*🧘♂️10- శ్రీ రమణ మార్గము🧘♀️*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 10*
*రావలసిన సందేహాలు - ప్రశ్నలు*
విచారణపై జిజ్ఞాసలేని జీవితం ప్రయోజనం యేమిటి?
భగవాన్ శ్రీ రమణ మహర్షి
స్వస్వరూప జ్ఞానం కోసం బోధించిన సూటి మార్గమైన 'నేనెవరు? విచారణ’ తన సహజమైన ఆగని తరగని స్థిరమైన పరమానందం అనుభవంపై ఆధారపడి ఉన్నది. ఈ సహజత్వాన్ని ప్రతిబింబించే జీవితం విలువ తెలియక దీన్నించి దూరంగా పారిపోతున్నారు. ఆ విలువ తెలియాలంటే మౌలికమైన గ్రహింపులపై నిరంతర ప్రశ్నలు లేవాలి. ప్రశ్నలంటే సందేహాలే. అలాంటి సందేహాలు, ప్రశ్నలు లేకుండా, భ్రమల్లోనే బ్రతుకుతారు, సత్యంపై దృష్టి పోనే పోదు, వారి భ్రమల గురించి సందేహాలు ప్రశ్నలు రానే రావు. సరయిన మార్గాన్ని పట్టుకోలేరు. జీవిత ప్రయోజనం యేమిటి? అందరూ జీవిస్తున్నారు, పరుగులెడుతున్నారు. దీనికి అర్థం యేమిటి? సందేహాలు, ప్రశ్నలు లేవు.
సహజత్వం ప్రతిబింబించే జీవనం ఉండాలంటే, మానసిక విశాలం కలగాలి, అపుడే అది అలాంటి జీవనంకు అవకాశమిస్తుంది. మానసిక విశాలం అంటే యేమిటి? సంకుచితం కానిది, భ్రమలు పోయినది, పరిపక్వం చెందినది. అలాంటి మనసు యెపుడూ ప్రశాంతంగా ఉంటూ, యెప్పుడూ దేనికో పరుగులు తీయక, యెన్నో తలంపులతో నిండి ఉండక, తలంపుల ప్రవాహం వాటి ప్రభావంలో చిక్కుకొనక ఉంటుంది. మనస్సు అంతగా పూర్తి నిశ్చలం, మౌనంకాకపోయినా, సాధనలో తలంపులపై దృష్టి మరల్చి 'నేను'పై ధ్యాసతో శుద్ధం కాగలదు. ఈ ధ్యాసలో విరామం, తలంపుల మధ్య విరామం జరుగుతూ ఉంటుంది. విరామ సమయంలో తన జీవన విధానాన్ని సమీక్షించుకోవచ్చు. దానికి వేరుగా తాను ఉండి దాన్ని సమీక్షించుకోగలరు. ధ్యాసలో విరామం అలా వ్యర్థం కాదు. అక్కడ తను విషయాల్లో మునిగిలేదు, వేరుగా ఉండే పరికిస్తున్నాడు. దీనితో యింకా లోతుగా అంతర్ముఖం కావడానికి ప్రయత్నం జరగాలి, విరామం తగ్గాలి. ఇంతకాలం మానసిక వైశాల్యం లేకపోవడం వలన లేవనెత్తని సందేహాలు ప్రశ్నలు, యిపుడు రావాలి, వాటివలన లోనికిపోవడం తీవ్రమవుతుంది. విచారణకు సంబంధించిన సూటిప్రశ్నలు కలుగడం వలన, మనసుయొక్క బద్ధకాన్ని పోగొట్టి శోధన చేస్తుంది. అవసరమైన ప్రశ్నలు లేవడంవలన మనసు చురుగ్గా, విచారణపై ఆసక్తి చూపుతుంది.
సాధన బలపడాలంటే ఎలాంటి మౌలిక ప్రశ్నలు కలుగాలో సాధకులకు తెలిసిందే. అయినాసరే, కొన్ని ప్రశ్నలు ప్రయోజనకరంగా అందరికీ లేవవలసినదే. గమ్యం, స్పష్టత గురించి 'నేను అసలు' 'నేనెవరు విచారణ' 'యెందుకు చేయాలి, చేస్తున్నాను'. 'ఈ విచారణ గమ్యం యేమిటి? ఈ గమ్యంలో యిప్పుడు నా స్థానం యేమిటి?' 'నేను యెవరు? ఎక్కడనుంచి వచ్చాను? జీవితం యేమిటి? శాశ్వతమైనదేమిటి? శాశ్వత పరమానందం యేమిటి? నేను జీవిస్తున్న అర్ధం యేమిటి?’ యిలా యెన్నో సందేహాలు ప్రశ్నలు కలగాలి. ఎవరో ఒక ధ్యాన పద్ధతిని బోధించినపుడు, యెన్నో నియమాలు, పాటించవలసిన విధానాలు, సమయాలు చెపుతారు. గమ్యం మనసును నియంత్రించడం అని చెపుతారు. రోజువారీ జీవితం దాని పాట్లు పరుగుల్లో ఉన్నవారికి, సాధారణంగా యిది ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఇక్కడ గమ్యంను సరిగ్గా గ్రహించారా అన్న ప్రశ్న రావాలి. నియంత్రించబడిన ప్రశాంత మనసు, నిశ్చల మనసే అయితే, అది సరయిన గమ్యమేనా? లేక ఆ గమ్యం మనసుయొక్క ప్రవృత్తుల నుండి పూర్తిగా విముక్తిని కలిగిస్తుందా?
గాఢనిద్రలో, మూర్ఛలో, స్పృహలేని స్థితిలోనూ తలంపులు ఉండవు, మనసు లయమై ఉన్నందువలన మాత్రమే. కానీ మనస్సులో నిక్షిప్తమైవున్న గత జన్మల వాసనలు, సంస్కారాలు అన్నీ అలాగేవుండి, అగ్ని పర్వతంలా లేచి విరజిమ్మడానికి తయారుగా ఉంటాయి. ఏ క్షణంలోనైనా మెలకువరాగానే అవి విజృంభించుతాయి. అందుకే రమణులు, మనసును నియంత్రించి కొంత సమయం లయంచేసే సాధనలేవైనా ఉపయోగం లేదంటారు. కొంత సమయం నిశ్చలం అయిన మనసుకూ, వాసనలు సంస్కారం నుండి విముక్తి పొందిన మనసుకూ తేడా వివరిస్తారు. 'ఈ ఆధ్యాత్మిక సాధన దేనికొరకు?' అన్న ప్రశ్నవస్తే, మనసును పూర్తిగా విముక్తి చేయవలసిన అవసరం గుర్తింపబడుతుంది.
కఠిన నియమ నిష్ట నిబంధనలతో కూడిన ఆధ్యాత్మిక జీవనం నుండి, భగవాన్ చెప్పిన సూటి మార్గమునకు మరలినవారు 'నాలో' నేను యెవరు? విచారణ గూర్చి, దాని సాధన గురించి యెంత తీవ్రమైన ఆర్తి శ్రద్ధ తపన ఉన్నది', 'నా వివిధ గమ్యాల్లో దీనిస్థానం యేమిటి' అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే చాలామంది ఎంతో ఉత్సాహంగా ప్రారంభించి తరువాత మెల్లగా చతికిలబడతారు. వారు రోజూ చేసే కార్యక్రమాలలో యిది యింకోటి అవుతుంది, అంతే. ఈ ఆసక్తి యింకిపోవడం అన్నది మనకు తెలియకుండానే జరుగుతుంది. 'నేను యెంత సమయం వెచ్చిస్తున్నాను విచారణకు' ప్రశ్నించుకోవాలి. మన ఆఫీసు పనులు, శరీర శ్రమలు, రుగ్మతలు, యితరులతో సంబంధ బాంధవ్యాల్లో చిక్కుకుని మనం యెంత విచారణ సాధన చేస్తున్నామో తెలుస్తుంది. ఏవేవో లౌకికమయినవి సాధించాలని పరుగులెత్తే వారికి సమయం అసలే చిక్కదు. ప్రశ్నలతో యీ వాస్తవాన్ని గ్రహించితే నేనెవరు విచారణపై తీవ్రత పెరుగుతుంది.
అలాగే విచారణకు దొరికిన కొంచెం సమయాన్ని యింకేవో విషయాలతో వ్యర్థం చేస్తున్నామా అని కూడా ప్రశ్నించుకోవాలి. కొన్ని పాత పద్ధతులను, సాధనలను విడిచిపెట్టుట కష్టమయి, వాటిని పాటించి సమయాన్ని వ్యర్థం చేస్తున్నారా చూడాలి. ఇంతకుముందు చేసిన సాధనలు అంటే జపం, పారాయణ, ఉపాసనలాంటి వాటి వలననే మీరు యీ విచారణ స్థితికి యెదిగారు అని భగవాన్ చెపుతారు. ముందు చేసిన సాధనల వలన మనసు శుద్ధం, దృఢం అయి, నా సహజస్థితి యేమిటి? నేనెవరు? ప్రశ్నలపై నిలువగలిగే సామర్థ్యం కలిగింది. విచారణ పద్ధతికి చేరుకున్నవారికి, యింతకు ముందు చేసిన సాధనలతో యిక అవసరం లేదు కాబట్టి సహజంగానే వదిలేస్తారు. లేకపోతే విచారణ పద్ధతి తన తాజాదనం, మనసును తనకలవాటయిన తలంపులు అభ్యాసముల నుంచి విముక్తి కలిగించే శక్తిని కోల్పోతుంది. సగం సగం ఆసక్తితో విచారణ చేయడం వలన అహంకారం విజృంభించుతూనే ఉంటుంది. నేనెవరు విచారణయొక్క అర్థం సరిగ్గా గ్రహిస్తే యిక దానిని విడువజాలరు. విచారణ ఉద్దేశము మనసు తన వాసనలు, మలినాలు వదిలించుకొంటే అది సత్యొక్క ప్రతిబింబమే, నిర్మలం శుద్ధమే తప్ప వేరుకాదు అని తెలుసుకోవడమే.
ఇంకా ప్రశ్నలు 'నేను రోజూ చేస్తున్న కార్యాలు, పనుల అర్థం గమ్యం యేమిటి? సంపదలు, ఆస్తులు, పేరుప్రతిష్ఠలు, వంశవృద్ధి గొప్పతనం, అధికారం, పంతం పట్టుదలలు... వీటన్నింటికీ నేను యెంతో ప్రాముఖ్యం యిస్తున్నాను. వీటినుంచి శాశ్వత ఆనందం వస్తుందా? వీటిలో తరగని శాశ్వతమైన సుఖం యేమైనా ఉందా?' యిలా ప్రశ్నలు రాకపోతే, మనసును తన హృదయంలో తెలుసుకోకుండా అంతా బాహ్య విషయాల్లోనే చరింపజేస్తారు.
ఇంకా 'ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను ఒంటరివాడినా? లేక నాకు తోడుగా నన్ను ఉత్సాహపరచడానికి, ధైర్యం చెప్పడానికి, స్ఫూర్తినివ్వడానికి యెవరైనా ఉన్నారా?' అన్న ప్రశ్నలుదయిస్తే, భగవాన్ మనల్ని నడుపిస్తున్న అనుగ్రహం అర్థం అవుతుంది. అవి పుస్తకాలు, సత్సంగ్లు, ప్రవచనాలు, ప్రశ్నల- జవాబులు అవ్వచ్చు. ఇంకా మనస్సు మౌనంగా ఉన్నప్పుడు వచ్చే మార్గదర్శకత్వం కావచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో సాధనచేస్తూ ప్రయాణం చేస్తున్నవారికి, మిగతా శ్రద్ధాభక్తులతో సాధనచేసే వారినుంచి కూడా సహాయం లభిస్తుంది.
ఏది యేమైనాసరే, సాధారణంగా రాని యీ సందేహాలు, ప్రశ్నలపై దృష్టి పెట్టడం నేనెవరు విచారణపై ఆసక్తిని కలిగించడం, స్థిరంగా సాధన సాగేటట్లు చేయడానికే. విచారణపై స్ఫూర్తి, ఆసక్తి యెప్పటికీ బలహీన పడకుండా నిలుపడానికే. ఈ ప్రశ్నల వలన, యేమైనా దారి తప్పి ఉంటే సరిచేసుకుని, అంతిమ సమాధానం పొంది, పొరలిపొంగే అనంత పరమానందం అనుభవిస్తారు.
భక్తులు, సాధకులు, ఆసక్తిపరులు అడిగే ప్రశ్నలకు భగవాన్ యెంతో ఓపికగా సమాధానం వివరణలు చెప్పేతీరు గమనిస్తే, యీ ప్రశ్నల సమాధానాల ప్రాముఖ్యం తెలుస్తుంది. భగవాన్ దేహంతో అచ్చట ఉన్న 54 సంవత్సరములలో ముప్పయి వేల కంటే అధికంగానే ప్రశ్నలకు జవాబులు చెప్పారు. మేధోపరమైనవి, స్ఫూర్తిలేని ప్రశ్నలకు తప్ప, జిజ్ఞాస, ఆసక్తిగలవారు అడిగిన ప్రశ్నలు దేనికీ భగవాన్ సమాధానం చెప్పకుండా మానలేదు. అంతేకాదు, భగవాన్ యిలాంటి ప్రశ్నలను యెంతో ఉత్సాహపరచేవారు. ఉదాహరణకు :
భక్తులు : జీవితం తాలూకా ఉద్దేశం, ప్రయోజనం యేమిటి?
మహర్షి : ఈ జీవితం యింతకుముందు చేసిన పుణ్యకర్మల వలన లభించిందని దానియొక్క ప్రాముఖ్యతను తెలుసుకొనాలని అన్వేషించడమే ఉద్ధేశ్యము, ప్రయోజనము.
భక్తులు : మరణం తరువాత జీవితం యొక్క స్వభావం యేమిటి?
మహర్షి : ప్రస్తుతం నువ్వు జీవిస్తున్న దాని గురించి కనుక్కో మరణం తరువాత జీవితం గురించి ఆందోళన యెందుకు? వర్తమానంలోని నిన్ను నువ్వు కనుక్కుంటే నీకు అంతా తెలుస్తుంది, తెలియనిదంటూ యేమీ మిగలదు.
భగవాన్ యెప్పుడూ, ప్రశ్నించేవారి దృష్టిని, నేనెవరు విచారణపైకే మరల్చేవారు. అందులోనే గమ్యం మొత్తం అంతా యిమిడి ఉంది కాబట్టి.
No comments:
Post a Comment