*🧘♂️04- శ్రీ రమణ మార్గము🧘♀️*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 4*
*గతాన్ని విస్మరించు వర్తమానంలో జీవించు*
ఒకచోట కొంతమంది కలిసి భోజనం చేస్తున్నారు. భోజనం కోసం రకరకాల వంటలు, కూరలు, పదార్థాలు చాలా ఉన్నాయి. అయినాసరే, వారి మనస్సులు యెంతో చురుగ్గా ఉండి, వారి వారి మనస్సుల అనుభూతుల గురించి మాటలు ప్రారంభమయ్యాయి. ఒకరు 'నా మనస్సు పరుగులను నేను యేమీ అర్థం చేసుకోలేకపోతున్నాను. కొన్నిసార్లు చురుగ్గా ఉంటుంది. కొన్నిసార్లు అసలు బద్ధకంగా కదలదు. కొన్నిసార్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నపుడు మాత్రం యీ ప్రపంచాన్నే జయించినట్లు ఉంటుంది. పనిలో కూడా ఆనందంగా ఉంటుంది. ఏమీ పనిలేనపుడు మాత్రం అన్ని రకాల చెత్త తలంపులు పుట్టుకు వస్తాయి. మరి యీ మనస్సు యెందుకో యింత అర్థంకానిదిగా ఉంది'.
మీరు ఊహించుకున్నది, అందరు అనుకోవడంలాగే తప్పే అయి ఉంటుంది. ఈ సమస్యను మొదటిగా యెంచుకుని, ప్రస్తుతం దీన్ని ప్రక్కన ఉంచి, తరువాత దీన్ని చర్చిద్దాము.
ఇంకొకరికి మనస్సు వలన యింకో రకమైన సమస్య ఉంది. దీన్ని సమస్య : 2 అందాము. అది 'అంతా యెంతో చక్కగా ఉన్నపుడు, నేను యెంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నపుడు, ఒక్కసారిగా అకస్మాత్తుగా విచిత్రంగా దానికి వ్యతిరేక వాతావరణం అలుముకుంటుంది. మనసంతా పొడి పొడిగా అయిపోతుంది. ఏమీ తోచనట్లు ఉంటుంది. ఏ పనిలో కూడా ఆసక్తి, సంతోషం ఉండదు. ఆఫీసులో పనిలాగే, రమణుల రచనలు కూడా ఆసక్తికరంగా ఉండవు. మరి యీ మనసెప్పుడూ ఒకలాగ ఉండక గజిబిజిగా, ఎగుడు దిగుడులుగా ఉంటుంది. ఇవి తికమకలుగా ఉంటాయి'.
మూడోవారి సమస్య : 3 'నాకు 29 సం॥ల వయసులో, జీవితంలో ఆత్మజ్ఞానం ఒక్కటే తెలుసుకొనవలసినది అనిపించింది. మిగతా అన్నీ కూడా వ్యర్థమైనవే. నేను సాధారణ సాధనలేకాక రమణులు బోధించిన విచారణ కూడా చేశాను. ఇలా యీ 30 సంవత్సరములలో నేను సాధనచేస్తూ, యిపుడు చూసుకుంటే నాలో అభివృద్ధి యేమిటో తెలియడంలేదు. ఇంకా నేను చిన్న చిన్న విషయాలకు, యింట్లో పనివాళ్ళ తప్పులకు, తోటి పనివాళ్ళ అశ్రద్ధకు ఆందోళన చెందుతూనే ఉన్నాను.
ఒక యువ విద్యార్థి 'సమస్య' క్లాసులో యేమి జరుగుతుందో పట్టించుకోకుండా, నేను పగటి కలలు కంటుంటాను. ఉపాధ్యాయులు చెప్పే దానిపై ధ్యాసపెట్టక, నా చుట్టూ అందరూ యేమి చేస్తున్నారో గమనిస్తుంటాను. నా ఊహల్లో, ప్రపంచంలో విహరిస్తూ ఉంటాను.
చివరిగా, యింకొకరి మనసులో అందరిపట్ల అసూయలు నిండి ఉన్నాయి.
మనస్సు నిండా వివిధమైన రకాల తలంపులు నిండిపోయి, ఒకదానితో యింకోటి పోటీ పడుతుంటాయి. మనసెపుడూ ఆలోచనల వరద ప్రవాహంలా ఉంటుంది. ఒక తలంపు నుండి, యింకో దానికి దాటుతూ నిలకడే ఉండదు. ఏదీ స్పష్టంగా ఉండదు. ఇన్ని ఆలోచనల వలన మనసు బలహీనంగా శక్తి విహీనంగా ఉంటుంది.
ఇలా ఒక్కొక్కరి మనస్సూ ఒక్కొక్కలా ఉంటుంది. వాటిల్లోని తలంపులు వేరే వేరే కాబట్టి.
ఈ ప్రపంచంలో యెంతమంది మనుషులుంటే అన్ని రకాల మనసులు ఉన్నట్లు చెప్పవచ్చును. వారి వారి మానసిక ప్రవృత్తులు అన్ని రకాలుగా ఉంటాయి. వివిధ గుణాల ప్రభావం, మనసులోని ఒడిదుడుకులు, మెతకదనం, చురుకుదనం, ప్రశాంతం ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా మారుతూ ఉంటాయి. ఇలాంటి అందరి మనసుల స్వభావాలను విశ్లేషించి మనస్సు యిలా ఉంటుందని ఒక అభిప్రాయానికి రావడం అసాధ్యం.
తలంపుల రూపంగా మనసును చూసినపుడు యీ సమస్యలకు సమాధానం యెప్పుడూ దొరకనే దొరకదు. లెక్కలేనన్ని అనంతమైన గత జ్ఞాపకాలు (వాసనలు, సంస్కారాలు) మనసులో నిక్షిప్తమై ఉండి, వాటికి అనువైన పరిస్థితుల్లో మంచి, చెడు రకరకాల తలంపులుగా లేస్తాయి.
నీ తలంపులను నువ్వు చూస్తున్నపుడు జరిగేదేమంటే నీ మొత్తం గతంవైపు నువ్వు చూస్తున్నావు. దానివలన వాటి వలయంలో యిరుక్కుంటున్నావు. ఈ గతం తాలూకా భారం నుంచే నువ్వు తప్పించుకోవాలి. భారం అని యెందుకన్నామంటే అవి నీపై సవారీ చేస్తూ నిన్ను వర్తమానంలో జీవించకుండా చేస్తాయి. నీ 'వర్తమాన మనసు'ను ప్రభావితం చేసి సహజంగా ప్రవర్తించకుండా చేస్తున్నాయి. రమణులు యీ వచ్చే తలంపులపై ధ్యాస ఉంచితే అవి యింకా బలమౌతాయని చెపుతారు. ఎంత యెక్కువ ధ్యాస దానిపై ఉంచితే, ఆ తలంపు నిన్ను అంతగా దారి మళ్ళిస్తుంది.
అందుకే రమణుల హాస్యపు మాటలో అంత అర్థం యిమిడి ఉంది. 'కోరికలను నువ్వు అసలు వదలివేయాల్సిన అవసరం యేమీలేదు, నీ తలంపులను మాత్రం పూర్తిగా విడిచెయ్'. నువ్వు తలంపులపై ధ్యాస చూపించినంతకాలం, అవి అనంత ప్రవాహంలా పొంగుతూనే ఉంటాయి. మనం, మనస్సులో నిక్షిప్తమై ఉన్న తలంపులపై దృష్టి ఉంచితే, మనం వాటిచే తప్పక బాధితులమవుతాము.
మరి యీ సమస్యకు పరిష్కారం యేమిటి? భగవాన్ మళ్ళీ మళ్ళీ పదే పదే దృఢంగా 'నీ మనస్సులో లేచే తలంపులపై అసలు ధ్యాస దృష్టి నిలుపక వాటిని పోనీ, విడిచెయ్, వదిలెయ్' అని చెప్పేవారు.
'అంతేకాకుండా మనసులోని విషయాల వైపుపోకుండా, అంటే గత జన్మల్లో నువ్వు ప్రోగుచేసుకున్న మలినాల వైపు నువ్వు పోకుండా వాటికి దూరంగా నీ దృష్టిని మళ్లించాలి. అందుకే మనసు అంటే యేమిటో తెలియాలి' అనేవారు. అంటే ఆలోచించేవాడి పైన మనసును కేంద్రీకరించి లగ్నం చేయాలి. ఈ తలంపులు యెవరికైతే వస్తున్నాయో వానిపై ధ్యాస నిలబెట్టాలి. తలంపులను, తలంచేవాడికే కట్టబెట్టి ప్రశ్నించడం తప్పనిసరిగా చేయాల్సిందే. అందుకోసం రమణులు చెప్పినవి :-
ప్రశ్న:- మనస్సును యెట్లా నిశ్చలం చేయాలి?
జవాబు :- మనసుతో, మనసుపైనే దృష్టి పెడితే దాన్ని నిశ్చలం చేస్తుంది.
ప్రశ్న :- తన నిజతత్త్వం, సహజస్థితిని కనుక్కోవడంలో ఆటంకాలను తాను యెలా తొలగించుకోవాలి?
జవాబు :- ప్రతీ తలంపుకూ మూలాన్ని వెదుకు, తలంపు పుట్టు స్థానం కనుక్కో అది మనస్సే. ధ్యానంలో అలా 'నేను'ను వెదుకు. 'నేను యెవరో వెదుకు. ఎప్పుడూ యే తలంపునూ ప్రవర్తింపనీయకు. వాటికి స్పందిస్తే, అంతం ఉండదు. ప్రతీ తలంపును వాటి పుట్టుస్థానం మనస్సుకే మళ్ళీ మళ్ళీ ప్రతిసారి స్పందించకుండా ప్రశ్నించి తీసుకునిపో. అపుడు ఆ తలంపు, మనసూ, రెండూ, ప్రశ్నలు నిరాసక్తత వలన లేకుండా నశిస్తాయి. మనసు తలంపుల రూపంలోనే మనగలుగుతుంది. తలంపులు పోతే, నాశనమైతే, యిక మనసు అన్నది లేనేలేదు.
సందేహం, నిస్పృహ కలిగినపుడెల్లా 'ఈ సందేహించే వాడెవరు? నిస్పృహ కలిగినదెవరికి?' అని ప్రశ్నించి వెదకి విచారణ చెయ్. ప్రతీసారీ నిరంతరంగా స్థిరంగా యీ ప్రశ్నకే వెళ్ళు. యీ 'నేను' యెవరు? అది యెక్కడ నుంచి? మూలమైన ఆధారం తప్ప యింకేమీ లేకుండా మిగలకుండా చింపి, చింపి
పారెయ్. అదే నువ్వు. అపుడు వర్తమానంలోనే జీవించు. దానిలో మాత్రమే ఆనందించు. ఇక మనసులో యేదీ, భారమై భావించే గతంగానీ, భవిష్యత్తు గానీ లేవు. ఉండవు. వర్తమానం మాత్రమే. అదే నీ సహజస్థితి. సర్వశక్తివంతం, చైతన్యం, పరమానందమే అయినది.
తలంపులను కేంద్రం మూలానికి తీసుకుని పోతున్నపుడు, మనస్సులో నిండి ఉన్న ఎన్నో వివిధ రకాల తలంపుల మహాసాగరాన్ని మధించినట్లే ఉంటుంది.
నువ్వు మనస్సును తన మూల స్థానంలోనికి మరల్చి నిలిపినపుడు, యినుపరజమును అయస్కాంతము ఆకర్షించినట్లు, నీలోని ఆత్మచైతన్యము తన శక్తితో ఆ మనసును తనలోనికి గుంజుకుంటుంది. అపుడు ఆ మనస్సు ఎరుకలో, హృదయంలో కలసిపోతుంది. దాని తరువాత మనసు వేరుగా లేవడం జరుగదు.
శుద్ధమైన మనసుకు కూడా సాధారణ యింద్రియ శక్తులు, జ్ఞాపకం, విచక్షణ, తర్కం అన్నీ ఉంటాయి. తేడా యేమిటంటే, అవన్నీ అహంకారపూరితంగా కాకుండా ఆత్మగానే ఉంటుంది. తలంపుల భారం లేకుండా వర్తమానంగానే ఉంటుంది. ఎప్పుడూ అలానే ఉంటుంది.
అలాంటి మనసు ఎప్పుడూ యేది అవసరం అయితే అంతవరకు స్పందిస్తుంది. పరిపూర్ణంగా పూర్తిగా ప్రవర్తిస్తుంది. శుద్ధ నిర్మల మనసు అంటే ఆత్మ (నేను) వలననే అన్నీ చేయడం, మాట్లాడడం, స్పందన, ప్రవర్తన జరుగుతుంది. మనసు మలినాలు, యెన్నో విధాల అస్థిర గుణాల నుండి విముక్తి పొందుతుంది.
ఆత్మలోనే నిలచి ఉంది కాబట్టి ఆ మనసు బ్రహ్మానందం అనుభవిస్తూంటుంది. దేశకాలాల కతీతంగా సదా ఉంటుంది. వర్తమానం అంటే 'ఇక్కడ' 'ఇప్పుడు'. ఇవి అన్నిచోట్లా అన్నికాలాల్లో ఉంటాయి.
అంటే ప్రదేశానికి, కాలానికి అతీతం. అంటే ప్రదేశం కాలం లేనివే శుద్ధ మనసుకు. ఉన్నదంతా సత్ (నువ్వు/నేను), దాని అఖండ శాంతం, మౌనం, బ్రహ్మానందం, అనంత చైతన్యం.
No comments:
Post a Comment