🧘♂️ *14- శ్రీ రమణ మార్గము*🧘♀️
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 14 మరణించేది - మరణమే లేనిది*
అది అనుకోకుండా అకస్మాత్తుగా, గమనించనంతటి యెంతో వేగంగా, ఆకాశంలోని మెరుపులా జరిగిపోయింది. అతను చాలా మంచివాడు, యెంతో చురుగ్గా, వివేకంగా, యెప్పుడూ అందరికీ సహాయకారిగా ఉండేవాడు. అతను ఛాతీనొప్పి అని చెప్పాడు. రెండు గుండెపోట్లు తరువాత, గుండె పని చేయడం ఆగిపోయింది. హాస్పిటల్నుంచి అతని శవాన్ని యింటికి తీసుకుని వచ్చారు. అది హృదయవిదారకమైన దృశ్యం, గట్టిగా తల్లి రోదన, భార్యకు అపుకోలేనంత దుఃఖం, భాతృ, పుత్ర, పుత్రికల భారమైన ఆక్రందనలు, నిరంతరం అందరికీ ధైర్యం చెపుతూ ఓదార్చే స్నేహితులు, బంధువులూ.
ఈ తతంగంతో పాటు, చివరి చూపు అయినా దక్కుతుందనే వారి కోసం బంధువులకు, స్నేహితులకు యీ వార్తను అందించడం, అంత్యక్రియలకు అవసరమయిన ఏర్పాట్లన్నీ చేయడం, వచ్చినవారికి టీ, కాఫీ, టిఫిన్, భోజనం ఏర్పాట్లు అన్నీ సాగిపోతున్నాయి. అలా జీవితం సాగిపోతుంది, ఎవరు ఆగినా సరే.
వాతావరణం అంతా దుఃఖంతో నిండి ఉంది. క్రొత్తగా వచ్చే ప్రతీ ఓదార్చేవారు ఆ వాతావరణానికి యింకొంత దుఃఖం కలుపుతున్నారు. ఆశ్చర్యం! కొన్ని గంటల క్రితమే యెంతో చురుగ్గా ఉండి, మాట్లాడి పనిచేసిన ఆ శరీరం యిపుడు అక్కడ ఒక శవమై, నిర్జీవంగాపడి ఉంది. దాన్ని రేపు ఉదయం వరకూ శీతలీకరణచేసి భద్రం చేయాలి.
రాత్రి అంతా యెంతో భారంగా నడచి, యేదోలా గడచిపోయింది. స్త్రీలందరినీ చివరిసారిగా చూపులను, వీడ్కోలును పూర్తి చేసుకోమన్నారు. జీవం పోయిన ఆ బరువైన శరీరాన్ని, యెంతో జాగ్రత్తగా ఎత్తవలసి వచ్చింది. అంతిమ ప్రయాణం మొదలయింది. అది ఎన్నో వందల వందల శవాలు వరుసలుగా దహనం చేసిన శ్మశానం గుండాపోయి, విద్యుత్ దహనవాటికవైపు పోయింది. ఎన్ని శవాలు, దహనాలు, అస్థికలు. ఇవన్నీ యీ రక్తమాంసాల గురించి గుచ్చి గుచ్చి చెపుతున్నాయి. మనకు తెలియని, ముందే నిర్ణయింపబడిన పంచభూతాలతో తయారు అయిన యీ శరీరం, పెరిగి, తిరిగి పంచభూతాల్లోనే కలసిపోతుంది.
ఆ దహన వాటిక వద్ద యెన్నో నిబంధనలు, నియమాలు ఉన్నాయి. అక్కడ ఉన్న గుమస్తా టీ కోసం బయటికి వెళ్ళాడు. మరి అక్కడ వేచి ఉండవలసినదే. వేచి ఉండటం ఎంతో దీర్ఘమయినదనిపించింది. మళ్లీ ఒక చివరి చూపు, వీడ్కోలు, ఇక శవాన్ని దహన వాటిక విద్యుత్ గుహలోనికి నెట్టబడింది. ఇక అది చూడబడదు. చూడడానికి లేదు. మరునాడు ఉదయం వచ్చి అస్థికలు, బూడిద తీసుకోమని తెలిపారు. ఒక పిడికెడు అస్థికలు, అవశేషం మిగిలింది, అది కూడా పవిత్ర జలాల్లో కలిపేసేదే.
ఎంతో యిష్టమైన ఆప్తుడు వెళ్లిపోయాడు. ఇక అతను ఎంతమాత్రం తనకు ప్రియమయిన కూతురుని, ఎంతో సేవలు చేసిన భార్యనుగాని, యే దగ్గర దూరం బంధువులు, స్నేహితులనైనా పిలువలేడు. ఎంతో శ్రమించి కష్టపడి తన స్వంత తెలివితేటలతో పైకి వచ్చిన భక్తి, వినయాలు నిండిన ఒక మంచి మనిషి జీవితానికి తెరపడింది. అతనిలోని జీవన జ్యోతి ఆరిపోయింది. ఎంత తీవ్రంగానో లేచిన దుఃఖ కెరటం, జ్ఞాపకాలను చెరిపేసే గొప్ప పనితనమున్న కాలంలో పడిపోతుంది.
ఈ దుఃఖం, తతంగాల మధ్య ఉండి వాటిని పంచుకుంటూ గమనించుతూ ఉండినవారికి, జీవితం దాని ప్రయాణం, స్వార్థచింతనలు, చేతలు, సంకుచిత పనులు, ఘర్షణ గొడవలు, యింకా యెన్నో, అన్నీ చూస్తుంటే నిస్పృహ కలుగుతుంది. జీవితం అంటే తాత్కాలికమైన ఒక మజిలీ మాత్రమే అనిపిస్తుంది. దాని ఉద్దేశం గమ్యం యేమిటని లోతుగా శోధన చేయాలి అనిపిస్తుంది.
అదే సమయంలో, యీ తాత్కాలిక ప్రయాణం, శరీరం అశాశ్వతత్త్వం, మట్టినుంచి పెరిగే దేహం, దానిచుట్టూ అల్లుకున్న నిర్మితమైన యెన్నో సంబంధాల గురించి గమనింపులు, ఆలోచనలు యెంతో కాలం నిలువవు. తొందరలోనే మరచిపోయి, మనసు పాత అలవాటయిన జీవితంవైపు మరలిపోతుంది.
అయినా, కొందరు మాత్రం పవిత్ర గ్రంథాల ప్రబోధాల నుంచి జనన మరణాలే లేని అమృతత్వమయిన ఆత్మ గురించి తెలుసుకుని, శరీరం యొక్క శాశ్వతత్త్వం గురించి ప్రశ్నించుకుంటారు. మనలో ఉన్న మరణం లేని శాశ్వత తత్త్వము, దేహం మరణమే అన్నిటికీ అంతిమం అని అంగీకరించడానికి నిరాకరిస్తుంది. ఎవరికైనా యీ విషయంలో గమనించుతూ, తర్కించుతూ, శోధించుతూ ఉంటే, దగ్గర బంధువో స్నేహితులో మరణించినపుడెల్లా అతని
జీవితంలో సత్యంవైపు మార్పు జరుగుతూ ఉంటుంది. మనం చూసే, తెలుసుకునే ప్రతీ మరణం ఒక ప్రశ్నను లేపుతుంది. దుఃఖం మనలో ప్రశ్నలు రేపుతుంది, అందువలన శోధనా, జ్ఞానం పెరుగుతుంది.
ఇది రమణులు తన తండ్రి మరణించినపుడు శోధించిన మాదిరిగానే ఉంటుంది. తిరుచ్చుజిలో, 1892వ సంవత్సరంలో తండ్రి సుందరం అయ్యరు గారు మరణించారు. భగవాన్ కు అప్పుడు పండ్రెండు యేళ్ల వయసు మాత్రమే. రోధిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఉన్న రమణులు, చనిపోయారు అని చెపుతున్న తన తండ్రి దేహానికి, పూర్తిగా జీవంతో కదులుతున్న తన దేహానికి బేధం యేమిటని ప్రశ్నించుకున్నారు. ఈ అంతర్గత శోధనవలన, తన తండ్రి శరీరంలోని 'నేను' వెళ్లిపోయి అది శవం అయిందనీ, తన శరీరంలోని 'నేను' యింకా ఉన్నదని అభిప్రాయానికి వచ్చి నిశ్చయించారు.
అలాంటి సంఘటనే, తన తల్లి తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చిన తరువాత తీవ్రమయిన జబ్బుకు గురి అయినపుడు జరిగింది. భగవాన్ శరణు పొందిన ఒకే ఒక్క నాథుడు, అరుణాచలంలో ప్రతిష్టితమైన శివుడే. అతని తల్లి ముక్తికి యింకా సిద్ధం కాలేదు. అందుకే, ఆవిడ జబ్బు నయం అయ్యేందుకు అరుణాచలుని ప్రార్థిస్తూ, ప్రార్థనలోనే మౌళికమైన 'అసలు మరణం అంటేనే యేమిటి? అని ప్రశ్నిస్తారు'. 'కాలం అంటే యేమిటి? మరణం అంటే యేమిటి?' విచారణ చెయ్. నిజానికి మరణం అంటే దేహం పోవడం మాత్రమే. కానీ మనసు సంగతి యేమిటి. లోనున్న దివ్యత్వం మాట యేమిటి? 'శరీరానికి, మనసుకూ చైతన్యాన్నిచ్చే, మరణం లేని శాశ్వతమైనదేమైనా మనలో ఉన్నదా?’ అంటూ ప్రశ్నించాలి అన్నారు.
శరీర మరణ సమయంలో, మనసు ప్రాణశక్తిని ఆవరించుకుని యీ దేహంలో నుంచి పోయి, యింకో శరీరానికి, స్థూలమైనా సూక్ష్మముదైనా, సంధించుకుంటుంది అని భగవాన్ తెలిపారు. ఇలాగే, వరుసగా జనన మరణాలు, చివరికి మనసే మరణించే వరకూ యిలా జరుగుతూనే ఉంటాయి. అందుకనే ఎవరైనా ముఖ్యంగా యీ మనసుపైనే దృష్టి పెట్టి, దాని నిజ స్వభావం యేమిటో తెలుసుకోవాలి. లేకపోతే, అది తలంపుల సమూహాంగా, గత సుఖ దుఃఖాల అనుభవాలతో కూడి వాసనలు, సంస్కారాలుగా సాగుతూ ఉంటుంది.
మనసు మరణం అంటే, అది దాని మూలస్థానంలో కలసిపోవడమే
అని రమణులు చెపుతారు. నేనెవరు విచారణ అంటే యీ అహంకారం/ మనసుకు గురిపెట్టబడిన శోధన కాబట్టి, ఫలితంగా మూలంలో కలిసిపోతుంది. అపుడు శుద్ధ నిర్మల మనసు, ఆత్మకు ప్రతిబింబం అయినది ఉంటుంది. అందుకే, తల్లి గర్భాల నుంచి గర్భాలకు మారుతూ పుట్టే నరకయాతన నుంచి తప్పించుకోవా లనుకునేవారు, స్థిరంగా శ్రద్ధగా తీవ్రంగా మనసు సహజ స్వభావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అహంకారంపై గురిచేసిన 'నేనెవరు విచారణ', ఫలితాన్ని తప్పక యిస్తుంది.
సందేహమే లేకుండా, తీవ్ర తపన ఆర్తితో చదివి విచారణ వలన మనసు సత్యరూపం తెలుస్తుంది.
కానీ విజయానికి అది చాలదు. ఎవరైనా విజయానికై సద్గురువులు రమణుల నిరంతర రక్షణ, సహాయం, అనుగ్రహం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనలోని అంతర్గత వాసనలు వేచివున్న అగ్ని పర్వతాల్లాంటివి. అవి అయిదు యింద్రియ ఆసక్తులతో మనసును లోబరచుకుని అగాథాల్లోనికి త్రోసేస్తాయి. ఎంత ఆధ్యాత్మిక సాధన చేసినా, యేదో బలహీన క్షణంలో వృధాగా పోతుంది. సద్గురు అనుగ్రహం సదా ఉన్నవారు మాత్రం రక్షింపబడతారు. గత వాసనలు సంస్కారాలు మనల్ని క్రిందకి త్రోసివేయకుండా భగవాన్ రక్ష సదా కావలసిందే, అవసరమే.
ఈ శరీరంలో జీవించి ఉండగానే, మన యొక్క మరణం లేని అమృత తత్త్వం తెలుసుకొనడం సాధ్యమే అని భగవాన్ గట్టిగా చెపుతారు. శ్రద్ధగా నిరంతరంగా నేనెవరు విచారణ వలన, సదా భగవాన్ అనుగ్రహాన్ని గ్రహించడం వలన యిది సాధ్యమవుతుంది. ఈ జీవితంలోని యీ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుని అంతర్ముఖమై విజయులు కాకపోతే, ప్రతీ జన్మకూ జన్మకూ శ్మశానానికి ప్రయాణం తప్పనిదే. ,
No comments:
Post a Comment