*🧘♂️19- శ్రీ రమణ మార్గము🧘♀️*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 19* *సద్గురు అనుగ్రహం తప్పనిసరే*
అది సోమవారం, నవంబర్ 18, 1907, కార్తీక శుక్ల చతుర్దశి. అంతా జనం, జనంతో నిండిపోయింది. పవిత్ర నగరమైన తిరువణ్ణామలైలో కార్తిగయ్ ఉత్సవాన్ని జరుపుకునేందుకు వేల వేలమంది భక్తులు విచ్చేసారు. వారు విరూపాక్ష గుహకు చేరుకుని మౌన సన్నిధి అయిన బ్రాహ్మణస్వామి శాంతిని ప్రసాదించే సమక్షంలో కూర్చుంటారు.
స్వామి అరుణాచలం చేరుకున్న సెప్టెంబరు 1, 1896 నుంచి యీ 11 సంవత్సరాలు తన దేహ స్పృహయే లేక అంతర్ముఖులై మౌనంలోనే ఉన్నారు. ఆసక్తి కల జిజ్ఞాసువులు ప్రశ్నలు వేస్తే, స్వామి జవాబును యిసుకపైనో, పలక మీదనో వ్రాసేవారు. కానీ ఆ రోజు మరువలేని దివ్యమైన రోజు ఈశ్వర నిర్ణయం. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్వామి విరూపాక్ష గుహ బయట ఒక్కరే కూర్చుని ఉన్నారు. జగద్గురువుగా తనను ప్రపంచానికి ఆ రోజు చాటే ప్రియశిష్యుడి రాకకోసం ఎదురుచూస్తూ వేచి ఉన్నారు.
అప్పటికి స్వామికి (దేహానికి) యిరవై యేడేళ్లు మాత్రమే వయసు. సదా ఆత్మనిష్టులై ఉంటారు కాబట్టి అతను బంగారు శరీరం ఆత్మ తేజంతో ప్రకాశిస్తుంది. ఆయన సాక్షాత్తూ ఆత్మ స్వరూపులే.
ఆ రోజు, గణపతి, ఒక ముని, స్వామికంటే ఒక్క సంవత్సరం మాత్రమే వయసులో పెద్ద. ఇరవై ఎనిమిది సంవత్సరాలే అయినా వారు ఆధ్యాత్మిక సాధనలో అంతిమ పరాకాష్టకై యెంతో ఆరాటంతో ఉన్నారు. అతని చిన్నతనం నుంచే అన్ని దేవతల ఉపాసనలు చేసి సాక్షాత్కరించుకున్నారు. సకల వేదోపనిషత్ గ్రంథాలన్నీ ఔపోసన పట్టారు. సంస్కృతంలో సాటిలేని నిష్ణాతులై భారతదేశ సంస్కృత సమ్మేళనంలో మహామహులను ఓడించి 'కావ్యకంఠ' బిరుదును పొందారు. ఎంతోమంది శిష్యులతో జైత్రయాత్రలను చేశారు. 1903వ సంవత్సరంలో ఆయన మొదటిసారి అరుణాచలం వచ్చినప్పటికే *ఓం నమ: శ్శివాయః* పంచాక్షరీ మంత్రజపం కోటికి పైనే చేసారు. అలానే 'శ్రీవిద్య' లాంటి తత్త్వాలపై యెన్నింటినో విశదీకరణలు వ్రాసారు. సంపూర్ణ నిష్ట నియమాలతో యెన్నో వేదోయుక్త యజ్ఞాలు చేశారు. అయినాసరే, ఆయనలో సంతృప్తి లేదు, బ్రహ్మానందం లేదు, యేదో వెలితి అనిపిస్తుంది. ముందుకు దారి కనిపించడం లేదు. అగమ్య గోచరంగా ఉన్న స్థితి అతన్ని బాధిస్తున్నది. ఎందుకంటే అతని సంపూర్ణ విశ్వాసం అంతా వేదగ్రంథాలు, దేవతా ఉపాసనలతో విజయం ప్రాప్తిస్తుందని. అతను తపస్సులెంతో చేసి పరిపక్వమయ్యారు. నిజమైన మునులయ్యారు. అయినాసరే అతనికి సత్యదర్శనం కాలేదు, ఊరిస్తూనే ఉన్నది. ఎందుకు? సద్గురువు అనుగ్రహం లేకపోవడం వలనా? సాధనలు యెంత తీవ్రంగా చేసినప్పటికీ, సద్గురువు అనుగ్రహం వలనే వాటి ఫలితం వస్తుంది. ఆయనకు యింతవరకూ తన సద్గురువు తెలియలేదు. 1903వ సంవత్సరంలోనే ఆయన అరుణాచలం వచ్చినపుడు, గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న బ్రాహ్మణస్వామిని మామూలుగా దర్శించుకున్నారు. అప్పటికి ఆయన శరణాగతి చెందడానికి పరిపక్వమై సిద్ధంగా లేరు. అతనికే యెంతోమంది శిష్యగణం, కానీ ఆయనకు గురువు యింకా తెలియలేదు.
అలాంటి దారి తెన్నూ లేని జీవిత పరిస్థితుల్లో, బ్రాహ్మణ స్వామి ఒక్కసారిగా గుర్తుకు వచ్చి వారే, వారొక్కరే తనకు సద్గురువుగా దారి చూపించగలిగే వారు అని అకస్మాత్తుగా తనలో స్ఫురించింది. వారు తపస్సు సుదూర తీరాలను జయించి దాటిపోలేదా? వారు సదా ఆత్మస్థితిలో మునిగి స్థిరంగా ఉండలేదా? ఉదృతమైన శ్వాసతో, యెంతో ఆశతో, తపస్సు నిజస్వరూపం స్వభావం, అసలు తపస్సు అంటే యేమిటి అని తెలుసుకోవాలనే తీవ్రమై లోన మండుతున్న ఆకాంక్షతో, మండించే మధ్యాహ్న సూర్యుని వేడిమిని కూడా లెక్కచేయకుండా, కొండపైకి యెక్కడం ప్రారంభించారు. తన ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చుకోవాలి. తానే తపస్సు అయి ఉన్నవారి దగ్గరనుంచే తపస్సుకు అర్థం యేమిటో తెలుసుకోవాలి. దీనివలన తెలుస్తున్నదేమంటే, ఆ క్షణంలోనే ఆయన బ్రాహ్మణస్వామిని తన సద్గురువుగా స్వీకరించారు. విరూపాక్ష గుహవద్దకు చేరగానే ఆయన చేసిన మొట్టమొదటి పని బ్రాహ్మణస్వామి పాదపద్మములను, కుడిచేత్తో కుడిపద్మము యెడవచేత్తో యెడమ పద్మము చేతులను కత్తెరెలా ఉంచి, పట్టుకుని తన కన్నీటిధారలతో కడిగి అభిషేకం చేశారు.
మానవజాతి ఆధ్యాత్మిక చరిత్రలోనే అది అత్యంత విశేషమైన ప్రత్యేకమైన అరుదైన సంఘటన. ఎందుకంటే, సత్యదర్శనం (ఆత్మ దర్శనం) అయిన తరువాత ఆయన మహర్షి మొట్టమొదటిసారిగా జగద్గురువు దివ్య పాత్రలో తన ప్రబోధాన్నిచ్చారు. ఇన్ని సంవత్సరాల వాక్ మౌనాన్ని విడిచారు. అంతరంగ మౌనం సదా ఉండేదే భగవాన్ కి దాన్ని విడుచుట అన్నది లేనే లేదు. అది తన సహజం. వారు యీ అతి సమర్థమైన శిష్యుని గురించే వేచి చూస్తున్నారా యిన్నాళ్ళూ? కావ్యకంఠ గణపతి ముని యొక్క సమర్థత గురించి కానీ, ప్రపంచానికే తన సద్గురువు జగద్గురువేనని చాటి చెప్పగల అతని సామర్థ్యం సత్తా గురించి కానీ; దక్షిణామూర్తులు, ఆదిశంకరులు సింహాసనాలను అధిరోహించగల ఆయన అర్హతను శక్తిని గానీ, శంకించడానికి యెలాంటి సందేహమూ లేశమైనా లేనేలేదు.
అప్పుడు అక్కడ ఆ కలయికతో యేమి జరిగిందనేది గణపతి ముని మాటల్లోనే ‘ఆధ్యాత్మిక వేదన నాలో దహించుచుండగా నేను ఆయన వద్దకు చేరి వారి పాదాలపై సాష్టాంగపడి నాకు ఆచరించడానికి మార్గదర్శకత్వం కావాలని ప్రార్థనతో ప్రాధేయపడ్డాను. వారి కరుణామయ వీక్షణం నాలో ప్రవహించింది. వారు ఇంద్రియాన్ని జయించిన వారిలో మొదటివారు. ఒక్క క్షణంలోనే వారు నా స్థితి, పరిస్థితిని గ్రహించి, విప్పారిన నేత్రాలతో నాపై పూర్తిగా నా సేద తీర్చే అనుగ్రహ దృక్కుల వర్షం కురిపించారు, పరమానందంలో నన్ను ముంచెత్తారు’.
గణపతి ముని తన సద్గురువుల నుండి పొందిన బోధ, మళ్లీ చెప్పవలసి ఉంది, యెందుకంటే భగవాన్ బోధలన్నింటికీ అదేసారం, కీలకం, ఆధారం కాబట్టి.
'ఎప్పుడైతే మనసు, యెక్కడ నుంచి నేను అనే భావన / అహంకారం పుడుతుందో అని విచారణతో శోధిస్తుందో, అపుడు ఆ పుట్టుస్థానంలో అది లయం అయిపోతుంది, అదే తపస్సు. ఎక్కడ నుంచి మంత్రశబ్ధం పుడుతున్నదో దానియొక్క పుట్టు మూలస్థానం యేమిటని విచారణ చేస్తే, అది మనసును ఆ మూలంలో లయం చేస్తుంది, అదే తపస్సు'.
ఇందులో మొదటిది ప్రపంచ ప్రాచుర్యం పొందిన 'నేనెవరు, నేనెక్కడి నుంచి' అనే విచారణ ప్రశ్నలు. రెండవది, మంత్రశబ్దం యెక్కడినుంచి పుడుతుందనే దానిమూలం గురించి విచారణ గణపతి మునికి ఒక్కరికే మాత్రం బోధింపబడింది. ఆయన ద్వారా ప్రపంచానికంతటికీ తెలిసింది. మంత్రం, బీజాక్షరాలపై విశ్వాసం ఉన్నవారందరికీ, యీ రెండవది అనంత శక్తివంతమైనది.
గణపతి మనికిచ్చిన యీ బోధలో, సదా మూలం స్ఫురణ ప్రాముఖ్యం గురించి భగవాన్ తెలిపారు. రమణ గీతలో స్ఫుటంగా తెలపడానికే యీ బోధను గణపతి మునికిచ్చారు. రమణుల మొత్తం అన్ని కూర్పుల్లోనూ అతి విశిష్టమైనది. రమణ గీతలోని 'హృదయ జ్ఞానం' అని, యెవరైనా వాదిస్తారేమో అనే భయం కూడా లేకుండా చెప్పవచ్చును. ఆత్మస్థానం, తలంపులు పుట్టిలేచే మూలస్థానం
అయిన హృదయం గురించి చక్కగా వివరణ ఉంది. హృదయానికీ, మనసుకూ గల సంబంధం కూడా స్పష్టంగా చెప్పబడింది.
కావ్యకంఠ గణపతిముని, అపుడే బ్రాహ్మణస్వామిని మొట్టమొదటిసారిగా 'భగవాన్ శ్రీరమణ మహర్షి' అనే నామంతో సంబోధించి ప్రపంచానికంతటకూ చాటారు.
సంపూర్ణ శరణాగతి మార్గం గురించి కూడా భగవాన్, గణపతి మునికి స్పష్టంగా బోధించారు. 1907వ సంవత్సరంలో గణపతిముని తీవ్ర తపస్సు కోసం తిరువత్తియూర్ కు వెళ్ళేటపుడు కూడా భగవాన్ యీ బోధ చేశారు.
తీవ్ర తపస్సు యొక్క శక్తి వలననే భారతదేశం తిరిగి జీవం పొందుతుందని గణపతి మునికి దృఢమైన విశ్వాసం ఉండేది. భగవాన్ 'అన్నిటికీ బాధ్యత, భారం విశ్వానికి నాధుడైన పరమేశ్వరునిపైనే ఉంచు, ఆయన సర్వశక్తివంతుడు, సర్వ సమర్థుడూ, విశ్వాన్ని పూర్తిగా నియంత్రించేవాడు, మొత్తం నడిపించేవాడూ పరమేశ్వరుడే. నీ మనసును యెప్పుడూ, సదా నీ హృదయంలో నివసించుచున్న పరిపూర్ణ చైతన్యం పైననే కేంద్రీకరించి లగ్నం చెయ్యి. నీ మనసు కేంద్రీకృతమైన భక్తితోనే మంచివీ, పవిత్రమైనవన్నీ సాధించుతావు.
నీ కర్మలనన్నింటినీ శంకరునికే సమర్పణ చేయుము' అని గణపతిమునికి తెలిపారు. జ్ఞానులలోకెల్లా శ్రేష్టులైన భగవాన్ శ్రీ రమణ మహర్పులే, పరమేశ్వరుడే అన్నిటికీ సర్వకార్యాలకూ కర్త, కర్మలను చేయడానికి శక్తినిచ్చినవాడు, యే సమయంలో యే దేశ ప్రదేశంలో యెక్కడ, యేది, యెప్పుడు, యెందుకు, యెలా జరగాలో జరిపించేవాడు అని సుస్పష్టంగా సందేహరహితంగా దృఢంగా, పూర్ణంగా బోధించారు.
No comments:
Post a Comment