*🧘♂️23- శ్రీ రమణ మార్గము🧘♀️*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 23 తనకు తాను బద్ధుడా?*
ఎవరైనా, తనకు తాను బద్దుడా? అని ప్రశ్న వస్తే?, కుటుంబానికి, సంస్థకూ, విశ్వాసానికి, స్నేహానికి, ఒక కారణానికి యిలా యెన్నో బాధ్యతలు ఉంటాయి. ఒక పాత పరిచయస్థులు ఒకాయన అకస్మాత్తుగా వచ్చారు. జంకూ, గొంకూ లేకుండా 'నేను జీవితంలో అన్ని బాధ్యతలను పూర్తి చేసేసాను. కుమారులు అమెరికాలో చక్కగా స్థిరపడ్డారు. అమ్మాయి కూడా మంచి కుర్రవాడినే వివాహం చేసుకుని అమెరికాలోనే ఉంటుంది' అన్నాడు. అతని మొహం గర్వంగా వెలిగిపోతుంది. అతనిలో సంతృప్తి కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. ఆలోచిస్తే, వివాహం కాకపోయినా పిల్లలు లేకపోయినా పెద్ద తేడా కనుపించదు. ఎవరి బాధ్యతలైనా పరిమితమైనవే. తప్పనిసరి అన్న బాధ్యతలు కూడా చాలా తక్కువ పరిధి గలవే.
జీవితానికి అర్ధం యేమిటన్న ప్రశ్నను ఈ సంబంధాలకు అతీతంగా చూడటం లేదు. జీవితానికి ఒక ఉద్దేశం ప్రయోజనం ఉన్నదా? ఉంటే దాన్ని నేను నిర్వర్తిస్తున్నానా? ఇదే ప్రశ్న యింకోలా, 'నాకు నా గురించి బద్ధత, బాధ్యత ఉన్నాదా, అది నేను నిర్వర్తిస్తున్నానా?' అందరూ సామాన్యంగా ప్రపంచం మొత్తంగా, యెంతో ప్రాముఖ్యమున్న సంగతని విస్మరిస్తున్నారు. మనకి ప్రియమైన వారి గురించే ప్రాముఖ్యమంతా, ఆరాటమంతా. స్వజీవితం గురించి ఉన్న యీ అంధకారం యెంత గాఢం విస్తృతమైనదంటే, యెవరికైనా దీని గురించి వివరించి చెప్పడమే కష్టం, అసాధ్యమే. దీనినే మాయ అన్నారు, సత్యంపై ముసుగు వేస్తుంది. జ్ఞానాన్ని మరుగునుంచుతుంది. అజ్ఞానం అవిద్యలతో ఆడిస్తుంది. ఈ మాయ పురాతనమైనది, అనాది.
జాలారి తన వలను యెంతో విస్తృతంగా అత్యంత నైపుణ్యంతో వేయవచ్చు. అతని కలవాటయిన నేర్పయిన వల విసురు యెంతో ఆకర్షణ కలిగించవచ్చు. అయినా కొన్ని చేపలు దొరక్కుండా తప్పించుకుని పోతాయి. సమయం చిక్కినవారు, సత్యాన్వేషణపై దృష్టి మరలినవారూ యిలాంటివారే. ఈ ప్రాపంచిక విషయాలనే ఉచ్చు నుండి తప్పించుకుంటారు. ఎందుకు జరుగుతుందనేది ముఖ్యం కాదు. ఇది జరిగే సత్యం అని తెలిస్తే చాలు. వారు దారిమళ్లి, మార్పులు చెందే బంధాల్లో చిక్కుకొనకపోతే, పరమానందమనే అంతర్గత సహజానందం వారికోసమై వేచి ఉంది, ఆహ్వానిస్తుంది, లభిస్తుంది.
అలాంటివారు, వారి హృదయాల్లో రమణులను సద్గురువులుగా అనుభవం చెందుతారు. ఎందుకంటే, తపన శ్రద్ధ ఉన్నవారి గురించి గురువు వేచి చూస్తుంటాడు. అతను మానవ రూపంలో అవతరించడం అందుకోసమే. అనుగ్రహం మార్గదర్శకత్వంతో సదా నడిపిస్తున్న సద్గురువు ఆయనే. ప్రేరణద్వారా, స్వప్నాల ద్వారా యితర సాధకుల ద్వారా ఆయన సహాయం చేరుతుంటుంది.
రమణుల మార్గంలో సాధన అంతా, కాలం నుంచి దూరమై కాలాతీతమైన జీవనానికి చేరుకోవడమే. మనసు / అహంకారం భూత, భవిష్యత్తులను కలిపే గొలుసు. భూత, భవిష్యత్తుల్లోనికి మనసు చరించడం మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా దానికదే జరుగుతున్నది. మనసు కదలికలు ఒక వి.సి.ఆర్.లో రివైండ్, ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్లను నొక్కినపుడు జరిగినట్లుంటుంది. ఎవరూ గతంలో బాధలను, భవిష్యత్తు భయాలను పైన వేసుకోవాలనుకోరు. కానీ అలానే జరుగుతుంది. ఎందుకంటే, వర్తమానంలోనే ఉండడానికి అవసరమైన పద్ధతులను, సాధనలను పాటించలేదు కాబట్టి. అలాంటి సాధన లేదు కాబట్టి భూత, భవిష్యత్తులు వర్తమానాన్ని ముంచేస్తున్నాయి. ముందుకు వెనుకకు యెలాంటి కదలికలూ లేకుండా మనసు మౌనంగా ఉన్నపుడే కాలాతీతంగా మనసు కదలికలకు దూరంగా ఉండటం జరుగుతుంది.
ఇక్కడే భగవాన్ సదా వర్తమానంలో జీవించడానికి మనకు సాధనం అందిస్తున్నారు. ఇందులో ధ్యాసంతా ఒకే కేంద్రంపై, మనసు దృష్టినంతా దానిపైకే మళ్లించి, మనందరిలోనూ ఉన్న వ్యక్తి/నేను అన్న భావన / అహంకారంపై లగ్నం చేయబడింది. ఒక సందేహం, ఒక ప్రశ్న - విచారణ తన నిజస్థితి గురించి, యీ కదలిక, ఎవరికి 'నేను' నుంచి దూరంగా కలుగుతుందని ప్రశ్న మొదలవుతుంది. ఇది అవగాహనకు కష్టం అనిపించవచ్చు. ఆచరణలో చాలా సులభమయినది. సత్యదర్శనం, హృదయంలోని బ్రహ్మానందం తలుపులు తెరుస్తుంది కాబట్టి. నేను అనే భావన/అహంకారంపై ధ్యాస దృష్టి ఆ సత్యం కోసమే. ఏ పనిలోనైనా ఏకాగ్రత అవసరమే. ఏ పనిలో విజయం కావాలన్నా, యింట్లో ఆఫీసులో, ఆటల్లో ఏకాగ్రత కీలకమయినదే.
అజాగ్రత్త, ధ్యాస లేకపోవడం వలన నేను అనే భావన గురించి అనుభవం లేకపోవడం వలన అపోహలు పెరుగుతున్నాయి. తలంపుల కదలిక యెవరిదైతే ఆ అహంకారంపై దృష్టి పెడితే, నిశ్చలత నిలుస్తుంది. ఈ నిశ్చలత జీవితంలోని పనులు, కార్యక్రమాల వల్ల భంగం కాదు. వారు పరమానందంలో మునుగుతూ జీవితం ప్రతీక్షణం పూర్ణంగా అనుభవిస్తారు.
తన జీవితం యొక్క ముఖ్యమైన బాధ్యతను మరచిపోవడం వలన ఈ అజాగ్రత్త కలిగింది. రమణగీతలో దైవరాతుడు భగవాన్ని అడిగిన ప్రశ్న యిలాంటిదే.
దై : భగవాన్, జనన మరణ చక్రభ్రమణంలో యిరుక్కుని తిరుగుతున్న మానవుడి ముఖ్యమైన బాధ్యత యేమిటి? దయతో ఒకటి నిర్ణయించి నాకు బోధించండి.
భ : అతి ఉన్నతమైనదీ, అత్యుత్తమమైనదీ కోరుకున్న వారెవ్వరికైనా, తన సహజ స్వభావము యేమిటని తెలుసుకోవడమే అన్నిటి కన్నా అతి ముఖ్యమైనది. అదే అన్ని కర్మలకూ, వాటి ఫలితాలకూ ఆధారం, ఉద్దేశ్యమూ.
రమణులు ఆత్మజ్ఞాన విషయంలో, ఒకరి ముఖ్యమైన బాధ్యత యేమిటో చెప్పి, అంతటితో ఆగక దానికి కారణం, యెలా సాధించాలో కూడా తెలిపారు. నేను అనే అహంకారంపై దృష్టి నిలిపి ప్రయత్నించాల్సిన అవసరం కూడా గట్టిగా చెప్పారు. దీన్ని అప్రాపంచిక విచారణ అనికూడా అనవచ్చు.
ఎందుకంటే ధ్యాసనంతా ఆలోచనలన్నీ బాహ్యం నుంచి తీసివేసి, ఆలోచించేవాడిపై లగ్నం చేయడం జరిగింది కాబట్టి. అలా నిరంతర సాధన నిలకడగా చేయడం వలన, తన సహజ ఆనందమయ స్థితిని కనుక్కొని తన అతి ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తించడం జరుగుతుంది.
No comments:
Post a Comment