Tuesday, August 2, 2022

నీవెవరివో నువ్వు కనుక్కో* *అధ్యాయం - 6* *దేహ జననం - మనసు నాశనం - ఆత్మజ్ఞానం

 *🧘‍♂️06- శ్రీ రమణ మార్గము🧘‍♀️*

*నీవెవరివో నువ్వు కనుక్కో*

*అధ్యాయం - 6* *దేహ జననం - మనసు నాశనం - ఆత్మజ్ఞానం*


ఎవరైనా భగవాన్ బోధనలను తెలుసుకుని, వాటి అర్థాలను ఆకళింపు చేసుకునేటపుడు, చాలామంది సాధకులకు మౌలిక విషయాలైన జన్మ, మరణం, మనసు నియంత్రణ, ఆత్మజ్ఞానం లాంటివి కొంత మింగుడు పడవు. జన్మకు కారణాలేమిటి, దేహంతో మనసు అనుభవించే వాటికి సంబంధం యెలా యేమిటి? లాంటివి మనకు తెలిసింది లేదు. మనకి మన స్వస్వరూపం గురించి సత్యం (ఆత్మజ్ఞానం) తెలియదు. కానీ యివన్నీ ఒకటితో ఒకటి సంబంధం ఉన్నవే, సమగ్రమయినవే.


జన్మ అంటే యేమిటో చూద్దాం. మనం అనుకోవడంలో, గ్రహింపులో దేహం పుట్టడం మన జన్మ, ప్రాణం పోయి అది శవంగా అవడం మన మరణం అని. జననం, మరణం అనేవి శరీరానికి సంబంధించినవే, అవి తప్పనిసరి సంఘటనలని అందరూ అంగీకరించేదే. జననం, మరణం రెండూ వచ్చీపోయే దేహానికి సంబంధించినవి కాబట్టి, పునర్జన్మ ఉందా అన్న ప్రశ్న ఉదయిస్తుంటుంది. ఉంటే, యెప్పుడు, యెంత కాలానికి? ఇలా అడుగుతారు. భగవాన్, యీ దేహం జన్మించడం అనేది యే కారణం వలన జరిగింది అన్న విషయం లోనికి వెళ్ళకపోతే, నువ్వు మరణం గురించి భయపడుతూ బ్రతకాలి అంటారు. అందుకే యీ శరీరం జన్మించడానికి కారణం తెలియదు కాబట్టి, యెన్నో గర్భాల్లో నుండి యెన్నో జన్మ పరంపరలు వాటికవే కలుగుతాయి.


ఈ దేహం రావడానికి కారణం మనసు అని భగవాన్ స్పష్టం చేస్తారు. చూద్దాం. దేహానికి కారణం మనసా? ఇలా భగవాన్ యెందుకు చెప్పారా అని ఆశ్చర్యం కలుగుతుందా? ఎందుకంటే మనసు నిరంతరం ఆనందం గురించి కోరుతూ వెదుకుతూ ఉంటుంది. బాధల అనుభవాల నుంచి తెలుసుకుని వాటిని వదిలి దూరంగా ఉంటుంది.


 అసలు నిర్మల శుద్ధ మనసు సహజంగా ఆనందమయ మయినదే, కాని మలినాల వలన ఆ బ్రహ్మానందాన్ని మరచి అది మరుగై, అది ఒకటి ఉందని తెలుసు గుర్తు కాబట్టి ఆ శాశ్వత పూర్ణానందం కోసమై జన్మ జన్మల్లో వెదుకుతూ ఉంటుంది. అలా వెదుకుతూ, ఆనందాన్ని అనుభవించడానికి ఉపాధి (బండి, సాధనం) యే భౌతికదేహం. ఒక శరీరంతో జీవితం అంతం అయిపోయింది అంటే అర్థం మనస్సు యొక్క కష్టసుఖాలు అనుభవాలు అయినట్లే, ఆ శరీరం ఉపాధిగా ముగిసినట్లే. ఆ అనుభవాలను కొనసాగించడానికి మనసు అపుడు యింకో భౌతిక శరీరం కోసం చూస్తుంది. మనసు/అహంకారం (అవి ఒక్కటే) దేహం లేకుండా ఉండలేదు. ఏదో శరీరంలో ఉంటుంది. అంటే ఒక భౌతిక శరీరం మరణంతో పాటు మనసు మరణించదు, కానీ అది ముందుకు సాగుతుంది, మళ్లీ మళ్లీ సంపాదించుకున్న వివిధ శరీరాలతో అనుభవాల కోసం.


అలా ఆనందం కోసం అన్వేషణలో, మనసు యొక్క విజయం -అపజయం గానీ, దాని కర్మలు, అంటే దాని ఆలోచనలు జ్ఞాన కర్మేంద్రియాలతో జరిగే చేతలన్నీ, మంచీ-చెడు, పాపం-పుణ్యం.... వాటన్నిటిని బట్టి ఉంటుంది. ఈ కర్మల ఫలితాలను బట్టే రాబోయే దేహం యెలాంటి పరిస్థితుల్లో యెక్కడ పుట్టాలి, పెరగాలి, జీవించాలి అన్నది నిర్ణయమై, ఈశ్వర నియంత్రణలో సమానత్వము సంపూర్ణ న్యాయముతో జరుగుతుంది. అందుకే ఆ దేహాన్ని, కర్మదేహం అని పిలువబడింది. ఆనందం కోసం మనస్సు యొక్క అనంత అన్వేషణ కోరిక వలననే ప్రతీదేహం తయారయింది, వచ్చింది.


తరువాత యేమిటి? ఈ శరీరం ఒక సాధనం మాత్రమే. కాబట్టి దానిపై నువ్వు యేమీ శ్రద్ధ చూపకు. దానిమీద ధ్యాస, దృష్టి వలదు. ఈ జడమైన దేహం, దానిపై చూపబడే శ్రద్ధ, మమకారాల గురించి భగవాన్ 'ఈ శరీరం అది పుట్టుక ముందు లేదు, అది పంచభూతాలతో తయారయ్యింది. గాఢనిద్రలో అది నీకు లేదు. అది శవం అయిపోతుంది. అందుకే యీ జడమైన దేహాన్ని యెప్పుడూ ఒక శవంలాగానే ప్రక్కన పెట్టు' అన్నారు. 'ప్రక్కన పెట్టు' అన్నది నొక్కి చెప్పేవారు. అంటే దాని అర్థం నీ దృష్టి శరీరంపై కాదు, కానీ మనసుపై ఉంచి దాన్ని అర్థం చేసుకోవడానికి లగ్నం చేసి కేంద్రీకరించు అని.


మనం మనసువైపు చూస్తే, ఏం తెలుస్తుంది? 'చూస్తే' అన్నాం. యెందుకంటే యెవరూ దానిపై ఆసక్తి చూపరు కాబట్టి. మనసు ఉంది, అలాగే ఉంటుంది మనసు అని అనుకుంటారు. అంతవరకే కాని ముందుకు యిదేమిటి అని ప్రయత్నించరు.


 మనసును చూస్తే మాత్రం, దాని నియంత్రణ గురించి చాలా యెన్నో రకాల మాటలు వస్తాయి. చివరిగా, యెన్నో రకాల మాటల తరువాత చేతులెత్తేసి, అబ్బో! మనసును నియంత్రణ చేయడం సాధ్యం కాదు, ఒకలా ఉండకపోవడమే దాని స్వభావం అని తేల్చేస్తారు అందరూ సాధారణంగా భగవాన్ యిలాంటి నిర్ణయాలను సరైనవి కాదు అంటారు. ఎందుకంటే, యీ అభిప్రాయాలన్నీ కూడా, మనసు అన్నది ఒక స్వతంత్ర ఉనికి గలది అన్న ఆధారంగా కలిగినవి.


 మనసు నియంత్రణకు ఉన్న సాధనలు, పద్ధతులను భగవాన్ ప్రక్కన పెట్టమంటారు. ఎందుకంటే వాటితో మనసును నియంత్రించవచ్చు. కానీ ఆ నియంత్రణ ఆ సాధన చేస్తున్న సమయం వరకే పరిమితం. తరువాత మామూలే. యోగక్రియల వల్ల మనసును నియంత్రిస్తే, అది ప్రాణాయామం చేస్తున్నంతసేపు మాత్రమే అణగి ఉంటుంది. మానేయగానే, మనసు మామూలుగానే వివిధ తలంపులతో పరుగులు పెడుతుంది.


అందుకే, ఫలితం తాత్కాలికం మాత్రమే. 'మనసు అని ఒకటి స్వతంత్ర ఉనికితో వేరుగా ఉన్నదా? ఆలోచించే వాడి యొక్క తలంపుల ప్రవాహమే మనస్సు కాదా?' అని భగవాన్ అడిగేవారు. ఆలోచించేవాడి ధ్యాస మారుతూ ఉంటే, తలంపులూ ఒకదానిపై నుండి యింకో దానికి వరుసగా మారుతూ ఉంటాయి. ఆ ఆలోచించేవాడి గురించి తెలుసుకుంటే, సత్యం తెలుస్తుంది. ఆలోచించే వాడిపై దృష్టి, ధ్యాస నిలపి ప్రయత్నిస్తే తెలుస్తుంది.


మనం మరచిపోయి విస్మరించిన కొన్ని సత్యాలను భగవాన్ ఖచ్చితంగా చెపుతారు. ‘మనసు అనేది పుట్టింది, దాన్ని మనం చూస్తున్నాము. అది లేకుండా కూడా మనం ఉన్నాము. ఇది మన అందరికీ, ప్రతివారికీ అనుభవమే, ఋజువు చేయడానికి'. మరి భగవాన్, యిది అందరి అనుభవమే అన్నారు. అలాగే అయి ఉండాలి కదా? కానీ అవునా? ప్రతీరోజూ అందరికీ గాఢనిద్రలో మనసు ఉండదు. మెలకువ రాగానే లేస్తుంది. అంటే ప్రతీరోజూ మెలకువ రాగానే మనసు పుడుతున్నది. గాఢనిద్రలో అది తాత్కాలికంగా మరణిస్తుంది.


ఈ జరిగే దానంతటిని బట్టి, మనసుకు మూలం పుట్టుస్థానం యెక్కడ అని వెదకవలసిన అవసరం ఉంది. మనసు అంటే తలంపులే కాబట్టి, ఆ తలంచే వాడిపై దృష్టిపెడితే దాని మూలం తెలుస్తుంది. తలంచే వాడిపై ధ్యాస నిలపి శోధించడం వలన, తలంపుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. మనసు దాని మూలం పుట్టుస్థానంలో కలసిపోతుంది. ఈ మూలమే సత్ అయిన 'నేను', ఆత్మ, సచ్చిత్ ఆనందం, లోనున్న దివ్యత్వం. నిరంతర సాధన వలన మనసు మెల్లగా తన మూలంలో కలసిపోయి ఉంటుంది. ఒక రకంగా అది మనసు యొక్క మరణమే, కానీ అది నిర్మల శుద్ధ మనసు యొక్క నిజమైన జననం.


 ఎందుకంటే అది ఆత్మ చైతన్యంగా సహజస్వభావం అపుడు తెలుస్తుంది కాబట్టి. బుద్ధి యొక్క శక్తి, జ్ఞాపకం, తర్కం,

విచక్షణ, గ్రహింపు లాంటి శక్తులన్నీ పూర్ణంగా అతి ఉన్నతంగా ఉంటాయి. ఈ మనసును శుద్ధమనసు, సత్త్వమనసు అని పిలువబడుతుంది. భగవాన్ 'మరణించిన మనసు, పూర్ణశక్తులతో జీవించి ఉంటుందని చెప్పడం విడ్డూరంగానే ఉంటుంది. కానీ జ్ఞానులు అలాగే జీవిస్తారు, పనులు చేస్తారు. మరి అంగీకరించాల్సిందే' అని అనేవారు.


మనసు తన మూలస్థానంలో కలసిపోగానే, యిక అది దేహాన్ని ఆనందం అన్వేషణ గురించి ఉపయోగించడం జరుగదు. మనసు తన సహజ అనంత బ్రహ్మానందాన్ని పొంది అనుభవిస్తూ ఉంటుంది మూల స్థానంలో, యిక అన్వేషణ ఉండదు. అందుకే శరీరాన్ని ఆనందం గురించి, కర్మలు చేసి వాడే అవసరం యిక లేదు.


 ఒకసారి శరీరాన్ని మనసు ఆనంద అన్వేషణ సాధనగా ఉపయోగించడం మానేసింది అంటే, యిక దేహం జన్మలు కలుగవు, ఉండవు. ప్రస్తుతం ఉన్న దేహం యిక యెంత మాత్రం మామూలుగా భౌతికమైనది కాదు కానీ, యే కర్మల కారణంగా అయితే యీ దేహం వచ్చిందో అవి పూర్తి అయ్యేంత వరకూ మాత్రం నిలుస్తుంది, ఉంటుంది. మూలస్థానంలో కలిసి ఉన్న శుద్ధ నిర్మల మనస్సు ప్రకాశం, భౌతికదేహంలో కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం కాగానే తన భౌతికదేహం ఒక దేవాలయం అవుతుంది. 

No comments:

Post a Comment