Tuesday, August 2, 2022

నీవెవరివో నువ్వు కనుక్కో, అధ్యాయం - 5. జీవించి ఉన్నది యెవరు? మరణించేది యెవరు?

 *🧘‍♂️05- శ్రీ రమణ మార్గము* 


*నీవెవరివో నువ్వు కనుక్కో*

*అధ్యాయం - 5*

 *జీవించి ఉన్నది యెవరు? మరణించేది యెవరు?*


ఓ! అరుణాచలా!


సంసార సాగర సంకటములఁ గుదుర్చు నరుణాచలా! నాకు శరణమౌ ప్రభూ! నా తల్లి జ్వరమును గుదుర్చుటకు నీవు గా కెవరున్నారు?


కాలకాలుఁడా! నాకు నీవే శరణము. నీయనుగ్రహమును నా తల్లిపై జూపి మృత్యువు నుండి రక్షింపుము. విమర్శించి చూడఁగా మృత్యువెవరు? అరుణాచలా, జ్ఞానాగ్నీ, నీ తేజస్సు నా తల్లి నావరించి తనలో నైక్యముఁ జేసికొనునుగాక, చితాగ్ని పాలామె యెందుకుఁ గావలెను?


మాయమైకముఁ దొలంచు నోయరుణాచలా, నా జనని మైకమును (సంధి) బోఁగొట్ట నాలస్యమేల? నిన్ను శరణు బొందిన జీవుని కర్మములను నివారించి మాతృప్రేమతో రక్షించుటకు నీవుగాక మఱియెవరైననున్నారా?


- అమ్మ ఆరోగ్యం కోసం భగవాన్ ప్రార్ధన:-


 పుట్టినరోజు పండుగను జరుపుకుందామనుకుంటున్న మీరు కనీసం ఈ రోజున అయినా యీ పుట్టింది యెవరు? అని విచారణ చేయండి. జననం మరణం అనేవే లేని, సదా ఆత్మచైతన్యమయిన 'నేను'గా ఉన్నరోజే యెవరికైనా నిజమయిన జన్మదినం.


*భగవాన్ శ్రీరమణ మహర్షి:-*


రమణుని బోధనలను, వాక్యాలను సరిగ్గా గ్రహించడానికి, తరచుగా వాడే కొన్ని పదాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం అవసరం. ఇవి దేహం పుట్టుక, అహంకారం పుట్టుక, మనస్సు పుట్టుక, మనస్సు నాశనం, 'నేను'గా కొత్త జన్మ లాంటివి. దేహం జననం మరణం చక్కగానే అర్థం అవుతుంది. యివి పూర్తిగా భౌతికం కాబట్టి.


తల్లి గర్భంలోంచి ప్రసవించినపుడు ఒకరు పుట్టారని, అలాగే దేహంలో నుంచి ప్రాణం పోగానే వైద్యపరంగా అతని మరణం అంటారు. జననం మరణం అనే రెండూ కూడా కర్మల కారణాల వలననే, దేహం పుట్టక ముందే నిర్ణయింపబడిన కర్మలను చేసేందుకు అనుభవాలను

పొందేందుకు జరుగుతున్నాయి. ఇలాంటి జననాలు యెవరికైనా వారి మనసు/ అహంకారం నాశనంకాక నిలచి ఉన్నంతవరకూ అనంతంగా మళ్ళీ మళ్ళీ కలుగుతాయి. అంటే మనసు/అహంకారం నాశనం అయితే 'నేను' (ఆత్మ)గా మేల్కొని యిక జనన మరణాలు లేని పరిపూర్ణ అనంత చైతన్యులుగా ఉంటారు.


మనసు నాశనం అంటే యేమిటని క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే యింకా లోతుగా పరిశీలించాలి. సరిగ్గా చూస్తే, మనసు అంటే తలంపుల తరంగాలే. అవి నిరంతరంగా క్షణక్షణం ప్రవాహంలా మారుతూ, నేను అనే భావన (అహంకారం) కేంద్రంగా చుట్టూ అల్లుకుని తిరుగుతాయి.


అవి 'నేను' అనే భావన ఉన్నవాని (వ్యక్తి) ధ్యాసపై ఆధారపడి ఉంటాయి. రోజూ జరుగుతున్న గాఢ నిద్రావస్థ (సుషుప్తి)లో తలంపులు దానికవే ఆగిపోతాయి, లేవు. ఈ అవస్థలో తలంపులుగాని, అవి ఆధారంగా, కేంద్రంగా చేసుకున్న వ్యక్తి (అహంకారం) గాని రెండూ లేవు, పోయాయి. అంటే మనసు లేదు. మనసంటే తలంపులు, అందులోని ప్రథమ తలంపు నేను అనే భావన (అహంకారం/వ్యక్తి), మిగతా అన్ని తలంపులూ దీన్ని కేంద్రంగా అల్లుకునేవి. గాఢనిద్రావస్థను మనసు తాత్కాలిక మరణం అని చెప్పవచ్చును.


రోజూ కొన్ని గంటలసేపు నిద్రావస్థలో, మనసు లేదు. ఆ సమయంలో 'నేను' 'నేను'గా ఉంటుంది. ఈ సుషుప్తి నుంచి మేల్కొనగానే, స్వప్నావస్థలో అయినా సరే, ఆ ప్రథమ తలంపు 'నేను అనే భావన' (వ్యక్తి భావన) దాని కేంద్రంగా ఆధారంగా మిగతా అన్ని ఆలోచనలూ, భావనలూ లేస్తాయి, మళ్లీ నిద్రావస్థ వచ్చేవరకూ. అంటే నిద్రావస్థలోంచి మెలకువలోనికి (జాగ్రదవస్థ) గాని, కలలోనికి (స్వప్నావస్థ) గాని మారినపుడు మనసు మళ్ళీ జన్మిస్తుందని చెప్పవచ్చు. ఈ మెలకువలోగాని, కలలోగాని మనసు లేచినది తాత్కాలిక జననం, మళ్ళీ నిద్రావస్థలో మనస్సు తాత్కాలిక మరణం రోజూ జరుగుతున్నవే.



ప్రతిరోజూ జరిగే యీ తాత్కాలిక మరణం, జననం గురించి భగవాన్ ప్రత్యేకంగా వివరించి చెప్పేవారు. దేనికోసం అంటే తలంపులు లేని స్థితి అంటే యేదో ఘోర విపత్కరమైనదిగా ఉన్న భయాన్ని పోగొట్టేందుకు. ఇది రోజూ జరుగుతున్నదే. దాని నుంచి యెవరూ పాడవటం లేదు, బాధపడడం లేదు సరికదా యింకా శక్తి పుంజుకుని తాజాగా ఉంటున్నారు. ప్రతీరోజూ నిద్రావస్థలో యెంతో ఆనందాన్ని పొందుతున్నారు. ఇదే ఫలితాన్ని, స్ఫురణతో 'నేను యెవరు విచారణ' చేస్తున్నా కలుగుతుంది అని భగవాన్ చెప్పేవారు.


 'నేను'పై ధ్యాస దృష్టి పెట్టినపుడు, తలంపులు లేవడం తగ్గుతుంది. వాటిపై శ్రద్ధ చూపే వ్యక్తి లేకపోతే, దృష్టి పెట్టకపోతే, అవి యిక రావు, ఆగిపోతాయి. అపుడు చివరిగా 'నేను అనే భావన' 

(అహంకారం/వ్యక్తి భావన) కూడా లేకుండా పోతుంది. మెలకువలో అది యెక్కడ నుంచి పుట్టి లేస్తున్నదో, అదే స్థానంలో (హృదయంలో) మూలంలో కలసిపోతుంది.


ఈ స్థానమే మనలో ఉన్న దివ్యత్వానికి కేంద్రం. 'నేను' ఉండే స్థానం, నివాసం. అందుకే, విచారణ స్ఫురణతో చేయగా, చేయగా నాశనంలేని శాశ్వతమైన అక్షయం అవ్యయం అయిన 'నేను'తో కలుపుతుంది. మనసు తనకు యెన్నో జన్మల నుండి యెంతో బలంగా అలవాటయిన బాహ్యంలో చరించడం మెల్లగా తగ్గుతూ, గత జన్మల వాసనల వలన బయట ప్రపంచంలోని ఆనందం వెదకడం ఆగిపోతుంది. ఆత్మయొక్క బ్రహ్మానందం సదా అనుభవిస్తుంది.


ఒకసారి వ్యక్తి (అహంకారం), దాని తలంపుల మధ్య కత్తిరింపు జరిగిందో, అపుడు మనసు యొక్క నిజమైన, సహజమైన స్వభావం తెలుస్తుంది. అది యేమిటి? అది ఆత్మ (నేను) యొక్క ప్రతిబింబమే, అందుకే అది నిర్మలం శుద్ధమే. అలాంటి మనస్సు దేనికయినా వెంటనే స్పందిస్తుంది. మలిన మనసు అనంతమైన తలంపులలో యిరుక్కుంటుంది. శుద్ద మనసుతో జీవనం యెంతో సామరస్యంగా పరిపూర్ణ చైతన్యం ఆనందంతో సదా సాగుతుంది.


ఇదంతా చెప్పడానికి చక్కగా ఉంది. కానీ రమణులు యీ సత్యాన్ని యెట్లా గ్రహించారు. ఇది కూడా తెలుసుకోవాలి మనం. యెందుకంటే భగవాన్ బోధించేదంతా తన స్వంత అనుభవాలు, అనుభూతినుంచే. భగవాన్ వాటిని అందరితో ఆనందంగా పంచుకుంటారు యెంతో దయతో. రమణులు, జీవితంలో మరణ సంఘటనలను ఐదుసార్లు యెదుర్కొన్నారు. మొదటిది, 1892వ సంవత్సరములో తన 12 యేళ్ల వయసులో. తన తండ్రి మరణించి, శవం నేలపై ఉన్నది. తన అమ్మగారు, తమ్ములు, బంధువులు అందరూ రోదిస్తున్నారు.


 ఈ దృశ్యం రమణుని శోధించేటట్లు చేసింది. జీవిస్తూ ఉన్న తన తండ్రి శరీరం నుంచి యేమిటి వెళ్ళిపోయింది, అది శవంలా అచేతనంగా యిలా పడి ఉండటానికి? తను జీవించే ఉన్నాడు. మరి తేడా యెలా వచ్చింది? శవదహనం జరిగిపోయిన తరువాత కూడా భగవాన్ యెన్నో గంటలు యీ ప్రశ్నలతో సతమతమవుతూనే ఉన్నారు. అంతిమంగా ఒక అభిప్రాయానికి వచ్చారు. "ఏదో 'నేను' అనే ఒక శక్తి వలన శరీరం నడుస్తుంది, చూస్తుంది, తింటుంది, పని చేస్తుంది. నాకు యీ 'నేను' గురించి స్ఫురణ ఉన్నది. కానీ నా తండ్రిలోని 'నేను' ఆ శరీరాన్ని వదలిపోయింది'. అంత చిన్న వయసులోనే, భగవాన్ జీవనం, మరణం గురించి ప్రశ్నలను చాలా దగ్గరగా పరిశీలించారు.


తరువాతది, నూతనశకయుగారంభ చరిత్ర సృష్టించిన జూలై 17, 1896 సం॥లోని సంఘటన. చనిపోవడం గురించిన తనను ఆవహించిన తీవ్ర భయం, అసలు మరణం అంటే యేమిటి అని పరీక్షించి పరిశీలించేటట్లు చేసినది. ఈ శరీరం చనిపోతే, 'నేను' కూడ మరణించినట్లేనా? ఈ ప్రశ్న తన మనసును అంతర్ముఖం చేసి, తాను (నేను) మరణంలేని శాశ్వతమైన సర్వత్ర సర్వకాలాల్లో అంతటా నిండి ఉన్న బ్రహ్మమే అని తెలిసింది.


 బ్రహ్మం, సత్, ఆత్మ అదే 'నేను'. ఈ స్ఫురణ, సంగీత రాగాల వెనుక ఉన్న నిరంతర శ్రుతిలా, తనలో స్థిరంగా అనంతంగా ఉంది. భగవాన్ మనసు నాశనం అయింది. బాహ్య ప్రపంచంలో చరించి, ఆనందం వెదకడం అంతం అయింది. పరిపూర్ణ చైతన్యమైన 'నేను' యొక్క శుద్ధ నిర్మల ప్రతిబింబం అయింది మనసు. భగవాన్ కి కాలం మరణం లేని సత్యం తెలుసుకున్న వాని సత్ దర్శనం కలిగింది.


ఇంకోసారి 1912వ సంవత్సరంలో జరిగింది. భగవాన్ పచ్చయ్యమ్మన్ కోవిల నుండి విరూపాక్ష గుహకు కొంతమంది భక్తులతో కలసి తిరిగి వస్తూ ఉండగా, తన కళ్ళముందు ప్రకాశవంతమైన తెల్లని తెరలా వచ్చి యింకేమీ కంటికి కనుపించలేదు. ఆ సంఘటన గురించి రమణులే స్వయంగా యిలా వివరించారు.


'నా ముందున్న దృశ్యాలన్నీ మాయమైపోయి నా కంటిముందు ఒక ప్రకాశవంతమైన తెల్లని తెరలా వచ్చి నాకూ, ప్రకృతికి మధ్య నిలచి, ప్రకృతిని కనుపించకుండా చేసింది. ఇది మెల్లగా జరిగి, నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మొదట నాకు ప్రకృతి కొంచెం మాత్రమే కనుపించి, మిగతాది తెర వలన మరుగైంది.



 ఇది మెల్లగా కిటికీ తెరను మూసి దృశ్యాన్ని కప్పినట్లుంది. ఇలా అనుభవం జరుగగానే, యిక నడక ఆపేశాను, లేకపోతే క్రింద పడతానని. ఆ తెర పోగానే మళ్ళీ నడక మొదలుపెట్టాను. మళ్ళీ రెండవసారి, దృశ్యం మరుగుపడి, మగతగా ఉంటే ఒక రాయికి, అది పోయేంతవరకూ చేరబడ్డాను. మళ్ళీ మూడవసారి జరిగితే, కూర్చుంటే మంచిదని, ఆ రాయి వద్ద కూర్చున్నాను. అపుడు ఆ ప్రకాశమైన తెల్లని తెర నా చూపును పూర్తిగా మూసివేసినది.


నా తలలో యేదో ఈదుతున్నట్లు ఉండి, రక్తప్రసరణము, శ్వాస ఆగిపోయాయి. చర్మం అంతా చిక్కని నీలం రంగుగా మారిపోయింది. ఇది సాధారణంగా దేహం మరణంలో జరిగినట్లే, రాను రానూ చిక్కగా మారింది. నాతో ఉన్న వాసుదేవశాస్త్రి నేను చనిపోయానని, నన్ను కావలించుకుని, గట్టిగా యేడుస్తూ నా మరణం గురించి రోదించసాగాడు. అతని శరీరం వణకసాగింది.


నాకు చూచాయగా అతను నన్ను పట్టుకోవడము, వణకడం, అతని రోధన తెలుస్తూనే జరిగింది. అర్థం అవుతూ ఉంది. దేహం రంగు మారినది కూడా తెలుస్తూ, గుండె ఆగిపోవడం, శ్వాస ఆగిపోవడం కూడా తెలుస్తూనే ఉంది. దేహంలోని వివిధ భాగాలు బిర్ర బిగుసుకుపోవడం అర్థం అవుతూ ఉంది. అయినా నా సాధారణ మామూలుగా ఉండే స్ఫురణ ప్రవాహం ఆ స్థితిలో కూడా ఆగలేదు, కొనసాగుతూనే ఉంది. నాకేమీ భయం కలుగలేదు.


ఆ దేహస్థితి గురించి యెలాంటి బాధ కలుగలేదు. నేను రాయి ప్రక్కన మామూలు ఆసనంలో కూర్చోగానే కళ్ళు మూసుకున్నాను గానీ రాయిపై చేరబడలేదు. దేహంలో రక్తప్రసరణ, శ్వాస లేకపోయినా సరే అదే ఆసనంలోనే దేహం యింకా ఉన్నది. ఈ స్థితి సుమారు ఒక పదిహేను నిముషాల వరకు నిలచింది. అప్పుడు ఒక్కసారి విద్యుత్ ఘాతంలా దేహంలో అనిపించింది. ఎంతో శక్తితో రక్తప్రసరణ, శ్వాస మొదలై గుండె పనిచేయడం మొదలయింది. శరీరం అంతటా ప్రతీ అణువులో స్వేదన మొదలయింది. చర్మంపై జీవకళ మళ్లీ కనుపించింది. అపుడు నేను కళ్ళు తెరచి, లేచి నిలబడి 'పదండి వెళ్లాం' అన్నాను.


ఏమీ కష్టం లేకుండానే విరూపాక్ష గుహ చేరుకున్నాము. ఇలా ఈ ఒక్కసారి మాత్రమే శ్వాస, రక్తప్రసరణ దేహంలో పూర్తిగా ఆగిపోయిన సంఘటన యిది.


ఇక్కడ పరిశీలనగా గమనించవలసిన విషయాలు యేమిటంటే, యీ మరణ సంఘటనలో భగవానకి యెలాంటి భయం లేశమైనా కలుగలేదు, తన 'నేను' స్ఫురణ యేమాత్రం ఆగలేదు, తగ్గలేదు. దీనివలన ఆత్మను (నేను) తెలుసుకున్న శాశ్వతమైన సత్ స్వరూపులకు, దేహ మరణం వలన యెలాంటి మార్పు ఉండదు.


భగవాన్ మరణ సంఘటనతో పరిచయం యింకొకసారి 1914వ సం॥లో జరిగినది. అమ్మకు టైఫాయిడ్ వచ్చి చాలా ఆపదలో ఉన్నది. ఈ సమయంలో అమ్మ ఆరోగ్యం నయంకోసం భగవాన్ అరుణాచలుని ప్రార్థించడం అందరికీ ప్రముఖంగా తెలిసినదే. అమ్మకు కూడా ఆత్మ దర్శనం జరిగి ఉంటే, దేహ. మరణం, శవ దహనం అర్ధం లేకుండా పోయేవి. అందుకే అరుణాచలునికి ఆమెకు దేహంతో సంబంధం నుంచి విముక్తి చేయమని ప్రార్ధన.


చివరి సంఘటన మే 19, 1922వ సంవత్సరంలో జరిగింది. అమ్మ, భగవాన్ తో 1914 నుండి 1922 వరకూ ఉన్నది. వారి మార్గదర్శకత్వంలో చాలా పరిపక్వం చెందింది. ఆమె, భగవాను శరణాగతి చెందింది. అందువలన అమ్మకు ముక్తి ప్రసాదించడం భగవాన్ బాధ్యత. అమ్మ చివరి దశలో ఆ రోజు, భగవాన్ అమ్మ కళ్ళపై ఒక చేయి, హృదయంపై ఒక చేయి వేసి పండ్రెండు గంటలు అలా అమ్మకు యెన్నో రాబోయే జన్మల కర్మల అనుభవాలను ఆ కొద్ది గంటల సమయంలోనే అనుభవింపజేశారు.


 భగవాన్ పవిత్ర చేతి స్పర్శ అమ్మ మనసును, మూలమైన హృదయంలో అణగద్రొక్కింది. ఎవరికైనా యీ దేహానికే మనం పరిమితమన్న భావన, బంధం, బానిసత్వం నుంచి విముక్తి పొంది జయం పొందాలంటే సద్గురువులు భగవాన్ అనుగ్రహం యెంత అవసరమో తేటతెల్లం చేస్తుంది.


జీవనం, మరణం గురించి తెలుసుకోవడానికి యింకా యేముంది? ఈ అయిదు సంఘటనలతో భగవాన్ మనకి మరణ అనుభవం గురించి తెలిపి, దాని నిజమైన అర్థం చూపించారు. ఎవరైనా నిరంతరం శ్రద్ధగా 'నేనెవరు విచారణ’ చేస్తే, సద్గురువులు భగవాన్ అనుగ్రహంతోడై తన స్వస్వరూప దర్శనం జరిగి, వారు మరణమే లేని కొత్త పునర్జన్మ పొం దుతారు. 

No comments:

Post a Comment