Tuesday, August 2, 2022

నీవెవరివో నువ్వు కనుక్కో* *అధ్యాయం - 16* *సత్పురుషుల సాంగత్యం అవసరం

 *🧘‍♂️16- శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*నీవెవరివో నువ్వు కనుక్కో*

*అధ్యాయం - 16*

*సత్పురుషుల సాంగత్యం అవసరం*


ఋషుల సాంగత్యంలో బంధాలు, వాటి కారణమైన భ్రమలూ మాయమై పోతాయి. భ్రాంతి నుంచి విముక్తి పొందిన మనసు నిశ్చలం, మౌనం అవుతుంది. ఈ జీవితంలోనే జీవన్ముక్తులవుతారు. అందుకే ఋషుల సాంగత్యం కోరుకోవలెను.


ఋషులతో సాంగత్యం లభించిందంటే, నిన్ను నువ్వు నియంత్రించుటకు మిగతా సాధనలతో పనియేమి? ఉపయోగం యేమి? చల్లని గాలులు చక్కగా వీస్తుండగా పంకా ప్రయోజనం ఏమిటి?


భగవాన్ తన ‘ఉల్లదునాఫదు'లోని 40 పద్యాలను మొదలుపెట్టి మొదటి 5 పద్యాల్లో సత్పురుషుల సాంగత్యం యొక్క విలువ, ప్రాముఖ్యం వివరించారు. ఇవి ఆదిశంకరుల రచనలు, యోగవాశిష్ఠం సంస్కృత రచనల నుండి అనువాదం చేసినవే.


అందులో రెండవ పద్యాన్ని దానివెనుక ఒక జరిగిన సంఘటన గ్రహించి ఉండటం వలన, స్మరించడానికి చాలా అనువుగా ఉంటుంది.


భగవాన్ కు అత్యంత భక్తురాలైన ఎచ్చమ్మాళ్ రోజూ భగవాన్ కూ భక్తులకు భోజనం తెచ్చేది. కొన్నిసార్లు తన మేనకోడలు చల్లమ్మద్వారా పంపించేది. ఎచ్చమ్మాళ్ తరుచూ యేదో ఒక పవిత్ర దినమనిచెప్పి ఉపవాసం చేసేది. ఆవిడ ఉపవాసం ఉన్నరోజుల్లో, చల్లమ్మకు కూడా, తను చిన్నదీ ఆకలితో ఉన్నాసరే, ఉపవాసం ఉండవలసి వచ్చేది. జరిగినది భగవాన్ యిలా చెప్పారు. 'ఒక కృత్తికా నక్షత్రం రోజు, తను ఉపవాసం ఉన్నా, నాకు భోజనం తీసుకుని వచ్చింది. ఆవిడ తినకుండా ఉంటే నేను యెలా తినగలను? ఆవిడను ఉపవాసాలు చేయవలదని, యింకా మంచి వయసులోనే ఉన్నావు అని నచ్చజెప్పి తినిపించాను.


 మరసటిరోజు ఆమె భోజనం తీసుకుని కొండపైకి వస్తున్నపుడు ఆవిడకు ఒక కాగితం కనిపించింది. అది తీసిచూస్తే దానిపై ఒక శ్లోకం ఉంది. నేను అది చూసినపుడు అందులో యీ రెండవ పద్యం యొక్క సంస్కృత శ్లోకం ఉంది. చూడు, నిన్న నీకు నేను చెప్పిందే యీ శ్లోకంలో ఉందన్నాను. దాన్ని తమిళంలోనికి అనువదించి ఆమెకు అర్థం చెప్పాను. అప్పటినుంచి ఆమె ఉపవాసములు మానివేసింది. ఆమెకు నాపై అచంచలమైన విశ్వాసం. గతంలో అయినా, యిప్పుడైనా మనం చేసిన సత్కార్యాలు, ధ్యానం,

తపస్సులకు దీవెనలుగా మనకు సత్పురుషుల సహవాసం భగవంతుని అనుగ్రహం వలన లభిస్తుందని తప్పక చెప్పవచ్చు.


సత్సంగ్ అంటే సత్, సత్యం దాని స్వరూపమే అయిన రమణుల లాంటి మహర్షుల సాంగత్యంలో, సహవాసంలో ఉండి చరించడం, సేవించడం, ధ్యానించడం.


భగవాన్ లాంటి జ్ఞాని యొక్క ఒక్క అనుగ్రహ వీక్షణం చాలు, మనల్ని అసాంతం శుద్ధిచేసి నేను యెవరు విచారణకు ఉన్ముఖులను చేయడానికి. ఈ విధానాన్నే మొదటి పద్యంలో చెప్పబడింది. దేహం, ఆస్తులు, సంబంధాలు, మనసుతో ఉన్న బంధం అంతా బలహీనపడుతుంది. ఈ మారే ప్రపంచం విషయాలన్నింటిపై అంతర్గతంగా అనాసక్తి పెరుగుతుంది. అపుడు 'నేను దేహం’ అనే భ్రాంతి విరిగిపోతుంది. అది పోగానే, మనసు తన మూలస్థానమైన శుద్ధ ఎరుకలో నిలచిపోతుంది. ఇక నేను ఫలానా, పరిమితుడిని అనే భావన అంతం అయిపోతుంది. తను సదా సర్వస్వతంత్రుడినే అనే చేతన ఉదయిస్తుంది.


మనపై జ్ఞాని యొక్క ప్రభావం మనకు తెలియకుండానే దృఢంగా నిరంతరంగా ఉంటుంది, పనిచేస్తుంది. అందువలన ప్రభావం పని గురించి తెలుసుకోలేక, కొందరు ఆ ప్రభావ ఫలితాన్ని గురించే ప్రశ్నిస్తారు. ఇలా యెప్పుడోసారి అత్యంత భక్తులకు కూడా జరుగుతుంది.


 హృదయం విశాలం కావడం, బంధాలు తొలగిపోతుండడం అనే మార్పు కొలవలేనిది, చూడలేనిది కాబట్టి, భగవాన్ ప్రభావం మనపై యేమీ లేదు అనుకుంటారు. దేవరాజ మొదలియార్ తనదైన మధురమైన శైలిలో యీ పొరపాటు గురించే చెప్పారు. 1935వ సంవత్సరంలో భగవాన్ ఉన్న హాలులో వెంకట్రామ అయ్యర్ మొదటి అయిదు పద్యాలను మొదలియార్ దృష్టికి తెచ్చి, 'మనలాంటి వారికి యిదే ఉత్తమమైనది' అన్నారు. భగవాన్ కూడా అతనికి కొన్ని పవిత్ర గ్రంథాలు భ్రమరగీత, కురుంతిరితి, జ్ఞాన వాశిష్ఠముల్లోని సంత్సంగం యొక్క ప్రాముఖ్యత ఘట్టాలు చెప్పారు. వాశిష్ఠంలో 'సత్సంగము వలన, అసంపూర్ణంగా ఉన్నవి పూర్ణం, అపాయం అదృష్టం, అపవిత్రం పవిత్రం అవుతాయి' అని తెలుపబడింది.


పురాణ కథల్లో తెలుపబడిన యెన్నో సత్సంగముయొక్క గొప్ప ఫలితాలు మొదలియార్కు భగవాన్ తెలుపగా, పత్రికలు పుస్తకాల్లో చదువగా తెలిసినవి. అయినాసరే, కొన్ని సంవత్సరాల తరువాత యీ ఫలితాల్లోని సత్యం గురించి మానసికంగా సందేహాలు వచ్చాయి. భగవాన్ దగ్గర ఆయనకు చాలా చనువు కాబట్టి అతను అడిగారు భగవాన్ ను 'సత్సంగం గూర్చి తెలిపిన గొప్ప ఫలితాలు నిజంగా అలాగే కలిగినవా లేక అవి అన్నీ కవులకు మామూలే అయిన ఆభూత వర్ణనలా? అని.


మనకు కనుపించే కొలవగలిగే ఋజువులుండవు కాబట్టి యిలాంటి సందేహాలు రావడం సాధారణమే కానీ, యీ సమస్య రావడానికి అసలు కారణం, సద్గురువులు చేసే పని ఫలితం వెంటనే లేక తొందరలోనే జరగాలని కాల నిర్ణయం పరిమితులను మనం నిర్దేశించుకోవడం, ఆశించడం. గత యెన్నో జన్మ జన్మల్లోని వాసనలు సంస్కారాలు యెంత యెంత చెప్పలేనంత బలంగా మన మనస్సుల్లో నాటుకుని ఉన్నాయో మనకు తెలియదు. అందుకే, మనపై ఆయన అనుగ్రహం యెప్పుడు యెలా పనిచేయాలన్న విషయం దాన్ని ప్రసాదించే పరమేశ్వరుడికే బాగా తెలుసు. సద్గురువు మనల్ని అంతగా పట్టించుకోవడం లేదనో, గమ్యం యింకా చాలా దూరకాలం పడుతుందనో, అభివృద్ధి అంతగా లేదనో అపోహలు, భయాల వలన చాలామంది ఆధ్యాత్మిక సాధనలో సద్గురు సేవలో నిలువక అపజయం పొందుతున్నారు. ఋషుల మాటలు, పవిత్ర గ్రంథాల ఉద్ఘాటనలు వ్యర్థం కావు, వృధా పోవని సదా గుర్తు ఉంచుకోవాలి మనం. ఒకసారి మన విధిని, భవిష్యత్తును యెలాంటి షరతులూ, అపోహలు, సందేహాలు లేకుండా సద్గురు చరణాలను నమ్మి విశ్వసించి సర్వభారం బాధ్యత ఆయనదే అని ఆయనపైనే ఉంచితే దానివలన బాధలు, దుఃఖం తలంపులు తాకలేని విముక్తి, పరమానంద స్థితి ఖచ్చితంగా కలుగుతుంది.


ఇక్కడ ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. సత్పురుషులతో సహవాసం అంటే భౌతికంగా అని మాత్రమేకాదు. సత్సంగము అంటే వారిని స్మరించడం, నామం చేయడం, వారి దివ్యత్వాన్ని ధ్యానించడం, వారితో మానసికంగా సంబంధం... యిలా యే విధంగా అయినాసరే, వారి సన్నిధే, సత్సంగమే. కొన్ని ప్రశ్నలకు భగవాన్ సమాధానాలు యీ విషయాన్ని సుస్పష్టం చేస్తాయి.


భక్తుడు :- మిమ్ములను విడచి యెంతో దూరంలో ఉన్న మా యింటికి పోలేకపోతున్నాను.


మహర్షి :- నువ్వు యెక్కడున్నా నా సన్నిధిలోనే ఉన్నావని గుర్తుంచుకో. తలంపే నిన్ను చక్కగా ఉంచుతుంది.


భక్తుడు :- నేను కోరుకున్నట్లు తరచుగా యిక్కడకు వచ్చి మిమ్ములను దర్శించుకో లేకపోతున్నాను.


మహర్షి :- నువ్వు యిక్కడకు రానక్కర లేదు. అందు గురించి నువ్వు నిరుత్సాహ పడనక్కర లేదు. నువ్వు యెక్కడ ఉన్నా 'నేను' నుండి దూరం కావద్దు.


ఒకసారి ఒక భక్తుడు రమణుల నుండి సెలవు పుచ్చుకుని విడిచి వెళ్ళడానికి యెంతో బాధపడుతుంటే, అతనితో భగవాన్ 'దివ్య సమక్షము నుండి దూరంగా పోయి యెవ్వరూ కనుపించకుండా ఉండలేరు. నువ్వు భగవాన్ అంటే యీ దేహమని, నువ్వు అంటే ఆ దేహమని భావించుతున్నందు వలన, యివి రెండు వేరు అన్న గ్రహింపు వలన, దీనినుంచి దూరంపోవడం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు యెక్కడకు పోయి యెక్కడ ఉన్నా, నన్ను విడచి ఉండలేవు'.


రమణుల భౌతిక సన్నిధి కరుణలో మునగలేని ప్రస్తుత కాలంలో, ఆ సద్గురువుల శరీరరహిత తత్త్వము, సర్వాంతర్యామిత్వము, యిప్పుడూ మనం భగవాన్ సమక్షంలోనే ఉన్నామనే గమనింపు సదా స్పురణలో మనకు ఉండాలి. దేశకాలాలకు అతీతమైన సద్గురువుల వీక్షణంతో ఆయన అనుగ్రహం, స్మరించి స్ఫురణలో ఉన్నవారందరికీ కలుగుతుంది. 

No comments:

Post a Comment