*🧘♂️15- శ్రీ రమణ మార్గము🧘♀️*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 15* *సర్వోత్తమ వైద్యుడు*
కోరికలు లేని స్థితి అవసరం గురించి మన పవిత్ర గ్రంథాలు చక్కగా వక్కాణిస్తున్నాయి. జ్ఞానులు, భగవాన్ రమణ లాంటి వారికి యెలాంటి భయం అన్నది లేదు. ఎందుకంటే వారు యెలాంటి కోరికలు లేనివారు, దేన్నీ కోరుకొనరు. కోరికలు లేకపోవడమూ, భయంలేకపోవడమూ అన్నా ఒకటే, అందుకే యీ స్థితిని యెలా సాధించాలన్న ప్రశ్న ఉదయించాలి.
అందుకోసం, యెప్పుడూ రెండు పద్ధతుల్లో ప్రయత్నం సాగేది. ఒకటి ఉన్న కోరికలను తీర్చుకుంటే యింక సంతృప్తి ఉంటుంది అనుకుని కోరికలను తీర్చుకోవడము. భగవాన్ ను ఒక భక్తులు అడిగారు.
ప్రశ్న :- కోరికలను త్యజించేమందు, యెవరైనా తమకు ఉన్నవాటిని తీర్చుకుని సంతృప్తి చెందాలి కదా?
జవాబు :- అలాగే, మంటలను కూడా పెట్రోలు పోసి ఆర్పవచ్చునా? కోరికలను తీర్చుకొనే కొద్దీ, సంస్కారాలు యింకా లోతుగా వృద్ధి చెందుతాయి. అవిపోయే ముందు అవి బలహీనపడాలి. కోరికల్లో మునిగిపోకుండానే, వాటిని బలహీన పరచడం జరుగుతుంది. కోరికలను తీర్చుకున్నపుడు కలిగిన ఆనందం వలన యింకా ఆనందం శేషించి మిగిలి ఉంటుంది. దీనివలన, యింతకుముందు ఆనందం కలిగించిన వాటి గురించి మళ్లీ మళ్లీ కోరుకోవడం జరుగుతుంది.
అందువలన కొంతమంది, కోరికలను అణచివేస్తే, జయిస్తే అవి యిక ఉండవు, తరువాత హాని కలిగించవు అని చెపుతారు. అణచి వేయడం అనేది దాని స్వభావరీత్యా తాత్కాలికమైనదే. ఈ పద్ధతిని కూడా భాగవాన్ ఒక భక్తుని ప్రశ్నకు సమాధానంగా వివరించారు.
ప్రశ్న :- నాలో లేస్తున్న కోరికలను నేను యేం చెయ్యాలి? వాటిని జయించి అణచివేయాలా లేక వాటిని తీర్చుకుని సంతృప్తి పొందాలా? భగవాన్ చెప్పిన పద్ధతిలో 'యీ కోరికలు కలిగినది యెవరికి?' అని ప్రశ్నించితే అవిపోవడం లేదు సరికదా యింకా బలపడుతున్నాయి.
జవాబు:- అంటే, ఆ పద్ధతిని నువ్వు సరిగా చేయడం లేదని తెలుస్తుంది.
సరి అయిన పద్ధతి యేమంటే యీ కోరికలకు మూలస్థానం యేమిటి తెలుసుకోవడం, అవి యెక్కడ నుంచి పుట్టి వస్తున్నాయో కనుక్కోవడమూ, వాటిని తొలగించుకోవడం. నువ్వు వాటిని జయించి అణచివేస్తే తాత్కాలికంగా అణగినా, అవి మళ్లీ విజృంభించి లేస్తాయి. వాటిని సంతృప్తి పరిస్తే యింకా యెక్కువ సంతృప్తి కోసం పరితపిస్తాయి. సంతృప్తిపరచి వాటిని ఆపివేయడం అంటే, మంటలను ఆర్పడానికి దానిపై కిరోసిన్ పోసినట్లు ఉంటుంది.
సంతృప్తి లేక అణచివేయడం వలన కామరహిత స్థితి రావడం లేదన్న సత్యం తెలుస్తూనే ఉంది. కొంతమంది అలాంటి స్థితి అసలు సాధ్యమే కాదని అనుకోవచ్చు. ఈ అభిప్రాయం కూడా తప్పే. జ్ఞానులు కామరహిత స్థితిలోనే ఉంటారు. ఆ స్థితిలోని పరమానందాన్ని, అనుభవాన్ని చూపిస్తుంటారు.
ప్రతీరోజు గాఢనిద్రలో ప్రతీవారు కామరహిత స్థితిలో, యెలాంటి కోరికలకై తలంపులు లేనివారై ఉంటారు అని భగవాన్ చెపుతారు. కోరికలను సంతృప్తి పరచకపోతే యెవరూ దరిద్రులైపోరు. అంతేకాదు, అందుకు విరుద్ధంగా, ఆ స్థితిలో దృఢంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు.
కొంతమంది మానసికంగా కామరహిత, భయరహిత స్థితిని ఒప్పుకుంటున్నా, ఆచరణలో సగం సగంతో ఆగిపోతారు. శ్రీ దేవరాజ మొదలియర్ గారితో (భగవాన్ అనుదినము సంకలన కర్త) మాట్లాడుతూ భగవాన్ యిందుకు కారణాలు వివరించారు.
'ఇంద్రియ సుఖాల వెంట పరుగులెడతారు. ఎందుకంటే వాటి అనుభవం ఆనందం యిస్తాయని తెలుసు. ఋషులు కామరహిత స్థితి, పరమానంద స్థితిని అనుభవించి చూపారు. కానీ, ఆ అనుభవం అందరికీ లేకపోవడం వలన దాన్ని విశ్వసించరు'. అందుకే యీ ఆనంద అనుభవాన్ని యెట్లా సాధించాలనే ప్రశ్న వస్తుంది. కోరికలన్నీ 'కోరుకున్నవాడి'కి సంబంధించినవే. ఎవరైనా వాడిపై, అహంకారంపై దృష్టి నిలపి కోరికల స్వభావాన్ని అర్ధం చేసుకుంటే, నేను భావన / వ్యక్తి భావన పుట్టే మూలాన్ని శోధిస్తే, కామరహిత స్థితి కలుగుతుంది. భగవాన్ చెప్పిన యీ సలహా, తిన్నగా సూటిది సరళమూ అయిన నేనెవరు విచారణకే తీసుకుని పోతుంది.
అందుకే యెవరికైనా వారి నిజస్థితి గురించి సందేహమూ, ప్రశ్న నిరంతరం, అంటే యేం పనిచేస్తున్నా విచారణ; పని, నడవడం, యేం చేస్తున్నాసరే ఉండాలి, కలగాలి. అలా మనసుతోనే, దానిపైనే దాని కోశంపై కేంద్రీకరింపజేస్తే మనసులోనికి తిప్పుతుంది. హృదయంలోని
దివ్యత్వం ఆత్మ (నేను) యొక్క ఆకర్షణశక్తి వలన మనసు లోపలికి పోతుంది. సహజంగానే బ్రహ్మానందం అనుభవిస్తుంది. ఒక పండిపోయిన పండుచెట్టు నుంచి దానికదే యెలా రాలిపోతుందో, అలాగే కోరికలను సంతృప్తి పరచడంలో ఆనందం ఉన్నదన్న భ్రమ అదే తొలగిపోతుంది.
సాధకులు ఒక విషయం మరువకుండా గుర్తుంచుకోవాలి. విచారణ విజయం కావాలి అంటే భగవాన్ అనుగ్రహం, మార్గదర్శకత్వం నిరంతరం ఉంటుంది అని, దృఢంగా విశ్వసించాలి. లేకపోతే మనసు యేదోలా బోల్తా కొట్టిస్తుంది. కామరహిత స్థితిలో స్థిరంగా నిలచేవరకూ భగవాన్ సహాయం, అనుగ్రహం సదా మనకు ఉంటుందని మనం నిశ్చయంగా అనుకోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం యింకోలా కూడా జరుగవచ్చు. చేస్తున్నవాడు, కర్త యెవరో కనుక్కోవడం. తన శక్తి, యుక్తి వలననే యేవైనా ఫలితాలు, అపజయాల్ని అధిగమించి సాధించామని భావించి కర్మలు, చేతలు హుషారుగా చేస్తుంటారు.
దీన్ని లోతుగా శోధించితే, జయం ఫలితాలు ఒకరి కోరిక శక్తియుక్తుల వలన కాదని తెలుస్తుంది.
ఫలితాలు యేవయినాసరే భగవంతుని నియమాలైన కర్మలు, అనుగ్రహంబట్టి మాత్రమే కలుగుతాయి. ఇది పూర్తిగా గుర్తించి, గ్రహించితే బలమైన కోరికలు వాటికోసమై తాపత్రయాలు, పరుగులు ఆగిపోతాయి. అహంకారం, వ్యక్తిత్వముపై విశ్వాసముపై సందేహమూ, ప్రశ్న లేస్తుంది. తనూ తన శక్తియుక్తులపై సందేహాల వలన, తన సహజ స్వభావమేమిటో తెలుసుకునే తృష్ణ పెరుగుతుంది. కామరహిత, భయరహిత స్థితికి చేరుకునే మార్గం త్వరితమవుతుంది.
No comments:
Post a Comment