*🧘♂️07- శ్రీ రమణ మార్గము🧘♀️*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 7* *నిత్య యవ్వనం - కుమార తత్త్వం*
సాధారణంగా నిత్యయవ్వనం అంటే అమృతమూ లేక వయసు మీరిన వారు తిరిగి యవ్వనం పొందే చికిత్సలు గురించి అనుకుంటారు. కాయకల్ప చికిత్సతో వయసయిన దేహాన్ని మళ్లీ యవ్వన శరీరంలా తయారుచేస్తారు.
భారతదేశంలో యిలాంటి చికిత్సలు ఉండి, ఎందరో ఆసక్తిగా వాటికోసం పరుగులిడేవారు. భగవాన్ ఒకసారి యిలాంటి చికిత్స గురించే చెపుతూ 'ఇలాంటి చికిత్సలు వందయేళ్ళ వేపచెట్టు, కర్పూరం లాంటి వాటి ఆధారంతో జరుగుతాయి. కానీ ఈ శరీరం గురించి అన్ని పాట్లు పడవలసిన అవసరం యేమిటి?' అనేవారు. ఈ చికిత్సల స్వభావమే మళ్ళీ మళ్ళీ అని, అంతేగాని శాశ్వతంగా అనంతంగా అనికాదు. మనం నిత్య యవ్వనం అని అన్నపుడు యిలాంటి చికిత్సల గురించి కాదు.
దేహం సరే, మనసు గురించి యేమిటి? దాన్ని నిత్య యవ్వనంగా తయారు చేయవచ్చా? మనస్సును సదా యవ్వనంతో చురుగ్గా ఉంచగలిగే అమృతం యేమైనా ఉందా? చాలామంది విషయంలో, శరీరం యవ్వనంలో ఉండగానే, మనసు ముసలి అయినట్లు అలవాటుగా ఒకే గాడిలో పని చేస్తుంటుంది. వార్ధక్యంలా అయిపోతుంది. దీన్ని మార్చగలమా? దీనికోసం అమృతంలాంటిదేమయినా ఉన్నదా? ఈ ప్రశ్నలను శోధించడం చాలా అవసరం. ఎందుకంటే, అందరూ సాధారణంగా జీవిస్తున్న జీవితం కంటే యెంతో ఉన్నతంగా ప్రమాణంగా ఉండగలిగే జీవనానికి యీ ప్రశ్నల్లో సమాధానాలున్నాయి.
మనం యవ్వనంలో ఉన్నపుడు, మన పరిస్థితులన్నీ చక్కగా ఉన్నపుడు, ప్రతీదీ యెంతో ఆనందదాయకంగా సాగుతూ ఉంటుంది. పార్కులకు, విహార యాత్రలకు, ఆటలకు, పోటీలకు, విందులకు యిలా యెన్నో కార్యక్రమాలు రోజూ ఒకదాని తరువాత ఒకటిగా వాటిలో మునిగి హాయిగా ఉంటారు. లేదా పర్వత శిఖరాలు అధిరోహించవచ్చు. కారడవుల్లో తిరుగాడవచ్చు. మనసు అమాయకంగా ఉండి, అన్నీ చూసి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. భయం, అనుమానాలతో మూసికొనిపోదు. కోరికలెన్నో ఉంటాయి కానీ సందేహ, అలసట కానీ కోరికలు గాఢమైనవి కాదు పైపైవే. ఆ కోరికల ఆటంకాలు
నుంచి సులభంగానే యేమార్చవచ్చు. శరీరం అంతా శక్తితో నిండుకుని ఉంటుంది. అంతటా అందం వెల్లివిరుస్తుంది. వాతావరణం ఆహ్లాదంగా, మరపించే తీయని గానంలా, అందం, ఆనందంతో నిండి ఉంటుంది.
అలా గడుస్తుండగా యెక్కడో మెల్లగా ఆ ఆనందాల హరివిల్లు మాయమవుతుంది. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఉవ్వెత్తున లేచే సముద్ర కెరటాల్లా యెన్నో వందలు, వేలు తలంపులు, భావాలు, కోరికలు, ఆలోచనలు తరంగాలుగా ఒక దానివెంట ఒకటి అనంతంగా రావడం మొదలవుతాయి. కాలేజీల్లో నైపుణ్యం, చదువుల్లో పోటీలు, పోటీ పరీక్షలు, ర్యాంకులు... యింకా యింకా పైకి పైకి అని ప్రయత్నాలు, ఒకవైపు తల్లిదండ్రులు, రెండోవైపు సమాజంలో బుద్ధినైపుణ్యం అగ్రస్థానం సాధించడానికే అత్యంత విలువ, యీ రెండింటి మధ్య అమాయకత్వం నలిగి బలైపోతుంది. తాజా మొగ్గలను వాటి వాటి సహజ పరిసరాల్లో పరిమళంలో వాటి సహజత్వాన్ని చుట్టూ ఉన్న పరిస్థితులు పాడు చేయకుండా పూర్ణంగా వికసింపనివ్వరు. ఫలితంగా యవ్వనంలోని చురుకుదనం, అడ్డులేని మానసిక శక్తి ఆరిపోయి, యేదో పాత జ్ఞాపకాలుగా మిగిలిపోయి, దిగులుగా విచారంగా మారిపోతాయి పరిస్థితులు. దీనికి యేవో కొన్ని మినహాయింపు లుండవచ్చును.
ఇలాంటి పరిస్థితుల్లోనే భగవాన్ బోధనలు యెంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయి. వాటిని ఆకళింపు చేసుకుని ఆచరిస్తే, నిజంగా నిత్య యవ్వనంగానే ఉంటారు. సదా కుమారులుగానే ఉంటారు. అంటే భౌతికంగా మీరు కుర్రవాళ్ళయిపోతారా? తెల్ల జుత్తు, బట్టతల ఆగిపోతుందా? మొహం మీద ముడుతలు పోతాయా? అలాకాదు. యెందుకంటే, తలంపుల ముసుగులో మూసిపోని విశాల శుద్ధ నిర్మల మనసుకూ, మానసిక అహంవృత్తుల బంధాలను త్రెంచుకున్న మనసుకు, దేహం దాని పరిస్థితి విశేషం యేమీకాదు, యెలాంటి సంబంధం ఉండదు, లేదు.
ఎల్లప్పుడూ, భగవాన్ మళ్లీ మళ్ళీ గట్టిగా తెలిపే ముఖ్యమైనది, ఆనందం మన సహజ స్వభావమే. మనకి సహజమైనది యెప్పుడూ పోవడం, పోగొట్టుకోవడం అనే సమస్యే ఉదయించదు. అది జరుగదు, వేరు కాలేదు, చేయబడదు. తొలకరి మేఘాలు సూర్యున్ని కప్పిమూసినట్లు, సహజానందాన్ని మరుగుపరచడం జరుగుతుంది.
అందుకే నువ్వు దాన్ని కనుక్కోగలవు. మన మలిన మనస్సులకూ ఆనందం ఆవిష్కరణ అంటేనే యెంతో ఉద్వేగం కలిగిస్తుంది. అదే ఆశ అంతా. ఈ ప్రయత్నంలో యెవ్వరూ ఒంటరిగా, నిస్సహాయంగా లేరు. సద్గురువులు
భగవాన్ శ్రీ రమణ మహర్షి, నిరంతరం తోడుగా అనుగ్రహం కురుపిస్తూ, మార్గదర్శకత్వం చేస్తూ, విచారణ మార్గం అనే చక్కటి గొప్ప రాజబాట రహదారిపై మనల్ని చేయి పట్టుకుని నడిపించుకు తీసుకుని వెళ్తారు.
భగవాన్ గట్టిగా చెప్పే యింకో విషయం యేమిటంటే, ఆనందం అనేది యెక్కడ ఉంది అని. మనలోనా లేక బాహ్యంలోనా? బాహ్యంలో అంటే మనకు బయట, అంటే మనసు బయట విషయాలతో తాద్యాత్మం చెంది చరించేటపుడు, అంటే సంపదలు ఆస్తులతో, పదవులతో, పేరుప్రతిష్ఠలతో, శరీరంతో, రుచులతో, ప్రపంచంలోని విషయాలు వస్తువులతో, కుటుంబం బంధువులు యితర సంబంధాల వలన ఆనందం ఉందా? మనం గమనించితే, యీ బాహ్యంలో చరించే మనసు దుఃఖంలేని ఆనందం పొందదు అనేది స్పష్టం అవుతుంది. వాటి వలన తాత్కాలిక ఆనందం కలిగినా దాని వెంట యేదో రకమైన దుఃఖం, బాధ ఉండనే ఉంటుంది. ఆనందం పోతుంది, దుఃఖం మిగులుతుంది.
అందువలన దుఃఖమేలేని శాశ్వతమైన అఖండ ఆనందం అనుభవించాలంటే మనం లోనికి చూడవలసిందే. మనసు అంతర్ముఖమవుతూనే లోపల యీ ఆనందం యొక్క స్థానాన్ని, ఛాతీకి కుడివైపున ఉండే హృదయం అని భగవాన్ తన స్వంత అనుభూతి వలన చెప్పారు. మనలో అనంత పరమానందం ఉప్పొంగే యీ స్థానమే మనకు మరుగునపడి, యిప్పుడు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాము. మనసు తన అన్వేషణలో తాత్కాలిక ఆనందం పొందినపుడు యిక్కడ హృదయంలోకి తిరిగివచ్చి ఉండినపుడే ఆ ఆనందం అనుభవిస్తుంది.
మళ్లీ బయటకుపోయి బాహ్యంలో చరిస్తుంది వివిధ రకాలుగా, ఎలాంటి ఆనందానికైనా స్థానం మనలోని హృదయమే. రమణ మార్గము సాధనచేస్తూ యిది సత్యమని మనం తెలుసుకుంటాము. ఎంతో బలమైన మన గత అలవాట్ల వలన, మనం దారితప్పించే మనసుకోరల్లో యిరుక్కుంటాము.
భగవాన్ గట్టిగా చెప్పే మూడో ముఖ్యమయిన విషయం, మనలో సహజంగా అంతర్గతంగా, మనసుతో సంబంధంలేని బ్రహ్మానందం యిప్పుడే, యిక్కడే యెవ్వరైనా సరే అనుభవించవచ్చు.
అందుకేమైనా నిబంధనలు, నియమాలు, కఠిన ఆచారాలు ఉన్నాయా? రెండు ముఖ్యమైనవి మాత్రమే. సద్గురువుపై అచంచల అత్యంత దృఢవిశ్వాసం, భగవాన్ యొక్క స్వంత అనుభవం అనుభూతి సత్యం, అది తప్పక మనకి కలుగుతుంది అని సంపూర్ణ విశ్వాసం. భగవాన్ యేదో ఒక రకంగా యెల్లప్పుడూ సదా తన శిష్యులను, భక్తులను అనుగ్రహంతో చూస్తూ నడిపిస్తూనే ఉంటారు. ఇంకా 'సాధన, యింకా సాధన, సాధన’. బయట విషయాల నుంచి ఆనందం ఉంది అనే జన్మ జన్మల బలమైన అలవాటు తప్పుడు భావన, శ్రద్ధగా నిరంతర సాధనద్వారా మానుకోవాలి. సాధన వలన భగవాన్ బోధ యెంత సత్యమో కనుక్కోవాలి. విచారణ పద్ధతి దిశగా వేసే ప్రతీ అడుగు మన ఆనందాన్ని పెంచుతూ ఉంటుంది.
ఎంతో బలమైన గత అలవాటు, బలహీనం అవుతూ ఉంటే, హృదయంలోని పరమానందం రుచి తెలుస్తూ ఉంటుంది.
ఇది మానసికమైన ఆనందం కాదు. ఈ ఆనందం మనస్సు నిశ్చలమై, తన మూలంలోనికి పోయి, కలసిపోయినపుడు కలిగేది. అన్వేషించే ఆనందం లోపల లభించింది కాబట్టి ఆనందం కోసం కోరిక, బయట వెదుకులాట ఆగిపోతుంది. అపుడు నిశ్చలమైన మనసు, నిర్మలం శుద్ధమైన మనసు ఆ శాశ్వత బ్రహ్మానందంలో ఓలలాడుతూ అనుభవిస్తుంది. ఆది సద్గురువులు దక్షిణామూర్తి మౌనంలోనే ప్రసాదించిన ఆ సహజ స్థితిని యెవరు వర్ణించగలరు. అనుభూతి చెంది తెలుసుకోవలసినదే.
No comments:
Post a Comment