Tuesday, August 2, 2022

నీవెవరివో నువ్వు కనుక్కో, అధ్యాయం - 1

*🧘‍♂️01- శ్రీ రమణ మార్గము🧘‍♀️


*అధ్యాయం - 1*
 *నీవెవరివో నువ్వు కనుక్కో*

మెలకువలో మనం నిరంతరం ప్రతీక్షణం యేదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము. స్వప్నంలో కూడా అంతే. కానీ యెవ్వరైనా యెప్పుడైనా ఒక్క క్షణం ఆగి, యిలా యెందుకు ఆలోచిస్తున్నామని అనుకోరు, ప్రశ్నించుకోరు. మనసు యిలాగే ఉంటుంది. అప్రయత్నంగానే ఆలోచనలు ఉంటాయని, ఎందుకు పట్టించుకోము. ఇదే నిజం అయితే ఎవరూ చేయగలిగిందేమీ లేదు. మనస్సు యొక్క పరుగుల్ని లెక్కలేనన్ని విధాలుగా వర్ణించవచ్చు.


 దానియొక్క వేగం, నిలకడలేనితనం, దాని నియంత్రణ.... యిలా యెన్నో విషయాలుగా చెప్పవచ్చు. ఈ రకంగానే దాన్ని విశ్లేషించవచ్చు. ఎందుకంటే, మన మనస్సు, దాని ఆందోళనలు, కోరికలు, భయాలు ఏవో సాధించాలని ఆరాటాలు, పోటీలు... యిలా మనకు అనుభవమే కాబట్టి.


ఆలోచించడమనే గాఢమైన వ్యసనం, అప్రయత్నంగా యెంత అలవాటయిందంటే దాని పర్యవసానాలను అందరూ ఆమోదించాల్సిందే. మనసులోని దుఃఖాలు, వాటి రకరకాల ఫలితాలు, బాధలు, కష్టాలు, యిటూ అటూ యెన్నో తలంపులు, భావనలు, అర్థంలేని ఆలోచనలూ యిలా యెన్నో పర్యవసానాలు.


ఈ మనసు యొక్క వాతావరణం నిన్నెప్పుడూ వదలదు. మంచైనా - చెడైనా, లాభమైనా - నష్టమైనా, సుఖమైనా - కష్టమైనా ఆ వాతావరణంలో బ్రతకాల్సిందే.
ఇలా ఆలోచనలు, తలంపులు, భావనలు మనసుకు సహజమైనవే అని అందరూ సాధారణంగా అనుకుంటారు. కానీ భగవాన్ కాదు అంటారు.


జీవితంలో ఎన్ని రకాల వ్యాపారాల్లో, పనుల్లో, సంబంధాలలో మునిగివున్నా మనసుకు మౌనంగా ఉండటము, ప్రశాంతంగా ఉండటం - మౌనం, శాంతి - మాత్రమే సహజమైనవని భగవాన్ చెప్పారు. ఈ విషయాన్నే మళ్ళీ మళ్ళీ నొక్కి నొక్కి చెప్పేవారు. భగవాన్ శ్రీరమణ మహర్షి. సత్యాన్ని యెన్నిసార్లు పదే పదే చెప్పినా ఉచితమే.


1900ల సంవత్సరంలో, ప్రపంచ గురువుగా మొట్టమొదట తన పాత్ర నిర్వహించడం ప్రారంభించినపుడు భగవాన్ శ్రీ గంభీరం శేషయ్యరు గారితో 'నిజంగా మనసు అంటే' ఎరుకj (ఆత్మ) మాత్రమే. ఎందుకంటే అది సహజంగా శుద్ధం, నిర్మలం అయినట్టిదే. అట్టి స్థితిలో మనస్సు భావనారహితమై తలంపులు లేనిదై ఉంటుంది. అది అద్వితీయం, ఏకం, సర్వశక్తివంతం, ఆకాశంలా విశాలం.


అలా కాకుండా మలినమైన మనసుగా ఆరోపింపబడితే, 'సహజ మనసుయొక్క అసలు తత్త్వమును మరచిపోవడం వలన మాత్రమే అలా జరుగుతుంది'. మనసు ఆకాశమంత నిర్మలమైనది, శుద్ధమైనది. దాని అసలు సహజత్వం, మనసులోని విషయాలనుబట్టి యెలాంటి మార్పు, వేదన చెందదు.


అంటే రెండు మనసులు, ఒకటి శుద్ధం యింకొకటి అశుద్ధమైనది ఉన్నాయా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ కాదు. మనకు మనసుయొక్క తప్పుడు గ్రహింపు, భావన ఉన్నంతకాలం, విచారణ శోధనకు అవసరం యెంతైనా ఉంది. శోధించి తెలుసుకుని, మనసుయొక్క సహజమైన అనంత శాంతిని అనుభూతి పొందు. ఇక ఆ స్థితిలోనే ఉండు.


 ఎలాంటి విచారణ అయినా, పద్ధతి అయినా జయం పొందాలంటే, మన అంతర్గత స్వభావమును ప్రశ్నించేదిగా ఉండాలి.
‘అసలు ఈ మనసు అనేది యేమిటి?' అని మనం ప్రశ్నిస్తే, లో మనకు రెండు తెలుస్తాయి. ఆలోచన, ఆలోచించేవాడు. ఆలోచన, ఆలోచించే వాడికి చెందినది.


ఆలోచించేవాడు లేకపోతే ఆలోచన లేదు, అవకాశం లేదు. ఈ సర్వసాధారణమైన ఆలోచన (శోధన) మిగతా అన్ని తలంపులను అధిగమిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించితే, ఒకటి విధితమౌతుంది. తలంపులు రావడం, లేకుండా పోవడం అనేది వ్యక్తియొక్క ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది.


 ఆలోచించే వాడి వలన ఉంటుంది. మనసు దానికదే యెక్కడికక్కడ తుడుపేస్తుంది. ఉదయం ఫలహారంపై దృష్టి ఉండి ఆస్వాదిస్తున్నప్పుడు రాత్రికి యే సినిమాకి అన్న తలంపు రాదు. అలాగే ఆఫీసులో పనిలో నిమగ్నమైనపుడు స్నేహితుల వద్దకు పోలేదేమని అనిపించదు.


కొన్నిసార్లు యిలా, గాఢమైన నియంత్రణ వలన జరుగవచ్చు. దీనివలన అర్థం అవుతున్నది యేమిటి? అసలు అంతా, ఆ ఆలోచించేవాడు/ అహంకారం పైనే మొత్తం ఆధారపడి ఉంది. అతనే కేంద్రం, కీలకం. ఆలోచనలకు స్వతంత్రత లేనేలేదు. వాటినుంచి దృష్టిని యీ కీలకమైన కేంద్రంపై సారిస్తే, మనసుయొక్క సహజమైన అసలు తత్త్వం అర్థం కావడానికి, కనుక్కోవడానికి అవకాశం కలుగుతుంది.


‘నేను యెవరు?’ అనే విచారణ ద్వారా, అలా కేంద్రంపై దృష్టిని లగ్నం చేయడం సాధ్యమేనని భగవాన్ తెలిపారు. ఈ విచారణనే 'నేను యెవరు? విచారణ' అన్నారు. ఎందుకంటే, యెవరైనా తనను తాను మనసుగానే
భావించుకుంటున్నారు కాబట్టి.


తనంటే మనసే అనుకుంటున్నారు కాబట్టి. మనసే చూచేది, మిగతా అన్నీ చూడబడేవి. మనసును కనుక్కోవడానికి, భగవాన్, యీ విచారణ మార్గం సార్థకత చాలా సూటిది, సరళము, సులభమూ అయినది అని గట్టిగా చెప్పేవారు.


 ఎందుకంటే, యీ విచారణ తీవ్రంగా, నిలకడగా, శ్రద్ధగా చేస్తుంటే, మనస్సును కేంద్రంపై, ఆలోచనలకు దూరంగా ఉంచుతూ, లగ్నం చేయగలదు. అలాకాకుండా ఆలోచనలను తగ్గించడానికి వాటిని తీసివేయడం అనేది చేస్తే, చెట్టును వదిలేసి ఆకులను తురిమినట్లు ఉంటుంది. మూలం అట్లానే ఉంటుంది.

మనసు కేంద్రంపై లగ్నం చేసిన ధ్యాస, తన సహవాసులైన తలంపులపై తన ధ్యాసను తగ్గించుతుంది. అలా అన్ని తలంపులపై తన ధ్యాస యెప్పుడైతే కత్తిరింపబడుతుందో అపుడు తనను యింతకాలం బాధించుతున్న తప్పుడు గ్రహింపు, 'తనకొక ప్రత్యేక గుర్తింపు స్వతంత్రత ఉన్నదని, గురించి అర్థం అవుతుంది. అపుడు తను సహజంగా పూర్ణమైన చైతన్యమేనని, మౌనం పరమశాంతితో శుద్ధ నిర్మల మనసేనని తెలుస్తుంది.


ఇది తెలియగానే అన్ని బంధాలు కొట్టుకుని తుడిచిపెట్టుకుపోతాయి. తన ఆధారాన్నే మరచిన పరిమితమైన ప్రత్యేక గుర్తింపు, సహజమైన ఆనంద వరద ప్రవాహంలో కొట్టుకుపోకుండా యెలా నిలచి ఉండగలదు?


 ఈ ఆనంద అనుభూతిని వర్ణించసాధ్యం కాదు. వర్ణించినా గ్రహింప సాధ్యంకాదు. ఎందుకంటే అది మనసుయొక్క సృష్టికాదు. అహంకార భావన అయిన 'నేను', తాను అయిన 'నేను, నేను’లో కరగిపోతుంది. నాశనమౌతుంది.


 'నేను, నేను...' హృదయంలోని నిరంతర ఆనంద తరంగమే. ఇది సహజం, వర్ణించలేనిది. అనుభూతి చెంది తెలుసుకోవల్సిందే. అది అంతటా యెప్పుడూ ఉన్నదే.
ఈ మరచిన తనను, తాను తెలుసుకోవడంలో గురువు పాత్ర యేమిటి? అని అడగవచ్చు యెవరైనా. గురువు యీ కార్యక్రమంలో యెక్కడ యెలా అమరుతాడు.


నీవెవరివో తెలుసుకోవడం, నిరంతర ఉత్సాహంతో విచారణ సాధన వలన జరుగుతుందని అన్నాము కదా మరి! కానీ 'కాదు' అనేదే నిరుత్సాహకర సమాధానం. సాధన, యింకా సాధన, నిరంతర సాధన తప్పక చేయవలసిందే అనడంలో సందేహమే లేదు. అంతేచాలదు, సద్గురువు యొక్క అనుగ్రహం మార్గదర్శకత్వము తప్పకుండా అవసరమే.


 అంతర్ముఖంగా ఉండే సద్గురువు యెల్లప్పుడూ సాధకుడిని నడిపిస్తూనే ఉంటాడు. సాధకుడు అంతర్ముఖుడై తనలోని లోతులకు పోతున్నకొద్దీ సద్గురువు అక్కడ మార్గ నిర్దేశకునిగా ఉండడం అనుభూతి కలుగుతుంది. తన సహజమైన స్థితిలో, తానుగా నిలచి ఉండటంలో సద్గురువు సహాయం, అనుగ్రహం లెక్కించలేనిది.


 తనను తాను తెలుసుకున్న తరువాత, తన రోజువారీ జీవితంలో దాని ప్రభావం యెలా యెంత ఉంటుందని ఆశ్చర్యం కలుగవచ్చు యెవరికైనా. ఒకరు యెలా మారుతారు? తన కర్తవ్యం విధులను అన్నీ వదిలేసి నిరంతరం ధ్యానంలోనే ఉంటారా? ఇక్కడ కూడా సమాధానం 'కాదు' అనే. చేయవలసిన పనికి, తనయొక్క జ్ఞానానికి యెప్పుడూ యెలాంటి ఘర్షణ ఉండదు అని భగవానే చెప్పేవారు. 'నేను యెవరు? విచారణ' సాధన చేస్తున్నప్పుడు కూడా, రోజువారీ పనులన్నీ చేస్తూ చక్కపెడుతున్నపుడు కూడా అంతర్గత ప్రశాంతత ఆనందం చెదరక నిలుస్తూనే ఉంటుంది.


 ఈ విచారణ వలననే, చేసే పనిలో నిమగ్నమై, శాంతంగా శ్రద్ధగా, స్థిరంగా చేయడం వలన చేసేదంతా చక్కని ప్రమాణాలతో ఉన్నతంగా జరుగుతుంది. తనయొక్క సహజత్వ జ్ఞానం నిలకడగా నిలచిన తరువాత ఆ పూర్ణత్వాన్ని, అంతర్ముఖస్థితిని ప్రపంచంలో యేదీ యెవరూ కూడా వేధించలేరు, చెదరగొట్టలేరు.


తనను తాను కనుక్కున్న తరువాత వారికి చేయవలసిన పనులపై యెలాంటి భావం ఉంటుంది? వారు పని చేయాలని ఆసక్తి కానీ, చేయకూడదని విరక్తీ, వ్యతిరేకం కానీ యేమీ అనుకోరు, భావించరు.


ఎంతో తర్పీదు పొందిన ఆటగానిలా లేక నిపుణిడిలా తీవ్రంగా, తను యే పని చేయవలసి వచ్చినా దానిలో నిమగ్నమై యెంతో శ్రద్ధగా, చక్కగా పూర్ణనైపుణ్యంతో చేస్తారు. అలా చూస్తూ కూడా ఆ పని గురించిగానీ, దాని ఫలితాలపై గానీ ఆశ, బంధం, కోరిక, భావన యేమీ లేకుండా ఉంటారు. మనసు/అహంకారం, దాని బంధాలనన్నింటినీ వదిలించుకున్న తరువాత తను చేస్తున్న యెన్నో రకాల విధుల్లో పాత్రల్లో నటిస్తున్నట్లే ఉంటారు.


తను తాత్కాలికంగా పోషిస్తున్నది ఒక పాత్ర మాత్రమేనని, తాను కాదు అనే స్ఫురణతోనే ప్రతీక్షణం ఉంటారు. చేయవలసింది యెలాంటిదైనా, చిన్నదైనా, పెద్దదైనా, సులభమైనా, కష్టమైనా, పవిత్రమైనా, అపవిత్రమైనా యెలాంటి భయం, సందేహాలు లేకుండా సంపూర్ణ ఉత్సాహంతో చేస్తారు.


 వారు యీ ప్రపంచంలో గతం భవిష్యత్తుల్లో కాకుండా వర్తమానంలోనే పూర్ణంగా జీవిస్తారు. తనలో చైతన్యం ఆనందం ప్రసరించగా, వారు జ్ఞాన జ్యోతిగా దివ్యంగా వెలుగుతారు. వారు, తీరాలే లేని మహా ఆనందసాగరమై ఉంటారు. వారి ఆ చైతన్య ఆనందాన్ని యితరులందరూ పంచుకుని అనుభూతి పొందుతారు.

 *ఓం నమో నారాయణాయ🙏* 

No comments:

Post a Comment