Tuesday, August 2, 2022

నీవెవరివో నువ్వు కనుక్కో* *అధ్యాయం - 24 పని - విరామం - సెలవులు

 *🧘‍♂️24- శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*నీవెవరివో నువ్వు కనుక్కో*

*అధ్యాయం - 24 పని - విరామం - సెలవులు*


అందరూ సేద తీర్చుకోవాలని విశ్రాంతి కోసమని విరామం కోరుతారు. ఎక్కడికెక్కడికో విహార యాత్రలకు పోయి సుఖంగా ఉండి, ఆనందించాలనుకుంటారు ఎందుకు? చేస్తున్న పనిలో విసుగు, రోజూ అదే, కొత్తయేమీ లేదు, మార్పులేదు, అలా చాలా చేస్తూనే ఉన్నాము. ఇంకా యెంతో చేయాలి. దాన్నించి తప్పించుకోవాలి. పనిపట్ల ఈ అవగాహన, ఉద్దేశ్యము సరి అయినదేనా? ప్రస్తుతం పరిస్థితి యేమిటి? ఎన్నో పథకాలు వేస్తాము. అన్నింటికి గమ్యాల్ని, కాలాన్ని నిర్దేశిస్తాము. పోటీలు పడతాము. నిరంతరంగా పరుగెడుతుంటాం. ఆరాటం పోరాటం. పనిచేయునపుడు కూడా, మనసుకు విరామమంటే తెలియదు. మనసు శక్తి అంతా ఖర్చయిపోయింది. ఎందుకు? మనం మనసును వేలాది తలంపులతో శక్తిహీనం చేస్తున్నాం. నిద్రలో కూడా స్వప్నాల్లో కూడా మనసు అదే చేస్తూ శక్తిని కోల్పోతుంది.


రమణాశ్రమంలో వంటశాలలో సహాయం సేవ చేసే సుబ్బలక్ష్మమ్మకు భగవాన్ ఈ విషయం గురించే స్పష్టం చేస్తారు. ఆమెకు భగవాన్ పాత హాలులో ధ్యానం చేయాలని గాఢమైన కోరిక, కానీ వంటశాలలోని పని వలన అందుకు సమయం చిక్కడం లేదు ఆమెకు.


భగవాన్ :- నీ మనసు ధ్యానం కోసం తహతహలాడుతున్నట్లున్నదే?


సుబ్బలక్ష్మమ్మ :- అయినా ప్రయోజనం యేమిటి? ఇక్కడంతా వంటశాల పనే కదా?


భ :- నువ్వు సదా, కదలికలేని, తలంపుల రహితమైన దానివే. ఇది నువ్వు తెలుసుకోలేనంతకాలం సమస్యలు ఉంటాయి. పనిచెయ్యడంలో కష్టం కనుపిస్తుంది. నువ్వు పని ఆపివేసినా సరే మనసు పరుగులెడుతూనే ఉంటుంది.


భారమైన తలంపులను పట్టుకుని వేలాడుతూ ప్రస్తుతంలా మనం పరుగులెడుతూ పనులు చేస్తున్నంతకాలం విరామం, విశ్రాంతి కోసం ఖాళీ సమయం, విహారయాత్రలు లాంటివి తప్ప వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే తలంపులతో కలసి పరుగుల వలన యెంతో శక్తి ఖర్చయిపోతున్నది కాబట్టి. అందుకే యెవరైనా

సరే తలంపులకు విరామం యెలా ఇవ్వాలో ప్రయత్నం చేయాలి. తలంపుల మధ్య విరామం యెలా వస్తుందో పరీక్షగా గమనించండి. సందర్భాలకు సంబంధించి స్పందించడం, భావాలను యిచ్చిపుచ్చుకొనడం అనేవి లేనపుడు కలుగుతుంది ఈ తలంపుల మధ్య విరామం. అందరూ అలాంటి విరామస్థితి పనికిరానిది, విసుగైనది అనుకుంటారు. ఆలోచనలకు తప్పుడు విలువలను ఆపాదించడం వలన అలా అనుకోవడం (అపోహ) జరుగుతుంది.


అంతే కాదు, ఈ విరామ స్థితి తలంపులు లేని సమయం మాత్రమే కాదు, యింకా యెంతో విశాలమైనది, మధురమైనది, అందమయినది, పరమానంద మయినది. ఎందుకంటే, అవసరం లేని తలంపులే నీ సహజస్థితిని మూసి ఉంచుతున్నవి. నిన్ను నువ్వు కనుక్కోవడానికి అడ్డంగా గోడలా ఉన్నవి ఈ తలంపులే, భావాలే. ఇక్కడ భగవాన్ ఒకసారి సరదాగా అన్నమాట చూడండి. ఒకరు ‘ఎవరైనా కోరికలను విడిచిపెట్టవలయునా' అంటే, భగవాన్ 'కాదు, కాదు తలంపులను విడిచిపెట్టాలి' అన్నారు. నేనెవరు విచారణ, ఒకరి ధ్యాసను దృష్టిని వారి తలంపులపై నుండి తప్పించి, తన ఆనందమయ స్వభావమైన తలంపులు లేని చురుకైన శక్తివంతమైన స్థితికి చేరుస్తుంది. తలంపుల సమూహాలు తగ్గినపుడు, అవి రహితమైనపుడు, మనసు విశాలమై తనను తాను తెలుసుకుంటుంది. ఒకరు క్రికెట్ బ్యాటింగ్ చేసేటపుడు బంతి ఆడేందుకు జాగా యెలా చేసుకుంటారో అలానే నేనెవరు విచారణ సాధకులు మనసును విశాలం చేసుకుంటారు. అపుడు 'నేను’ యొక్క విస్తృతమైన అనంతమైన మనోమౌనం అఖండమైన బ్రహ్మానందంను అనుభవిస్తూ ఉంటుంది.


అహంకారం తన మూలమైన హృదయం (నేను)లో కలసిపోయినపుడు, దైవత్వంతో కలవడం వలన అది మనసుకు, శరీరానికి అనంత శక్తినిచ్చి ఉత్సాహపరుస్తుంది. వాటికవే, మనసుకు గానీ, శరీరానికి గానీ చైతన్యం, స్వయం ప్రకాశం, శక్తి ఉన్నవి కాదు. ఆత్మ (నేను) నుంచే అవి శక్తి చైతన్యం ప్రకాశాన్ని పొందుతున్నాయి. ఈ దివ్యత్వం అనంత చైతన్యశక్తి హృదయంలో 'నేను, నేను...” అంటూ స్పందిస్తూ ఉంటుంది సదా.


శరీరానికి యేమైనా స్వతంత్రంగా తన స్వయం చేతన ఉందా అని కొంచెం శోధిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. శరీరానికీ, శవానికీ తేడా యేమిటి? భగవాన్ తన 12వ యేటనే, తన తండ్రి మృతదేహం తిరుచ్చుజి తన గృహంలో నేలపై ఉండగా రమణులకు యిదే ప్రశ్న ఉదయించింది. "తన తండ్రి మరణించిన రోజు అసలు మరణం అంటే యేమిటన్నది తనలో తొలుస్తూ ఉండగా దానిపై శోధన జరిగింది. కుటుంబం బంధువులందరూ రోదిస్తూ ఉండగా తను గంటల తరబడి ఆలోచిస్తూనే ఉన్నాడు. యెంతో తర్కం శోధన జరిగిన తరువాత శవాన్ని దహనం చేసిన తరువాత, ఒక విషయం గ్రాహ్యమయింది. 'నేను' అనేది శరీరంలో ఉన్నపుడే చూడడం, మాట్లాడడం, తినడం, పరుగులూ అన్నీ జరుగుతాయి, నేను యిపుడు ఆ 'నేను'ను తెలుసుకున్నాను, కానీ నా తండ్రి యొక్క 'నేను’ ఆ దేహాన్ని వదలిపోయినది”.


మరి మనసు సంగతి యేమిటి? గాఢమైన నిద్రలో మనసు కోల్పోయిన శక్తి తిరిగి తరచూ దానికి యివ్వవలసి వస్తున్నది. దైవపథకం ప్రకారం ఈ నింపడం జరుగుతున్నది. అందుకోసం ఆ శక్తిని పూరించే సమయంలో తలంపుల రహితంగా చేసి, తనలోని దివ్యత్వము మనసుకు, శక్తిని నింపుతుంది. అలా, తలంపులు రహితమైనపుడు మనసు ఆత్మతో హృదయంలో అనుసంధానమవుతుంది, కలసి ఉంటుంది. అలాగే, ఎవరైనా శ్రద్ధగా తీవ్రంగా నేనెవరు అనే విచారణ సాధన స్థిరంగా చేస్తూ సూటిగా సదా దివ్యత్వంతో అనుసంధానమై ఉంటే మనసు యెల్లప్పుడూ సర్వశక్తివంతంగా ఉండి, ఉత్సాహం యెప్పుడూ ఉరకలేస్తుంది. బద్దకం విసుగు మరి యెక్కడ? చోటు అడ్రసు వాటికి లేవు. ఇక చేసే పని నుంచి దూరంగా విశ్రాంతికై పోవలసిన అవసరం లేనేలేదు. ఎంత పని ఉన్నా, పని యేమీ లేకపోయినా సరే, అంతా పరమానందమయమే తప్ప యింకో స్థితి లేనే లేదు, అవకాశమే లేదు


 *ఓం అరుణాచలశివ* 

No comments:

Post a Comment