Tuesday, August 2, 2022

నీవెవరివో నువ్వు కనుక్కో* *అధ్యాయం - 12* *శుద్ధ మనసు - నిశ్చల మనస్సు - విభజన మనస్సు

 *🧘‍♂️12- శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*నీవెవరివో నువ్వు కనుక్కో*

*అధ్యాయం - 12* *శుద్ధ మనసు - నిశ్చల మనస్సు - విభజన మనస్సు*


సత్యాన్వేషకులు, రేగుతున్న గాయంలా తలంపుల వలన బాధింపబడి, ప్రశాంత మనసు, ఆలోచనలు లేని మనసే గమ్యం అనుకుంటారు. వారు మనసును నిశ్చలంచేస్తే, నియంత్రణ జరుగుతుందని నమ్ముతారు. అణగివున్న మనసు వలన పెద్ద ఉపయోగం లేదన్న విషయం వారు మరచిపోతున్నారు. గాఢనిద్రలో మనసు అణగే ఉంటుంది కదా? మరి లేవగానే, నిద్రలోకి పోకముందు కంటే జ్ఞానం యేమైనా పెరిగిందా? అలాగే, యోగుల సాధనలు కూడా యెన్నో గంటలు మనసును నిశ్చలంగా ఉంచుతాయి. కొన్ని మందులు కూడా, మనసును యెన్నో గంటలు నిద్ర పుచ్చుతాయి. ఇలాంటి నిశ్చలం అంతా తుఫాను ముందు ఉండే నిశ్చలతవలె ఉండవచ్చును.


మనసు స్వభావం తెలియనపుడు, యిలా సంపాదించిన నిశ్చలతను మనసు యొక్క శక్తి అగ్ని పర్వతం లేచినట్లు లేచి నాశనం చేయగలదు. అందుకే భగవాన్ తలంపులేని మామూలు స్థితి గురించి హెచ్చరించేవారు. భగవాన్ 'ఉపదేశ సారం'లో తాత్కాలికంగా లయమైన మనసు మళ్లీ లేచి తనకలవాటైన రీతిలో మళ్లీ యెన్నో రెట్లు విజృంభిస్తుందని తెలిపారు. అందుకే భక్తురాలైన ఎచ్చమ్మాళ్కు యేకాగ్రతతో నాసాగ్రంపై దృష్టి నిలిపి, తాత్కాలికంగా తలంపులు ఆపడం లాంటిది చేయవలదని చెప్పారు.


స్వామి రామానంద సువర్ణగిరికి, తాత్కాలికంగా నిశ్చలమైన మనసు ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రమాదకరమైనదని తెలిపారు. దాన్నే, ఆత్మలో మునిగివుండే పరిపూర్ణ స్థితి అని భ్రమపడే ప్రమాదం యెంతయినా ఉంది. సహజ స్థితి తాత్కాలిక నిశ్చలం కంటే యెంతో వేరైనది శాశ్వతమైనది. భగవాన్ యిలాంటి సాధనల్లో యిరుక్కున్న భక్తులను, స్వయంగా వివరించి చెప్పి అపాయం నుండి కాపాడేవారు. ఆశ్రయంలోని పాత హాలులో ఒక భక్తుడు ధ్యానం చేస్తూ తాత్కాలిక నిశ్చలస్థితికి చేరుకునేవాడు. భగవాన్ యిది గమనించి, యింకో భక్తునితో వారిని తీసుకునిపోయి కొంతదూరం నడిపించి తీసుకుని రమ్మనేవారు. మనసు నీరసం కాకూడదు, ఎంతో చురుగ్గా ఉండాలి, తలంపులకై కాదు, తలంచే వాడిని గురించి, అంతర్ముఖంలో స్థిరం కావడానికి, తన మూలస్థానం వెదకడానికి తాత్కాలిక లయం తలంపులను ఆపి మనసును మెతగ్గా చేస్తాయి. అది విచారణకు పనికిరాదు. అందువలన యిలాంటి సాధనలు తన మూలం తెలుసుకునే విచారణ నుండి దూరం చేస్తాయి. అందుకే అలాంటి పద్ధతులు గమ్యమార్గానికి ఆటంకాలవుతాయి.


నిశ్చల మనసుపై విశ్వాసం, అది భ్రమ అయినా సరే, యెందుకు కలుగుతుంది అని యెవరైనా అడగవచ్చు. మనం చేస్తున్నదంతా విభజింపబడిన మనసు నుండి దూరంగా పోవడం. విభజన యెందుకంటే, నేను భావన / అహంకారంను అది చూసే బాహ్యం, ప్రపంచం నుండి విడదీస్తున్నందు వలన ఇందులోనే ఘర్షణ విత్తనాలు ఉన్నాయి. ఎందుకంటే యీ విభజన నిజం కాదు, తప్పుడిది, అసత్యం. తలంపులన్నీ మనసు యొక్క ఆవిష్కరాలే. మనం స్వప్నానుభవం జాగ్రత్తగా గమనించితే, కలలో కూడా ఒక ప్రపంచం ఆవిష్కరించ బడుతుంది. ఇంకా, నేను భావన/వ్యక్తి/అహంకారం, 'నేను' కంటే వేరుగా సత్యం కాదు, లేదు.


అయినాసరే, విభజింపబడిన మనసు నివారణ, దాన్ని నిశ్చలం చేయడం వలన జరుగదు, దాని సహజ స్వభావం అర్థం చేసుకుంటే కలుగుతుంది. నేను యెవరు విచారణ వలన యీ అర్థం తెలుస్తుంది. ఈ విచారణ అంతా నేను భావన/అహంకారంపైనే కేంద్రీకరించబడుతుంది. మొదట తలంపులు, ప్రపంచం నుంచి తప్పించబడతాయి. తరువాత, యిలా తలంపుల నుంచి వేరు కావడమే మనసును తన మూలస్థానం వైపుకు తోస్తుంది. మనసు మళ్లీ తిరిగి లేవలేదంటే అర్థం యిక అహంకారం, మిగతా తలంపులు, ప్రపంచ విషయాలు మళ్లీ లేవవు. మనసు ఆలోచనా రహితం, భావనా రహితం అయి శాంతం అవుతుంది, సహజ శాంతం నిలుస్తుంది.


 యోగక్రియల వలన కలిగిన తాత్కాలిక ప్రశాంతతకు యిది భిన్నం అయినది. ఈ ప్రశాంతంలో పూర్ణచైతన్యం ఉల్లాసం ఉంటాయి. దీన్ని నాశనం అయిన మనసు అని పిలుస్తాం. కానీ యిదే సత్యమైన మనస్సు, సదా చురుగ్గా, ఆనందంతో ఉంటుంది. మరి అవసరమైనపుడు తలంపుల మాటేమిటి? అవసరం అయినపుడు, అవసరం అయినంత మేరకు తలంపుల స్పందన ఉంటుంది. ఒక భక్తురాలు దీని విషయంలో తన అనుభవం తెలిపింది. 'ఒకరోజు మధ్యాహ్నం ఒకరు కాగితంపై వ్రాసి ఉన్న పద్యాలు భగవానుకు చూపించారు. భగవాన్ వాటిని చదివి, కొన్ని మాటలు చెప్పి, ఉదాహరణగా యోగవాశిష్ఠంలోని ఒక కథ చెప్పి వివరించారు. మహర్షి ఆ కథను చెపుతున్నపుడు తనే స్వయంగా అందులోనికి, గురిపెట్టిన బాణంలా, పోయి అక్కడ ఉండి తెలిపారు. తెలిపిన వెంటనే తన సహజమైన బోధించే మౌనంలో ఉండిపోయారు.


భగవాన్ మౌన మనస్సు పనిని వివరించేవారు స్పష్టంగా. అది ఆయనకు చిన్న పిల్లల ఆటలాంటిది. దానికి ముందు, మనసు నియంత్రణ సాధనా పద్ధతుల్లో చేసుకోలేదు పరిమితులను చూద్దాం. వాటన్నింటిలోనూ ఒక విషయంపై యేకాగ్రత - పవిత్రనామం మంత్రం రూపం సద్గురువు లేక దైవం అవవచ్చు, ఉంటుంది. ఈ విషయంపై నిలువడానికి కావలసిన తలంపుల శూన్యతకై ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నం విజయం కాదు, యెందుకంటే మనసు స్వభావాన్ని అర్థం కాబట్టి. భగవాన్ 'తలంపులనేవి మనసులోని ఒక భాగమే, వేరు కాదు. అందుకే యీ మనసు అంటే యేమిటి? అని శోధించితేనే, యీ మనస్సు యెక్కడ నుండి పుడుతున్నది? అని ప్రశ్నిస్తే, అపుడు మనసు తలంపులను వదిలి, ఆ మూల స్థానంలో కలిసిపోతుంది. అది ప్రపంచాన్ని (ఆబ్జెక్ట్) చూచే వ్యక్తి/అహంకారం (సబ్జెక్ట్) కాదు.


'గది అంతా రాత్రి చీకటితో నిండినపుడు, వస్తువులను చూడడానికి ఒక వెలుగుతున్న దీపపుకాంతి అవసరం అవుతుంది. కానీ సూర్యుడు ఉదయించిన తరువాత వస్తువులను చూడడానికి దీపం అవసరమే లేదు. సూర్యుని చూడడానికి యెలాంటి దీపం అవసరం లేదు. స్వయం ప్రకాశం అయిన సూర్యుని నువ్వు యెప్పుడూ తెలుసుకునే ఉంటావు'.


అలాగే మనసుతో కూడా వస్తువులను చూడడానికి సూర్యుని నుంచి వెదజల్లే కాంతి అవసరం అవుతుంది. కానీ హృదయాన్ని తెలుసుకోవడానికి మనసు అందులోనికి అంతర్ముఖమైతే చాలు'.


హృదయం యొక్క ఆకర్షణశక్తి వలన, మనసు దాని మూలస్థానంలో అణగడం దానికదే జరుగుతుంది. అపుడు శుద్ధనిర్మల మనసు విభజింపబడిన మనసు బదులు నిలుస్తుంది. ఆ తరువాత ఉన్నదంతా ఆనందమే ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, అనంతమైన ఆనందం, సదానందంలో మనసు మునిగి ఉంటుంది. 

No comments:

Post a Comment