*🧘♂️17- శ్రీ రమణ మార్గము🧘♀️*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 17* *భగవంతుని అర్చన*
సహస్రనామాల్లో, భగవంతుని ఒక నామరూపాల్లో ఉన్నట్లు అర్చన జరుగుతుంది. భక్తిగా సేవించడం, పూజించడం కోసం వాటిల్లో దైవం యొక్క వెయ్యి వివిధ సద్గుణాలు ఉంటాయి. భగవంతుని అనంత ప్రేమ, కరుణ, శక్తి ఆ ప్రతీ నామాల్లో, రూపాల్లో నుండి ప్రసరిస్తూ ఉంటుంది. వాటిని భక్తితో పారాయణం చేస్తే, సద్గుణాలను స్తుతిస్తే, కోరికలను తీర్చుకోవాలనుకున్నా, ఆత్మజ్ఞానం పొందాలని చేసినాసరే, ఆ నామరూపాల శక్తి ఫలితాన్నిస్తుంది.
శ్రీ రమణ సహస్రనామాల్లో పరమేశ్వరుని భగవాన్ శ్రీ రమణ మహర్షిగా స్తుతించడం జరుగుతుంది. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని స్తుతిస్తూ అగస్త్య ఋషి చెప్పిన సహస్రనామాలు, శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ సనక ఋషి చెప్పిన సహస్ర నామాలూ, యీ రెండూ కూడా యెన్నో వేల వందల సంవత్సరాల నుండీ భక్తులచే రోజూ పారాయణం చేయబడుతున్నాయి. భగవాన్ శ్రీ రమణ మహర్షి సహస్ర నామాలు కూడా భక్తి, శ్రద్ధలతో ప్రార్థించి పారాయణం చేస్తే, అదే శక్తితో ఫలితాన్నిస్తుంది. ఇందులో యెలాంటి సందేహం లేదు.
శ్రీ జగదీశ్వర శాస్త్రి, భగవాన్ శ్రీ రమణ మహర్షి సహస్ర నామాల యొక్క విశిష్టతను చక్కగా ఉదహరించారు. పార్వతీదేవి ఒకసారి గౌతమ ఋషి నుండి అరుణాచల మహాత్మ్యమును విని, గొప్ప మహర్షి అయిన రమణులు, మానవ దేహంలో ఉన్న అరుణాచలుడే కాబట్టి, వారి గురించి తెలుపమని కోరుతుంది. ఈ కోరిక విశ్వ సౌభాగ్యం కోసమే కలిగినదని గౌతమ ఋషి గుర్తించి స్పందించారు. ముందుగా, ముక్తికై జ్ఞానమార్గము అన్నింటి కంటే ఉత్తమమైనదని చెప్పారు. తరువాత, యీ జ్ఞాన మార్గంలో శ్రీ రమణులచే బోధింపబడిన సాటిలేని నేనెవరు విచారణ సాధనను యే సమయంలోనైనా యెవ్వరైనా యే మతం విశ్వాసాలు ఉన్నవారైనా చేయవచ్చునన్నారు. అందుకే అత్యంత నిగూఢమైన శ్రీ రమణుల మహాత్మ్యం గురించి తెలుపుటకు అంగీకరించారు.
ఏ సహస్ర నామాల్లోనైనా అంతర్గతంగా ప్రవహించేది, భక్తే. దాని ప్రయోజనం యేమిటన్న ప్రశ్న ఆ పవిత్ర నామాల్లోని శక్తి ప్రభావం అనుభూతి చెందనివారికే కలుగుతుంది. మొదటి ప్రయోజనం కోరుకున్నవి ఫలించడం. పరమేశ్వరుడే మహాశక్తి సంపన్నుడు, అలాగే అనంత ప్రేమమయుడు. శ్రీ లలిత, శ్రీ విష్ణు, శ్రీ రమణ యెవరిదైనా సహస్రనామాలను పారాయణం చేసినపుడు తప్పక దైవ స్పందన కలుగుతుంది. విద్యార్థులు జయం పొందుతారు. యవ్వనులకు వారి కోరికలను బట్టి వివాహం జరుగుతుంది. వ్యాపారులకు వారి సామ్రాజ్యం విస్తరిస్తుంది. నాయకులకు అధికారం నిలుస్తుంది. ఇలా ఫలితాలు కలుగుతాయి. ప్రాపంచిక విషయాల్లో లాభం యెవరూ ఊహించినంత కలుగుతుంది.
'ఉల్లదునాఫదు'లో భగవాన్ సాధకులకు పారాయణ అవసరానికి ప్రత్యేక కారణం తెలిపారు. పరమేశ్వరుని అర్చన తన బంధాలను బలహీనపరచి, ముక్తికి రంగం సిద్ధం చేస్తుంది యెవరికైనా. ఎందుకంటే, భగవంతుడే సర్వ సద్గుణాలకు మూల పురుషుడు. మనసు, భక్తి, ప్రార్థన నిండిన మనసుతో సహస్ర నామాలను పారాయణం చేస్తూ ఆ సద్గుణాలను పరిచయం, ఆకళింపు చేసుకుంటూ, అలవర్చుకోవడానికి వీలు కలుగుతుంది. మనసు యింకా యింకా సిద్ధం అవుతూ ఆత్మ విచారణకు అర్హత పొందుతుంది. ఈ అర్చనల్లో అంతర్గతంగా యిమిడివున్న అంతరార్థం, తను ఊహించుకుంటున్న అహంకారం స్వంత శక్తితో తన గమ్యం సాధ్యం కాదనే సత్యాన్ని గ్రహించడం. నేను చేస్తున్నాను, కర్తను కాదనే సత్యం తెలియడం. ఆ తప్పుడు గ్రహింపు, భావన పోయి, తనది అనుకుంటున్న శక్తి అంతా కూడా సత్యంగా పరమేశ్వరుడిదేనని ఉదయిస్తుంది.
చాలామంది భగవంతుడు, దేవతల సహస్రనామార్చనతో స్తుతిస్తూ ఉంటారు. కానీ అదే పరమేశ్వరుడు శ్రీరమణులుగా శరీరంతో ఉండగా వారికి సహస్రనామార్చనను సందేహిస్తుంటారు. ఆ అజ్ఞానం వలన వారు, యిలాంటి అర్చన వ్యక్తి పూజకు దారితీస్తుందని భ్రమలో పడతారు. ఇలాంటి ఆలోచనా విధానంలో యెన్నో తప్పుదోవలు ఉన్నాయి. పవిత్ర గ్రంథాలన్నీ కూడా దైవం, సద్గురువు, నేను ఒకటే అని మళ్లీ మళ్లీ యెలుగెత్తి చాటాయి. మనసు, భావన, స్వభావము ముఖ్యమైనవి కాబట్టి, గురువునకు భక్తిప్రపత్తులతో కొలచినపుడు, సద్గురువు ఈశ్వరుడు ఒకటే, వేరు కాదని స్పురణతో ఉండాలి.
శ్రీరమణునిలా నిరంతరం సదా స్థిరంగా ఆత్మలో నిలచి ఉన్నపుడు, వారు ఆత్మ స్వరూపులే, పరమేశ్వర రూపులే. భగవాను ఒకే రూపంగా భావించడం సరికాదు. గతంలో, భవిష్యత్తులో, యిపుడు ఉన్న, ఉండే అన్ని రూపాలు ఆయనే. ఈ రూపాలన్నీ, ఆ హృదయంలో చైతన్యంగా ఆయన లేకపోతే అవన్నీ కదలని బొమ్మలే కదా! కొంతమంది భక్తులకు, భగవాన్ తన అశరీరతత్త్వాన్ని ప్రదర్శించారు కూడా. భగవంతుడే మానవ రూపంలో విశ్వ సౌభాగ్యం కోసం నామరూపంతో అవతరించగా, ఆ నామం రూపం కూడా భగవంతునిలానే నాశనంలేనిది, అనంతం అయి ఉంటుంది. మొదటి చరణాల్లో, గౌతమ ఋషి, శ్రీ రమణ సహస్రనామ స్తుతిలో దాని ప్రత్యేక విశేషాన్ని నొక్కి వక్కాణించడం గమనిస్తే చాలా మంచిది. ఎవరు యే పద్ధతిలో సాధన చేసినా, అంతిమంగా జ్ఞాన మార్గంలోనే సత్యదర్శనం కలుగుతుంది అని నిస్సందేహంగా చాటారు. అందుకు సరళమైనది, సూటి అయినది రమణులు అలుపే లేకుండా బోధించిన విచారణ మార్గము మేలయినది అని చెపుతారు. ఈ రాచబాటలో సాధన చేసేవారికి సద్గురు రమణుల రూపంలో ఉన్న పరమేశ్వరుని కృపకంటే విలువయినది యింకేమయినా ఉంటుందా?
శ్రీ రమణాశ్రమంలోని శ్రీ రమణేశ్వర ఆలయంలో ప్రతీరోజూ అర్చనలో శ్రీ రమణ సహస్రనామ స్తుతి ఒక భాగం. ఈ నిధికై, దీన్ని కూర్చిన శ్రీ జగదీశ్వర శాస్త్రికి ప్రపంచం ఋణపడి ఉంటుంది. ఎవరైనా యీ పవిత్ర నామాలను అలా పారాయణం చేస్తూ చేస్తూ ఉండగా యింకా యెన్నో విషయాలు స్పష్టం అవుతాయి. ఈ స్తుతి కూర్పునకు స్ఫూర్తి భగవాన్ రమణులే. రమణులుగా ఉన్న పరమేశ్వరుని స్తుతించాలంటే యెంతటి పండితులకు మేథావులకైనా సాధ్యం కాదు.
ఇంకో విషయం కూడా భాషయొక్క అసహాయత వలన, యే భాష అయినా, భగవాన్ మహోన్నత జీవితం, స్థితి వర్ణించడం అసాధ్యం. కావ్యకంఠ గణపతిముని తప్ప, శ్రీ జగదీశ్వర శాస్త్రికి సంస్కృత భాషా ప్రావీణ్యంలో సమతుల్యులు, సాటివారు యింకెవరూ లేరని ఘంటాపథంగా చెప్పవచ్చును. భగవాన్ వద్ద ఉండి, ఆయన చాలా చిన్న వయసునుండే సేవించుకున్నారు. భగవాన్ అంటే ఆయనకున్న భక్తిప్రపత్తులు అనన్యమైనవి. అయినాసరే, ఆయన భగవాన్ యొక్క మహాత్మ్యము, ఏకత్వమును కొంచెం రుచి మాత్రమే చూపించగలిగారు.
ఈ స్తుతి మహోన్నత సద్గుణాలను పారాయణం చేస్తున్నపుడు వాటి ప్రభావం పారాయణం చేసేవారి శరణాగతి భావం, గ్రహణశక్తిపై ఆధారపడి ఉంటుంది. రమణుల భగవశ్శక్తివైపు ఆకర్షితులవుతూ ఉంటే ఆస్వాదిస్తూ ఉంటే ఆనందానుభవం యింకా పెరిగిపోతుంది. అలా సహస్రనామ పారాయణం యెంతో అర్థవంతమైనది, యెంతో మార్పు కలిగించేది, యెంతో ఆకర్షించేది అని గ్రహిస్తారు.
ఎవరైనా యీ వెయ్యి సద్గుణ సర్వశక్తుల్లో, మహిమల్లో అక్కడక్కడ దేన్నయినా గ్రహించి దాని మధుర భావనను ఆస్వాదించవచ్చును. ప్రతీ నామం మహిమకూ లోతైన ఉన్నతమైన శక్తి, భగవానున్ని ప్రతిబింబించేందుకు, భగవానునిలో తన్మయులయ్యేందులకు, సమృద్ధిగా ఉన్నది.
భగవాన్ అనుగ్రహం మనల్ని పూర్ణ ఋణగ్రస్తుల్ని చేస్తుంది. ఆ ఋణాన్ని మనం యెన్నడూ తీర్చలేనిదే. శ్రీ రమణ సహస్రనామ స్తుతి పారాయణంలో భగవాన్ సన్నిధి స్ఫురణ కలుగడం కంటే ఉత్తమమైన దీవెనలు మనకు యేమి ఉంటాయి?
No comments:
Post a Comment