*🧘♂️09- శ్రీ రమణ మార్గము🧘♀️*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 9*
*నువ్వు పరిపూర్ణ ఆత్మ చైతన్యమే*
సత్యంగా యెవరైనా పరిపూర్ణ చైతన్యమే, మనసు దాని ప్రతిబింబం నిర్మలం శుద్ధమైనదే అని భగవాన్ మళ్లీ మళ్లీ నొక్కి చెపుతారు. ఈ పరిపూర్ణ చైతన్యం ముక్కలు ముక్కలుగా ఉండదు, రెండు కాదు. దీన్ని జ్ఞానులు తెలుసుకోగలరు. మిగతా అందరూ భ్రాంతిమయమైన ప్రపంచంలో, స్వతంత్రమైన వేరు వేరు వ్యక్తులు/అహంకారాలు/మనసులుగా భావిస్తూ ఆ మిథ్యతో జీవిస్తారు.
ఈ భ్రమలో భాగంగా మనసుకు ఒక ప్రత్యేక స్వతంత్ర ఉనికిని కల్పించుతారు. మనసును నియంత్రించలేనిదిగా ముద్రవేసి, దాన్ని శాంతపరచి దారిలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తారు. తన సహజస్థితిని మరచి మరుగున పడడం అవిచారణ వలననే అని రమణులు చెపుతారు. అంటే పరిపూర్ణ చైతన్యమైన 'నేను'కు వేరుగా ప్రత్యేకమైన మనసు, దేహం ఉందా అని విచారణ చేయకపోవడం. ఈ మౌళికమైన ప్రశ్నవైపు యెవరు దృష్టి సారించారో వారు యీ భ్రాంతిమయమైన పరిమితులతో ఉన్న మనసుతో జీవిస్తారు, మరణిస్తారు. అలాంటి మనసు అత్యద్భుతమైన అనంత వైశాల్యం, ఆనందంను అనుభవించదు, అనుభవించలేదు.
కొంతమంది శ్రద్ధగా తపనతో ఆధ్యాత్మిక మార్గము నవలంభించి మొదటి ఆటంకమైన ప్రపంచాన్ని అంటిపెట్టుకుని విచారణ చేయని మనసు స్థితిని దాటారు. వారు కొంతవరకు, మనుషుల జీవితంలోని ఆరాటాల వ్యర్థ ప్రయోజనం తెలుసుకుని, అహంకారపూరితమైన నడవడికవైపు పోలేదు. శోధన మొదలై, యెన్నో అడ్డంకులను దాటుకుని, భగవాన్ బోధించిన సూటిదైన విచారణ పద్ధతిపై ఆకర్షితులయ్యారు. సూటిది అని యెందుకంటే, జబ్బు 'అవిచారణ' అంటే శోధించాలి, ప్రశ్నించాలి అనే దృష్టి, విచారణ ఆసక్తి లేకపోవడం, దానివలన తన నిజస్థితి, తానేమిటో కనుక్కొనకపోవడం జరుగుతుంది. దీనికి పరిష్కారం శోధన, విచారణ చేయడంలోనే ఉంది.
ఖచ్చితంగా ఫలితాన్నిచ్చే భగవాన్ చెప్పిన విచారణ మార్గము, తన గురించి తను యేమిటని ప్రశ్నలతో, నేనెవరు? నేను యెక్కడ నుంచి? అని విచారణ జరిగినపుడు, బుద్ధిపరంగా మేధోపరంగా చేసినపుడు అంతగా ఉపయోగం కనుపించదు. ఈ ప్రశ్నలు యేదో అలవాటుగా, అలా మళ్ళీ మళ్ళీ వేసుకోవడంవలన వ్యర్ధమే అవుతాయి.
ఒక తలంపు వచ్చినపుడు, యీ తలంపు యెవరిది, నేనెవరు? అనే ప్రశ్న రావాలి. లెక్కలేనన్ని యెన్ని తలంపులో దైవానికే యెరుక. ఈ సాధనను, దాని శక్తి, విధానం తెలియకుండా చేసినపుడు ఫలితంలేక నమ్మకం పోతుంది. సత్యంకోసం, ఎంతో శ్రద్ధ ఆసక్తి ఆర్తి తపన, తానెవరో తెలుసుకోవడం గురించి ముఖ్యంగా చాలా అవసరం, విచారణ అసలు నేనెవరు అనే మౌలిక సందేహం నీ గురించి లేచి ఉత్సుకతతో నీలో నుంచి రావాలి.
అలాంటి సందేహం, ఆసక్తిలోనే, యీ మానసిక జైలునుండి విడుదలకు కావలసిన తాళంచెవి ఉంది. నీది యెంతో విలువైన యిష్టమైన, ప్రాణమైన వజ్రం ఉంగరం పోయింది. ఎలా వెదుకుతావు? పిచ్చెక్కిన వాడిలా, అన్నీ తీసి, అందరినీ అడిగి, పోలీసులను పరుగెత్తించి, నువ్వు పరుగులు తీసి, ఎంత ఆతృత? నువ్వు శరీరం కాదు, మనసు కాదు, ఆర్జిస్తున్నవి శాశ్వతం కాదు, ఉన్నవన్నీ తీసుకుని వెళ్ళేవి కావు, వ్యర్ధమే. మరి నేనెవరు? అనే తొలిచే ఆతృత ఆసక్తి ఆర్తితో వచ్చిందా ప్రశ్న? నేనెవరు? అని. అలాంటి విచారణ భగవాన్ అనుగ్రహంతో తప్పక ఫలిస్తుంది.
భగవాన్ బోధనల ఉద్దేశం అంతా, నువ్వు యే స్థానం నుంచి నిన్ను మరచావో ఆ స్థానం వైపుకు నీ దృష్టి మరల్చి, నీ దివ్యత్వంలో, చైతన్యములో నిన్ను మేల్కొలుపుటకే.
నువ్వు మానసిక ప్రవృత్తుల భ్రాంతిమయ సుడిగుండంలో యిరుక్కున్నప్పుడు సత్యం అన్వేషించే అవకాశం ఉండదు. అందుకే మానసిక ప్రవృత్తులైన తలంపులను, అవి మానసిక ఆకాశంలో లేచే దగ్గరి నుంచే దృష్టి పెట్టి దూరం చేయాలి. తలంపుల కంటే ఆలోచించే వాడిపైనే దృష్టి సారిస్తే, మనసు నిశ్చలమౌతుంది. అపుడు, తలంపులు యెలా లేస్తాయి, అహంకారం లేవకుండా. అందువలన, మనసు తలంపులకే మొత్తం నివారణ జరుగుతుంది.
ఈ స్థితిలో మనస్సు పూర్తిగా వికాసమవుతుంది. 'నేను' అనే దానిపైనే దృష్టి అంతా లగ్నం అవుతుంది. ఒకే తలంపు మిగులుతుంది. మనసుయొక్క శక్తి వందల తలంపులపై పోయి వ్యర్థం కాదు. ఇది, అన్ని దీపాలను ఒకటే విషయంపై కేంద్రీకరించినట్లు ఉంటుంది. ఉన్న భ్రాంతి అంతా దానికదే తొలగిపోతుంది, నూనె అయిపోయి ఆరిన దీపంలా. మిగిలినది పరిపూర్ణ చైతన్యమే. నిర్మల శుద్ధ మనసు అనంత అఖండ 'నేను, నేను...'ను అనుభవిస్తూ ఉంటుంది.
ఈ అనుభూతి, బంధాలు లేని మనసు పరమానందంను, తెలుసు lకుంటుంది, లోపలికి ఆకర్షింపబడుతుంది.
మొదట్లో, మిగిలివున్న ప్రారబ్ద కర్మల వలన ఉన్న వాసనలు సంస్కారాల వలన వచ్చే భ్రాంతిమయ తలంపులు, శుద్ధ మనసును వెనక్కి లాగుతూ ప్రయత్నిస్తాయి. మళ్లీ 'నేను'పై కేంద్రీకరించాలి, ఆ తలంపులను వదిలించుకోవాలి. ఈసారి అంత కష్టం కాదు, తనలోని పరమానందాన్ని ఒకసారి అనుభవించింది కాబట్టి. భ్రాంతిమయ తలంపులు రాగానే, మనసులో ప్రథమ తలంపు అహంకారం/నేను భావన లేచి వెనక్కు రావాలనుకుంటుంది.
దివ్యత్వమైన పరిపూర్ణ చైతన్యం ముంగిట ఉంది మనసు, కానీ యింకా పూర్ణంగా అహంకారం నాశనం కాలేదు. అలాగనీ, యెన్నో తలంపులూ ముంచుట లేదు. 'నేను'పై కేంద్రీకరణ తొలగిపోలేదు. ఇక్కడ యీ కేంద్రీకరణకు విఘాతం లేకుండా ఉంటే, ప్రథమ తలంపు/అహంకారం దానికదే ఆత్మచైతన్యంలో కలసిపోతుంది. తలంపులన్నీ ఆగిపోతాయి. చైతన్యం ఒక్కటిగానే ఉంటుంది. వ్యక్తి/అహంకారం లేదు. తను తన సహజస్థితిలో ఉంటారు. అప్పుడు అనుభవించే బ్రహ్మానందాన్ని యెవరూ వర్ణించలేరు, వర్ణింపశక్యం కానిది.
No comments:
Post a Comment