*ఓం నమో భగవతే శ్రీరమణాయ*
*02 రమణ మార్గం*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 2 రమణుని బోధనలు*
రమణుని బోధనలన్నీ ఒకే ఒక్క విషయంపై లగ్నమై ఉంటాయి. అవన్నీ తాను స్వయంగా అనుభూతి చెందిన, దేహంతో తాద్యాత్మం చెందని అమృత తత్వమైన 'నేను, నేను' పైన ఆధారపడినవే. 1896వ సంవత్సరము జూలై 17న మధురైలో తన మావయ్యగారి యింటిలో ఉండగా జరిగిన సంఘటనే రమణుల బోధనలన్నింటికీ మూలం, ఆధారం. అదే, తాను అంటే యీ దేహం అనే భావన నశించగానే, స్పురణ అంతా తనపైనే తప్పనిసరిగా కేంద్రీకృత మవుతుంది. అపుడు 'నేను' చైతన్యం ఆనందమే తప్ప వేరు కాదని, అనుభూతి కలిగి, ఉన్నది అదొక్కటి మాత్రమే తప్ప వేరుగా యేమీలేదని, మానసిక ప్రవృత్తులన్నీ దానివలన దానిలోని కదలికలేనని విశదమవుతుంది. ఇది రమణులకు నేనెవరనే విచారణ వలన, 'నేను’ కేంద్రంగా జరిగిన విచారణ వలన అనుభవంగా తెలుస్తుంది. తన మృత్యుభయం మనసును అంతర్ముఖంచేసి, యీ దేహ మరణమే అంతిమమా అని విచారణ చేయిస్తుంది. ఈ విచారణ తన దేహం/అహంకారంతో తనకు కలిగిన తప్పు గుర్తింపును అంతంచేసి, అదే సమయంలో అకస్మాత్తుగా తనలోని 'నేను, నేను' అనే చైతన్యం స్ఫురిస్తుంది. అప్పటినుంచీ రమణులు సహజమైన పొరలిపొంగే ఆనందసాగరంలో నిలకడగా నిలచారు. అతనికి భయాలన్నీ యిక యెలాంటివీ లేకుండా మాయమయ్యాయి. ఈ అనుభవంపై ఆధారపడిన అతని బోధ చాలా సరళమైనది. తన స్వస్వరూప జ్ఞానము, ఆత్మజ్ఞానము నేనెవరనే విచారణ ద్వారానే సాధ్యం. తన నిజస్వరూపం యేమిటి అనే విచారణ, వ్యక్తి/నేను అనే భావన/అహంకారం పుట్టే మూలస్థానంకు తీసుకుని వెళుతుంది. ఈ విచారణే ప్రఖ్యాతిగాంచిన ప్రశ్నలు 'నేనెవరు?', 'నేను యెక్కడ నుంచి?’గా రూపుదాల్చాయి. ఈ ప్రశ్న విచారణతో అంతమయి, 'నేను, నేను’ అనుభవం కలిగి, 'నేను ఫలానాఫలానా' అనే అహంకారభావం మాయమైపోతుంది.
ఈ పద్దతి సూటితనం యెంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. మానవజన్మ పరాకాష్టగా, గమ్యంగా యెంతో ఆధ్యాత్మిక సాధనతో లభించే ఆత్మసాక్షాత్కారము, యింత సులభంగా దొరుకుతుందా? నియంత్రించలేని మనసు సంగతి యేమిటి? సాధారణంగా పాటించి ఆచరించవలసిన యెన్నో విధాల నియమనిష్టలు సంగతి యేమిటి? రమణుని బోధ అర్ధం చేసుకోవడంలో యిదే ప్రథమ ఆటంకం. సత్యం యెప్పుడూ, యెలాంటి అడ్డదారులూ లేకుండా సూటిగా, స్పష్టంగా సరళంగా ఉంటుంది. కానీ మనస్సే, యెన్నో ఆకర్షణీయమైన తలంపులు, మేధోపర అల్లికలు అల్లుతుంది. సత్యం యెక్కడైనా యెప్పుడూ అంతటా ఉన్నదే, ఉండేదే. ఎవరికైనా దాన్ని పొందడానికి యెలాంటి షరతులూ అవసరం లేదని భగవాన్ గట్టిగా చెపుతారు. తన సహజస్థితిలో తానుగా నిలచి ఉండటానికిగల ఆటంకాల గురించి యెవరైనా చాలా జాగ్రత్తగా గమనించాలి.
మనస్సు నిజతత్త్వమును అర్థం చేసుకొనకపోవడమూ, అనంతమైన తలంపులే అసలైన ఆటంకాలని రమణుల బోధ స్పష్టం చేస్తుంది. అంతటా ఉన్నదంతా ఒకే ఒక్క ఎరుక (ఆత్మ/నేను/సత్) కాబట్టి, మనస్సు అనేది యింకొకటి స్వతంత్రమైనదిగా ఉండదు. అది ఎరుక చైతన్యాన్నే ప్రతిఫలిస్తుంది. చంద్రుడు సూర్యకాంతిచే ప్రతిబింబించినట్లు, తలంపులే అయిన మనస్సు, స్వతంత్రత ఉనికి లేనిదే, మిథ్యయే. మెలకువలో లేచి, గాఢనిద్రలో లేని మనస్సు మిథ్యాతత్త్వము, దాని నిజతత్త్వము గురించి విచారణ జరుపనంతకాలం భ్రమ ఉంటుంది. తలంపుల పుట్టుకస్థానంపై దృష్టి నిలిపితే, మనసు తనకు ఆధారమైన మూలంలో కలసిపోతుంది. ఇక శేషించేది శుద్ధచైతన్యం (ఎరుక) మాత్రమే, దాన్ని ప్రతిబింబించేదే శుద్ధ మనస్సు.
రమణులు తరుచూ వాడే 'మనో నాశనం' అనే పదం చాలా అపార్థంకు గురయింది. అందువలన చాలామంది భయపడిపోతున్నారు. మనసనే పనిముట్టుతోనే వ్యక్తి జీవితం నడుస్తుంది. జీవించి ఉన్న భావన కలుగుతున్నది. మరి మనస్సును నాశనంచేస్తే యెవరైనా యేం చేయగలరు? ఇక్కడే మనం ఆగి, దీని అర్థం యేమిటో తెలుసుకోవాలి.
ఇంతకుముందు వివరించినట్లుగా మనస్సు ఉంది. అది శుద్ధనిర్మలమైనది. ఎలాంటి బంధాలు, భావాలు లేకుండా ఆత్మను (నేనును) అది ప్రతిబింబిస్తుంది. మానసిక శక్తులైన తలంచడం, బుద్ధి, జ్ఞాపకం, విచక్షణ, ఇంద్రియ నిర్వహణ లాంటివన్నీ పూర్ణంగా ఉంటాయి. కానీ, లెక్కలేనన్ని అనంతమైన ఆలోచనలతో, భావాలతో మానసిక శక్తి వ్యర్థం, ఖర్చు జరుగదు. ఎన్నో రకరకాల ఆలోచనల వలన కృశించిన మనసు బదులు, ఒకేదానిపై లగ్నమై, నిమగ్నమై, సమగ్రంగా, పూర్ణంగా భావనారహితమైన యెంతో శక్తివంతమైన మనసు ఉంటుంది.
ఇంకో సాధారణముగా అందరికీ కలిగే భయం యేమిటంటే, రమణుల పద్ధతిన తన్ను తానుగా (ఆత్మగా, నేనుగా) నిలచి ఉన్నట్లయితే, తనకు యీ ప్రపంచం యింక ఉండదు, గ్రహించబడదు అని. ఇది కూడా పూర్తి అపార్థమే. జ్ఞానికి, అజ్ఞానికి యిద్దరికి కూడా ప్రపంచం ఉంటుంది. అజ్ఞాని యీ నామరూపాలను శాశ్వతం అనుకుని భ్రమతో వాటిలో లీనమై ఉంటాడు. జ్ఞాని యీ నామరూపాలను గుర్తిస్తూనే వాటి అన్నిటి వెనుక అంతర్గతంగా నిలచివున్న శాశ్వత అఖండ పూర్ణచైతన్యం స్ఫురణతో ఉంటాడు.
అనంతమైన మనస్సు యొక్క గుప్తశక్తినీ, హద్దులే లేని పొంగిపొరలే అనంత పరమానందాన్ని పొందే అవకాశం ఉండటం వలన, అందరూ రమణుని పవిత్ర దివ్యబోధనలపై దృష్టి నిలపాలి. అపుడు, యీ సాధన విచారణ మనలోని యెన్నో రకాల భయాలను, సందేహాలను తొలగించి రమణుల మార్గంలో స్థిరంగా నిలుపుతుంది. చాలామంది రైల్వే ప్రయాణికులిలా, గమ్యానికి ముందే మధ్య స్టేషనుల్లోనే దిగిపోతారు. గమ్యం వరకు కొనసాగించరు. మధ్యలోనే ఆగిపోవడం జాలి కలిగించేదే, ఎందుకంటే అలా వారు అపరిమిత అనంత మనసుయొక్క అనంత అఖండ పరమానందాన్ని చేజార్చుకుంటున్నారు.
No comments:
Post a Comment