Tuesday, August 2, 2022

నీవెవరివో నువ్వు కనుక్కో* *అధ్యాయం - 25* *అవకాశాలను చేజార్చుకుంటారు

 *🧘‍♂️25- శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*నీవెవరివో నువ్వు కనుక్కో*

*అధ్యాయం - 25* *అవకాశాలను చేజార్చుకుంటారు*


జీవితం వరుసగా ఎన్నో అవకాశాలను ఇస్తూనే ఉంటుంది. అసలు జీవితమే ఒక అవకాశం, తానంటే ఎవరో తెలుసుకోవడానికి, తన సహజ స్థితిని కనుక్కుని తెలుసుకుని అనంత ఆనందమయంగా ఉండడానికి. దివ్యత్వానికి చేర్చే తరంగాలను చాలా మంది గ్రహించలేరు, గుర్తించలేరు. అందుకే అవకాశాలను చేజార్చుకుంటారు. ఒక ఇంటర్వ్యూకు వెళ్లిన అభ్యర్థి తనకు కేటాయించిన సమయంలోనే తన ఉత్తమ ప్రతిభను కనపరచాలి. అలాగే ఒక కళాకారుడు కూడా తనకు కేటాయించిన పరిమిత కాలంలోనే తన ఉత్తమ ప్రదర్శన జరపాలి. ఆటల పోటీల్లో కూడా విజయానికై కీలకమయిన సమయాల్లోనే అత్యంత ప్రతిభ ప్రావీణ్యం సమయస్ఫూర్తి చూపించాలి, అది  ఏ ఆట అయినాసరే, ఎక్కడైనా సరే. అలా కాకపోతే, ఎంత సమర్ధులు నైపుణ్యం గలవారయినా ఓడిపోతారు, గెలవలేరు. అలాగే జీవితం యిచ్చే అవకాశాలను చేజార్చుకుంటే, గాలికి వదిలేస్తే, ఎన్నో జన్మలు, ఆందోళనలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, ఎడుపులు తప్పవు.


ఆధ్యాత్మిక సాధన, కృషి విషయానికి వచ్చినపుడు అది అంత కష్టమైనది కాదు, జాగ్రత్తగా ఉండాలన్నది సరే. ఎందుకంత కష్టం కాదు? ఎందుకంటే సద్గురువు రమణుల శిష్యులకు, భక్తులకు సదా అవకాశాలను కల్పిస్తూనే ఉంటారు. అవి యెలా ఉంటాయంటే, ఒక ద్వారం తలుపు మూసుకుని పోతే, యింకో ద్వారం తలుపు తెరుచుకుంటుంది. భక్తి శ్రద్ధలతో ఉన్న సాధకులకు వారి అహంకారాన్ని చెరిపేయడానికి, స్థిరంగా నేనెవరు అనే విచారణకు ప్రయత్నిస్తున్న వారికీ, భగవాన్ నిరంతరంగా అనుగ్రహం, సహాయం అందించి ముందుకు తీసుకుని పోతూనే ఉంటారు. భగవాన్ యొక్క విశ్వప్రేమ, సర్వశక్తివంతంపై పూర్ణ విశ్వాసం ఉంటే తనను తాను తెలుసుకోవడంలో అపజయం అనేది కలుగదు. విచారణ సాధన చేస్తూ, మళ్లీ మళ్లీ తన పాత అలవాట్లయిన విషయ వాసనల వైపు, మనసు పరుగులెత్తిస్తుంటే, ప్రాపంచిక సుఖాలకై, తనలోన చూడడం వదిలేసి పోయిన వారికి కూడా భగవాన్ తన సహాయ హస్తం అందించి పైకి లాగుతారు.


కనుపించని, కనుపించే భగవాన్ సహాయక హస్తం, మనల్ని నేనెవరు విచారణలో స్థిరంగా నిలువడానికి ప్రయత్నిస్తుంటే, మనలో ప్రతీ ఒక్కరికీ మన బాధ్యతను ఇంత సులభతరం చేస్తూ యిస్తున్న అవకాశాన్ని పూర్ణంగా ఉపయోగించుకోవడం మన విధి కాదా? ఆచరణలో దీని అర్థం యేమిటి? అంటే, యెవరైనా తన అహంకారాన్ని వదిలించుకోవాలన్న దానిపై దృష్టిని కేంద్రీకరించి లగ్నం చేసి, తన నిజ స్వభావం యేమిటని ప్రశ్నించి శోధించాలి.


ఎంతవరకైతే అహంకారం స్వభావం యేమిటని పరీక్షించకపోతే, ఎంతకాలమైతే మనసుకు మూలం ఏమిటని శోధించకపోతే, ఎవరి జీవితంలో నైనా మార్పు ఉండదు, రాదు. వారు ఒక మూసలో పోసినట్లు ఉన్న తలంపులు, పనులు, పూజా, పునస్కారాలు, ధ్యానాలు ఎవయితే అవి చేస్తూనే ఉంటారు. వాటివలన లాభం అనేది తప్పక ఉంటుంది. కానీ వారిలో నిజమైన మార్పు, మౌళికమయిన మార్పు ఉందా? అంటే, 'రమణుల పద్దతిలోని పూర్తి లాభం వారు పొందుతున్నారా?' అని ప్రశ్నిస్తే, లేదు అనే జవాబే వస్తుంది. కొత్త జీవితం, ఆనందమయ స్థితిలో సదా ఉండే జీవనం ఉండేటపుడు, అంతకంటే తక్కువ దానికి ఎందుకు పోవాలి. ఇదీ ఈ జీవితంలోని అవకాశాన్ని పోగొట్టుకోవడమే, చేజార్చుకోవడమే, గాలికి వదిలి వేయడమే. సదా ఉంటూ చురుగ్గా సర్వశక్తివంతంగా ఉన్న మౌన నిశ్చల మనసు వారికి లేదు.


ఎన్నుకున్న మార్గం నుండి యెన్నో మళ్లింపులుంటాయి. ఆ ఎన్నుకున్న మార్గంలో ముందుకు పోతూ ఉంటే, ఆటంకాలు మళ్లింపులు కూడా యింకా పెరుగుతుంటాయి. అందుకే యెంతో యెంతో జాగ్రత్త చాలా చాలా అవసరం. ఇందులో మొదటిది, మనకి సంబంధంలేని విషయాల్లోకి మనం తలదూర్చడం. నేనెవరు విచారణ చేస్తున్న శివప్రకాశం పిళైకు భగవాన్ గట్టిగా స్పష్టంగా యితరుల విషయాల నుండి దూరంగా ఉండమని హెచ్చరించారు. ఎవరూ మనల్ని అడగకపోయినాసరే, మనకి తెలుసు మనం పోయి అడిగి తెలుసుకుని మరీ అందరికీ సలహాలిస్తాము. శ్రీ రమణాశ్రమ విషయాల్లో ఒక్కొక్కరూ ఎలా జోక్యం చేసుకుంటారో హాస్యంగా భగవాన్ చెప్పినది చూడవచ్చును. ఇక్కడకు వచ్చినవారు మొదట ఇక్కడ ఉన్న ఆనందమయ వాతావరణాన్ని గ్రహించి ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉంటారు. కొంతకాలానికి, ఇక్కడ జరుగుతున్న పనుల్లో, పద్ధతుల్లో యేయే లోట్లు ఉన్నాయో అని వెదుకుతారు చూస్తారు. మరి కొంతకాలానికి నిర్వాహకులకు, యిది అలా ఉండాలి, అది యిలా జరగాలని సలహాలు యిస్తారు, వినకపోతే యిక కోపాలు, ఫిర్యాదులు, ఖండనలు. అలా మెల్లగా, వారు శ్రీ రమణాశ్రమమునకు ఎందుకు వచ్చారన్న విషయాన్ని మరచిపోతారు, అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ఇరుక్కుంటారు.


పాల్ బ్రంటన్, తన మరణం తరువాత ప్రచురణ అయిన 'రిఫ్లెక్షన్స్' అన్న పుస్తకంలో, జాగ్రత్తపడవలసిన యిలాంటి యెన్నో ప్రమాదాల గురించి వివరించారు. మొదటిది, రహస్యంగా అంతరంగంలో ఉన్న పేరు, ప్రతిష్టల కోసం అత్యంత ఆరాటం కోరిక. ఒకరికి తను రమణుల బోధనల్లో ఆరితేరిన ప్రావీణ్యమున్న అధికారిననీ లేక రమణుల దగ్గరి శిష్యులు, భక్తులతో యెంతో సన్నిహితంగా తిరిగినవాడిననీ లేక రమణుల రచనలు బోధనలన్నీ ఔపోసన పట్టినవాడిననీ ఉంటుంది. ‘ఉల్లదునాఫదు'కు అనుబంధంలోని పద్యంలో యిలాంటి పేరు ప్రతిష్టల గురించి ఆరాటం కోరికను తీవ్రంగా ఖండించారు రమణులు. ఇంతకు ముందు అనుకున్నట్లు, సుఖదుఃఖాలు, పేరు ప్రతిష్టలు, మానావమానాలు, పదవులు, బంధువులు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా రావడం పోవడం అనేది గత కర్మల ఫలితాల వలన జరుగుతుంది. అంతేకాని మన సహజ స్వభావంతో వాటికి యెలాంటి సంబంధం ఉండదు, లేదు. ఎంతో పొగిడిన నోళ్ళే మళ్లీ ఉమ్మేసి తిట్టడానికి కూడా వెనుకాడవు. రెండింటినీ పూర్తిగా సమర్థించవచ్చు.


ఇంకో కోరిక ఆరాటం, ఆస్తి సంపద, ఆడంబర జీవితం గురించి. సాధారణమైన నిరాడంబర జీవనం ఆధ్యాత్మిక జీవనానికి నిదర్శనం. సత్యాన్వేషణకై సాధన చేస్తూ ముందుకు పోగా, దివ్యత్వంతో అనుసంధానం కలుగుతుంది. అందువలన వారికి ఒక ఆకర్షణ దానికదే వస్తుంది. చాలామంది వారికి వసతులు, అలంకారాలు, కారులు, విరాళాలు యివ్వడానికి సిద్ధమౌతారు. లేకపోతే తన స్వంత ఆస్తిపాస్తుల వలననే కలుగవచ్చు యివన్నీ. వాటన్నింటికీ అలవాటుపడే కంటే వాటికి దూరంగా ఉంటేనే, అంటకుండా ఉంటేనే చాలా మంచిది. ఈ అనవసరమైనవి వారిని అగాథంలోనికి తోసివేసినా ఆశ్చర్యం యేమీ లేదు.


ఇంకో అతి ప్రమాదం భౌతికమైన ఆకర్షణలు. మనం నిలకడగా సదా నిరంతరం గుర్తు ఉంచుకోవలసినది మన నిజ స్వభావం దివ్యత్వం అనీ, యింతకు ముందు యెన్నో జన్మల్లో అనంతమైన భౌతిక సుఖాలను యెన్నో అనుభవించామని, ఆ కోరికలకు అంతం లేదని. ఈ భౌతిక సుఖాలు వాంఛలు, మోహాలకు తావిస్తే జనన మరణ చక్ర భ్రమణం నుంచి తప్పించుకోవడం అసలు సాధ్యం కానిదే.


ఇవన్నీ చెప్పడం, భక్తిశ్రద్ధ ప్రపత్తులతో తపన ఆర్తితో ఉన్న సాధకులను భయపెట్టాలని కాదు. అలాంటి వారికెలాగూ సద్గురు రమణుల రక్షణ తప్పక ఉంటుంది. అలాంటి వారు దారి తప్పినా, భగవాన్ సహాయం వస్తుంది. కానీ దారి తప్పవలెనా? అన్నది ప్రశ్న. దారి తప్పితే, భగవాన్ తన జీవితంలోనికి వచ్చి, తన ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి యిచ్చిన గొప్ప సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుని గాలికి వదిలివేసినట్లే.


ఈ ఉన్నవన్నీ కనుపించేవన్నీ చూసేవన్నీ సత్యమే, ప్రపంచం విషయాలు వస్తువులు, సంబంధాలు అన్నీ నిజమైనవే అని అందరికీ మనసులో యెంతో యెంతో బలంగా, యెన్నో గత జన్మల నుండీ లోతుగా నాటుకునిపోయి ఉంది. అందువలన వాటిని వదులుకోవాలేమో, అవి తనకు తనవి కాకుండా పోతాయేమో అన్న భయం దృఢంగా ఉంటుంది. దీన్ని పెకళించడం అనేది సామాన్యంగా సాధ్యం కాదు. వీటన్నిటి నిజతత్త్వము, సత్యం గురించి సందేహమూ, ప్రశ్న తీవ్రంగా ఉదయించినపుడు మాత్రమే అవకాశం కలుగుతుంది. కంటి పై భయం పొరలు తొలగుతాయి. శోధన, సత్యం గురించి అన్వేషణ జరుగుతుంది. నేనెవరు విచారణ జరుగుతుంది. గమ్యం చేరుతుంది.


అలాకాక వీటన్నిటిలో మునిగిపోయి యివే సర్వం అంతా అంటూ జీవిస్తూ ఉంటే, యింకా యింకా మళ్లీ మళ్లీ పుట్టడం, చావడం, శ్మశానం.... యిలా అంతం ఉండదు, జరుగుతూనే, సాగుతూనే ఉంటుంది. ఇదే ప్రయాణం, ఇలాంటి ప్రయాణమే


 *ఓం అరుణాచలశివ* 

No comments:

Post a Comment