Tuesday, August 2, 2022

నీవెవరివో నువ్వు కనుక్కో* *అధ్యాయం - 21* *ట్రావల్ యాజ్ యు ప్లీజ్

 *🧘‍♂️21- శ్రీ రమణ మార్గము🧘‍♀️


*నీవెవరివో నువ్వు కనుక్కో*

*అధ్యాయం - 21* *ట్రావల్ యాజ్ యు ప్లీజ్*


1940 దశాబ్దంలో భారతీయ రైల్వేలు 'ట్రావెల్ యాజ్ యు ప్లీజ్' ప్రయాణ టిక్కెట్లు యిచ్చేవారు. ఈ టిక్కెట్లు కొనుక్కున్నవాళ్లు, వారెక్కడకు ప్రయాణం చేయాలనుకుంటే అక్కడకు వెళ్ళవచ్చు. మొత్తం ప్రయాణం దూరాన్ని పరిమితి చేసి, స్టేషన్లు యెక్కడి నుంచి యెక్కడికయినా ప్రయాణించవచ్చును.


ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్న చాలామంది, యీ టిక్కెట్లు కొనుక్కున్న వారి మాదిరిగానే కనుపిస్తారు. వారి ప్రయత్నాల యొక్క గమ్యం, ఉద్దేశం గురించి వారికేమీ స్పష్టత ఉండదు. అందువలన వారి ఆధ్యాత్మిక మార్గంలోని ప్రయాణం యిటూ, అటూ, యెటు వైపో వారికి అంతు చిక్కదు. ఎందరో గురువుల వద్దకుపోయి ఆశ్రయించడం, పెద్ద పెద్ద వక్తల ఉపన్యాసాలు వినడం, యెన్నో గ్రంథాలు చదవడం జరుగుతుంది. దాంతో వాళ్ల మనసులు ఒక కలగూర గంపలా తయారవుతాయి. ఫలితంగా, గంగానదిలో తేలుతున్న దుంగల్లా, అయోమయంలో ఉంటారు. వారు వారి యిష్టం వచ్చినట్లు ప్రయాణించవచ్చు. కానీ గమనించవలసింది యేమంటే అమూల్యమైన తిరిగిరాని యెంతో కాలం వృధా అయిపోతుంది. జీవితకాలం, ఆ టిక్కెట్లకు దూరాన్ని పరిమితం చేసినట్లు, పరిమితమైనది. వారి శక్తి అంతా అలా ఖర్చు అయిపోయిన తరువాత, వారి మనసులో యెన్నో రకాల తలంపులనన్నింటినీ వదిలించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అలాంటి మేధోపరమైన మేతల యొక్క నిరర్థకత్వం గురించి భగవాన్ 'ఈ విచార సాగరం యెన్నో తర్కాలు పెద్ద పెద్ద శాస్త్రీయ పదాలు వాక్యాలతో కూడికుని ఉంటుంది. ఈ పెద్ద పెద్ద గ్రంథాలన్నీ అసలు ఉద్దేశానికి, గమ్యానికి యేమైనా పనికి వస్తాయా? అయినా, కొంతమంది వాటిని చదివి, వారి ప్రశ్నలకు సమాధానం కోసం మాత్రమే మునుల వద్దకు పోతారు.


వారు గ్రంథాలను కొత్త కొత్త ప్రశ్నలు, సందేహాల గురించే చదువుతారు. ఇలా చేయడమే వారికి ఆనందం. ఇవన్నీ పూర్తిగా వ్యర్థం అని తెలిసే, మునులు అలాంటి వాటిని ప్రతిపాదించరు, ఉత్సాహపరచరు'.


అందువలన, ప్రాపంచిక విషయాల్లో యెలా స్పష్టత కలిగి మెలగుతున్నారో, అంతర్ముఖ ప్రయాణంలో కూడా మొదటినుంచీ తన గమ్యం గురించి పూర్తి

అవగాహన, స్పష్టత కలిగి ఉండాలి. దైవానుగ్రహం వలన రమణుల సూటి పద్ధతిని సాధన చేయువారు ప్రత్యేకంగా తప్పక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఈ రమణ మార్గంలోని విశిష్టత యేమిటంటే, గమ్యం యెప్పుడూ మనకు కంటిముందు స్ఫురణలోనే ఉంటుంది. సాధన మొట్టమొదటి క్షణం నుంచి కూడా సాధకునకు యెక్కడకు చేరుతాడో తెలుసు. ఉద్దేశం తనను తాను తెలుసుకోవడం, సహజానంద స్థితిలో స్థిరంగా నిలచి ఉండడం. ఇదే నేనెవరు విచారణ అంటే అర్థం.


ఈ సాధన పద్ధతిలో గమ్యం, విచారణ పద్ధతి, రెండూ ఒకదాని నొకటి పెనవేసుకుని విడదీయరానివిగా ఉన్నాయి. అందుకని గమ్యాన్ని మరచే ప్రశ్నేలేదు. కొలబద్ద యెప్పుడూ తన కంటిముందు అలాగే ఉంటుంది.


నేనెవరు విచారణ చేస్తున్న వారికి సహజానందం అనుభూతి కలుగకపోతే, యెక్కడ యేమి తప్పు జరిగిందో, యెక్కడ దారి తప్పిందోనని సరిచూసుకోవాలి. ఎందుకంటే, అంతిమ అనుభూతి, ప్రస్తుత అనుభూతి సారాంశంలో ఒకటే, వేరు కాదు. ఈ విచారణ సాధనలో కలిగే ఆనందం అంతర్గతమైన సహజమైన ఆనందం, అది బాహ్య విషయాల వలన కలిగినది కాదు. నీలోనుండి ఊరే ఆనందం స్ఫురణ, సాధన మొదట్లో వచ్చిపోతూ ఉంటుంది. మెల్లగా యింకా యెక్కువ సమయం ఉంటుంది. సరయిన స్థిరమైన నిలకడగా నేనెవరు విచారణ సాధన వలన యిటూ అటూ కాకుండా సదా యీ సహజానందం నిలుస్తుంది. నేనెవరు విచారణను యెవరైనా వదలకుండా, స్థిరమైన సహజ పరమానంద స్థితికి చేరుకునే వరకూ చేయాలి. ఎప్పుడేతే స్థిరంగా తన సహజ స్థితిలో మార్పులేక తరగనివారై ఉంటారో వారినే 'జ్ఞాని' అంటారు.


నిరంతరం జ్ఞానంతోనే ఉన్నవారు. ఎప్పుడైతే అఖండంగా విరామమే లేకుండా యీ స్ఫురణ ఉంటుందో, యికపై యెలాంటి ప్రయత్నాల అవసరం లేనేలేదు. వారు సదా తనకు తానే యెలాంటి ప్రయత్నమూ లేకుండానే నిరంతరం నిర్మల శుద్ద మనసు అనుభవించే పొంగిపొరలే బ్రహ్మానంద సాగరంలో మునిగి ఉంటారు.


ఈ అంతిమ అనుభూతి అనుభవం 'యిపుడే, యిక్కడే' ఉంది కాబట్టి. 'నేను’ యెక్కడో దూరంగా చేరుకోవలసినదిగా లేదు. 'నువ్వు యెప్పుడూ అదే’. నువ్వు యెన్నో జన్మల నుండి అలవాటైన 'అనాత్మను నువ్వు అనుకోవడం’ను మానివేయాలి. ప్రయత్నం అంతా యిందుకే. రమణులు బోధించిన నేనెవరు విచారణ సాధన ద్వారా అడ్డంకులను తొలగించాలి, ముసుగును చేధించాలి. అందుకు, అవగాహన స్పష్టంగా ఉండాలి, అనుభవం తప్పక కలుగుతుంది.


రమణుల మార్గానికి, సాధారణ యితర సాధనలకు తేడాలు చూద్దాం


రమణ మార్గం


1. మనసు అనేది ఆత్మచైతన్యమైన  'నేను'కు, జడమైన దేహానికి (పదార్థానికి) మధ్య ఒక గొలుసు, ఆత్మ నుంచే లేచిన ఒక అతిశయశక్తి. నేను ఫలానా ఫలానా అనే భావం / అహంకారమే మనసు. దానికి స్వతంత్రమైన ఉనికి వేరుగా లేనేలేదు.


2. మనసు సహజ స్వభావం మౌనం, నిశ్చలం.


3. ప్రపంచం (దృశ్యం), చూచేవాడు (దృక్కు/అహంకారం) వేరు అనే ఆధారంగా మనసును నియంత్రించే ప్రయత్నాలు యేమైనా అపజయ మవుతాయి.


ఇతర సాధారణ మార్గాలు:-


1. మనసు, ఒక సూక్ష్మ శరీరము.


2. మనసు పరుగులు తీసేది, నియం త్రించాల్సింది.


3. సరి అయిన ప్రయత్నాల వలన మనసు నియంత్రణ జరుగుతుంది.


చాలా గ్రంథాల్లో మనసును సూక్ష్మ శరీరం అని, అలాగే భౌతిక దేహాన్ని స్థూల శరీరమని చెప్పబడింది. భగవాన్ మనసు అంటే తలంపులే. మనసు స్వభావాన్ని గమనించితే, రెండు రకాల తలంపులు ఉన్నట్లు తెలుస్తుంది. మొదటిది ప్రథమ తలంపైన మిగతా అన్ని తలంపులకు ఆధారమై కేంద్రమైన నేను అనే భావనను కేంద్రంగా ఆధారం చేసుకుని వచ్చే భావన. రెండవ రకం, యీ న్నో విధాల తలంపులు, వస్తూ పోతూ మారుతూ ఉంటాయి. ఈ రావడం, పోవడం, మారడం అనేది ఆధార కేంద్ర తలంపు అయిన నేను అనే భావన (అహంకారం) యొక్క వాటిపై ధ్యాస దృష్టినిబట్టి ఆధారపడి ఉంటుంది. వాటిపై ధ్యాస ఉంటే లేస్తాయి, నిలుస్తాయి. ధ్యాస లేకపోతే పుట్టనే పుట్టవు. అందుకే మనసు నిరంతరం మారుతూ పరుగులు తీస్తున్నట్లు ఉంటుంది.


 ఈ మారడాన్ని పరుగులను, ఆ తలంచేవాడు / వ్యక్తి / అహంకారం యీ మారే తలంపులపై దృష్టిని పెట్టకపోతే ఆపివేయవచ్చు, ఆగిపోతాయి. అపుడు మిగిలేది మొదటి కేంద్ర తలంపుపై ప్రశ్న ఒక్కటే, యిపుడు ధ్యాస, దృష్టి మొత్తం అంతా యీ ప్రశ్నపైన మాత్రమే నిలుస్తుంది. అలా ఆ ఒక్క తలంపుపై కేంద్రీకరించి ధ్యాసను నిలిపినపుడు, అది కూడా పోయి తన మూలమైన హృదయంలో కలిసిపోతుంది. ఇక మిగులదు. అపుడు మనం మనసు అనుకునేది, యిక ఉండదు, లేదు. నువ్వు బాహ్యమైన విషయాల గురించి తలంచునంత కాలం మనసు ఉంటుంది. దాన్ని విషయాల నుండి తప్పించి, దాన్ని 'నేను అనే భావన'పై కేంద్రీకరించితే, అంటే అంతర్ముఖం చేస్తే, యిక లేకుండా పోతుంది.


తరువాత ప్రశ్న యేమిటంటే, మనసు తన మూలమైన చైతన్యంలో కలసిపోయిన తరువాత యేమవుతుందని. అంటే అలాంటివారు మనస్సు లేని తెలివిలేని జడ్డివారవుతారా? 'కాదు' అని గట్టిగా చెపుతారు భగవాన్, ఎందుకంటే తలంపుల సాగరమయిన మనసు, తలంపుల రహితమై, సూక్ష్మమై, చురుగ్గా, అనంతంగా ఉంటుంది. ఇంకా భగవాన్ “మనసుకూ, 'నేను'కూ భిన్నత్వం యేమీ లేదు, వేరుకాదు, తేడా యేమీలేదు. మనసు అంతర్ముఖమైతే అదే 'నేను', మనసు బహిర్ముఖం అయితే అదే అహంకారం, ప్రపంచం. 'నేను' కంటే వేరుగా మనసు లేనేలేదు. అలా అంతర్ముఖమైన మనసును నిర్మల శుద్ధ మనసు అంటారు, దానిలో చైతన్యం పూర్ణంగా ప్రతిబింబిస్తుంది. మనసు, శక్తి అంతా సమగ్రంగా కేంద్రీకృతమయి ఉంటుంది. విచ్ఛిన్నం కాదు. ఎందుకంటే, అపుడు మనసు అవసరమైన రోజువారీ కుటుంబ, వ్యాపార, వృత్తిపనులకు పనిచేస్తుంది. మనసు, గతం గురించి బాధింపదు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందదు. వర్తమాన క్షణం ఒక్కటే ఉంటుంది. మనసు మౌనంగా నిశ్చలంగా పరమానందంలో మునిగి, దాని కార్యకలపాలనుంచి యే కోరిక ఉండదు. కావున దాన్ని యేదో నియంత్రించాలనే వెర్రి సాధనలన్నీ వాటికవే ఆగిపోతాయి.


ఇక్కడ యీ ఫలితంగా, యెవరైనా తన సత్య స్వరూపం, నిజమైన 'నేను’ పరిపూర్ణమైన చైతన్యమే అని తెలుసుకుంటారు. ప్రస్తుతం యెందరిగానో ఉన్నా 'నేను'లు, మెలకువ స్థితిలోని 'నేను'ను స్వప్నంలోని 'నేను', గాఢనిద్రావస్థలో నున్న 'నేను' అన్నీ కూడా మానసిక ఆవిష్కరణలైన కదలికలే తప్ప వేరు కాదు. తరువాత ప్రయాణం అంతం అవుతుంది. ఎలాంటి వెలితి లేని పరమానందంలో మునిగి అనుభవిస్తున్న వారికి, యిక ప్రయాణం అవసరం యేమిటి? ఒకపుడు దారి, తెన్నూ తెలియక చీకట్లో తడుముకున్న సాధకుడు, తానే ప్రపంచానికి అఖండజ్యోతి అవుతాడు.


ఉదాహరణకు:- 


అందరూ వారి వారి కుటుంబ సభ్యులూ, బంధువులూ, ఆప్తులూ అంటే యెంతో ప్రీతి, ప్రేమతో ఉంటారు. ఇతరుల గురించి ఉదాసీనంగా ఉంటారు. తనవారు కాదు, తనకు యేమీకారు అనుకుంటారు. కొంతమందితో అయితే క్రోధం, శతృత్వం, పగ, ద్వేషం, అసూయ, అసహనం, అసహ్యం లాంటివే ఉంటాయి. మరి ఒక విషయం, సత్యం గ్రహించండి. మన లెక్కలేనన్ని గత జన్మల్లో ప్రతీవారూ కూడా మనకు యేదో జన్మలో తల్లీ, తండ్రీ, భర్త, భార్య, పిల్లలు, బంధువులో, ఆప్తులో అయినవారే. అలా జంతువులకు కూడా మనతో సంబంధం యేదో జన్మలో ఉన్నదే. అన్నింటిలో అందరిలో అంతటిలో ఉన్నది 'నేనే'. ఈ సత్యం గ్రహించితే ఉన్నది విశ్వప్రేమ మాత్రమే, వేరే దేనికీ అవకాశం ఉండదు.


భగవాన్ యెప్పుడూ దేన్నీ తప్పు అనలేదు, దేన్నీ తప్పుగా చూడలేదు, దేన్నీ ఖండించలేదు. ఆయనకు అలాంటి పదాలే లేవు. ఏమి జరుగుతున్నా, లేకపోయినా కర్త నడిపించేవాడు ఈశ్వరుడే.కారణాలతో యెలాంటి సంబంధం లేకుండా సదా సర్వత్రా భగవాన్ నిరామయంగా విశ్వప్రేమనే వర్షించారు.


 *ఓం అరుణాచలశివ* రమణ సమూహంలో చేర దలచినవారు ఈ నెంబర్ కు మెసేజ్ పెట్టండి 9490860693

No comments:

Post a Comment