*శ్రీ రమణ మార్గము. 13*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 13* *కాలం తరగిపోతూ ఉంది*
డెబ్బయి సంవత్సరాల వయసు వచ్చేసింది. అందుకు సంబంధించిన ఉత్సవాలన్నీ యిప్పుడే పూర్తయ్యాయి. ఒకరి జీవితంలో డెబ్బయివ సంవత్సరం చాలా కీలకమయినది అంటారు. మన తలంపుల్లో, మాటల్లో, చేతల్లో చేసిన లెక్కలేనన్ని తప్పులు, పాపాలకు భగవంతునికి వేలకొద్దీ క్షమాపణ చెప్పి ప్రార్ధన జరిగింది. వాటి సూచిక పట్టీకి అంతం లేదు. అహంకారపూరిత జీవనంతో, స్వార్ధం నిండిన కోరికల వలన భగవంతుని చట్ట ఉల్లంఘనలు లెక్కలేనన్ని జరిగాయి.
ఆ ఉత్సవాలకు వచ్చిన ఒక స్నేహితుడు 'నువ్వు యింకా యెక్కువకాలం జీవించాలని కోరుకుంటున్నావా?' అని అడిగాడు. ఇలాంటి ప్రశ్న వినగానే, అలాంటి సందర్భంలో జాలిలేని కఠినమైన, ఘోరమైన ప్రశ్న అనిపిస్తుంది. అయినాసరే, యెలాంటి వాదనకు తావు లేకుండా, 'అది రమణ భగవాన్ యిష్టం’ అని సమాధానం వచ్చింది చల్లగా, నెమ్మదిగా, ప్రశాంతంగా.
ఈ ప్రశ్న, దాని జవాబు కూడా యెవరికైనా ఆలోచింపజేయాలి. కాదా మరి? భగవాన్ కి అన్నివిధాల శరణాగతి పొందినవారు మాత్రమే యెవరయినా సరే, నిజంగా ‘అంతా భగవాన్ దే ' అని చెప్పగలరు. మిగతా వారికి, ఆ ప్రశ్నతో యీ జీవితమంతా యేమిటి, యెందుకనే సమీక్ష జరగాలి. మిగిలిన జీవితకాలం, యెన్ని సంవత్సరాలు మిగిలి వున్నా గానీ, యెలా గడపాలి? గతం కంటే పూర్తిగా లేక కొంతయినా మార్పు ఉంటుందా జీవితంలో సత్యం యేమిటనీ, తెలుసుకోవాలనీ ఆతృత యేమైనా కలుగుతుందా? సత్యం తెలుసుకోవడానికి నేనెవరు విచారణ స్థిరంగా జరుగుతుందా? భగవాన్పైన జీవితం పూర్తిగా ఆధారపడుతుందా? నిరంతరం ప్రవహించే భగవాన్ అనుగ్రహం అవగత మవుతుందా, అందుకుంటానా? లేక మిగతా రానున్న జీవితం కాలం కూడా యింతకు ముందు లాగే అలవాటుగా, మామూలుగా, అశాంతిగా, నీరసంగానే గడచిపోతుందా?
ముసలివారే కాదు, కుర్రవారు కూడా దృష్టి సారించాల్సిన కొన్ని ప్రశ్నలూ ఉన్నాయి. ఎందుకంటే చాలా విషయాలు స్పష్టంగా లేవు. జీవితకాలం యెవరికైనా అసలు యెంతో తెలియనే తెలియదు. దేహం పోవడానికి యే సమయం, యే వయసులోనైనా కాలం వచ్చేసరికి, యెవరైనా యింకా కొంతకాలం ఉంచమని ప్రార్ధిస్తారా? చేస్తే, ఎందుకు? ప్రార్ధన చేస్తే, అది మన్నించి యింకా కొంత కాలం పొడిగించబడిందే అనుకోండి, అపుడు కూడా అర్థం ఆలోచనా లేని జీవితమే కొనసాగుతుందా లేక జీవితంలో సత్యాన్ని తెలుసుకుందామనే తీవ్ర తృష్ణతో కొత్త పంథా మొదలవుతుందా?
అలాంటి ప్రశ్నలు మనల్ని యింకా లోతుగా కొన్ని మన మౌలిక గ్రహింపుల్లోకి తీసుకుని పోతాయి. అసలు కాలం అంటే యేమిటి? భగవాన్ చెపుతారు, కాలం అంటే అహంకారమే, నేను శరీరం అనే భావన, నేను మనసు అనే గ్రహింపే అని. కాలం గతంతో, గతజన్మల వలన ఉన్న అనంత అనుభవాల వలన, గుర్తించబడి సంధింపబడి ఉంటుంది.
ఈ గుర్తింపు, సంధిని కత్తిరించి అంతం చేస్తేగాని, జీవితం యొక్క అనంతమైన ఆనందం, మధురం అనుభూతి కాదు. మనం మన గత అనుభవాలకు, తలంపులకు, అనంతంగా పుడుతున్న ఆలోచనల ప్రవాహాలకు బానిసలై ఉన్నాము. ఎవరి జీవితమైనా యెలా మొదలయిందో అలాగే అంతం కాకుండా, అత్యద్భుతమైన జీవన అందం, పరమానందాన్ని మరచి బ్రతికి యీ జీవితం వ్యర్థం కాకుండా ఉండాలంటే, అందరిపై సవారీ చేస్తూ కొరడా ఝళిపిస్తున్న వారి గతం నుండి విడివడి విముక్తి పొందాలి.
గతం నుండి విముక్తి కలిగితే, గతాన్ని విడిచేస్తే జీవితం ప్రతీక్షణం మధురమై పూర్ణమే. మనసు, గతం భవిష్యత్తుల వలన ప్రభావితం అయి దారి మళ్లక, ప్రతీ ఒక్కక్షణం వర్తమానంపైనే లగ్నం అవుతుంది. అదే వర్తమానంలో పూర్ణంగా జీవించే మధురమైన జీవితం. ఇదంతా సరి అయినదే, మేథోపరంగా అంగీకరించేదే, కాని యేదో చాలా కొద్దిమందే దీన్ని గ్రహించి ఆచరించి ఆనందించగలుగుతున్నారు.
ఇదేం ఆశ్చర్యం కాదు, యెందుకంటే ప్రస్తుతం మన ముందు ఉన్న యెన్నో సంబంధాలు, సమస్యలు, సాధించాల్సిన గమ్యాలు, యీ విషయంలో నుండి శ్రద్దను దూరం చేసి, కేవలం వర్తమానంలో మనసును ఉండనీయవు. తను యెక్కడికి పోతానో, భవిష్యత్తు యెలా ఉంటుందో, యేమవుతానో అనే భయం ఉంటుంది. ఒక జీవన విధానానికి, గ్రహింపు ఆలోచనా సరళికి అలవాటయి పోయారు. ఇక్కడ చెపుతున్నదంతా, యీ అలవాటుకు పూర్తిగా వ్యతిరేకం, అందుకని మనసు యీ సత్యం వైపు మార్పు అంటేనే భయంతో వణుకుతుంది, దూరంగా పారిపోతుంది.
అందుకని, యిలాంటి అవసరం, అర్థం లేని భయాల నుంచి అధిగమించాలి. గతం అన్నది. యెన్నో బాధలు, గాయాలు తీరని కోరికలతో కూడి ఒకరిపై ఉన్న అతిభారమైన బరువే. వాటి తాలూకా ప్రభావం, ఉదృతం చాలా చాలా దృఢం అయినది. వాటి నుంచి బయటపడడం అనేది జరుగక, వాటి బానిసలుగా జీవిస్తుంటారు. కొన్ని మధుర అనుభవాలు కూడా ఉండవచ్చు. కానీ వాటి ప్రభావం కంటే బాధల అనుభవాల ప్రభావం యెంతో ఉదృతంగా లోతుగా కలుగుతాయి. ఏదేమయినా సరే, యీ జీవిత విధానాన్ని వదలి, కొత్త మధుర జీవనాన్ని ఆవిష్కరించే, పరమానందాన్నిచ్చే పద్ధతిని సాధనచేసి శ్రద్దగా కృషి చేయాలి.
ఈ స్థితికి చేరుకోవడానికి, అందులో స్థిరంగా ఉండడానికి అవసరమైన ప్రయత్నం యేమిటనే ప్రశ్న వస్తుంది. కొలంబో నుంచి వచ్చిన ఒక సాధకుడు, భగవాన్ను 'కోరిక ఎంపిక, అవకాశం, ప్రయత్నంకు అతీతమైన సహజానందం ఎరుక స్థితికి చేరుకోవడానికి అన్నింటి కంటే ఉత్తమమైన మార్గంయేది’? అని అడిగారు. అంటే సాధకుని ఉద్దేశం, అతని మాటల్లో 'ప్రతీక్షణం పూర్ణంగా జీవించడం' కోసం ఉత్తమపద్ధతి గురించి. మానసిక ప్రవృత్తులు యేమీ లేనపుడు మనసు పూర్ణంగా వర్తమానంలోనే ఉంటుంది. భగవాన్ సమాధానం :
‘ఎంపిక, ప్రయత్నం లేక సదా ఉండే ఎరుక యేమనగా సహజ స్వభావం. మనం అది సాధించగలిగితే, ఆ స్థితిలో నిలిస్తే, అదే సత్యమైనది. కానీ దాన్ని, ప్రయత్నం లేకుండా చేరుకోలేరు, ధ్యానం అనే ప్రయత్నం కావాలి, చేయాలి. గత జన్మల వాసనలన్నీ మనసును బాహ్యంలోనికి తీసుకునిపోయి బాహ్య విషయాల్లో ముంచి ఉంచుతాయి.
అలాంటి తలంపులనన్నింటినీ విడిచివేసి, మనసును అంతర్ముఖం చేయాలి. ఈ ప్రయత్నం అందరికీ అవసరం అయినదే. అన్ని గ్రంథాలు, వక్తలు 'మౌనంగా ఉండు, నిశ్చలంగా ఉండు' అని చెపుతారు. కాని అది అంత సులభం కాదు. అందుకే యీ ప్రయత్నం అంతా చాలా అవసరం. ఎంపిక, ప్రయత్నంకు అతీతంగా ఉండే ఎరుక స్థితి కలుగడానికి యెంతో నిరంతర ధ్యానం వలనే సాధ్యం'.
భగవాన్ బోధించిన నేనెవరువిచారణ కంటే యెలాంటి ధ్యానం ఉత్తమమైనది? విచారణ అంతా ధ్యానించే వాడిపై, అహంకారం, వ్యక్తిపై కేంద్రీకరించబడి ఉంటుంది. కాబట్టి యిది సూటిది. నేనెవరువిచారణ సాధన వలన, మనసు కల్పించే గందరగోళం నుంచి తొందరగా బయటపడటం
అలవాటయి, 'నేను'పై దృష్టి లగ్నం అవుతుంది.
ఒకసారి యీ కేంద్రీకరణ సమగ్రం పూర్ణం అయితే, లోపల నుంచి బ్రహ్మాండమైన అయస్కాంతంలా అత్యంత ఆపలేని ఆకర్షణ శక్తి ఉన్న ఆత్మ (నేను), తనని లోపలికి లాగుకుంటుంది. ఒక నది సముద్రంలో కలసి ఐక్యం అయినట్లు, కాలం అహంకారం ఆ స్థానంలో కలసి లీనమయి యిక లేకుండా పోతాయి. అహంకారంలేని జీవనం మొదలవుతుంది.
ఆ తరువాత, వారి శరీరం కాలంలో ఉండవచ్చు, కాని మనసు కాదు. మనసు కాలానికి, దేశం, ప్రదేశాలకు అతీతంగా ఉంటుంది. దీన్ని, 'మనసు మరణం' అని అంటారు. నిజంగా అయితే యిది మనసుకు సత్యంగా పుట్టుక, అది విముక్తి పొంది చైతన్యంగా, బ్రహ్మానందంగా ఉంటుంది. దేహం యొక్క మరణం అంటే భయమూలేదు, ఆహ్వానమూ లేదు.
శరీరం దైవం యొక్క ఒక సాధనం అయి, పరమేశ్వరుడు దాన్ని ఉంచిన ఉద్దేశ్యం నెరవేరే వరకు ఉంటుంది. ఈ స్థితినే భగవాన్ మనకు బంగారు పళ్లెంలో అనంత కరుణతో అందిస్తున్నారు. ప్రతీ శ్రద్ధాభక్తులున్న సాధకునికి మార్గదర్శకత్వం వహిస్తూ, నిరంతరం నడిపిస్తూ, అనుగ్రహంతో వీక్షిస్తూ ఉన్నారు భగవాన్.
No comments:
Post a Comment