Tuesday, August 2, 2022

నీవెవరివో నువ్వు కనుక్కో* *అధ్యాయం - 18* *అనుగ్రహమే అత్యంత అవసరం

 *🧘‍♂️18- శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*నీవెవరివో నువ్వు కనుక్కో*

*అధ్యాయం - 18* *అనుగ్రహమే అత్యంత అవసరం*


రమణులు అంటే అనుగ్రహ విగ్రహమూర్తులే. అది పూర్ణమే. ఎందుకంటే ఆయన ప్రతీక్షణం 'నేను' (ఆత్మ)గానే నిలచి, తన సహజ పరమానంద స్థితి, స్ఫురణలోనే ఉన్నారు. కానీ భగవాన్ భౌతికంగా ఉన్నపుడు ఆయన వద్ద దగ్గరగా ఉన్నవాళ్ళూ, అక్కడకు వచ్చినవాళ్ళూ చాలా మంది ఆయన నిరంతర అనుగ్రహ ప్రవాహాన్ని అందుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. గంగానది జీవ ప్రవాహం లాంటి భగవాన్ అనుగ్రహం వారందరికీ లేనిదే అయింది. ఇప్పుడు ఆ ప్రమాదం యింకా యెక్కువయింది, ఎందుకంటే వారి రహస్య అశరీర మార్గదర్శకత్వాన్ని, కొన్నిసార్లు బాహ్య సహాయాన్ని గ్రహించలేకపోతే, యెవరైనా తన హృదయంలోని ఆ సద్గురు సన్నిధిని ఉపేక్షించిన వారవుతారు.


మనం 'రమణుల సంభాషణలు', 'అనుదినము భగవాన్' సంకలనాలను చదువుతూ ఉంటే తెలిసేది, అక్కడికి వచ్చిన అందరు భక్తులు, సాధకులు, జిజ్ఞాసువులు, ఆగంతకులు ప్రార్థించి కోరినది భగవాన్ అనుగ్రహాన్నే. ఈ ప్రార్థించేవారు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించరు. వారు చేసే నేనెవరు విచారణలోని తపన శ్రద్ధ వలన, ఎన్ని విధాలుగా వీలయితే అన్ని రకాలుగా రమణుని స్ఫురణలో ఉంచడం, అర్చన, నామస్మరణ, ప్రతీక్షణం తనకు భగవాన్ యిచ్చే రక్షను గమనించడం వలన, సదా యెడ తెగక ప్రవహిస్తున్న ఆ రమణుల అనుగ్రహం అనుభవం అవుతుంది. రమణులు చాలాసార్లు, తమ అనుగ్రహాన్ని యే గదిలోనో బంధించి తాళం వేయలేదని చెప్పేవారు. ఒక చిన్న గ్లాసుతో పెద్ద జీవనదిలోనికి పోయి, యింకొకరు పెద్ద బిందెతో నీరు తీసుకుపోతున్నారని ఫిర్యాదు చేయవచ్చునా? అలాగే అనుగ్రహం సదా అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అందరికీ సమానంగా యెప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అది గ్రహించే వారినిబట్టి యెంత అందుకోగలరు అనేది ఆధారపడి ఉంటుంది.


మహేషభట్ తన 'నవీన గురువు యు.జి. కృష్ణమూర్తి' అనే పుస్తకంలో రమణులతో జరిగిన సంభాషణలను పదిలం చేశారు.


కృ: ముక్తి సిద్ధాంతం నిజంగా సత్యమేనా?


భ : అవును.


కృ: దానిలో వివిధ దశలు ఉన్నాయా?


భ : లేవు. అదొక స్థితి. అది తన సహజ స్థితిలో నిలచి ఉండటం. 

కృ : తమరు నన్ను విముక్తులను చేయగలరా?


భ : మౌనం వహించారు.


కృ చిరాకుగా : కనీసం మీవేవైనా అనుభవాలను నాకు యివ్వగలరా? 


భగవాన్ అతని వైపు తీక్షణంగా చూస్తూ : అవును. నేను యివ్వగలను. నువ్వు తీసుకోగలవా?


కృష్ణమూర్తికిది సత్యాన్వేషణకు పురికొల్పి మొదలయిన సంఘటన.


గ్రహించేవాడు, తను భగవాను శరణాగతి చెందడానికి సిద్ధమైతే, యెంతవరకూ శరణు చెందాడన్నదాన్నిబట్టి మాత్రమే గ్రహించగలడు. ఈ విషయంలో యెన్నో రకాల వాదాలు ఉన్నాయి. మార్జాల కిశోర న్యాయం. పిల్లి తన పిల్లలను తనే కరచిపట్టుకుని తీసుకుపోతుంది. పిల్లలు వేచి ఉంటే చాలు. భగవాన్ యీ పద్ధతిని అంగీకరించరు. ఎందుకంటే, ఎంతకాలం అయితే అహంకారం మిగిలి ఉన్నదో, నేను కర్తను అనే భావం ఉన్నదో, ఆధ్యాత్మిక సాధనలో విజయం సద్గురువు బాధ్యత, అది ఆయన పనే అంటే యెలా జరుగుతుంది. ఎవరికైతే వ్యక్తిత్వము / అహంకారం ఉందో వారు విచారణ చేయాలి, అన్వేషించాలి, సత్యమైన తన సహజ స్వస్వరూపానికై తీవ్రంగా తపించాలి. అలా తపించి, అన్వేషిస్తూ ఉండగా, సద్గురువు అనుగ్రహంపై ఆధారపడాలి, ఎందుకంటే ఆ అనుగ్రహం వలనే మొదట అన్వేషించాలనే తపన మొదలవుతుంది. ఆ అనుగ్రహం వలననే విచారణ సాధనలో స్థిరంగా నిలుస్తారు. ప్రయత్నం అన్నది తప్పదు. సాధన, అనుగ్రహం రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి నడుస్తాయి. ప్రయత్నం యొక్క అంతిమ విజయం కేవలం సద్గురు అనుగ్రహంపైనే ఆధారపడి ఉంటుంది. దాన్ని గ్రహించడం సాధకుడి తపనపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంపై 1929వ సంవత్సరంలో భగవాన్తో కపాలిశాస్త్రి సంభాషణ చూద్దాం. 


క : ఒకరు తీవ్రంగా ఉపాసన చేస్తే కొన్ని సిద్ధులు లభిస్తాయి. ఆ ఉపాసన గమ్యం అయిన యీ సిద్ధులు లభించడం తాను చేసిన ఉపాసన వలనా, లేక పరబ్రహ్మం / తనలోని శక్తి అనుగ్రహమా?


భ : తనలోని శక్తి విశేషమే.


క : అంటే ఉపాసన చేసేవాడి కర్మ / ప్రయత్నం వలన కాదన్నమాట సిద్ధులు లభించేది. కానీ తనలోని పరాశక్తి వలన మాత్రమేనా? 


భ : అవును.


భగవాన్ యెన్నోసార్లు నొక్కినొక్కి చెప్పేవారు. ఆధ్యాత్మిక మార్గం విజయం పూర్తిగా సాధన తీవ్రంగా జరుగడం వలన మాత్రమే లభించలేదు, సద్గురువు అనుగ్రహం వలన మాత్రమే.


ఈ విషయంలో యింకా గట్టిగా చెప్పడం మనకు కష్టమే. ఎందుకంటే, నేనెవరువిచారణ మొదట్లో, నేనెవరు? నేను యెక్కడనుంచి? ప్రశ్నలు బుద్ధి పరమైనవిగా అనిపిస్తాయి. మతపరమైన నియమాలు, విధానాలు యేమీ లేవు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనే నిబంధనలు యేమీ లేవు. ఎన్నో రకాల క్రతువులు లేనేలేవు. అందుకే యీ ప్రశ్నలో మనసుకు గట్టిగానే, సూటిగా తగులుకుంటాయి.


మనం మనసుతోనే నడిపింపబడుతున్నాము కాబట్టి, ఆ మనస్సులో యెన్నో భావాలు నిలువై ఉన్నాయి కాబట్టి, మనకు యెలాంటి సహాయం, మార్గదర్శకత్వమూ అవసరం లేదనే అభిప్రాయం రావచ్చు. కానీ, ఒకసారి నేనెవరు విచారణలో స్థిరంగా నిలిస్తే, యీ ఆధ్యాత్మిక సాధనలో మనసు పని చాలా తక్కువ తక్కువగా అవుతుందనీ, అనుగ్రహం సహాయంపై ఆధారపడడం యెక్కువ యెక్కువ అవుతుందని తెలుస్తుంది. మనం ఒకసారి మూలం, అక్కడ చేరడం గురించి అనుకున్నపుడు, ఆ మూలస్థానం (హృదయం) యొక్క స్వభావం యేమిటి అన్న ప్రశ్న కూడా వస్తుంది.


ఆ మూలం ప్రతీ హృదయంలో 'నేను, నేను' అంటూ ప్రకాశిస్తున్న దివ్యత్వమే. ఇదే సత్యంగా భగవాన్ అనుగ్రహం. భగవాన్ మనల్ని ఆ అనుగ్రహం ద్వారం వద్దకు తీసుకునిపోయి లోనికి లాక్కుని మనల్ని జీవిస్తుండగానే జీవన్ముక్తులను చేస్తారు. అలాంటి జీవనం గురించి యిప్పుడు మనకేమీ తెలియదు, అర్థంకాదు. దాన్ని ఒకసారి రుచి చూడగానే మనలో నాశనం లేని అనంత అమృత తత్త్వం నిండిపోతుంది.


 *ఓం నమః శివాయ🙏*

No comments:

Post a Comment