం వేయించి  గౌరవించడం, గుర్రపు బగ్గీలో ప్రక్కనే స్థానమివ్వడం,  విందు భోజనాల్లో సమాన స్థాయి కల్పించడం.. వగైరా చాలా చేసాడు. తనలోని  కోపాన్ని తగ్గించి మంచి చేసుకోడానికే ఇదంతా చేస్తున్నాడని అనుకున్నాడు విజయుడు. 


విజయుడికి బాధ్యతలు అప్పగించే రోజు ఉదయం విజయుడితో ఏకాంతంగా మాట్లాడాడు మంత్రి ముకుందుడు.

 “ శిక్షణా కాలంలో  నిన్ను కావాలనే  దూరంగా వుంచాను. అందుకు ఎంతో బాధ పడేవాణ్ణి.  కానీ తప్పలేదు. నువ్వు పని నేర్చుకోవాలంటే కష్టాలు తప్పవు. నా ప్రక్కనే   గుర్రపు బగ్గీలో నిన్ను త్రిప్పుతుంటే  నిన్ను కూడా మంత్రి లాగానే చూస్తారు పౌరులు.  మనస్సు విప్పి ఏమీ చెప్పుకోలేరు. అందుకే మంత్రిగా కాకుండా సామాన్యుడులాగానే వారితో  తిరిగేలా చేశాను. ప్రజలతో  కలవాలని, జరుగుతున్నవన్నీ తెలుసుకోవాలని, క్రింది వాళ్ళ  మంచి చెడులు, కష్టసుఖాలు స్వయంగా చూసి , అనుభవించి విషయాలను  నువ్వర్ధం చేసుకోవాలనే ఇదంతా చేశాను. భటుల నివాసగృహంలో ఉంచడానికి కారణమూ  అదే.  ఇప్పుడు నీకొచ్చిన అనుభవం పదవిలో ఉండగా  పదేళ్లకు కూడా రాదు. అందువల్ల ఇబ్బందులు  వచ్చేవి కూడా. చేద్దామనుకున్నది చేయలేకపోయేవాడివి. ఇప్పుడు  ఎంతో  నేర్చుకున్నావు.  అందుకు సంతోషిస్తున్నాను. ముఖ్యమైన మాట చెబుతాను.విను.   రాజసేవ  పూలపాన్పు కాదు. పదవి అనేది ముళ్ళ కిరీటం. చాలా జాగ్రత్తగా ధరించాలి. కష్టాన్ని కూడా సులువుగా తీసుకునే ఓర్పు ఇప్పుడు నీకుంది. కాబట్టి అంతా మంచి జరుగుతుంది” అని దీవించాడు.   


అనుభవజ్ఞుడైన మంత్రిగారు  ముందుచూపుతో వ్యవహరించాడని, ఆయన   ప్రవర్తనను అపార్ధం చేసుకున్నానని గ్రహించాడు  విజయుడు.  ఆయనకు  కృతజ్ఞతలు చెప్పుకుని పాదాభివందనం చేసాడు. 


సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment