Tuesday, August 2, 2022

నీవెవరివో నువ్వు కనుక్కో* *అధ్యాయం - 26* *ప్రపంచం ఆనందమయమైన సయ్యాట

 *🧘‍♂️26- శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*నీవెవరివో నువ్వు కనుక్కో*

*అధ్యాయం - 26* *ప్రపంచం ఆనందమయమైన సయ్యాట*


ఉత్సాహం, ఉరకలు ఉన్నట్లు అనిపిస్తుంది. ఉద్వేగం, ఉద్రేకం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ యే బంధం యేదీ అంటుకోకుండా, ఆట ఆడు, ఓ కథానాయకుడా, యీ ప్రపంచంలో అన్ని అనురాగబంధాల నుండి విముక్తుడవై, అన్నిటి యందు సమతత్త్వముతో, బాహ్యంలో అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో నీ పాత్రకు సముచితంగా నటిస్తూ, చక్కగా నీవు ఆట ఆడు, నాయకా, యీ ప్రపంచంతో.


ఉల్లనాఫదుకు అనుబంధం, పద్యం : 27


రమణులు, ఆనందమయజీవనం, మనకు యెప్పుడూ మౌన ప్రశాంతంలోనే ఉండేటటువంటి జీవనం మనముందు ఉంచారు. పరుగులెత్తే ప్రాపంచిక జీవితం, జోరుగా మారే అదృష్ట ఫలితాలు, భయాలు, ఆందోళనలు అన్నీ మనకు లేనివే అవుతాయి. పొంగిపోరలే ఆనందసాగరంలో తేలియాడే మనసుకు బాహ్య ప్రపంచంలోని ఒడిదుడుకులేవీ ప్రభావితం చేయలేవు.


యోగవాశిష్ఠంలో నుంచి అనువదింపబడిన యీ పద్యానికి నేపధ్యం శ్రీరామునికి వశిష్ఠ మహర్షులిచ్చిన బోధ. శ్రీరాముడు తన 15వ యేటనే ప్రాపంచిక విషయాలు, భోగాలు, రాజ్యం, సంపదలు, సుఖాలు అన్నీ అనిత్యం వాటిననుసరించి నిర్మించుకున్న స్వప్నాలు, భవిష్యత్తు, దేహం కూడా అనిత్యాలే అర్థం లేనివే అని విరక్తితో అన్నపానాదులు వదలి దేహాన్ని అశ్రద్ధ చేసి వైరాగ్యం పెంచుకుంటాడు. శ్రీరాముడు ఈ స్థితిలోనే కొనసాగి ఉంటే ఆ అవతార కార్యక్రమం జరిగేదా? అపుడు వశిష్ఠులవారు, శ్రీరామునికి బోధించి, అంతర్ జీవితం, బహిర్ ప్రాపంచిక జీవితం ఒకదానితో ఒకటి ఘర్షణేలేని సత్యమార్గాన్ని అతనికి స్ఫురింపజేస్తారు. ఈ మారే బాహ్య ప్రపంచ విషయాల గురించి తెలిసివున్నా, యెవరైనా సరే యీ ప్రతీ విషయానికి ఒక ఉద్దేశము గమ్యం దేనికదే ఉన్నట్లు తెలుసుకుని స్ఫురణతో బంధం లేకుండా జీవించగలరు. తప్పు, ప్రమాదం కర్మల్లో లేదు, ఆ విషయాల్లోనూ లేదు, మానసిక బంధంలోనే ఉంది. తనకు దైవమిచ్చిన యీ ప్రపంచంలోని పాత్రను తను యెలా నిర్వర్తిస్తున్నారా అని అది గ్రహించడంపైనే ఆధారపడి

ఉంటుంది. రమణుల, పాల్ బ్రంటన్ సంభాషణలతో యీ విషయం స్పష్టమవుతున్నది.


పా :- సత్యాన్ని కనుగొనాలంటే, యీ ప్రపంచాన్ని త్యజించి, సన్యసించి, అడవుల్లోనో, పర్వతాల్లోనో ఒంటరిగా ధ్యానం, తపస్సు చేయాలని యోగులు చెపుతుంటారు. పాశ్చాత్య దేశాల్లో అలాంటివి అసలు చేయడానికే వీలుపడదు, మా జీవితాలే యెంతో వేరైనవి. యోగులు చెప్పిన దాంతో మీరు యేకీభవిస్తారా?


భ :- కర్మల జీవితాన్ని త్యజించాల్సిన పనే లేదు. ప్రతీరోజూ నువ్వు ఒకటి రెండు గంటలు ధ్యానం చేస్తే, నీ విధులను నువ్వు నిర్వర్తించుకోవచ్చు. నువ్వు సరి అయిన మార్గంలో ధ్యానం చేస్తే, ఆ ధ్యాన మనసులోని ప్రవాహము నీ అన్ని పనుల మధ్య కొనసాగుతుంది. అదెలాగునంటే, ఒకే విషయాన్ని రెండు రకాలుగా వ్యక్తీకరించినట్లు ఉంటుంది. నువ్వు నీ ధ్యానంలో నింపుకున్న స్ఫురణ నీ అన్ని పనుల్లోనూ వ్యక్తీకరణమవుతుంది.


పా :- అలా జరగడం వలన ఫలితం యేమిటి?


భ : నువ్వు అలా ధ్యానం, నీ పనులు కొనసాగిస్తూ ఉంటే మెల్లగా యితరులు, సంఘటనలు, వస్తువులు, విషయాలు, ప్రపంచం పట్ల నీ ప్రవృత్తి మారుతుంది. నువ్వు చేసే కర్మలన్నీ, త్రికరణంగా, వాటికవే నీ ధ్యానంలోని స్థితిని అనుసరిస్తాయి.


పా :- ప్రాపంచిక జీవితం కొనసాగిస్తూ, నిస్వార్థంగా ఉండటం అనేది యెలా సాధ్యమవుతుంది?


భ :- జ్ఞానం, పని (కర్మలు) మధ్య అసలు యెలాంటి ఘర్షణ లేనేలేదు.


పా : ఎలాంటి విచ్ఛిన్నత, భంగం కలిగించని యీ అరణ్యం మధ్యలో ఉండే మీకు యీ స్థితిలో ఆధ్యాత్మిక ప్రశాంతత సులభమే.


భ : గమ్యం చేరిన తరువాత, యిదంతా తెలుసుకునే వాడిని తెలుసుకున్న తరువాత, లండన్లో జీవిస్తున్నా అరణ్యంలో జీవిస్తున్నా తేడా యెలాంటిదీ యేమీ లేనే లేదు, ఉండదు.


రమణులు, జ్ఞానం కర్మలకు మధ్య యెలాంటి ఘర్షణ, విభేదం లేనేలేదన్నారు. సరి అయిన పద్ధతిలో, అహంకారంపై కేంద్రీకరింపబడిన నేనెవరు, నేను యెక్కడి నుంచి శోధనతో ధ్యానం వలన మనసు కర్మబంధాలు చిక్కుముడుల నుండి విడుదల అవుతుంది.


అసలు సత్యం యేమంటే, మనకున్న ప్రారబ్ధకర్మభారం నుండి త్యజించి పారిపోలేము. ఎవరైనా జీవితం నుంచి నిష్క్రమించుదామనుకొనినా అది చేయలేరు.' ఈ సత్యం అర్థం అయినపుడు, యెన్ని ఒడిదుడుకులతో ఉన్నా, యీ జీవితాన్ని ప్రాపంచిక మైదానంలో ఆనందమయమైన ఆటగా మార్చుకోవాలి. నైపుణ్యం లేని ఆటగాళ్ళందరూ వారి ఆటను యెంతో ఆనందిస్తారు. మనము జీవితం అనే ఆటలో మనకు యిచ్చిన పాత్రలో ఆడుతున్నామని తెలుసుకుంటే ఆ జీవనం యెంతో మధురంగా హాయిగా గడిచిపోతుంది. ప్రతీవారు ప్రతీరోజూ ఆడవలసిన పాత్ర మారిపోతూ ఉంటుంది. తండ్రిగా, కొడుకుగా, భర్తగా, భార్యగా, స్నేహితుడుగా, డాక్టర్గా, వకీలుగా... యిలా యెన్నోగా మారుతూ ఉంటాయి. మార్పులన్నీ పూర్తి సాఫీగానే మారుతాయి.


ఎందుకంటే అన్నిటిలోనూ కొనసాగే గొలుసు ఒకే ఒక ‘నాది’ అనేది కాబట్టి. కానీ విషయం యేమిటంటే యిలాంటి పాత్రలే, యిలాంటి ఆటలే లెక్కలేనన్ని గత జన్మల్లో మనమే ఆడాము అని మనకి గుర్తులేదు. ఇవన్నీ కూడా నాటకాల్లో, సినిమాల్లో, సీరియల్స్లో నటించే పాత్రలాంటివే అని స్ఫురణలో ఉంటే యే ఆందోళన, ఘర్షణ, భయం ఉండదు. ఒకరు ఒక సినిమా పాత్రలో నటించి, బయట కూడా తాను అదే అనుకుంటే ప్రవర్తిస్తే యెలా ఉంటుంది? భగవాన్, బ్యాంక్ లోని నగదు గుమస్తా (క్యాషియర్) గురించి చెప్పేవారు. ఎన్నో లక్షల రూపాయలు అతని చేతుల్లో ఉంటాయి, లెక్క. పెడతాడు, కానీ అతనికి సత్యం, అవి తనవి కాదని ఖాతాదార్లవనీ స్ఫురణలో ఉంటాడు. ఆ డబ్బుతో తనను, యింత లక్షాధికారినని, గుర్తించుకోడు.


 అందువలన, యెన్ని లక్షల లక్షలు వచ్చినా, పోయినా అతను ఒకేలా ఆందోళన భయరహితంగా ఉంటాడు. ఆ డబ్బు అంతా తనదే అనుకుంటే, అతని పరిస్థితి యెలా ఉంటుంది?


నటుడుగా, నటన గురించి భగవాన్ చెప్పిన యీ ఉదాహరణను చక్కగా అర్థం చేసుకుని విలువనిచ్చి స్ఫురణలో ఉంచుకుంటే జీవితం అంతా ఆనందమయమే కదా! మారిస్ ఫ్రెడమన్కు భగవాన్ సమాధానం యిస్తూ 'ఒక్కడే మనిషి రకరకాల పాత్రల్లో నటిస్తున్నా. అతను చేసేవన్నీ ఆ పాత్రను బట్టి ఉంటాయి. ఒక రాజు పాత్రలో సింహాసనంపై కూర్చుని పరిపాలిస్తాడు. అదే ఒక సేవకుడైతే చెప్పులు తుడుస్తాడు. భిక్షగాడైతే జోలిపట్టి భిక్షమెత్తుతాడు. అలా చేయడం వలన అతని స్వస్వభావం యేమీ తరగలేదు, పెరగలేదు, మారలేదు. జ్ఞాని యీ పాత్రల్లో ఉన్నవాడిని 'నేనే' అని ఒక్క క్షణం కూడా మరచిపోడు.


ఒకరు నాటకంలో దుర్యోధనుని పాత్ర వేశారు. భీముని పాత్రలో ఉన్నవారు దుర్యోధనుడిని తిట్టేరు. అపుడు వారికి కోపం వస్తుందా లోపలినుండి? అతను ద్రౌపదిపై పంచభర్తృకా అని అరిచాడు. అపుడు అతనికి లోపల నుండి ఉద్వేగం ఉద్రేకం కలుగుతాయా? ఏమీ లేవు, అవకాశమే లేదు. ఉండవు. నాకటం అయిపోయింది, దుర్యోధన వేషం వేసిన తను యీ కిరీటం, సింహాసనం నాది అనీ రాజ్యపాలన చేస్తాడా? ఇంతసేపూ పాత్రలో నటనే అనే స్ఫురణతో, అసలు తానెవరో స్ఫురణ ఒక్కక్షణం కూడా పోదు, నేను దుర్యోధనుడిని రాజును అనే స్ఫురణ ఒక్కక్షణం కూడా కలుగదు, అందుకే అవకాశం లేదు. మరి మనమో, యిందుకు వ్యతిరేకంగా, ప్రతీక్షణం మన యీ పాత్ర మనమే అని స్ఫురణతో ఉంటాము, మనముగా ఒక్కక్షణం కూడా స్ఫురణతో ఉండము.


జీవితాన్ని ఒక ఆటలాటగా తీసుకున్నపుడు గెలిచినా ఓడినా, పడినా లేచినా అన్నింటిలోనూ ఆనందాన్నే చూస్తారు. గెలుపు ఓటములు సహజమే, తప్పనివే అని ఆనందంగానే అంగీకరిస్తారు. మానసికంగా జీవితం ఆట మాత్రమే అని తెలుసుకున్నవారు తప్పనిసరి పోటీల్లో, పరుగుల్లో కూడా ప్రశాంతంగా మౌనంగానే పాల్గొంటారు. ప్రతీ అపజయం, విజయానికి మెట్లే అని ముందుకు సాగుతారు, నిరాశపడి కృంగిపోరు.


ఈ సమస్యలను యింకో కోణం నుంచి కూడా దూరం చేయవచ్చు, మనం సత్యాన్ని మన దృష్టి నుంచి క్షణం కూడా దూరం కాకుండా ఉంచడం. ఈ కనుపించేదంతా మారేదే అదృశ్యమయ్యేదే యెప్పటికైనా పుట్టేది యేదైనా పోయేదే. మారే దీనికంతటికీ వెనుక మార్పులేని నాశనంలేని సదా అంతటా నిండి ఉండే సత్యం ఒకటి ఉంది. మనసులో యీ సత్యాన్ని గట్టిగా స్ఫురణలో ఉంచి అనుభూతి అనుభవం పొందితే, అపుడు కూడా యెవరైనా జీవితాన్ని మధురమైన ఆటగానే సాగిస్తారు. ఇది, శ్రీరామునికి వశిష్టులు యింకోసారి చెప్పిన బోధన గుర్తు చేస్తుంది. 'అన్ని అనుభవాల్లోనూ హృదయంలో యీ

సత్యాన్ని తెలుసుకుని ఉండు. ఈ సత్యం నుండి క్షణంకూడా మరలిపోకుండా, ప్రపంచంతో ఆడ, ఓ రాజా!'


ఒకసారి జీవితంలో పోషించే వివిధ పాత్రలతోని నిజమైనవిగా గుర్తింపును కత్తిరించితే, యెవరైనా బంధాల ముడుల నుంచి విడుదల అవుతారు. మన సహజ స్వభావమైన పొంగిపొరలే పరమానందం పైకి ఉబుకుతుంది. అపుడు, ఈ విశ్వ రచన, జగన్నాటకంలో మనకు యివ్వబడిన పాత్రను ప్రతీక్షణం మనం దివ్యమైన ఆటగా జీవితంలో ఆనందంగా పోషిస్తాము.


*చిన్న ఉదాహరణ:-*


తనకు తాను తెలుసుకోవడం కన్నా మించిన బాధ్యత యెవరికైనా మరేదీ లేదు, ఉండదు. ఇదే మానవుడిగా, మానవుడు సాధించాల్సిన ఒకే ఒక స్థితి, గమ్యం, ఉద్దేశ్యము అవసరము. మానవులు కోరుకునే, అనుకునే మిగిలినవన్నీ మిథ్య, భ్రమ, భ్రాంతి మాత్రమే. ఉన్నట్లు, నిజమైనట్లు, సత్యంగా అంతా అన్నీ గోచరిస్తాయి, కానీ యేమీ యేవీ లేనివే. ఇది సత్యం. జాగ్రత్ సుషుప్తి స్వప్న యే అవస్థల్లోనైనా యెవరైనా 'నేను ఉన్నాను' అంటారు గానీ 'నేను లేను' అనరు, అనలేరు యెప్పుడూ.


అణువులోనైనా, ఆకాశంలోనైనా 'నేను' ఉంది. చెప్పవలసి వస్తే నేను అణువు, నేను ఆకాశం, నేను చెట్టు, నేను పర్వతం, నేను పులి..., యిట్లానే చెప్పడం జరుగుతుంది. 'నేను' లేనిది యేమీలేదు, ఉండదు. అదే సర్వాంతర్యామి, నీవు, అందరూ, అన్నీ.... నీ స్వరూపమే. ఇది గ్రహించితే పరిమితమైన ప్రేమ, పూర్ణ విశాలంగా విశ్వప్రేమ అవుతుంది.


 *ఓం అరుణాచలశివ* 

No comments:

Post a Comment