Tuesday, August 2, 2022

ఆధునిక కాలంలో ఆధ్యాత్మిక ఉన్నతికి చేరుకోవటం కఠినతరంగా ఉంది ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

       💖💖 *"296"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

*"ఆధునిక కాలంలో ఆధ్యాత్మిక ఉన్నతికి చేరుకోవటం కఠినతరంగా ఉంది ?"*

**************************


*"భౌతిక జీవనానికి తక్కువ ప్రాధాన్యతనిచ్చి, అంతర్గత జీవనాన్ని అత్యుత్తమ జీవనంగా చాటిచెప్పిన దేశం మనది. పాశ్చాత్య విధానాల అనుకరణ మనకు లౌకిక, ఆధ్యాత్మిక జీవితాల్లో శాంతి లేకుండా చేస్తుంది. ఏ విషయంలోనైనా ఫలం కోసం కాలం వచ్చేవరకు వేచి ఉండటం సహనం. మనం ఋషుల్లాగా సమాజాన్ని, లౌకిక జీవనాన్ని వదిలివెళ్లి సాధన చేయలేం. కనుక బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అన్ని దశల్లోనూ ధర్మ జీవనం ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక ఉన్నతికి చేరగలుగుతాం. కానీ నేటి మన పోకడలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. ఒకప్పటి మన సమాజంలోని ప్రేమాభిమానాలు ఇప్పుడు వ్యామోహాలుగా మారుతున్నాయి. బాల్యంలో మొదలైన ఫ్యాషన్ల మోజు యవ్వనప్రాయానికి విచ్చలవిడితనంగా మారుతుంది. మన సంస్కృతిలో ఎంతో ఉన్నతమైన వైవాహిక వ్యవస్థలో కూడా దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాంతిని దూరంచేసే విధానాలవైపు పరుగులు పెడుతూ ధ్యానం-దైవం వంటి ఆధ్యాత్మిక సాధనలకు పూనుకోవటం వృధా ప్రయాసే అవుతుంది. కలుపుమొక్కలను తీయకుండా సేద్యం ఎలా సాధ్యం కాదో అలాగే మనలోని దుర్గుణాలను తొలగించకుండా శాంతి, తృప్తిలను పొందటం సాధ్యంకాదు. సద్గుణాలను అలవర్చుకొని, మనసు ఉధృతికి కళ్ళెంవేసే సహనం లేకుండా ధ్యానంగానీ, జపంగానీ సిద్ధించవు. అందుకే మన నిత్య జీవితంలోనే సహనాన్ని అలవర్చుకుంటే ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన మార్గాన్ని సుగమం చేసుకోగలుగుతాం !"*


*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

            🌼💖🌼💖🌼

                  🌼🕉🌼

No comments:

Post a Comment