Tuesday, August 2, 2022

నీవెవరివో నువ్వు కనుక్కో* *అధ్యాయం - 22* *ఇంకా నేను కుటుంబం పిల్లలు బంధువులు స్నేహితులను ప్రేమించగలనా?

 *🧘‍♂️22- శ్రీ రమణ మార్గం* 


*నీవెవరివో నువ్వు కనుక్కో*

*అధ్యాయం - 22* *ఇంకా నేను కుటుంబం పిల్లలు బంధువులు స్నేహితులను ప్రేమించగలనా?*


మన సాధారణ ఆనందాలన్నీ మనుషుల చుట్టూ నిర్మించబడ్డాయి, వారు యెవరైనాసరే, భర్త, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు. ఇంకా ఆస్తులు, సంపదలు, పేరు ప్రతిష్టలు, హోదాలు కూడా ఉన్నాయి. ఈ ఆనందాలన్నీ కూడా వాటన్నిటితో సంబంధాలు వాటి యెగుడు దిగుడులుతో ముడిపడి ఉన్నాయి. మనమాట వినని చెడు తిరుగుడుల పిల్లలతో దుఃఖాలే వస్తాయి. అవతలి వారి స్పందన అసంపూర్ణము, ఆగిపోయిన దవవచ్చును. వారికి ప్రేమగా స్పందించడం రాకపోవచ్చు, లేకపోవచ్చు. ధనానికి యెలాగూ దాని సంఘర్షణలు, భయాలు, కొట్లాటలు ఉన్నాయి.


బాధలు, దుఃఖాలు వచ్చేవే అయినా, మనకు ఫర్వాలేదు అనిపిస్తుంది. తన స్వంతమైన వ్యక్తిగతమైన ప్రేమలే లేకపోతే మనం యెట్లా ఉంటాము? ఒంటరితనంతో, సంకుచితంగా మూసుకునిపోయి హృదయం కుచించుకుపోయి ఉంటాము. ఒకరి చేతి స్పర్శ, అర్థవంతమైన చూపుల కలయికలు, హాయి నిచ్చే మాటలు యిలా యెన్నో తెలుస్తూ కోరుకుంటాము.


ముల్లులు, బాధలు, దుఃఖాలు లేని ప్రేమ అనేది ఉన్నదా? అలాంటిది ఊహల్లోనో, సిద్ధాంతాల్లోనే ఉంటూ, మనకు అసాధ్యమా? కానేకాదు. ఎందుకంటే మనకు ముందు నిలువెత్తు భగవాన్ ఉదాహరణగా ఉన్నారు. ఆయన ఆత్మనిష్టులై స్థిరంగా తన పదహారవయేటనే ఉన్నారు. అతని మహా నిర్వాణం 1950 సం॥. అతనికి 70 సం||ల వయసులో జరిగింది. ఇన్ని సంవత్సరాలు ఆయన నేను, నాది అనే భావనే లేకుండా విశ్వప్రేమకు నిదర్శనంగా ఉన్నారు. అతని ప్రేమ అందరివైపు ప్రవహించింది. పెద్దా-చిన్నా, ధనికులు పేదలు, జ్ఞానులు అజ్ఞానులు యెవరైనా అందరినీ సమాన దృష్టితోనే చూశారు. వారి ప్రేమ యేదో కొందరికే పరిమితం కాలేదు. ఈ విషయంలో ఆయన శిష్యులు భక్తులు కూడా ప్రపంచంలోని మిగతా అందరితో సమానమే. అంటే దీని అర్థం వ్యక్తిగతమైన ప్రేమకు స్థానం లేదా? రమణులు వ్యక్తిగతమైన శ్రద్ధ చూపించలేదా?


ఈ ప్రశ్న వస్తున్నదెందుకంటే మనకు సర్వమానవ విశ్వప్రేమ, వ్యక్తిగతమైన ప్రేమ రెండూ కలసి ఉండవు అనే అపోహ వలన. ఒక భక్తురాలు రమణుల బోధలపై ప్రవచనములు జరుగుతున్నపుడు యిలాంటి సమస్యనే లేవనెత్తినపుడు సమాధానం కోరినపుడు, యీ విషయం వెలుగులోనికి వచ్చినది. ఆత్మజ్ఞానం, విశ్వప్రేమ గురించి ప్రవచనం విన్న తరువాత, ఒకామె 'రమణుల మార్గంలో నేను ప్రస్తుతం సాధన చేస్తున్నట్లు పూర్ణ సాధనలో అంకితమైతే, నా ప్రియమైన వారందరితో సంబంధ బాంధవ్యం యింతకు ముందు ఉన్నట్లే, తరువాత కూడా కొనసాగుతుందా? ఆత్మజ్ఞానం ఉదయించిన తరువాత, నాకున్న అన్ని సంబంధాలు యేమవుతాయి? ఫలితంగా కలిగే విశ్వప్రేమ, యీ వ్యక్తిగత ప్రేమలనన్నీ తుడుచేస్తుందా?' అని ప్రశ్నలు ఆసక్తితో పలికింది. రమణుల మార్గాన్ని అంతిమ విజయం వరకు సాధన చేయాలనే పట్టుదల వలన ఆమెకీ అనుమానాలు ఉదయించేయి.


ప్రవచనాల యొక్క సారాంశం ఆమె తప్పుగా గ్రహించింది. అయినా ఆమె లేవనెత్తిన ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి, స్పష్టత అవసరమైనవే. ఒకరి హృదయం ప్రపంచమంతా అల్లుకుని పోయినపుడు, వ్యక్తిగత ప్రేమకు స్థానమెక్కడ? భక్తులందరూ, ప్రతీవారు యెవరికి వారు భగవాన్ ప్రేమను వారిపైనే ప్రత్యేకంగా కురిపించినట్లు భావించుకునేవారు. ఆయన అనుగ్రహంతో వారిని ముంచెత్తేవారు. భగవాన్ ను కొందరు తండ్రిగా, కొందరు తల్లిగా, కొందరు స్నేహితునిగా, కొందరు రక్షకుడిగా యిలా యెన్నో విధాల చూసేవారు, భావించేవారు.


ఎప్పుడైనాగాని తన పాత బంధువులు చిన్నప్పటి పాఠశాల మిత్రులు రమణుల వద్దకు వచ్చినపుడు, ఆయన వారితోని అనుబంధం, ఆ రోజుల్లో కలసి చేసిన పనులు గుర్తు చేసి వాళ్ళకి యెంతో హాయి గొలిపేవారు. షాబాన్, ఒక ముస్లిం సహవిద్యార్ధి, రమణులకు యెంతో సన్నిహితుడు, వారాంతంలో అతన్ని తన తిరుచ్చుజిలోని గృహానికి తోడ్కొని పోయేవారు. రమణుల సత్య దర్శనం, తిరువణ్ణామలైకి వచ్చేయడం తరువాత యిక కలుసుకోలేదు. షాబాన్ పోలీసు సర్వీసులో చేరాడు. ఒకరోజు అతను వండివాస ఊరులో భగవాన్ ఫోటోను చూసాడు. వెంటనే తన స్నేహితుణ్ణి చూడాలనే తీవ్రమైన కోరిక కలిగింది. కానీ ఒక సందేహం కలిగింది. తనను అతను అసలు గుర్తుపడతాడా అని. ఈ అనుమానంతోనే అరుణాచలం వచ్చాడు. రమణులు ఆత్మనిష్టులుగా ఉన్నా అతని స్నేహం యెలాంటి మార్పు లేదని తెలుసుకున్నాడు. ఇలాగే యింకో చిన్ననాటి స్నేహితుడు రంగన్ విషయంలో కూడా జరిగింది. 


అతన్ని 'గ్రహదోషాల' నుండి కాపాడేందుకు భగవాన్ అతనిపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. సుబ్బరామయ్యగారు మరణించిన భార్యను స్వప్నంలో చూడాలనుకున్నారు, దేవరాజ మొదలియార్, ఆశ్రమంలోనే ఉండి కొనసాగించేందుకు దెబ్బ తగిలిన తన కన్ను వెంటనే నయమవ్వాలనుకున్నారు, సబ్ రిజిస్ట్రార్ నారాయణ అయ్యర్ తన కుమార్తె పెళ్లికి భగవాన్ ఆశీస్సులను కోరారు. ఇవన్నీ కూడా భగవాన్ తన అతి సహజమైన పద్ధతిలోనే తీర్చారు. ఇవన్నీ కూడా కొద్ది ఉదాహరణలే, యిలాంటివి యెన్నో లెక్కలేనన్ని సంఘటనలు. విశ్వమంతా విస్తృతంగా విస్తరించిన భగవాన్ విశ్వప్రేమ వలన ఆయన వ్యక్తిగతమైన సంబంధం, ప్రేమకు యే మాత్రం కొరత రాలేదని యీ ఉదాహరణలు చాటి చెపుతున్నాయి.


వీటన్నిటిని బట్టి తెలుస్తున్నదేమంటే, ఆత్మజ్ఞానం కలిగిన తరువాత ప్రస్తుతం ఉన్న అన్ని సంబంధాలకు ఉత్సాహకరమైన కొత్త అర్థం, బలం చేకూరుతుంది. వారికి ఆశ అనే పాశం, స్పందన కోసం కోరిక ఉండదు. వారు యివ్వడం, యింకా యివ్వడం అంతే.


 అలా యివ్వడమనే దాంట్లోని ఆనందం ప్రతీ సంబంధానికి ఆశ్చర్యకరమైన కొత్త పరిమళాన్నిస్తుంది. ఇప్పుడున్న వ్యక్తిగత ప్రేమల్లోని నాది, నా వారనే బంధం, ప్రీతీ, భ్రాంతీ, ఆశలూ, కన్నీళ్లు అన్నవి వారికి యేమాత్రం లేనివే. వ్యక్తిగతమైన ప్రేమల్లో యెంతో సంతృప్తికరంగా ఉన్నపుడు కూడా పోని అంతర్గత భయం మాయమైపోతుంది. దానికి చోటే లేదు. ఈ పరిమితులన్నీ పోయి, ఉన్నదంతా ఆనందం, పరమానందం.


 *ఓం అరుణాచలశివ* ,

No comments:

Post a Comment