*🧘♂️03- శ్రీ రమణ మార్గము🧘♀️*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 3*
*శుద్ధ నిర్మల మనస్సు - అహంకార పూరిత మనస్సు*
*భక్తుడు :-* నేను, ఆత్మ యొక్క బ్రహ్మానందాన్ని అనుభూతి చెందలేకపోతున్నాను.
*మహర్షి : -* తేనెటీగలు అమృతమును గ్రోలుటకు పుష్పము రేకులు విప్పి వికసించవలెను. రేకులు ముడుచుకుని ఉంటే తేనెటీగలు యెట్లా లోపలికి పోగలవు? పుష్పము వికసిస్తే, తేనెటీగలకు ప్రత్యేక ఆహ్వానం అవసరమే లేదు. వాటికవే వస్తాయి. ఆ మాదిరిగానే, అహంకారం, నేనును కప్పి మూసి ఉంచితే ఆత్మజ్ఞానం యెలా కలుగుతుంది.
నేను జ్ఞానము (ఆత్మజ్ఞానం)నకు 'నేను' ఉండటమే ఋజువు అంటారు భగవాన్. అందుకే, 'నేను' యొక్క జ్ఞానం, అరచేతిలోని పండును చూచి తెలుసుకోవడం కంటే సులభం. తన అరచేతిలోనిదే అయినా చూడాలంటే చూచేవాడు, చూడబడే పండు, చూడడం అనేవి ఉండాలి, అవసరం. ఇంత సమంజసమైన చిన్న విషయం చూచి తెలియాలి అంటే అంధుడైతే చూడలేకపోవచ్చు లేదా మనస్సు దానిపై లగ్నంకాక చూడకపోవచ్చు. లేక అక్కడ పండు లేకపోవచ్చు.
కానీ 'నేను' (ఆత్మ/చైతన్యం/ఎరుక అనంతం, సర్వవ్యాపితం, సర్వాంతర్యామి, సర్వకాల సర్వ అవస్థల్లో సర్వత్రా అంతటా ఉన్నవాడిని) ఉన్నాను. ఎప్పుడూ సదా అంతటా అన్నింటిలో ఉన్నాను. 'నేను' ఉన్నట్లు స్ఫురణలోనే ఉంది. ఈ స్ఫురణకు దేని అవసరం లేనేలేదు. అయినాసరే, నేను జ్ఞానం చాలా కష్టమయినది అనే తప్పు భావనకు బాగా అలవాటయి బానిస అయిపోయి ఉన్నాము.
అందుకే యెన్నో సాధనలు, పద్ధతులు, ప్రయత్నాల ద్వారా యీ మనసు కల్పించిన తప్పు అలవాట్లను శుద్ధి చేస్తే, అంతిమంగా తన స్వస్వరూప జ్ఞానం, తన యెప్పుడూ ఉన్న అనుభూతి కలుగుతుంది. మనసు యొక్క నిజతత్త్వం యేమిటి అని గ్రహించకుండా, ఒక ప్రత్యేక మనసు ఉందనుకున్నంత కాలం (అదీ మనసు/ కల్పించే భ్రమే) యీ ప్రయత్నాలు తప్పవని భగవాన్ చెప్పేవారు.
భగవాన్, గంభీరం శేషయ్యర్ గారికి మొట్టమొదటి లిఖించి చేసిన బోధలో, మనస్సు స్వభావము గురించి యెంతో వివరంగా ఉదహరించారు. ‘నిజానికి మనస్సు సహజంగా శుద్ధం నిర్మలమైనది. కాబట్టి అది ఆత్మ చైతన్యమే, వేరు కాదు. మలినమైన మనస్సు యింకో తప్పు గుర్తింపును ఆపాదించుకుని
మిథ్య భ్రమను కల్పించుతుంది. ఆత్మచైతన్యమే అయిన శుద్ధ నిర్మల మనసు మలినముల వలన తన సహజత్వాన్ని మరచి, 'నేను'కు బదులుగా 'అహంకార నేను”నే సత్యమని భావించుతుంది.
అందువలన ఒకటి శుద్ధ నిర్మల మనసు, రెండోది మలినమైన మనస్సు అని రెండు మనస్సులున్నాయా? అనే ప్రశ్న వస్తుంది. అలాగే ఒక వ్యక్తిలో, రెండు 'నేను'లు, ఒకటి సత్, ఆత్మ అయిన 'నేను', రెండవది 'అహంకార నేను'లు ఉన్నాయా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. కానీ ఉన్నది, ఉండసాధ్యమయ్యేది ఒకే ఒక్క మనసు, ఆత్మచైతన్యం ప్రతిబింబించడం వలన సమగ్రంగా సర్వశక్తివంతంగా ఉంటుంది. అయినాసరే, ఈ జ్ఞానం మరుగై, అజ్ఞానం ఆవరించి యీ సత్యాన్ని విస్మరిస్తుంది.
అలా, యీ అజ్ఞానం వలన తానంటే స్వతంత్ర ప్రత్యేక ఉనికిగల దేహం/అహంకారం/ మనసు అని భావించుకుంటూ ఆలోచనలు, కార్యాలు చేస్తాడు. అసలు 'నేను'ను సత్ అయిన దాన్ని మరచిపోతాడు. ఇలా మరుగునపెట్టిన అజ్ఞాన ముసుగు వీడిపోయేంతవరకు తనదే అయిన సహజ పరమానందం, సర్వశక్తి, సర్వామిత్వం నుంచి వేరుగా దూరమవుతాడు. ఎన్నో జన్మల నుంచి అలవాటై యెంతో బలంగా స్థిరపడిన యీ అజ్ఞానం వేర్లుతో సహా, నేను యెవరు విచారణ, మనసు స్వభావం యేమిటో తెలుసుకొనడం వలన, సద్గురు అనంత అనుగ్రహంతో మాత్రమే పెకలింప వేయబడుతుంది. 'అహంకార నేను’ భావన వలన తను యెన్నో పరిమితులకు, దుఃఖాలకు, అలజడి, ఘర్షణలకు లోను అవుతూ, జనన-మరణ చక్రభ్రమణంలో చరించే గతి వలన, నేను యెవరు విచారణ యెంతో ముఖ్యమని భగవాన్ గట్టిగా చెప్పేవారు.
'అహంకార నేను' భావనల నేను అంటే ఫలానా పేరు, ప్రతిష్ట, హోదా, తండ్రిని, కుమారుడిని, పుత్రికను, తల్లిని, యజమానిని, బానిసను, డాక్టర్ని, లాయర్ని, మినిష్టర్ని, నేను అది ఇదీ, నాది, వాడు, వీడు... యిలా మొత్తం ‘అహంకార నేను’కు యెంతో అలవాటైన కార్యక్రమం అంతటా పూర్తిగా ఉంటుంది. వీటికి యింకా ఒక్కొక్కటీ వచ్చి చేరేటప్పటికి బాహ్యంలో యెన్నోరెట్లు పెరిగి బాంధవ్యాలు, కక్షలు, సిద్ధాంతాలు, నమ్మకాలు, ఆస్తులు, రాగద్వేషాలు... ఎన్నో బంధాలు తయారవుతాయి. వీటి ఫలితంగా కోరికలు, ఆశలు, భయాలు, ఆందోళన, ఘర్షణ... ఎన్నో మనసును కలుషితం చేసి మలినపరుస్తాయి.
ఇలా మలినమైనాసరే, మనసు యొక్క సహజ స్వభావమునకు యేమీ కాదు, పోదు, ఉన్నదే కానీ మరుగున పడుతుంది అంతే. బంగారం మలినమైతే శుభ్రం చేయగానే తన సహజమెరుపు ఉంటుంది. దానికేమీ హాని జరుగలేదు, పోలేదు.
ఆకాశంలో నుంచే పంచభూతాలు వచ్చాయి. కానీ వాటి గుణాలు, తత్త్వాలు ఆకాశానికి అంటలేదు. ఆకాశం ఆకాశంలానే ఉంది. భూమిపై కలుషితాలు, గాలిలోని మలినాలు ఆకాశాన్ని మలినం చేయలేవు. ఒకసారి మిథ్యా నేను / అహంకారం / మనసుయొక్క తప్పు గ్రహింపు పోయిన వెంటనే మిగిలేది శుద్ధ నిర్మల మనసు, ఆత్మగా ఉన్నది, పరిపూర్ణంగా సర్వశక్తిమంతంగా ఉంటుంది. మరపులేని దారిమళ్ళని, ఒకే ఒక్క సహజమైన మనోస్థితి వలన యిది సాధ్యమవుతుంది.
తన సహజశక్తిమయ పరమానంద స్థితిని, శుద్ధ నిర్మల మనసునూ మరుగునపెట్టి అడ్డుగా ఉన్న యీ తప్పుడు గ్రహింపును యెట్లా పోగొట్టుకొనవలెను? తన సహజస్థితిని మరపించినది అజ్ఞానం కారణమయినందు వలన, తన స్వస్థితిని తెలుసుకోగల జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం మొదలు కావాలి. నేనెవరో కనుక్కొనే పద్ధతి కావాలి. అది జ్ఞానం వలన కలిగిన అనుభవం అనుభూతి కావాలి. జ్ఞానంతో కూడిన అనుభవం లేకపోతే, మేధోపరమైన తెలివితేటలు యెక్కడైనా యెప్పుడైనా తడబడతాయి.
అందుకే భగవాన్ దృఢంగా 'నేనెవరు విచారణ జ్యోతిలా యీ తప్పుడు గ్రహింపును నాశనంచేసి, సత్ అయిన 'నేను'ను ఆవిష్కరిస్తుంది. ఈ విచారణ చాలా సరళం సూటి అయిన సాధనం. ఇది అహంకారం నాశనం అయిన సహజ స్థితిని తెలియపరుస్తుంది. ఏమైనా వేరే తలంపు వచ్చినపుడు, యీ తలంపు యెవరికి కలిగినదో ప్రశ్నించు, నాకు అని జవాబు వస్తుంది. యీ నేను యెవరు? తలంపులు యెన్నో లేచి వస్తుంటే, అంతర్ముఖమై అవి యెక్కడ నుంచి పుడుతున్నాయో గమనించు, వెదుకు. ఆ చోటనే వాటిని మూలంలోనే కత్తిరించు. ఇదే సరి అయిన ఫలితమిచ్చే పద్దతి, సాధన, మార్గం.
భగవాన్ యింకా ఆచరణలో జరిగేవి తెలిపారు. ఒకరు విచారణ చేస్తుంటే ఫలితాలు కనుపించలేదని అంటే 'జవాబు రావడానికి యిది సాధారణ మానసిక ప్రశ్న విచారణ కాదు. ఇది మనసును తన మూలంవైపు మళ్ళించడానికి ఒక సాధనం మాత్రమే.
ఈ విచారణను నీవు స్థిరంగా, దృఢంగా చేయాలి. ఈ పద్ధతిని ప్రతీ తలంపు, భావన వద్ద మళ్ళీ మళ్ళీ చేస్తుంటే, నీ అహంకారం, నేను అనే భావనపై నీ ధ్యాస అంతా లగ్నం అవుతుంది. ఈ అహంకారం మూలాన్ని
అన్వేషించు, చేరుకోవడానికి ప్రయత్నించు. నీ యీ ఒకే ఒక ధ్యాస ప్రయత్నంతో విచారణ సాధన చేసి ఆ స్థితిని చేరుకుంటే, నిన్ను ఆ ప్రశాంత ఆనందస్థితి నుంచి యింక యేదీ యెవరూ మార్పు చేయలేరు' అని తెలిపారు.
రమణులు తెలిపిన యీ విషయముల నుండి రెండు సంగతులు తెలుస్తున్నది. ఒకటి, నిలకడగా నిరంతరంగా లోలోనికి 'నేను' పై ధ్యాస మళ్ళించి విచారణ సాధన చేయడం. రెండవది, యీ పద్ధతి యేమిటీ, యెందుకు, ఉద్దేశమును సరిగ్గా అర్థం చేసుకొనడం. ఈ రెండింటినీ గ్రహించడానికి, సద్గురు భగవాన్ పై ఆధారపడి, వారి అనుగ్రహం మార్గదర్శకత్వంను స్ఫురణలో ఉంచుకోవాలి.
ఈ నేను యెవరు? విచారణ పద్ధతి గురించి అన్ని ప్రశ్నలను, సమస్యలను, మెలకువలను, ఫలితాలను, గమ్యాలనూ భగవాన్ శ్రీరమణ మహర్షి, 54 సంవత్సరములు యెంతో కరుణాసముద్రులై ఓర్మిగా తన అనుభవం 'అనుభూతియే ఆధారంగా యెందరికో భోధించారు, వివరించారు. ఎవరైనా యీ బోధనలను తెలుసుకోవచ్చు. ప్రతీవారికి తన స్థాయికి తగ్గ, తను అంతర్ముఖమైన స్థితిని బట్టి, సద్గురు రమణుల అనుగ్రహం, మార్గదర్శకత్వం యిప్పుడూ, యెప్పుడూ దొరుకుతుంది. ఈ విచారణ పద్ధతి కొనసాగిస్తున్న వారి శిష్యులు, భక్తుల నుంచీ, సహాయం అందుతుంది. ఎవ్వరైనా వారి సహాయం, అనుగ్రహం కోరుకుంటే చాలు.
భగవాన్ అనుగ్రహం అపజయమే లేని సద్గురు మార్గదర్శకత్వం వారికి కలుగుతుంది. మనసుయొక్క సహజజ్ఞానం వికసిస్తుంది. అపుడు తలంపులు, భావాలు వచ్చినా వెంటవెంటనే అణగిపోతాయి, ఆగిపోతాయి. అలాగే చేయవలసిన కార్యాలు కూడా. అవసరం అయినపుడు కార్యాలు చేస్తారు, అవసరం లేనపుడు, అవసరం తీరిపోయినపుడు కర్మల గురించి కోరుకొనరు. తలంపులుండవు. ఆత్మ స్వరూపానికి మానసిక రూపమైన మనసు తన సహజ ఆనందసాగరంలో మునిగి ఉంటుంది.
No comments:
Post a Comment